రైతు పక్షం వహించాలి

Dec 12,2023 07:15 #Editorial

                ఏకకాలంలో కరువు కాటు తుపాను పోటులకు రైతాంగం అతలాకుతలమై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వ్యవసాయం సంక్షోభం అంచుకు చేరగా, సాగుదారులపై ఒకదాని వెంట మరొక విపత్తు కత్తి దూయడం శరాఘాతం. డిసెంబర్‌లో వచ్చిన మిచౌంగ్‌ తీవ్ర తుపాన్‌ కోస్తాలోని అన్ని జిల్లాలపై ప్రతాపం చూపింది. లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన ఖరీఫ్‌ పంటలను ఊడ్చేసింది. ప్రధానంగా కోతకొచ్చిన వరి పైరు వరదలో పూర్తిగా మునిగిపోయింది. కల్లాల్లో కోసిన పంట, ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇత్యాది పంటలు వర్షార్పణమయ్యాయి. రబీలో సాగు చేసిన శనగ, మినుము, పొగాకు తదితర పంటలూ మట్టిపాలయ్యాయి. ఈదురుగాలులకు కోస్తా, రాయలసీమల్లో తోటలు నేలమట్టమయ్యాయి. తుపాన్‌ వెలిసి రోజులు గడుస్తున్నా ఎన్యూమరేషన్‌ లేదు. ముఖ్యమంత్రి వద్ద సమీక్షలో నష్టం నాలుగు లక్షల ఎకరాల్లోనేనన్నారు. కాగా క్షేత్ర స్థాయిలో తుపాన్‌ విధ్వంసం మాటలకందకుండా ఉంది. నష్టం అంతకు నాలుగు రెట్ల పైమాటేనంటున్నారు. నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని, అన్యాయం చేయబోమని తుపాన్‌ ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా సిఎం జగన్‌ హామీ ఇచ్చారు.

భౌగోళిక, వాతావరణ పరిస్థితుల రీత్యా ఆంధ్రప్రదేశ్‌కు నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో తుపానులు సాధారణం. అందుకనుగుణంగా నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టం ప్రభుత్వ బాధ్యత. తుపాన్లొచ్చే సమయానికి ఖరీఫ్‌ కోతలు పూర్తయ్యే విధంగా కాల్వలకు నీరు విడుదల చేస్తున్నామని సర్కారు చెపుతున్నా వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీటి కొరత, కాల్వలకు మరమ్మతులు లేక చివరి భూములకు నీరు చేరని దుస్థితి, మెట్ట ప్రాంతాల్లో కరువు, కరెంట్‌ కోతలు వెరసి ఎప్పటికంటే కూడా ఈ మారు ఖరీఫ్‌ సాగు ఆలస్యమైంది. అన్ని అడ్డంకులనూ దాటుకొని పంట పండిస్తే సరిగ్గా కోతల వేళకు తుపానొచ్చి నీటిపాల్జేసి అన్నదాతల వెన్ను విరిచింది. పెట్టుబడులు సైతం దక్కని దైన్యం. నోటికాడికొచ్చిన పంట కళ్ల ముందే ఆగమాగమవుతుంటే రైతుల గుండెలు తరుక్కుపోతున్నాయి. మనస్తాపంతో రైతుల, కౌలు రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదం.

రైతు పక్షపాతులమని ఊరూ వాడా టముకేసుకుంటున్న ప్రభుత్వం విపత్తు రైతులను ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనడానికి సర్కారు చేతలే నిదర్శనం. తుపానొచ్చి చేలు కొట్టుకుపోయి విలవిలాడుతున్న రైతులను ముఖ్యమంత్రి పరామర్శించిన తీరే సాక్ష్యం. కనీసం పొలం వద్దకెళ్లలేదు. ఆపన్నులకు ప్రభుత్వం ఇచ్చే విలువేంటో, బాధితులకు చేసే సహాయంపై సర్కారు చిత్తశుద్ధి ఏంటో ఈ ఘటనలతో తెలిసిపోతుంది. కరువుపైనా ఇదే బడి. ఖరీఫ్‌లో 400కు పైన మండలాల్లో దుర్భిక్షం ఉందని రైతులు భోరుమంటున్నా కరువు కాస్తేనని 103 మండలాలకు పరిమితం చేసింది. ఖరీఫ్‌ ముగిసిన రెండు మాసాలకు కేంద్ర బృందాలంటున్నారు. ఎప్పటికి పరిహారం, బీమా ఇస్తారో తెలీదు. ఇప్పుడొచ్చిన తుపాన్‌ సాయం ఎప్పటికో? వాస్తవ నష్టాలకు, ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీకి పొంతనే లేదు. ఉదాహరణకు ఎకరా వరికి రైతుకు పెట్టుబడి రూ.20 వేలైతే ప్రభుత్వం ఇచ్చేది రూ.6,800 మాత్రమే. దానికే రైతులను ఆదుకుంటున్నామంటున్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ల హామీలూ నీటిపై రాతలేనని గత అనుభవాలు చెప్పుతున్నాయి. రూ.2 వేల కోట్ల విపత్తు నిధి ఏమైందో తెలీదు. కరువు, తుపాన్‌ సహాయంపై కేంద్రాన్ని రాష్ట్రం అడిగింది లేదు. అటు కేంద్రమూ మాట్లాడట్లేదు. డ్రైనేజి వ్యవస్థకు తుపాన్‌, కరువులతో కోలుకోలేని స్థితిలో ఉన్న రైతులకు సముచిత స్థాయిలో పరిహారం చెల్లించాలి. బీమా ఇవ్వాలి. తిరిగి పంటలేసుకోడానికి రుణాలు, విత్తనాలు సమకూర్చాలి. జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులివ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేయాలి. అఖిలపక్షం వేయాలి. వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలి. తుపాన్‌ బాధిత ప్రజలకు తక్షణ సహాయం అందించాలి. రైతులను, కౌలుదార్లను ఆదుకొని ప్రభుత్వం తన రైతు పక్షపాతాన్ని నిరూపించుకోవాలి.

➡️