హామీలు మరచిన సర్కారు !

Dec 24,2023 07:18 #Editorial

ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46 వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపోయాయి. ‘మాట తప్పం, మడమ తిప్పం…అంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్ర్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు.

             ‘ఇంకో ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం. టైం స్కేలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతం అమలు చేస్తాం. వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తాం…’ అంటూ గత ఎన్నికలకు ముందు సంకల్ప పాదయాత్రలోనూ, శాసనసభలోను ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 26వ తేదీ నుండి ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46 వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపోయాయి. ‘మాట తప్పం, మడమ తిప్పం…అంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు.

పాలకులందరిదీ ఒకటే దారి

అధికార పీఠం ఎక్కే ముందు చెప్పే మాటలకు తీరా గద్దెనెక్కిన తర్వాత అనుసరించే విధానాలకు పాలకులందరిది ఒకటే దారి! ”తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కిస్తే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తాం” అంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది టిడిపి. తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మొండి చేయి చూపింది. కనుక తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి నేత జగన్మోహన్‌ రెడ్డి గారు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఊరూవాడతో పాటు అసెంబ్లీలోను ఊదరగొట్టారు. గత నాలుగున్నరేళ్లుగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను గత టిడిపి ప్రభుత్వం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం కూడా అడియాసలు చేసింది.

ప్రభుత్వ ప్లాప్‌ సినిమా ఆప్కాస్‌

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చీ రాగానే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఆప్కాస్‌ పేర శఠగోపం పెట్టింది. గతంలో మధ్యవర్తి కాంట్రాక్టర్‌ ద్వారా పని చేసిన కార్మికులను దోపిడీ నుండి విముక్తి చేసేందుకు ఆప్కాస్‌ తెస్తున్నామంటూ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు. ప్రతి పట్టణంలో ఉన్న మధ్య దళారీల బెడదైతే తొలగిపోయింది కానీ వైసిపి ప్రభుత్వం ద్వారా కొత్త సమస్యలు కార్మికులను చుట్టుముట్టాయి. అందుకు ఉదాహరణ గతంలో మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ పద్ధతి అమలులో లేదు. ఆప్కాస్‌ వచ్చాక రిటైర్మెంట్‌ విధానాన్ని బలవంతంగా కార్మికులపై రుద్దారు. ఆప్కాస్‌ మున్సిపల్‌ కార్మికులతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ ఉద్యోగులుగా నమోదు చేశారు. ఉద్యోగులకు అమలు చేస్తున్న జీతభత్యాలు, సరెండర్‌ లీవులు, గ్రాట్యుటీ, పెన్షన్‌ వంటి పథకాలు ఏవీ వీరికి వర్తింపచేయలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారైంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల పరిస్థితి. ఆప్కాస్‌లో ఉద్యోగులుగా నమోదు చేసినందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎగిరిపోయాయి. పిల్లలకు అమ్మ ఒడి, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, కుటుంబ సభ్యులకున్న వితంతు/వృద్ధాప్య పెన్షన్‌ దారులకు పెన్షన్‌ కట్‌ చేశారు. దీనితో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు, చెత్త పన్ను వంటివి కార్మికుల నెత్తిన బండలుగా మారాయి. ముఖ్యమంత్రి గారు నవరత్నాలు ప్రారంభిస్తూ పారిశుధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన హామీ అటకెక్కింది.

కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒకటేనన్నారే !

అధికార పీఠం ఎక్కక ముందు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒక్కటే, పేరులోనే తేడాలు తప్ప. చదువులు విధులు ఒక్కటే అన్నారు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి అయ్యాక అందుకు విరుద్ధంగా కాంట్రాక్టు కార్మికులను మాత్రమే పర్మినెంట్‌ చేస్తూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను గాలికొదిలేశారు. దసరా సందర్భంగా కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ జీవో నెంబర్‌ 114ను జారీ చేసే సందర్భంలో తమకు కూడా తీపి కబురు వస్తుందని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరూ వేయి కళ్ళతో ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కటాక్షించలేదు. గత టిడిపి ప్రభుత్వం, వైసిపి ప్రభుత్వం రెండింటికి తేడా కనిపించడంలేదు. దొందూ దొందే చందంగా వుంది.

చర్చలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం

ఈ సమస్యపై మున్సిపల్‌ రంగంలోని అన్ని సంఘాలు కలిసి 2022 జులై 11 నుంచి 15వ తేదీ వరకు సమె నిర్వహించాయి. ఈ సమ్మెకు ముందు జులై ఏడో తేదీన డిఎన్‌ఏ ఆధ్వర్యంలోనూ, సమ్మె ప్రారంభమైన జులై 11వ తేదీ ఇరువురు మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలో అన్ని సంఘాలతో సచివాలయంలో చర్చలు జరిగాయి. 2022 జనవరి నుండి జీతాలు 3000 రూపాయలు పెరిగాయి కనుక హెల్త్‌ అలవెన్స్‌ రూ.6000 కాకుండా రూ.3000 మాత్రమే చెల్లిస్తామంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇంజనీరింగ్‌ కార్మికులకు సంబంధించి జీవో ఆర్టీ నెంబర్‌ 30 సవరించి వాటర్‌ సప్లై, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, షైన్‌ దళం మొదలగు ఎనిమిది కేటగిరీలకు కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాలు చెల్లిస్తామని, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోకి వచ్చే చెత్త తరలించే వాహన డ్రైవర్లు మలేరియా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లిస్తామని, పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా సంక్షేమ పథకాల అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు రూ.6000 హెల్త్‌ అలవెన్స్‌ మాత్రమే చెల్లిస్తూ మంత్రి గారు ఏకపక్షంగా ప్రకటించి ఇంజనీరింగ్‌ కార్మికులకు ద్రోహం చేశారు. అప్పటివరకు పారిశుధ్య కార్మికులకు అమలైన సంక్షేమ పథకాలను 2022 ఆగస్టు ఒకటో తేదీ నుండి ఎత్తివేశారు.

హామీల అమలు కోసం సమరశీల పోరాటాలు

పట్టణాల విస్తరణ మేరకు పని భారం పెరిగి కార్మికులు అవస్థలు పడుతుంటే సిబ్బంది సంఖ్యను పెంచాలని కార్మికులు నిలదీస్తున్నారు. సిబ్బందిని పెంచుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అంటూ 44 మున్సిపాలిటీలు ఆర్థిక శాఖకు మొరపెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా అనుమతి ఇవ్వడం లేదు. రోడ్లమీద పని చేయాల్సిన కార్మికులను అధికారులు డ్రైవర్లు గాను ఇతర పనుల కోసం పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. దీనివల్ల వీధుల్లో పని చేస్తున్న కార్మికులపై మోయలేని పని భారం పడుతున్నది. దీనితోపాటు జీవో నెంబర్‌ 30 సవరణ, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోని వారికి హెల్త్‌ అలవెన్స్‌, ముఖ్యమంత్రి హామీలైన సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్‌, సిపిఎస్‌ రద్దు డిమాండ్ల సాధన కోసం సిఐటియు అనుబంధ సంఘం మే, జూన్‌ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు బస్సుయాత్రలు నిర్వహించింది. ఆగస్టులో మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి, జిల్లా కలెక్టరేట్ల ముట్టడి మిలిటెంట్‌గా జరిగాయి. అనేక జిల్లాల్లో మహిళా కార్మికులతో సహా తలలు పగిలి చేతులు విరిగాయి. పోలీసు నిర్బంధం పెద్ద ఎత్తున కొనసాగింది. రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారడంతో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సిఐటియు అనుబంధ సంఘంతో ఆగస్టు 10వ తేదీన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. గత నాలుగున్నరేళ్లలో 20 నుండి 25 దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు.

మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని డిసెంబర్‌ 21వ తేదీ తరువాత సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి అధికారులకు సిఐటియు అనుబంధ సంఘం సమ్మె నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఏఐటీయూసీ నాయకత్వం కూడా డిసెంబర్‌ 27 నుండి సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి డిసెంబర్‌ 14వ తేదీ మున్సిపల్‌ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ప్రధానమైన డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకునే దిశలో చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో సిఐటియు అనుబంధ సంఘం డిసెంబర్‌ 26వ తేదీ నుండి నిరవధిక సమ్మె తేదీని ప్రకటించింది. సమ్మెని ఫెయిల్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక మున్సిపల్‌ అధికారులను రంగంలోకి దించి మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో జాయింట్‌ మీటింగులు పెట్టి స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. మీరు సమ్మెలోకి వెళ్ళొద్దంటూ కార్మికులను లొంగదీసుకునేందుకు, బెదిరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు, హెచ్చరికలను లెక్క చేయకుండా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. సమ్మె జయప్రదం కావడం కోసం ప్రజల మద్దతు కోరుతున్నారు.

/వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు), ప్రధాన కార్యదర్శి /కె. ఉమామహేశ్వరరావు
/వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు), ప్రధాన కార్యదర్శి /కె. ఉమామహేశ్వరరావు
➡️