వలస కార్మిక విషాదం!

Jun 15,2024 05:30 #editpage

బుధవారం తెల్లవారుజామున కువైట్‌ లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 50 మంది వలస కార్మికుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం. వారిలో ముగ్గురు రాష్ట్ర వాసులతో సహా 45 మంది భారతీయులు కావడం మరింత విషాదకరం. కువైట్‌లోని మంగాఫ్‌ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో గాఢ నిద్రలో ఉండగానే 43 మంది మంటల్లో సజీవ దహనమవ్వగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో 50 మందిలో ఎంతమంది ఏమవుతారో ఎవరికీ తెలియని పరిస్థితి. దినదిన గండమే! మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా వున్నందున డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించి మరణించినవారిని గుర్తిస్తున్నారు. ఆ భవనంలో సుమారు 200 మంది నివాసం ఉంటున్నారు. కువైట్‌లో అతి పెద్ద భవన నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఎన్‌బిటిసి గ్రూపు (యజమాని భారతీయుడే) ఈ భవనాన్ని అద్దెకు తీసుకుని వలస కార్మికులకు అందులో వసతి కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి అందులో జనం నివసిస్తున్నారనీ, అసలు ఆ భవనం ఫైర్‌ సేఫ్టీ నియమాలకు అనుగుణంగా లేదనీ అధికారులు ఇప్పుడు చెబుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని గంభీర ప్రకటనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చిన్న తప్పునకైనా తీవ్రమైన శిక్షలుంటాయని చెప్పబడే గల్ఫ్‌లోనూ పెద్ద తేడా లేదు. ఏది ఏమైనా పోయిన ప్రాణాలను ఎవరూ వెనక్కు తేలేరు కదా! ఆయా కుటుంబాల బాధామయ పరిస్థితి వర్ణనాతీతం.
ప్రమాదంలో గాయపడిన భారతీయులకు అందుతున్న సహాయాన్ని పర్యవేక్షించడానికి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్‌ సింగ్‌, మరణించిన వారి కుటుంబాలకు సాయం చేయడానికై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి కువైట్‌ వెళ్లారు. గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులపై సమీక్షించారు. గ్లోబల్‌ కాంటాక్ట్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని సంస్థలు, దాతృత్వం కలిగినవారూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కోటి మందికి పైగా భారతీయ వలస కార్మికులు గల్ఫ్‌లో జీవిస్తున్నారు. కువైట్‌ జనాభాలో భారతీయులు 21 శాతం (10 లక్షలు), దాని శ్రామిక శక్తిలో 30 శాతం (సుమారు తొమ్మిది లక్షలు)గా ఉంటారు. అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకూ నిపుణులుగా వెళ్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. వివిధ దేశాల్లో శ్రామికులుగా ఆ దేశాల అభివృద్ధిలోనూ మనవారి పాత్ర చాలా ముఖ్యమైనదే! ఏటా పది వేల కోట్ల డాలర్లు (సుమారు 8.4 లక్షల కోట్ల రూపాయలు) మన దేశానికి విదేశాల నుండి రెమిటెన్సెస్‌ రూపంలో చేరుతున్నది. ప్రపంచంలోనే ఇది అత్యధికం. లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న వలస కార్మికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టడంలేదు. వారి ఉద్యోగ భద్రత, వేతనాల చెల్లింపు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో ఆయా ప్రభుత్వాలు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాలు కూడా వారి సంక్షేమం, భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ స్వల్పంగానే ఉంటోంది. మొత్తంగా చూస్తే గరిష్ట లాభాలు (ప్రాఫిట్‌ మాగ్జిమైజేషన్‌) పోగేసుకోవడానికి బడా కార్పొరేట్లు అనుసరిస్తున్న దోపిడీ విధానాలకు వలస కార్మికులు సమిధలవుతున్నారు. ప్రమాదాల్లోనో లేక సహజంగానే మరణించినా వారిని చివరిసారి చూసుకునే అవకాశం కూడా దక్కని దుస్థితి కలుగుతోంది. ఈ అనుభవం తరువాతనైనా భారత ప్రభుత్వం వలస కార్మికుల భద్రత పట్ల పటిష్ట చర్యలు చేపట్టాలి. అందునా శారీరక శ్రమ చేసే సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ కార్మికుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఏ దేశంలోనైనా నివసిస్తున్న వారందరి సంక్షేమం, భద్రత అక్కడి ప్రభుత్వానిదే. ఆ బాధ్యత తప్పక నిర్వహించాలి.

➡️