పాలస్తీనాకు మరో మూడు దేశాల గుర్తింపు

May 24,2024 05:05 #editpage

అనేక తర్జన భర్జనల తరువాత 2024 మే28 లోగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని స్పెయిన్‌, ఐర్లండ్‌, నార్వే నిర్ణయించాయి. నిజానికి 2014 నవంబరు 17న…పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ప్రభుత్వానికి అధికారమిస్తూ స్పెయిన్‌ పార్లమెంటు తీర్మానించింది. ప్రధాన స్రవంతికి దూరంగా లేదా వ్యతిరేక శిబిరంలో ఉండి ఇంతకాలంగా విమర్శల పాలైన ఈ దేశాలు ఇప్పటికైనా ఈ సముచిత నిర్ణయం తీసుకోవటాన్ని స్వాగతించాల్సిందే. అయితే దీని వలన కొత్తగా పాలస్తీనా అరబ్బులకు ఒరిగేదేంటన్న వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇప్పటికే 139 దేశాలు గుర్తించాయి. ఐరాసలో పాలస్తీనాకు ఇప్పుడున్న పరిశీలక హోదా స్థాయికి బదులు పూర్తిస్థాయి దేశంగా గుర్తించాలనే బాటలో మరొక అడుగు వేసే తీర్మానంపై తాజాగా 143 దేశాలు మద్దతుగా ఓటు వేశాయి. పరిశీలక హోదాకు పరిమితం కాకుండా కొత్త హక్కులు, చర్చల్లో అన్ని అంశాలపై మాట్లాడే సభా హక్కులు ఇవ్వాలన్నదే దాని సారం. మరో విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయి సభ్యత్వ హోదాను ఆమోదించటమే. భద్రతా మండలిలో తీర్మానం పెడితే నరుకుతా అంటూ వీటో కత్తితో వీరంగం వేస్తున్న అమెరికా ఉన్నంతవరకు ఇలాంటి ఎన్ని తీర్మానాలు చేసినా ప్రయోజనం ఉండదు. మరి మూడు దేశాల గుర్తింపుతో ఎలాంటి ప్రభావం ఉండదా అంటే తప్పకుండా ఉంటుంది. పాలస్తీనాను వ్యతిరేకిస్తున్న శక్తులపై ఒత్తిడి పెరుగుతుంది. వాటి ప్రజాస్వామ్య, మానవత్వ ముసుగులు మరికొంత చిరిగి వాస్తవ రూపాలు మరింతగా కనిపిస్తాయి. పాలకులలో స్పందన లేకున్నా పౌరుల్లో చురుకు పుట్టిస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులకు ఊపునిస్తాయి. దూరంగా ఉన్నవారికి మనమెందుకు స్పందించటం లేదనే ఆలోచన కలిగిస్తాయి.
ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి గాలాంట్‌కు సమన్లు జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ప్రాసిక్యూటర్‌ కోరటం ఇజ్రాయిల్‌కు దిగ్భ్రాంతి కలిగించింది. దీనికి తోడు మూడు దేశాల ప్రకటనతో ఇజ్రాయిల్‌కు ఆగ్రహం కలిగింది. ఉక్రోషంతో ఆ దేశాల నుంచి రాయబారులు వెనక్కు రావాలని ఆదేశించింది. ఉగ్రవాదానికి ఇచ్చిన బహుమతి అంటూ చిందులేసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండుగా విభజించి ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఐరాస తీర్మానించిన సంగతి తెలిసిందే. తరువాత అడ్డం తిరిగిన పశ్చిమ దేశాలు పాలస్తీనాను గుర్తించేందుకు అంగీకరిస్తూనే ఆచరణ సాధ్యంగాని షరతులను ముందుకు తెస్తూ అడ్డు పడుతున్నాయి. రెండు పక్షాల మధ్య నేరుగా సంప్రదింపులు జరిగిన తరువాతే తప్ప ఏకపక్షంగా గుర్తింపు ఇవ్వకూడదన్న తన అప్రజాస్వామిక వైఖరిని మరోసారి మూడు దేశాల ప్రకటన తరువాత అమెరికా ప్రదర్శించింది. గాజాలో హమాస్‌ ఉన్నంత వరకు పాలస్తీనా దేశాన్ని తాము గుర్తించబోమని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి కామెరాన్‌ సెలవిచ్చాడు. హమాస్‌ నిన్నగాక మొన్న ఉనికి లోకి వచ్చింది, అంతకు ముందు ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? మేకపిల్లను తినదలచుకున్న తోడేలు చెప్పిన కుంటి సాకు కథ తప్ప మరొకటి కాదు. తనకు కేటాయించిన ప్రాంతాలకు పరిమితం గాకుండా తమ రక్షణకు హామీగా ఉండాలంటూ అడ్డగోలు వాదనలతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటమే కాదు. జనాభా స్థితిగతులను మార్చివేసేందుకు ఆ ప్రాంతాలలో యూదుల నివాసాలను ఏర్పాటు చేసి, అరబ్బులను మైనారిటీగా మార్చి…వాటిని చూపి అవి కూడా తమవే అంటున్న ఇజ్రాయిల్‌తో పాలస్తీనా విముక్తిని కోరు కుంటున్న వారికి ఏకీభావం ఎలా ఉంటుంది.
మూడు దేశాల చర్యతో ఐరోపాలో మరికొన్ని దేశాలు అదే బాట పట్టవచ్చనే చర్చ జరుగుతోంది. తాము కూడా పరిశీలిస్తున్నట్లు మాల్టా, స్లోవేనియా మార్చి నెలలో ప్రకటించాయి. ఐరోపా స్పందన ఎంతో బలహీనంగా ఉన్నందున మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా గుర్తింపు ఇచ్చేందుకు ముందుకు పోవాల్సిన పరిస్థితిలో ఉన్నామని ఈ రెండు దేశాల ప్రధానులతో మాడ్రిడ్‌లో జరిపిన చర్చల తరువాత స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌ ప్రకటించాడు. తాము కూడా వీటితో జత కడతామని బెల్జియం, పోర్చుగల్‌ దేశాలు సంకేతాలు పంపినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇన్ని దేశాలు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించినా ఇజ్రాయిల్‌ దాని దారుణాలకు మద్దతు ఇస్తున్న, పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటుకు మోకాలడ్డుతున్న అమెరికా మరికొన్ని దేశాల వైఖరిలో రాని మార్పు ఇప్పుడు వస్తుందని భావించనవసరం లేదు. వీటో కత్తిని ఝళిపిస్తున్న అమెరికా ఉన్నంత వరకు దానికి తోడుగా ఇజ్రాయిల్‌ మినహా… పాలస్తీనాను ప్రపంచ దేశాలన్నీ గుర్తించినా ఆచరణలో తక్షణ ప్రయోజనం కనిపించదు.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️