ఎగ్జిట్‌ లెక్కలు ఏ మేరకు నిజం ?

Dec 3,2023 07:19 #Editorial

ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలు అన్నవి విస్తరించిన కొద్దీ ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అనివార్య ఘట్టంగా మారాయి. సోషల్‌ మీడియా, మీడియా, మార్కెటింగ్‌ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్రలోకి మారాక వ్యాపారపరంగానూ ఇదో వ్యవస్థగా తయారైంది. ఆ యా పార్టీల కమిటీలు, నాయకత్వాలు, సమావేశాలు గాక వ్యూహకర్తలే ఎన్నికల విధానాల నిర్ణాయకులైనందు వల్ల తమ పాత్రను చూపించుకోవడానికి కూడా వారికి దశలవారీ సాధనాలుగా ఇవన్నీ అక్కరకు వస్తున్నాయి.

ఏమైనా మౌలికంగానే ఇవి పరిశీలనలే గానీ ఫలితాలు కావు. సర్వేల కన్నా ఎగ్జిట్లకు కొంత వాస్తవికత వుందని అంటుంటారు గాని అదే స్థాయిలో పరిమితులు కూడా వుంటాయి. అందుకే ఎగ్జిట్‌ ఎగ్జాక్ట్‌ కాదనే నానుడి ఏర్పడింది. ముందే చెప్పుకున్నట్టు వీటికి ఏ విధమైన ప్రామాణికత ఇవ్వడం కష్టం. స్థూలంగా వాటిలో చెప్పిన వారు గెలిస్తే పర్వాలేదనుకోవడం తప్ప ఎగ్జిట్‌ లెక్కల ఆధారంగా మరీ లోతుల్లోకి వెళ్లి వ్యాఖ్యలు, విశ్లేషణలు చేయడానికి ఖచ్చితమైన ప్రతిబంధకాలున్నాయి. పైగా గతంలో చాలాసార్లు ఈ ఎగ్జిట్లు తారుమారైన ఉదాహరణలున్నాయి.

                ఓటింగు, కౌంటింగు మధ్యలో ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ అనే మరో మధ్యంతర దశ ప్రవేశించింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పడు మన ముందు ఆవిష్కరించబడ్డాయి. అంతకంతకూ విస్తరించిన ఈ మధ్యంతర ఘట్టానికి రాజ్యాంగ పరంగా గానీ, రాజకీయ విలువ గాని లేకున్నా ప్రజల, పార్టీల ఉత్సుకతను పెంచేస్తున్నది. పోలింగు ముగిసీ ముగియక ముందే పోటాపోటీగా వెలువడే ఈ ఎగ్జిట్‌ ఫలితాలు ఒక ప్రీ కౌంటింగ్‌ ప్రహసనంగా తయారైనాయి. ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలు అన్నవి విస్తరించిన కొద్దీ ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అనివార్య ఘట్టంగా మారాయి. సోషల్‌ మీడియా, మీడియా, మార్కెటింగ్‌ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్రలోకి మారాక వ్యాపారపరంగానూ ఇదో వ్యవస్థగా తయారైంది. ఆ యా పార్టీల కమిటీలు, నాయకత్వాలు, సమావేశాలు గాక వ్యూహకర్తలే ఎన్నికల విధానాల నిర్ణాయకులైనందువల్ల తమ పాత్రను చూపించుకోవడానికి కూడా వారికి దశలవారీ సాధనాలుగా ఇవన్నీ అక్కరకు వస్తున్నాయి. ఇదిగాక భారీ బెట్టింగుల కోసం కూడా అనేక వలలు. ఇన్ని వ్యూస్‌, ఇన్ని క్లిక్స్‌, ఇన్ని లైక్స్‌, విజిటర్స్‌ అంటూ చూపించడం క్లయింట్లయిన రాజకీయ పార్టీలనూ అభ్యర్థులనూ ఒప్పించే ప్రక్రియగా మారింది. 1990లలో ప్రణరు రారు ఎన్‌డిటివి టీం భారతీయులను దగ్గర చేసిన ఈ ప్రక్రియ ఇప్పుడు అచ్చంగా వ్యాపార రాజకీయ పోటీగా మారింది. సాంకేతికంగా దాని పరిమితులు ఒక క్రమపద్ధతిలో నిర్వహించినా వుండే తేడాలు ఒకటైతే అచ్చమైన వ్యాపారంగా మారాక దీని ప్రామాణికత అసలే ప్రశ్నార్థకమవుతున్నది. చాలాసార్లు నిజమైనా కొన్ని సార్లు ఘోరంగా దెబ్బ తిన్నా ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చను మాత్రం దాటేయగల స్థితి ఇప్పుడు లేదు. ఎగ్జిట్‌ అనుకూలంగా వచ్చిన వారు ఆనందిస్తే, రాని వారు అసహనానికి గురైతే ఎటొచ్చీ పూర్తి ఫలితాల కోసం వేచి చూడడం అనివార్యమే అవుతుంది. కాకపోతే ఈలోగా మీడియా చర్చలకూ పార్టీల పరస్పర సవాళ్లకు మరో కొత్త అస్త్రం దొరికినట్టయింది.

తెలంగాణలో ప్రభుత్వ మార్పు ?

తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్లు కాంగ్రెస్‌కు ఆధిక్యతను సూచిస్తున్నాయి. వాటిలో పరస్పర తేడాలు చూడొచ్చు. అదే సమయంలో మూడు నాలుగు సంస్థలు బిఆర్‌ఎస్‌కే మెజార్టీ వస్తుందని చెప్పినవీ వున్నాయి. కానీ వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. హంగ్‌ వస్తుందని కూడా సూచనలు వున్నాయి. కాని ఎక్కువ భాగం కాంగ్రెస్‌కే ఇచ్చాయి గనక, అంతకు ముందు నుంచి ఈ మాట వినిపిస్తున్నది గనక బిఆర్‌ఎస్‌ ఓటమి తప్పదనే తరహాలో చర్చలు నడుస్తున్నాయి. ఆ పార్టీ నేత కెటిఆర్‌ మాత్రం ఎగ్జిట్లు చెత్త అని తాము 70 స్థానాలు తెచ్చుకుంటామని ప్రకటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌కు 25 కంటే రానివ్వబోమంటున్నారు. ఇక బిజెపి నేతలైతే హంగ్‌ అంచనాలు కొనసాగిస్తున్నారు. హంగ్‌ వస్తే బిఆర్‌ఎస్‌, బిజెపి మద్దతు తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్న అయితే…కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం సవాలవుంతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఇలాంటి వ్యవహారాలలో ఆరితేరిన ఉప ముఖ్యమంత్రి, రేవంత్‌ సన్నిహితుడు డి.కె.శివకుమార్‌ ఆ పనిలో పడ్డారని అంటున్నారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.

చత్తీస్‌గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ ఏదో విధంగా అధికారం నిలుపుకోగలుగుతుందని ఎగ్జిట్లు చాలావరకూ చెబుతున్నాయి. అలాగే బిజెపి మొదటి నుంచి ఎక్కువ ఆశ పెట్టుకున్న రాజస్థాన్‌లో దానికి అనుకూలత కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్‌ కూడా దగ్గరలోనే వుంది. ఇక మధ్యప్రదేశ్‌లో ఎవరు గెలుస్తున్నారన్న దానిపై పరస్పర తేడాలతో అంచనాలు వెలువడ్డాయి. కొన్ని కాంగ్రెస్‌కు, కొన్ని బిజెపికి మొగ్గు చూపాయి. మిజోరాం లోనూ ఎంఎన్‌ఎఫ్‌ పెద్ద పార్టీగా వుండగా దాని తర్వాత జెడ్‌పిఎం, కాంగ్రెస్‌ వున్నాయి. ఈశాన్యంలో తాను బాగా బలపడ్డానని చెప్పే బిజెపి ఇక్కడ కూడా ఒకటి రెండు సీట్లకు పరిమితమైనట్టు ఎగ్జిట్లు అంటున్నాయి. రాజకీయంగా ప్రధాని మోడీ మంత్రజాలం పెద్దగా పని చేయలేదన్నది ఈ సర్వేలన్నిటిలోనూ విదితమవుతున్నది. కాంగ్రెస్‌ పట్ల మొగ్గు పెరిగినా పోటాపోటీగానే వున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌ నేతల కలహాలు, లౌకిక పార్టీల విశాల ఐక్యతకు ఆ పార్టీ సహకరించకపోవడం వల్ల ప్రతి చోటా సందిగ్థతే కొనసాగుతుందనిపిస్తుంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇది బిజెపికి ఓటర్ల హెచ్చరికగానే భావించాల్సి వుంటుంది.

జాతీయంగా గత ప్రహసనాలు

                  ఏమైనా మౌలికంగానే ఇవి పరిశీలనలే గానీ ఫలితాలు కావు. సర్వేల కన్నా ఎగ్జిట్లకు కొంత వాస్తవికత వుందని అంటుంటారు గాని అదే స్థాయిలో పరిమితులు కూడా వుంటాయి. అందుకే ఎగ్జిట్‌ ఎగ్జాక్ట్‌ కాదనే నానుడి ఏర్పడింది. ముందే చెప్పుకున్నట్టు వీటికి ఏ విధమైన ప్రామాణికత ఇవ్వడం కష్టం. స్థూలంగా వాటిలో చెప్పిన వారు గెలిస్తే పర్వాలేదనుకోవడం తప్ప ఎగ్జిట్‌ లెక్కల ఆధారంగా మరీ లోతుల్లోకి వెళ్లి వ్యాఖ్యలు, విశ్లేషణలు చేయడానికి ఖచ్చితమైన ప్రతిబంధకాలున్నాయి. పైగా గతంలో చాలాసార్లు ఈ ఎగ్జిట్లు తారుమారైన ఉదాహరణలున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు! తెలుగు రాష్ట్రాలలోనే 2018, 2019 ఎన్నికల ఎగ్జిట్లకు, వాస్తవ ఫలితాలకు చాలా తేడాలొచ్చాయి. 2004లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎ మళ్లీ ఆధిక్యత సాధిస్తుందని 240 నుంచి 250 స్థానాలు తెచ్చుకుంటుందని ఎగ్జిట్లు చెబితే వాస్తవంలో 187కు పరిమితమైంది. కాంగ్రెస్‌ కూటమికి 170 నుంచి 205 వస్తాయని చెబితే వాస్తవంలో 216 వచ్చాయి. ఈ ఉదాహరణలలోకెల్లా దారుణమైంది ఉత్తర ప్రదేశ్‌లో 2007లో మాయావతి బిఎస్‌పి పూర్తి మెజార్టీ తెచ్చుకోవడం. చాలామంది బిఎస్‌పి పెద్ద పార్టీగా రావచ్చని అంచనా వేసిన వారు కూడా పూర్తి మెజార్టీ ఊహించలేదు. 117-168 మధ్య ఆమెకు సీట్లు వస్తాయని లెక్కలేయగా వాస్తవంలో ఏకంగా 206 తెచ్చుకుని అయిదేళ్లు పాలించారు. 2014లో మోడీకి అనుకూలత చూపినా బిజెపికి మెజార్టీ వస్తుందని చెప్పలేకపోయాయి. ఒకరు మాత్రం 300 వస్తాయని చెప్పిందీ నిజం కాలేదు. ఆ తర్వాత 2015లో బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ బిజెపితో విడగొట్టుకుని ఆర్‌జెడి తో కలసి పోటీ చేసినప్పుడు కూడా ఆ కూటమి ఘన విజయం ఎగ్జిట్లకు అందలేదు. 2017లో యు.పి లో యోగి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎగ్జిట్లు పూర్తి ఆధిక్యతను పసిగట్టలేకపోయాయి. కొన్నిసార్లు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. కేరళలో గతసారి మాత్రం పినరయి విజయన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని దాదాపు అన్ని ఎగ్జిట్లు అంచనా వేశాయి. ఎగ్జిట్లు నిజమైతే ఎవరూ మాట్లాడుకోరు, తప్పయితే మాత్రం దాడి చేస్తారని సర్వే సంస్థలు అంటుంటాయి. అయితే పాలకవర్గ పార్టీలు సర్వేలను కూడా ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడం వల్లనే ఈ సందేహాలు పెరుగుతున్నాయి. బిగ్‌ డేటాతో తిమ్మిని బమ్మిని చేస్తామనే వ్యూహకర్తలు అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీలు ప్రజాభిప్రాయ ప్రకటనను ప్రహసనంగా చేశాయి. కార్పొరేట్‌ సంస్థల ప్రవేశం మరింత గందరగోళానికి దారితీసింది. 1980లో ఇందిరా గాంధీ పునరాగమన ఎన్నికలతో మొదలై ఆమె హత్యానంతరం 1984 ఎన్నికలలో రాజీవ్‌గాంధీ హయాంలో ఈ మార్కెటింగ్‌ విజృంభించింది. 2013 మోడీ అభ్యర్థిత్వం నాటికి పరాకాష్టకు చేరింది. కార్పొరేట్‌ కాన్సెప్టులు, క్యాచీ క్యాంపైన్లు ఓటర్లపై ప్రయోగించబడుతున్నాయి. బెట్టింగ్‌ సర్వేలు కలిపిన వ్యాపార సామ్రాజ్యాలేర్పడ్డాయి. 2018లో రేపు తెలంగాణ పోలింగ్‌ అనగా ఒకరోజు ముందు అత్యంత హాస్యాస్పదమైన సర్వే విడుదల చేసిన మాజీ ఎంపీని, ఉదంతాన్ని ఎవరు మర్చిపోగలరు ? ఈ ధోరణి ముదిరిపోయి ఉప ఎన్నికలకు కూడా సర్వే సంస్థలను రంగంలోకి దించడం, ముందే ఒక క్రమపద్ధతిలో ప్రచారం చేయడం అంచనాలు వదలడం పరిపాటిగా మారింది. పార్టీల పోటీ కాస్తా సర్వే సంస్థల పోటీగా మారింది.

వ్యూహకర్తల విన్యాసాలు

              ఎగ్జిట్‌ పోల్స్‌ ఓటింగు తర్వాత వస్తాయి గనక పార్టీలకు పెద్దగా ఉపయోగపడవు. కానీ సర్వే సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలలో అవీ భాగంగా వుంటాయి. వాటి వ్యాపారం కోసమే గాక పోటీలో ప్రత్యేకత నిలబెట్టుకోవడానికి కూడా ఏవో చిట్కాలు ప్రయోగించడం కద్దు. మీడియా చర్చల సందర్భంలోనూ ఇతరత్రానూ ఇలాంటివారితో మాట్లాడితే చిత్రమైన సంగతులు చెబుతుంటారు. ఆ యా పార్టీల, ప్రభుత్వాల నాయకులను కలుస్తూ నిరంతర సంబంధాలు నెరుపుతుంటారు. ప్రత్యర్థి పార్టీల తరపున కూడా పని చేస్తుంటారు. ప్రశాంత్‌ కిశోర్‌ మోడీకి, రాహుల్‌కి కూడా పని చేయడం విడ్డూరమేమీ కాదు. ఏదైనా తప్పు చెబితే తమ మనుగడకే ముప్పు గనక కావాలని ఎందుకు చెబుతామని వారంటుంటారు. కానీ మీడియా ప్రచారం, సర్వేలు, యాడ్లు అన్నీ కలిసిన ప్యాకేజీలు గనక రకరకాల సేవలు తప్పవు. రాజకీయ మొగ్గులూ వుంటాయి. ఒకప్పుడు ఇలాంటి సేవలందించిన వారెందరో తర్వాత ఆయా పార్టీలలో చేరడం చూస్తాం. ఉదాహరణకు బిజెపి ఎం.పి జీవిఎల్‌ నరసింహారావు సెఫాలజిస్టుగా పనిచేసిన వారేనని అందరికీ తెలుసు. ప్రశాంత కిశోర్‌ రాజకీయ పాత్ర కోసం ఎలా తహతహలాడుతున్నదీ చూస్తున్నాం. యోగేంద్ర యాదవ్‌ విషయం కూడా సెఫాలజిస్టుగా చేసి తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఈ సారి సురేష్‌ కనుగోలు సేవలు తీసుకుంది. ఆయన కూడా ప్రశాంత కిశోర్‌తో పనిచేసిన వారే. తమాషా ఏమంటే రాహుల్‌, ప్రియాంకలే గాక రాష్ట్ర నాయకులతో సహా ఎవరు ఎప్పుడు ఏ విషయం లేవనెత్తాలి, ఏ సభలో ఏ సందర్భంలో ఏ అంశం తీసుకెళ్లాలి వంటిది కూడా వీరే నిర్దేశిస్తారట. మాకు సలహాలివ్వడం గాక మేము ఏం చేయాలో కూడా వారే చెబితే ఎలా అంటూ బిఆర్‌ఎస్‌ ప్రశాంత్‌ టీమును పంపేసిందని కెటిఆర్‌ సూచనగా చెప్పారు. ఎ.పి లో మాత్రం వీరి సేవలు ప్రభుత్వ యంత్రాంగంలోకి కూడా చొరబడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇది మార్కెటీకృత ప్రజాస్వామ్యమన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడొచ్చిన ఎగ్జిట్‌ ఫలితాలు మిశ్రమ సంకేతాలిచ్చాయనేది వాస్తవం. నిజమైన ఫలితాలతో ఇవి సరిపోలుతాయా లేదా అనేది మరి కొద్ది గంటలలో కానీ తేలదు. వాస్తవ ఫలితాలకూ ఎగ్జిట్ల ప్రదర్శనకూ మధ్య ఎంత తేడా వుందో, ఎన్ని రకాల తేడా వుందో అప్పుడే తెలుస్తుంది. అయినా ఈ రాజకీయ వ్యాపార క్రీడ మాత్రం ఆగదు.

తెలకపల్లి రవి
                 తెలకపల్లి రవి
➡️