పథకాల ఏకరువు

Feb 6,2024 07:20 #Editorial

                        ఉభయ సభలనుద్దేశించి సోమవారం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం యావత్తూ ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టడానికే సరిపోయింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీ. గవర్నర్‌ ప్రసంగం ప్రభుత్వ పనితీరుకు దిశ, దశ. ఇప్పటి వరకు ఏం చేశాం, భవిష్యత్‌లో ఏం చేస్తాం అనే విషయాన్ని ప్రభుత్వం గవర్నర్‌ చేత చెప్పిస్తుంది. వైసిపి సర్కారు వచ్చి ఐదేళ్లవుతున్న తరుణాన, త్వరలో ఎన్నికలున్నందున ఇప్పుడు ప్రవేశపెట్టేది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌. అందువల్ల రాబోయే కాలానికి నిర్దేశాలేవీ ఆశించలేం. ఈ టర్మ్‌లో ఇదే ఆఖరి బడ్జెట్‌ కనుక గడచిన కాలంలో చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడమే. కానీ గవర్నర్‌ నోట సర్కారు చెప్పించిన ప్రసంగ పాఠంలో ఏకోశాన సమీక్ష లేదు. చేసిందేమిటి చేయనిదేమిటి వైఫల్యాలేమిటి వంటివి మచ్చుకూ దొరకవు. ‘నవరత్నాల’నే ఏకరువు పెట్టారు. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన ప్రజలను ఉద్ధరించామని భూజాలు చరుచుకున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ప్రాధామ్యాలుగా ప్రాథమిక రంగమైన వ్యవసాయ, అనుబంధ రంగాలను గవర్నర్‌ ప్రసంగంలో తొలుత ప్రస్తావిస్తారు. కానీ ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంచుకుంది. ఆంగ్ల మాధ్యమం, బైజూస్‌, టోఫెల్‌ వంటి వాటిని కీర్తించి విద్య కార్పొరేటీకరణకు బాటలు వేశామని నేరుగానే చెప్పింది. అవినీతి, అక్రమాలపై సమాధానం లేదు. ఇటీవలే కేంద్రం విడుదల చేసిన ఒక సర్వేలో ప్రాథమిక, సెకండరీ స్థాయిలో డ్రాపవుట్లలో ఎ.పి. పరిస్థితి అథమంగా ఉందని పేర్కొంది. దాదాపు 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడి కాగా మెగా డిఎస్‌సి అన్న సర్కార్‌ మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ వాస్తవాలను కావాలనే ప్రభుత్వం దాచిపెట్టింది. రైతే వెన్నెముకగా పేర్కొనగా, వారు అధోగతి అనుభవిస్తున్నారు. ఆర్‌బికెలు, భరోసానే అన్నదాతలను ఆదుకున్నట్లు ప్రభుత్వం అసత్యాలు వల్లించింది. వైద్యరంగాన్నే తీసుకుంటే ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయనందున నెట్‌వర్క్‌ ఆస్పత్రులు తరచు చికిత్సలను తిరస్కరిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల దుర్భర స్థితికి కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందక రోగులు మరణించిన దృశ్యాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఘోర వైఫల్యాలకు అన్నమయ్య, పులిచింతల, గుండ్లకమ్మ, పోలవరం డయాఫ్రంవాల్‌ డ్యామేజిలు మచ్చుతునకలు. ఎ.పి.కి జీవనాడిగా చెప్పే పోలవరం నిర్వాసితుల పునరావాస పరిహారం నేటికీ 22 శాతమేనని గవర్నర్‌ నిజం పలికారు. ఈ నిర్లక్ష్యానికి కారణమెవరో, బాధ్యతెవరిదో తెలపలేదు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి పెద్ద పెద్ద మాటలు వాడినా, స్త్రీ, శిశుసంక్షేమానికి పాటుపడుతున్న అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికుల పట్ల సర్కారు అవలంబించిన కాఠిన్యం ప్రభుత్వ నైజాన్ని బయట పెట్టింది.

ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసు గవర్నర్‌ చివరి ప్రసంగంలోనూ టార్చిలైట్‌ వేసి చూసినా కనిపించదు. వీటి ఎజెండాతోనే 2019 ఎన్నికల్లో వైసిపి నెగ్గింది. రాజధాని లేని రాష్ట్రంగా ఎ.పి. ‘ఖ్యాతి’కెక్కింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ప్రాణార్పణలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ఉనికి ప్రశ్నార్ధకమైంది. చెప్పుకుంటూ పోతే విభజన చట్టంలో పొందుపర్చిన ఏదీ రాలేదు. వీటిపై ఆఖరి సమావేశాల్లోనైనా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి వాకౌట్‌ చేసి బిజెపి ద్రోహాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయడం దారుణం. రాష్ట్రంలో నిరుద్యోగానికి, పేదరికానికి, సర్వ భ్రష్టాత్వానికీ కారణం బిజెపి, ఆ పార్టీ అనుంగు పార్టీలే. వైసిపి ప్రభుత్వం గొప్పగా వెల్లడించింది. డిబిటి, నాన్‌ డిబిటి ద్వారా ప్రజలకు 4.23 లక్షల కోట్ల నగదు బదిలీ, విజయవాడలో అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహ స్థాపన. మానవాభివృద్ధి సూచీ గ్రాఫ్‌లు నేల చూపులు చూస్తున్నా, అప్పులు మితిమీరినా, ఇసుక, లిక్కర్‌, భూదోపిడీ అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తినా, అభివృద్ధి లేకపోయినా, గుంతల రోడ్లు సాక్షాత్కరిస్తున్నా రెండంకెల వృద్ధి అనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. అయినాసరే, తమకు ప్రజల నుంచి సహకారం, గట్టి మద్దతు ఆశించడం అత్యాశకు పరాకాష్ట.

➡️