సుఖాంతం

uttarakhand tunnel accident return

ఉత్తరాఖండ్‌ సొరంగం కథ సుఖాంతం కావడం యావత్‌ దేశానికి పెద్ద ఊరట. చార్‌ధామ్‌ యాత్రా స్థలాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉత్తరకాశి జిల్లా సిల్కెరా వద్ద భారీ సొరంగ తవ్వకాలు జరుపుతుండగా ఈ నెల 12న ఒక్క ఉదుటున కొండ చరియలు విరిగి పడటంతో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఉదంతం జాతిని కదిలించగా, ఏకంగా 17 రోజులు సొరంగంలోనే కార్మికులు దిక్కుతోచని స్థితిలో గడపాల్సి రావడం మరింత ఆందోళన కలిగించింది. ఎప్పుడు తమ వారు బయట పడతారా అని కళ్లుకాయలు కాసేలా నిరీక్షించిన కూలీల కుటుంబాలు పడ్డ క్షోభ మాటలకందనిది. పైగా కార్మికులందరూ పనుల కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాలు దాటొచ్చిన వలస కార్మికులు. అటువంటి వారి క్షేమ సమాచారం కుటుంబాలకు అంత తొందరగా అందదు. ఇటువంటి ఉద్విగతల మధ్య సహాయ కార్యక్రమాలు రోజుల తరబడి సాగాయి. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి ప్రయత్నాలు ఫలించి సొరంగంలో చిక్కుకున్న వారందరూ సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలుపెరగకుండా సహాయ చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రజానీకం, ముఖ్యంగా కార్మికలోకం జేజేలు పలికింది. మనోధైర్యం కోల్పోకుండా క్షేమంగా బయటపడ్డ కార్మికులు అభినందనీయులు. టన్నెల్‌లో కార్మికులు చిక్కుబడిన తక్షణం తీవ్రతను అంచనా వేసి పకడ్బందీగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడంలో ఉత్తరాఖండ్‌ బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్‌ ఇంజన్‌ సర్కారు పాట పాడే ప్రధాని మోడీ, తమ పాలనలోని ఉత్తరాఖండ్‌లో కూలీలు ప్రమాదంలో చిక్కుకుంటే ఆ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రధాన స్రవంతి మీడియా ప్రమాదాన్ని పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సిపిఎం, వామపక్షాలు, కార్మిక సంఘాలు, విపక్షాలు గళం విప్పాకనే కేంద్రం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాల్లో కదలికొచ్చింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఒఎన్‌జిసి, సైన్యంలోని ఇంజనీర్లు, ఇలా ఏడు ఏజెన్సీలు పూర్తి స్థాయిలో రంగంలో దిగినా, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన భారీ యంత్రాలు తెచ్చినా సాధ్యం కాలేదు. చివరికి అత్యంత నిపుణత కలిగి బొగ్గును వెలికి తీసే డజను మంది కార్మికులు చిన్న పనిముట్లతో చాకచక్యంగా తవ్వకాలు జరిపి అనువైన మార్గాలు వేసి ఎట్టకేలకు లోపల చిక్కుకున్న కార్మికులను వెలుపలకు తెచ్చారు. మానవ శ్రమ ఔన్నత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కార్మికుల కృషికి విలువ కట్టే షరాబు ఇప్పటికి పుట్టలేదు, ఇకపైనా పుట్టడు. కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయినప్పుడు నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రధాని మోడీ, ఇతర బిజెపి పెద్దలు, తీరా కార్మికులు బయటికొచ్చాక మాత్రం ఆ ఘనత తమదేనని ప్రచారం చేసుకోవడం నీతి బాహ్యం. ఉత్తరాఖండ్‌లో చేపట్టిన చార్‌ధామ్‌ జాతీయ రహదారి ప్రాజెక్టు మొత్తం హిమాలయ సానువుల్లోనే ఉంది. ఆ ప్రాంతం తీవ్ర భూకంప జోన్‌లో ఉంది. భూగర్భంలో పొరలు, మట్టి పెళుసుగా ఉంటాయి. గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణంలో మార్పుల కారణంగా హిమాలయాల్లోని మంచు కరుగుతోంది. ఆ ప్రభావాలతో అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. చార్‌ధామ్‌కు ముఖద్వారంగా ఉండే జోషీమఠ్‌ గ్రామం కుంగిపోతోందన్న ఆందోళనలున్నాయి. ఇవన్నీ సహజ వనరులపై కార్పొరేట్‌ గద్దల దోపిడీ, వాటికి సహకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే సంభవిస్తున్నాయి. ఈ పూర్వరంగంలోనే సిల్కెరా టన్నెల్‌ను చూడాలి. టూరిజం, కార్పొరేట్ల వ్యాపార లాభాల కోసం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఉత్తరాఖండ్‌లో ఇష్టారీతిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం దుర్మార్గం. పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయకుండా నిర్మాణాలకు, సరైన భద్రతా చర్యలు లేకుండా వలస కార్మికులతో టన్నెల్‌ పని చేయించిన నిర్మాణ సంస్థపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ఇటువంటి నిర్మాణాలకు అనుమతించిన డబుల్‌ ఇంజన్‌ సర్కారే దోషి. ఈ వాస్తవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోడీ, బిజెపి ప్రచార హడావుడి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు ప్రజలు.

➡️