ఉద్యోగ భర్తీపై ఉత్తుత్తి మాటలు

Feb 2,2024 07:20 #Editorial

              ఇంకొన్ని నెలల్లో ఎన్నికల ఢంకా మోగనున్న నేపథ్యంలో బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియను ప్రకటించింది. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేస్తామని, దశల వారీగా టెట్‌, ఆ తదుపరి డీఎస్సీ నిర్వహిస్తామని, ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ వెలువరిస్తామని తెలిపింది. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని కలిగించాలి. కానీ, అందుకు బదులు భారీ ఆశల మీద నీళ్లు కుమ్మరించిన నిరాశా భావన వారిని ఆవరించింది. అభ్యర్థుల ఆశలకు తగ్గట్టుగా కాక అధికార పార్టీ ఎన్నికల అవసరాలకు తగ్గట్టుగా, తూతూమంత్రంగా ఈ ప్రకటన ఉండటమే అందుకు కారణం.

తాము అధికారంలోకి రాకమునుపు, చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రం ఉన్నప్పుడు- ఉద్యోగ, నిరుద్యోగ బృందాల మీద జగన్‌ ఎంతో ప్రేమ ఒలకపోశారు. రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, వాటిని భర్తీ చేయకుండా చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చీ రాగానే మెగా డీఎస్సీని ప్రకటించి, అటు పాఠశాల విద్యను, ఇటు ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలను ఉద్ధరిస్తామని హామీలు గుప్పించారు. కానీ, పీఠం ఎక్కాక ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. పాఠశాల విద్యలో పెను మార్పులు తెస్తున్నామంటూ హడావిడి చేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. విలీనం పేరుతో వేలాది పాఠశాలలను మూసేసి, పోస్టులను కుదించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, పాఠశాలలకు హంగులూ అలంకరణ … ఇత్యాది అంశాలపై ప్రచారార్భాటం చేశారు. బోధనకు అవసరమైన పోస్టుల భర్తీని మాత్రం సంపూర్ణంగా విస్మరించారు. దీంతో, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐదారు లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో ఐదేళ్ల వయసు మీరింది. ప్రభుత్వ ఉద్యోగం పొందగలమన్న ఆత్మవిశ్వాసం వారిలో రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈ దశలో ప్రభుత్వం ఉన్న ఖాళీలను దాచిపెట్టి, కంటితుడుపు చర్యగా పోస్టుల భర్తీని ప్రకటించటం నిరుద్యోగులను మోసగించటమే! పైగా చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన అరకొర జీతపు రెండేళ్ల అప్రంటిస్‌ పద్ధతిని మళ్లీ తీసుకురావడం మరీ అన్యాయం. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల పోరాటంతో 2010లో రద్దు చేయబడ్డ ఆ విధానాన్ని మళ్లీ అమలు చేయబూనటం ఘోరం.

ఈ మొత్తం వ్యవహారం ఏదో ఒక విధంగా నిరుద్యోగులను మభ్యపెట్టటమే జగన్‌ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో 2025 జూన్‌ నుంచి అంతర్జాతీయ స్థాయి బోధన అందిస్తున్నామంటూ ఇంటర్నేషనల్‌ బాకలారియట్‌ (ఐబి) ప్రతినిధులతో ఒప్పందం చేసుకోవడం ప్రభుత్వ విద్యారంగంలోకి ప్రయివేటును చొప్పించటమే అవుతుంది. ఇప్పటికే బైజూస్‌తో ఒప్పందం ఉండనే ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులను కుదించటం, మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి కార్పొరేట్లను చొప్పించటం ఆందోళన కలిగించే అంశం.

వివిధ వృత్తివిద్యల్లో శిక్షణ పొందిన వారు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారూ అందుకు తగిన ఉద్యోగాల్లో చేరి, స్థిరపడాలనుకోవడం సహజం. కానీ, అందరికీ, అన్నిటికీ సచివాలయ ఉద్యోగ కల్పనే గొప్ప ఘనతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. గ్రామ సచివాలయాల్లో లక్షా 34 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటోంది. గతేడాది జరిగిన వైజాగ్‌ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులతో, 6 లక్షల ఉద్యోగాలను కల్పించే 340 ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే అప్పట్లో గొప్పగా చెప్పారు. ఏడాది కాలం గడిచినా అందులో నాలుగో వంతు అయినా అమల్లోకి రాలేదు. ఒకపక్క పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నప్పుడు చేయాల్సింది చేయకుండా తాము చేసిందే గొప్పన్నట్టు టాం టాం వేసుకోవడం అర్థరహితం, మోసపూరితం.

మంత్రివర్గం ఆమోదించిన ఇతర అంశాల్లో విద్యుత్‌రంగంలో ప్రయివేటు పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం ఒకటి. ఆ పేరుతో వేలాది ఎకరాల భూమినీ ఆయా సంస్థలకు అప్పనంగా కట్టబెట్టటమే దీని అసలు ఉద్దేశం. ఇలా మౌలిక రంగాలు అన్నిటిలోకీ ప్రయివేటు సంస్థల జోక్యాన్ని, పెత్తనాన్ని నెమ్మది నెమ్మదిగా పెంచటం… తరువాతి కాలంలో ప్రజలపై పెను భారాలకు దారి తీస్తుంది. ప్రపంచీకరణ విధానాలను నెత్తిన పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ తరహా ఒరవడితోనే సాగుతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోడీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ కేలండరు అని ఊరించిన జగనూ మాట మీద నిలబడలేదు. ఇచ్చిన హామీలకు కట్టుబడని పాలకులకు యువతే తగిన గుణపాఠం చెబుతుంది!

➡️