కాలయాపన కమిటీలు, కోట్లాది రైతుల సంగతేమిటి మోడీజీ !

Jan 31,2024 07:17 #Editorial

రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జులై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు… రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు. ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ధ చూపటం లేదు ?

            ఎట్టకేలకు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది. జనవరి 22న ఆ కార్యక్రమ కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశం నలుమూలలా ఎంతలా తిరిగిందీ, ఎన్ని పొర్లుదండాలు పెట్టిందీ, ఎక్కడ ఎన్ని మొక్కులు మొక్కిందీ చూశాము. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు కనిపిస్తున్నందున ఈ తాపత్రయాన్ని అర్ధం చేసుకోవటం కష్టం కాదు. పోయిన దేశ ప్రతిష్టను, దానితో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అధికారానికి వచ్చిన కొత్తలో విదేశాలు తిరిగిన తీరు, చేసిన హడావుడి చూశాము. సరే ఎవరెన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయని చరిత్రకెక్కిన పాలకుల సరసన చేరిన నరేంద్ర మోడీ రామాలయ ప్రారంభాన్ని ప్రభుత్వ-సంఘపరివార్‌ కార్యక్రమంగా మార్చివేశారు. మతానికి ప్రభుత్వానికి ఉన్న గీతను చెరిపివేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, మన దేశ ప్రతిష్టను పెంచినట్లు ప్రచారం చేసుకున్నా చెప్పినంతగా పెట్టుబడులు రాలేదు. పలుకుబడి పెరుగుదలకు రుజువూ లేదు. మేడిన్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత సాకారం కాలేదు. ఇప్పుడు రామాలయం కోసం తిరిగినదానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయా? ఏం జరిగిందీ, ఎందుకు జరిగిందీ దేశమంతా చూసింది. ఏం జరగనుందో చూద్దాం!

రామాలయం మీద చూపిన శ్రద్ధ ప్రజల సమస్యల మీద నరేంద్ర మోడీ చూపారా? తమది పని చేసే ప్రభుత్వమని మోడీ, బిజెపి కూడా చెప్పుకుంటుంది. పదేళ్లలో అలాంటిదేమీ కనిపించలేదు. అచ్చే దిన్‌లో ‘ఆకలో రామచంద్రా…’ అన్న పరిస్థితిని అంగీకరిస్తూ సబ్సిడీతో కూడా జనాలు కొనుక్కోలేని స్థితిలో (లేకుంటే ఉచితంగా ఇవ్వాల్సిన పనేముంది) ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ఉచిత ఆహార ధాన్యాల అందచేత పథకాన్ని పొడిగించారు. కొన్ని అంశాల్లో మోడీ సర్కార్‌ ఎక్కడ లేని వేగాన్ని కనబరిచిన మాట వాస్తవం. బహుశా కనపడని శక్తి ఏదో నెడుతూ ఉండాలి. ఉదాహరణకు మూడు సాగు చట్టాలనే తీసుకుందాం. 2020 సెప్టెంబరులో 17న లోక్‌సభ, 20వ తేదీన రాజ్యసభ ఆమోదం, 27న రాష్ట్రపతి అంగీకారం, పది రోజుల్లో అంతా జరిగింది. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించలేదు. ఎంత వేగంగా చట్టాలను రుద్దారో ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఎదురైంది. రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే సెప్టెంబరు 25న భారత బంద్‌కు పిలుపు ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులను రాజధానిలో ప్రవేశించకుండా అడ్డుకోవటంతో నవంబరు 26 నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేశారు. చట్టాల అమలు మీద 2021 జనవరి 12 సుప్రీం కోర్టు స్టే విధించి, రైతుల చెబుతున్నదానిని వినాలంటూ ఒక కమిటీని వేసింది. అయినా రైతులు తగ్గలేదు. చివరకు నరేంద్ర మోడీ దిగివచ్చి క్షమాపణలు చెప్పి మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు నవంబరులో ప్రకటించారు. డిసెంబరు ఒకటిన పార్లమెంటులో రద్దు బిల్లుతో ఉపసంహరించుకున్నారు.

రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జులై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు…రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు. ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ధ చూపటం లేదు ?

గతంలో సుప్రీం కోర్టు కమిటీ వేసిన నివేదిక, ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తరువాత నాలుగు నెలలకు బహిర్గతమైంది. దానిలోని అంశాలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదనలు తప్ప మరొకటి కాదు. అందుకే రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వం వేసిన కనీస మద్దతు ధరల కమిటీ నివేదిక లోక్‌సభ ఎన్నికలకు ముందే వస్తే అది రైతుల్లో చర్చకు దారి తీస్తుందన్న భయంతోనే కాలపరిమితి నిర్దేశించలేదు. కనీసం ముసాయిదా నివేదికలు కూడా సమర్పించలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఏం సిఫార్సు చేస్తుందో ఆ పైవాడికే ఎరుక.

రామాలయ నిర్మాణం పూర్తిగాక ముందే ప్రారంభోత్సవం జరపటం గురించి శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. మనం కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పూర్తిగాక ముందే ప్రవేశ పూజలు చేసి తరువాత మిగతా పనులు చూసుకోవటంలేదా అని అనేక మంది సమర్ధించారు. నిజమే, ఇదే పద్ధతి ఇతర వాటికి ఎందుకు వర్తింపచేయటం లేదు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అక్టోబరు నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు, ఆఫీసు ఏర్పాటు లేదు. దీని ఏర్పాటుకు వివాదాలేమీ లేవు. వేల కోట్ల ఖర్చూ కాదు. తదుపరి చర్యలు ఎందుకు లేవు? ముందు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి నిర్దేశించిన కార్యకలాపాలు ప్రారంభమౌతాయి. పరిశోధనలకు అవసరమైన భూమి కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి వీలుంటుంది. చిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పసుపు లేదు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పడుతుంది, అది రైతులకు ఎలా మేలు చేస్తుంది? రాబోయే కాలానికే వదలివేద్దాం. అంతకు ముందు పసుపు రైతులకు బాండ్లు రాసిచ్చిన బిజెపి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి పసుపు బోర్డు కంటే ఇదే గొప్పదని చెప్పుకున్నారు. అది రైతుల్లో పేలకపోవటంతో పసుపు బోర్డు గురించి మరో అంకాన్ని ప్రారంభించారు.

ప్రకటనలు చేయటం మీద ఉన్న శ్రద్ధ అమలులో లేదని పదేళ్ల అనుభవం నిరూపించింది. రాష్ట్ర విభజన 2014 చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటును పరి శీలించాలని ఉంది. ప్రత్యేక హోదా వాగ్దానంపై మడమ తిప్పి న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం దానికి బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామం బిజెపి మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దాంతో 2019 ఫిబ్రవరి 27న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు, దాని మీద స్పందించినట్లు ప్రచారం చేశారు. వారు ఐదేళ్లు ఏం చేశారో తెలియదు. మరోసారి లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి.

ఇంతవరకు రైల్వే జోన్‌ ఏర్పడలేదు. అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అదుగో ఇదిగో అంటూ చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఇవ్వలేదన్నారు. ఫలానా చోట ఇస్తామని చెప్పిన తరువాత దాని మీద నిర్ణయం తీసుకోలేదంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే జోన్‌ ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఉంచే ందుకు విశాఖలో అద్దె భవనాలే దొరకవా? ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించిన తరువాతే జోన్‌ ఏర్పాటు చేస్తారా? రాజకీయం గాకపోతే మరొకటేమైనా ఉందా ?

విశాఖ ముడసర్లోవలో ప్రతిపాదిత రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి 52.2 ఎకరాలు ఇస్తామని రాష్ట్రం ప్రతి పాదించింది. ఇంకా భూమిని గుర్తించాల్సి ఉందని, దాన్ని ఆమోదించాలని, ప్రాజెక్టు నివేదిక సిద్ధంగా ఉందని 107 కోట్ల రూపాయలను మంజూరు చేశామని డిసెంబరులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కె.రామ మోహన్‌ నాయుడు వేసిన ప్రశ్నకు సమాధానంలో చెప్పారు. 2023-24 బడ్జెట్‌లో పది కోట్లు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. జోన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నలకు సమాధానం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌ నరసింహారావు నెల రోజుల క్రితం మాట్లాడుతూ ముడసర్లోవ భూములను అధికారులు ఖరారు చేశారని, నిర్మాణ జాప్యం ఎందుకో అర్ధం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఖరారులో చాలా ఆలశ్యం చేసిందన్నారు. విశాఖ జోన్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖ డివిజన్‌ను రద్దు చేసి మూడు ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను రాయగఢ్‌లో మరో ముక్కను ఖుర్దా, మూడో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేస్తారు. ఈ జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ప్రధాన కేంద్రంలో డివిజన్‌ లేని జోన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుంది.

బిజెపి ఓట్ల రాజకీయంలో భాగంగా తెలంగాణ ఎన్నికలకు ముందు షెడ్యూలు కులాల ఉప వర్గీకరణ గురించి వాగ్దానం చేసింది. కానీ దానికి ఎలాంటి ఫలితమూ దక్కలేదు. అయిననూ ప్రయత్నించి చూడవలె అన్నట్లుగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణలో ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం తప్ప ఈ కమిటీ ఏం చేస్తుందన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ సమస్య మీద దశాబ్దం క్రితం అధికారానికి వచ్చిన బిజెపి చేసిందేమిటి? అన్నది సమాధానం లేని ప్రశ్న. ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉన్నందున నిజానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసేందుకు పూనుకోవచ్చు. ఆ పని చేయలేదు. కాబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందా? ఉండేట్లయితే కమిటీ చేసే పనేమిటి? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ? అందుకే దీన్ని ఓట్ల ఆకర్షణ కమిటీ అంటున్నారు.

ఎం. కోటేశ్వరరావు
ఎం. కోటేశ్వరరావు
➡️