ఐరోపా రైతాంగ ఆందోళన కారణాలేమిటి !

Apr 3,2024 03:42 #editpage

సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నికల సంవత్సరమిది. మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ అనేక దేశాల్లో రైతాంగం ఆందోళన బాట పట్టింది.
స్పెయిన్‌ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్‌ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్‌ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. టోకు సూపర్‌ మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన ధరలు చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపేవారు లేకపోవటంతో రైతులు పోరు బాట పట్టారు. మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్‌ రైతులు చెబుతున్నారు. 2023 జూన్‌-సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది. మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు. ఐరోపా సమాఖ్య దేశాల జిడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4 శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2 శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 30 శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపు నింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకు అని ప్రశ్నించటమే. 1960లో స్పెయిన్‌ జిడిపిలో వ్యవసాయ వాటా 23.5 శాతం కాగా 2022 నాటికి 2.6 శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6 శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్‌ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది. పారిశ్రామిక రంగ జిడిపి వాటా కూడా ఇదే కాలంలో 30.8 నుంచి 17.4 శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6 శాతానికి పెరిగింది. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3 శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2 శాతం ఉన్నారు.
రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్‌, నైట్రోజన్‌ తదితర వాయువులను 30 శాతం తగ్గించాలన్నది ఒకటి. ఓజోన్‌ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2 శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు. మన మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్‌ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్ధం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.
ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్‌లో జరిగే ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్‌ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది. స్పెయిన్‌ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్‌ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చివేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్‌ అమెరికా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జూన్‌లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు.
ఫ్రాన్సులో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలుగా ఉందని, అనేక కుటుంబాల్లో సాగును కొనసాగించే వారు కనిపించటం లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. యాంత్రీకరణతో పనిచేసే జనాభా తగ్గి అనేక చోట్ల గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫ్రెంచి ఆహార, వ్యవసాయ, పర్యావరణ జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 18శాతం మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, మరో 25 శాతం మంది చావ బతకలేని స్థితిలో ఉన్నారు.పర్యావరణం పేరుతో సాగుకు ఆటంకం కలిగించటం పట్ల రైతులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు. నాలుగు శాతం సాగు భూమిలో సాగు చేయకుండా చెట్ల పెంపకానికి వదలివేయాలన్నది ఒక నిబంధన పెట్టారు. ఇతర నిబంధనల కారణంగా సబ్సిడీలకు కోత పెడుతున్నారు. ఐరోపాలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏర్పడిన పార్టీల సమావేశాల మీద రైతులు దాడులకు దిగుతున్నారు. జర్మనీలో అదే జరిగింది. బెర్లిన్‌ సమపంలో రోడ్లపై ఎరువుల మడ్డిని కుమ్మరించటంతో అనేక కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఐరోపా దేశాల్లో ఇంథన, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫ్రాన్స్‌లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ ఖర్చు అంతకు ముందుతో పోలిస్తే గతేడాది రెట్టింపైంది. ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఐరోపా వ్యవసాయ విధానమే అక్కడి రైతులను ఆందోళనలకు పురికొల్పుతున్నది. పోలాండ్‌లో కార్మికుల వేతన రేట్లు చాలా తక్కువ, దానికి తోడు చౌకగా కోళ్లను పెంచి ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించటంతో ఫ్రాన్స్‌ వంటి చోట్ల కోళ్ల రైతులకు గిట్టుబాటు కావటం లేదు. ఉక్రెయిన్‌లో వేతనాలు మరీ తక్కువ. దాంతో అక్కడి నుంచి చౌక ధరలకు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అది రైతుల్లో అసంతృప్తికి దారితీయటంతో పంచదార, కోడి మాంసం దిగుమతులపై ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు.
మొత్తంమీద ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది.

– ఎం. కోటేశ్వరరావు

➡️