జిడిపి లెక్కలు దాచిపెడుతున్నది ఏమిటి ?

Feb 6,2024 07:17 #Editorial

దేశంలో రెండు తరగతుల ప్రజల మధ్య అంతరాలు ఇంత కొట్టవచ్చినట్టుగా తీవ్రంగా పెరుగుతూన్న నేపథ్యంలో జిడిపి అనే ఒకే ఒక కొలబద్ద, సర్వరోగ నివారిణి మందు లాగా, దేశ పురోగతికి ప్రాతిపదికగా పరిగణించడం అంటే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగించే సాధనంగా జిడిపిని ఉపయోగించడమే ఔతుంది. ఈ జిడిపి లెక్కలు కప్పిపుచ్చుతున్నది కేవలం పెరుగుతున్న ఆర్థిక అసమానతలను మాత్రమే కాదు. నయా ఉదారవాద విధానాల పెత్తనంలో సమాజంలో పెరుగుతున్న అంతరాల రూపంలో సామ్రాజ్యవాదం ఆధిపత్యాన్ని మనపై చెలాయిస్తున్న తీరును కూడా కప్పిపుచ్చుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సామ్రాజ్యవాద దోపిడీని కప్పిపుచ్చే సాధనంగా జిడిపి లెక్కలు ఉన్నాయి.

స్థూల దేశీయోత్పత్తి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) లేదా జిడిపి అనే భావనతో, దానిని లెక్కించే పద్ధతితో చాలా సమస్యలు ముడిపడి వున్నాయి. సేవా రంగాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం అనే పద్ధతిని ఆడమ్‌ స్మిత్‌ ఉండి వుంటే మాత్రం తప్పకుండా వ్యతిరేకించేవాడు. సేవారంగంలో పని చేసేవారు అదనంగా ఉత్పత్తి చేసే సరుకులు ఏమీ ఉండవు అన్న భావన ప్రాతిపదికన అతని వ్యతిరేకత ఉంటుంది. గతంలో సోషలిస్టు దేశాలుగా ఉన్నప్పుడు సోవియట్‌ యూనియన్‌లో, తక్కిన తూర్పు యూరప్‌ దేశాలలో జిడిపి అని కాకుండా, స్థూల పాదార్థిక ఉత్పత్తి (గ్రాస్‌ మెటీరియల్‌ ప్రొడక్ట్‌)ని లెక్కించేవారు. అందులో సేవారంగం లెక్కలోకి వచ్చేది కాదు.

ఒకవేళ సేవా రంగాన్ని కూడా కలిపి జిడిపి ని లెక్కించాలనుకున్నా, ఆ సేవా రంగం ద్వారా జరిగే పని విలువని (ఔట్‌పుట్‌) లెక్కించడం ఎలా అన్నది కూడా ఒక సమస్యే. ఏది ”సేవ చేయడం” కింద వస్తుంది అన్నది ప్రశ్న. సేవలు అందించడానికి (రవాణా లేదా టెలిఫోన్‌ సేవ), సొమ్మును ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు బదిలీ చేయడానికి మధ్య తేడాను చూడాలా ? వద్దా ? అన్నది సమస్య. ఒక సంగీత కచేరీని ఆస్వాదించిన వారు తద్వారా కొంత సంతృప్తిని పొందుతారు. దానికి ప్రతిఫలం చెల్లించడం అర్ధం చేసుకోవచ్చు. ఆ ప్రతిఫలాన్ని చెల్లించే లావాదేవీని నిర్వహించడాన్ని కూడా లెక్కలోకి తీసుకోగలమా? ఇటువంటి అవగాహన తో ముడిపడిన సమస్యలతోబాటు చిన్న స్థాయి ఉత్పత్తి రంగంలో నమ్మకమైన, క్రమబద్ధమైన గణాంకాలు సకాలంలో లభించే పరిస్థితి లేదు. దానివలన కూడా జిడిపి లెక్కలు వేయడం సమస్య ఔతుంది. మన దేశంలో చాలా మంది ఆర్థికవేత్తలు మన జిడిపి వృద్ధి రేటు లెక్కలు వాస్తవ వృద్ధి కన్నా చాలా ఎక్కువ చూపిస్తున్నాయని భావిస్తున్నారు. జిడిపి వృద్ధి బాగుంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టే అని అనుకోలేం. ఎందుకంటే పెరిగిన సంపదను పంపిణీ చేయడంలో అసమానతలు చోటు చేసుకోవచ్చు. సామ్రాజ్యవాదం వ్యవహరించే తీరు కారణంగా ఒకానొక మూడవ ప్రపంచ దేశంలో నిట్ట నిలువుగా అంతరాలు ఏర్పడతాయి. దాని వలన ఆ దేశపు ఆర్థిక పురోగతిని కొలవడానికి జిడిపి ఏ మాత్రమూ ఉపయోగపడదు. వాస్తవానికి జిడిపి దేశంలో ఏర్పడిన అంతరాలను దాచిపెట్టడానికి తోడ్పడుతుంది.

ప్రస్తుత కాలంలో మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద సామ్రాజ్యవాదం రెండు విభిన్న రకాల ప్రభావాలను కలిగిస్తుంది. ఎక్కువ మూడవ ప్రపంచ దేశాలు ఉష్ణ మండల ప్రాంతాలలో ఉన్నాయి. అక్కడ మాత్రమే పండే వివిధ రకాల పంటలు (ఖనిజాలు ఎటుతిరిగీ కావాలి) పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు అవసరం. పెట్టుబడిదారీ విధానానికి పుట్టిల్లు అయిన శీతల దేశాలు మంచుతో స్తంభించిపోయివున్న రుతువులలో సైతం ఉష్ణ మండల ప్రదేశాలలో భూమి మీద చాలా పంటలు పండుతాయి. ఆ విధంగా గోధుమ, మొక్కజొన్న మినహా తక్కిన అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ ఈ పారిశ్రామిక, సంపన్న దేశాలకు కావాలి. ఐతే ఉష్ణ మండలాలలో వ్యవసాయానికి పనికొచ్చే భూమి విస్తీర్ణం పరిమితంగా ఉంటుంది. అటువంటప్పుడు ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేయడానికి తగినంత పంటలు పండించాలంటే ఆ భూమి దిగుబడి సామర్ధ్యాన్ని పెంచాలి. సాగునీటి సదుపాయం కల్పించాలి. నీటి ప్రాజెక్టులను నిర్మించాలంటే అందుకు ప్రభుత్వాలే పూనుకోవాలి. కాని నయా ఉదారవాద విధానాలు ప్రభుత్వం ఈ విధంగా ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా జోక్యం చేసుకోడానికి అనుమతించదు. ఆ కారణంగా ఆ ఉష్ణ మండల దేశాలలో భూమి మీద దిగుబడిని పెంపొందించే కార్యక్రమాలు అవసరమైన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితిలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల అవసరాలు తీరడానికి ఆ మూడవ ప్రపంచ దేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఎలా ? ఇందుకోసం దేశీయంగా ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే మార్గంగా నయా ఉదారవాదం ఎంచుకుంది. అందుకోసం అది మూడవ ప్రపంచ దేశాలలోని అధిక సంఖ్యాకుల ఆదాయాలను కుదించే విధంగా షరతులను విధిస్తుంది. ఆదాయాలు తగ్గిపోవడంతో మూడవ ప్రపంచ దేశాల ప్రజల ఆహార వినియోగం, వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం తగ్గిపోతుంది.

ఆ పరిస్థితుల్లో మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో అంతవరకూ ఉండే నియంత్రణలన్నింటినీ సడలించి నిత్యా వసర వ్యవసాయోత్పత్తుల ఎగమతులు ఏ ఆంక్షలూ లేకుండా జరిగేలా చేయడం నయా ఉదారవాద వ్యవస్థ నిర్వహించే ముఖ్యమైన పనుట్లో ఒకటి. ఆ ఎగుమతులు సాఫీగా జరిగిపోతూ వుండడానికి వీలుగా మూడవ ప్రపంచ దేశాలలో ఆ ఉత్పత్తులకు ఉండే డిమాండ్‌ను కుదించివేయడంతోబాటు ఏ యే పంటలు పండించాలన్న విషయాన్ని ఆ యా రైతుల ఇష్టాలతోగాని, దేశపు అవసరాలతోగాని నిమిత్తం లేకుండా కేవలం ”మార్కెట్‌” అవసరాలే నిర్ణయిస్తాయి. ఇక్కడ మార్కెట్‌ అంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాల కొనుగోలుశక్తి అని గ్రహించాలి. ఆ సంపన్న పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండేలా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అంతవరకూ తమ దేశ రైతులకు అందిస్తున్న మద్దతు ధరలను ఉపసంహరించుకునేలా నయా ఉదారవాదం వత్తిడి చేస్తుంది. దానితోబాటు ప్రజా పంపిణీ కోసం ఆహార ధాన్యాలను నిలవ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. ఎగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేసేలా, అంతర్జాతీయ ధరలకు సమానంగా ధరలు ఉండేలా, ఎగుమతి చేసే ఉత్పత్తుల పరిమాణం మీద ఎటువంటి ఆంక్షలూ లేకుండా ఉండేలా చూస్తుంది. సరిగ్గా ఈ పని చేయడానికే ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది. ఇదే సమయంలో సంపన్న దేశాలలోని రైతులకు మాత్రం చాలా హెచ్చు స్థాయిలో నగదు బదిలీలు చేపడతారు. ముఖ్యంగా ఆహారధాన్యాలను, పత్తిని పండించే రైతుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఈ తరహా సబ్సిడీలు తమ రైతులకు అందించడం వలన అంతర్జాతీయ ధరల మీద ప్రభావం ఏమీ పడదని సంపన్న దేశాలు వాదిస్తాయి.

ఈ మొత్తం క్రమంలో మూడవ ప్రపంచ దేశాలలో దేశీయ డిమాండ్‌ తగ్గిపోవడంతోబాటు సంపన్న పారిశ్రామిక దేశాలకు కావలసినంత సరఫరా జరుగుతుంది. మూడవ ప్రపంచ దేశాలలో తలసరి ఆహార లభ్యత తగ్గిపోవడంతో బాటు ఆ దేశాలలో ఏ యే పంటలను పండించాలో దానిని కూడా ఆ సంపన్న పారిశ్రామిక దేశాలే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం మన దేశంలో మనకి కనిపిస్తున్నది ఇదే.

ఇక సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాలపై కలిగిస్తున్న రెండో ప్రభావాన్ని చూద్దాం. మూడవ ప్రపంచ దేశాలు వలసలుగా ఉన్న కాలంలో వాటిలో భారీగా స్థానిక పరిశ్రమలు, వృత్తులు దెబ్బతిన్నాయి. దాని ఫలితంగా పెద్ద స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. దాని వలన నిజ వేతనాల స్థాయి కనీస స్థాయికే పరిమితం అయిపోయింది. ఇదే కాలంలో సంపన్న పారిశ్రామిక దేశాలలో వేతనాలు శ్రామిక ఉత్పాదకతలో వచ్చే పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చాయి. అందుచేత సంపన్న దేశాలకు, మూడవ ప్రపంచ దేశాలకు మధ్య కార్మికుల వేతనాల స్థాయిలో అంతరాలు పెరిగిపోయాయి. అందుకే నయా ఉదారవాద విధానాలు వచ్చాక బహుళజాతి సంస్థలు తమ ఫ్యాక్టరీలను సంపన్న దేశాలనుండి మూడవ ప్రపంచ దేశాలకు తరలించడానికి సుముఖంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసేది ఆ మూడవ ప్రపంచ దేశాల అవసరాల కోసం మాత్రం కాదు. ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేయడం కోసం. ఐతే ఈ విధంగా ఫ్యాక్టరీలను తరలించినందువలన ఆ మూడవ ప్రపంచ దేశాలలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి లభించదు. పైగా లభించే ఉద్యోగాలలో ఎక్కువ భాగం నైపుణ్యం పెద్దగా అవసరం లేని ఉద్యోగాలే. అందుచేత ఫ్యాక్టరీలు తరలివచ్చినా, ఇక్కడ కార్మికుల వేతనాల స్థాయి మాత్రం పెరగదు. దీనికి తోడు ముందు చెప్పుకున్నట్టు ఆదాయాల కుదింపు ఉండనే వుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలను తరలించినందువలన ఆ మూడవ ప్రపంచ దేశాలలో పట్టణీకరణ పెరుగుతుంది, ఉన్నత మధ్య తరగతి ఆదాయాలు పెరుగుతాయి. అంతే.

సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాలపై కలిగించే ఈ రెండు రకాల ప్రభావం వలన మూడవ ప్రపంచ దేశాలలో రెండు రకాల వ్యవస్థలు ఏర్పడతాయి. రెండింటి నడుమ అంతరాలు పెరిగిపోతాయి. వలస పాలన కొనసాగుతున్నప్పుడే ఈ విధమైన అంతరాలు ఏర్పడ్డాయి. వలస విముక్తి పోరాటాలు ఆ అంతరాలను తొలగించాలనే లక్ష్యంతో నడిచాయి. ఆ దిశగానే స్వాతంత్య్రం సాధించాక ఏర్పడిన ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా జోక్యం కొంతవరకైనా కల్పించుకున్నాయి. ఐతే నయా ఉదారవాదం అమలులోకి రావడంతో ప్రభుత్వ జోక్యం లేకుండా పోతోంది. దీని ఫలితంగా మళ్ళీ అంతరాలు పెరిగిపోతున్న సమాజాలుగా మూడవ ప్రపంచ దేశాలు మార్పు చెందుతున్నాయి.

ఐతే, మూడవ ప్రపంచ దేశాలలో కొత్తగా తరలివచ్చిన పరిశ్రమలలోని కార్మికులకు, ఎదుగూ బొదుగూ లేకుండా మందగించిపోయిన చిన్న రైతుల వ్యవసాయానికీ పోల్చి చూసుకుంటే వారి ఆదాయాల నడుమ అంతరాలు అంతగా పెరిగిపోలేదు. రెండు రంగాలలోని శ్రమజీవులూ నయా ఉదార విధానాల బాధితులే. రెండు రంగాలలోనూ పనులు లేనివారి సంఖ్య భారీగా పెరిగిపోతూ వారి వేతనాల స్థాయిని అంతకంతకూ తగ్గించివేస్తోంది. దీని వలన వారి కొనుగోలుశక్తి పడిపోతోంది. అందువలన సంపన్న పారిశ్రామిక దేశాలలోని డిమాండును తీర్చేలా వారికి ఇక్కడినుండి వ్యవసాయోత్పత్తులు ఎగుమతి ఔతున్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది. కాని, స్థానిక బడా బూర్జువా వర్గాల, ఉన్నత మధ్యతరగతి వర్గాల ప్రజానీకానికి, మరోపక్క పాత, కొత్త పరిశ్రమలలోని కార్మికులకు మధ్య అంతరాలు బాగా పెరుగుతున్నాయి. భౌగోళికంగా కూడా పట్టణాలకు, గ్రామాలకు నడుమ అంతరాలు కూడా పెరుగుతున్నాయి.

ఈ విధంగా పెరుగుతున్న అంతరాలు అధికారికంగా భారత ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలలో సైతం కనిపిస్తున్నాయి. కనీస పౌష్టికాహారం పొందలేకపోతున్నవారు పట్టణ ప్రాంతాలలో 1993-94లో 57 శాతం ఉంటే 2017-18 నాటికి 60 శాతం ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతాలలోనైతే ఇదే కాలంలో వారు 58 శాతం నుండి 80 శాతానికి పెరిగారు. నయా ఉదారవాద విధానాలను సిగ్గూ ఎగ్గూ లేకుండా దూకుడుగా అమలు చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఈ అంతరాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి.

దేశంలో రెండు తరగతుల ప్రజల మధ్య అంతరాలు ఇంత కొట్టవచ్చినట్టుగా తీవ్రంగా పెరుగుతూన్న నేపథ్యంలో జిడిపి అనే ఒకే ఒక కొలబద్ద, సర్వరోగ నివారిణి మందు లాగా, దేశ పురోగతికి ప్రాతిపదికగా పరిగణించడం అంటే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగించే సాధనంగా జిడిపిని ఉపయోగించడమే ఔతుంది. ఈ జిడిపి లెక్కలు కప్పిపుచ్చుతున్నది కేవలం పెరుగుతున్న ఆర్థిక అసమా నతలను మాత్రమే కాదు. నయా ఉదారవాద విధానాల పెత్తనంలో సమాజంలో పెరుగుతున్న అంతరాల రూపంలో సామ్రాజ్యవాదం ఆధిపత్యాన్ని మనపై చెలాయిస్తున్న తీరును కూడా కప్పిపుచ్చుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సామ్రాజ్యవాద దోపిడీని కప్పిపుచ్చే సాధనంగా జిడిపి లెక్కలు ఉన్నాయి. అంతే కాదు. ఈ జిడిపి లెక్కలు అన్నీ ప్రాథమికంగా భారీ పరిశ్రమల నుండి లభించే గణాంకాల ఆధారంగానే రూపొందుతాయి. భారీ పరిశ్రమల లో అభివృద్ధి ఉంటే దాదాపుగా అదే స్థాయిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలోనూ ఉంటుందన్న లెక్కతో జిడిపిని అంచనా వేస్తారు. కాని, వాస్తవానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వృద్ధి చెందడంలేదు సరికదా కునారిల్లుతున్నాయి. ఆ విధంగా జిడిపి లెక్కలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి.

(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️