అమెరికా అధ్యక్ష బరిలో యువత ఏరీ ? 

Feb 10,2024 07:17 #Editorial

             అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ఉంటుంది. అయితే…దశాబ్దాల కాలంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా…ఎవరైనా యువ నాయకుడు పోటీ చేస్తాడా..? లేదా..? అనే విషయంలో ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూనే ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఆ ఎదురు చూపులు అడియాసలైపోతున్నాయి.

అమెరికా ఎన్నికలను పరిశీలిస్తే.. అక్కడ వయస్సు పైబడిన వారే తప్ప…యువతరం అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశాలు దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలను పాలించే స్థాయికి యువతరం ఎప్పుడు ఎదుగుతుందా అని విశ్వవ్యాప్తంగా ఎదురు చూస్తుంటే.. అందుకు భిన్నంగా అగ్రరాజ్య ఎన్నికలు జరుగుతుండటం ఇప్పుడు ప్రధానమైన చర్చకు దారితీసింది.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థులు శరవేగంతో తమ గెలుపు ఓటములపై కసరత్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే…పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అయోవా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు న్యూ హ్యాంప్‌షైర్‌ రాష్ట్ర ప్రైమరీలోనూ మెజారిటీతో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ట్రంప్‌ వరుసగా రెండు రాష్ట్రాల్లో గెలిస్తే దేశాధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ ఆయన్నే వరించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ (డెమోక్రటిక్‌ పార్టీ)తో డొనాల్డ్‌ ట్రంప్‌ తలపడటం ఖాయమవుతుంది. అధ్యక్ష పదవికి బైడెన్‌ (81), ట్రంప్‌ (77) వంటి వృద్ధ సింహాలు తప్ప మరో గతి లేదా అని మెజారిటీ అమెరికన్‌ ఓటర్లు ఇప్పుడు మదనపడుతున్నారు.

అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్‌ పార్టీలో పోటీ అంతా ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్‌ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌లు బరినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రామస్వామి, డిశాంటిస్‌లు ట్రంప్‌కు తమ మద్దతు ప్రకటించారు. క్రిస్టీ మాత్రం మొదటి నుంచి ట్రంప్‌ను వ్యతిరేకించడంతో ఆయన మద్దతుదారులు నిక్కీ హేలీ వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా, న్యూ హ్యాంప్‌ షైర్‌ గవర్నర్‌ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్‌నకు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఇక్కడ కూడా అయోవాలో మాదిరిగా ట్రంప్‌ గెలిస్తే, పోటీ నుంచి తప్పుకోవలసిందిగా హేలీపై ఒత్తిడి పెరగడం ఖాయమనిపిస్తోంది. న్యూ హ్యాంప్‌షైర్‌ లోని కుగ్రామం డిక్స్‌ విల్‌నాచ్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హేలీయే గెలుపొందాడు. ఆ గ్రామంలోని మొత్తం ఆరుగురు ఓటర్లు హేలీకే ఓటు వేశారు. వీరిలో నలుగురు రిపబ్లికన్‌ పార్టీ ఓటర్లుగా నమోదు కాగా, మిగిలిన ఇద్దరు తటస్థ ఓటర్లు. ఆరుగురు ఓటర్ల పోలింగ్‌ ప్రక్రియ కవరేజికి 60 మందికి పైగా విలేకరులు హాజరయ్యారు.

సాండర్స్‌ చాలా పాతవాడు. అలాగే బైడెన్‌, ట్రంప్‌ కూడా. అమెరికా 2024 సార్వత్రిక అధ్యక్ష ఎన్నికలకు ఇద్దరు రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ డెమొక్రాటిక్‌ పార్టీ వ్యూహాత్మక నామినీగా ఉండగా, అనేక మంది ధర్డ్‌ పార్టీ ఆశావహులు పోటీలో చేరారు.

మాజీ అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు వేర్వేరు క్రిమినల్‌ కేసుల్లో తన నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు. మాజీ అమెరికన్‌ అధ్యక్షుడు రిపబ్లికన్‌లలో తన ప్రజాదరణను పెంచుకోవడానికి, అలాగే అవసరమైన నిధులను సేకరించడానికి తన శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాడు. మళ్లీ ఎన్నికైతే, తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటానని ట్రంప్‌ ప్రమాణం చేశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఇమ్మిగ్రేషన్‌ విధానాలను విధించడం వంటి ఇతర భారీ మార్పులను తీసుకు వస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఒబామా కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తొలగిస్తామని, చైనాతో వాణిజ్యంపై కఠిన ఆంక్షలు విధిస్తామని కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రజలకు హామీ ఇస్తున్నాడు.

జో బైడెన్‌, ఇప్పటికే అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్నాడు. తన వయస్సు, పేలవమైన ఆమోదం రేటింగ్‌ల గురించిన ఆందోళనల మధ్య, పదవిలో మరో నాలుగు సంవత్సరాలు తనకు సత్తువ ఉందని ఓటర్లను ఒప్పించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నాడు. అయితే…ట్రంప్‌ను ఓడించగల ఏకైక డెమొక్రాటిక్‌ అభ్యర్థి అతనేనని బైడెన్‌ మిత్రపక్షాలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాశ్చాత్య ప్రభుత్వాల ప్రతిస్పందనకు బైడెన్‌ నాయకత్వం వహించాడు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలబడ్డాడు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి భారీ ఆర్థిక ఉద్దీపన కార్యక్రమాన్ని చేపట్టాడు. అయినప్పటికీ ఓటర్ల నుండి ఆశించినంతగా గుర్తింపు పొందలేకపోయాడు. బైడెన్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీ రిపబ్లికన్లతో పాటు డెమొక్రాట్‌ల నుండి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఆయన పాలనలో అమెరికా-మెక్సికో సరిహద్దు దగ్గర వలసదారులు రికార్డు స్థాయికి చేరుకున్నారు.

ఈ పరిస్థితులలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో వుంది.

/ వ్యాసకర్త సెల్‌ : 6300866637 /- వి.వి. వెంకటేశ్వరరావు

➡️