రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు ?

Mar 1,2024 07:17 #Editorial

మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్‌ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేయిస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశబ్దాలుగా వ్యవసాయం పట్ల, గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం.

                వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చిన మోడీ ప్రభుత్వం, ఆయన సిఫారస్సుల అమలు కోసం ఉద్యమిస్తున్న రైతుల మీద మాత్రం బుల్లెట్లను ప్రయోగిస్తున్నది. వ్యవసాయాన్ని కాపాడుకోవాలని రైతులు ఉద్యమిస్తుంటే, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే రెండు పక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. మీడియా, పోలీసు, అధికార యంత్రాంగంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సోషల్‌ మీడియా చేస్తున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటిస్తూ దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు పట్టు విడవకుండా పోరాడుతూనే వున్నారు. ఇప్పటికే ఒక యువ రైతు పోలీసు బుల్లెట్‌కు బలయ్యాడు. ముళ్ళ కంచెలను, ఇనుప చువ్వలను, నీటి ఫిరంగులను, రబ్బరు బుల్లెట్లను, పోలీసు కాల్పులను లెక్క చేయకుండా 13 డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 13 నుండి ఉద్యమిస్తున్నారు. ఇప్పటికీ ఐదు సార్లు రైతుల ప్రతినిధులతో చర్చలు జరిపామంటున్న ప్రభుత్వం ఏ డిమాండ్లు నెరవేర్చిందో చెప్పడంలేదు.

హామీలను అమలు చేయని మోడీ

                   లక్షలాది రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో 2020 నవంబర్‌ 26 నుండి సుమారు రెండు సంవత్సరాల పాటు భైఠాయించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే విద్యుత్‌ బిల్లు-2020ను ఉపసంహరించుకోవాలని, లఖింపురిలో ఆందోళన చేస్తున్న రైతులపై అధికార మదంతో జీపును నడిపి రైతుల మరణాలకు కారణమైన కేంద్రమంత్రి కుమారుడిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మొక్కవోని పోరాటంలో చలికి, వానకు, ఎండకు అంతకంటే భయంకరమైన కరోనా మహమ్మారికి 700 మందికి పైగా అన్నదాతలు అమరులయ్యారు. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులకు వేలాది మంది రైతులు గురయ్యారు. నిందారోపణలను ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం గ్రామీణ ప్రజలు నడిపిన సుదీర్ఘ పోరాటం అది. 1990 తరువాత ప్రపంచీకరణ విధానాలపై తీవ్రస్థాయి ప్రతిఘటన అది. మోడీ కళ్ళు తెరిపించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించిన ఉద్యమం అది. ఆ సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల అమలును వాయిదా వేసుకుంటున్నామని, పంటలకు కనీస మద్దతు ధర అమలు చేసేందుకు కమిటీ వేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఉద్యమాన్ని ఆపేశారు. అయితే మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్‌ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేయిస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశబ్దాలుగా వ్యవసాయం పట్ల, గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం.

ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17 శాతం. ప్రపంచ భూమిలో కేవలం 2.4 శాతం మాత్రమే వున్న దేశం మనది. దేశ జనాభాలో 48.6 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి గ్రామాల్లో జీవిస్తున్నారు. ఈ లెక్కలు మన భూమికి, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతలను చెబుతున్నాయి. దేశ జనాభాకు అవసరమైన ఆహారం, వారి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు వ్యవ సాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక విషాదాల అనుభవాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను పెంచు కున్నాము. 1950-1990 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.5 శాతం ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల 3.4 శాతానికి చేరింది. 1980-90 మధ్య వ్యవసాయ ఉత్పత్తులు సగటు నాలుగు శాతం పెరుగుదల సాధించాయి. 1991 నుండి ప్రారంభమైన ప్రపంచీకరణ విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 1990 చివరి నాటికి వ్యవసాయం తిరోగమనంలోకి దిగజారి దాని ఉత్పత్తులు మైనస్‌ 2 శాతానికి పడిపోయాయి. దీనివల్ల ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పూర్వ పరిస్థితి వచ్చింది. గత పదేళ్ళ నరేంద్ర మోడీ పాలన వ్యవసాయాన్ని పూర్తిస్థాయి సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమయ్యింది. అందుకే రైతులు పోరాడుతున్నారు.

దేశంలో 14.58 కోట్ల రైతు కుటుంబాల కింద 38.82 కోట్ల ఎకరాల సాగు భూమి వుంది. ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలు 12.57 కోట్లు కాగా, వీరి వద్ద వున్న భూమి మాత్రం 18. 38 కోట్ల ఎకరాలు మాత్రమే. వీరిలో అధికులు వెనుకబడిన కులాలకు చెందిన పేదలు. సెంటు సాగు భూమి లేని గ్రామీణ కుటుంబాలు ఏడు కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, మైనారిటీలు, గిరిజనులు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కోట్ల కుటుంబాలు నిత్యం అప్పుల్లో ఉండడానికి, పేదరికంలో మగ్గుతుండడానికి ప్రధాన కారణం తగినంత సాగు భూమి నిజమైన సాగుదార్ల వద్ద లేకపోవడం. శాస్త్ర, సాంకేతికత పెరిగే కొద్ది గ్రామీణ వృత్తులు అంతరించి వాటిపై ఆధారపడిన వారు వ్యవసాయానికి అదనపు భారమయ్యారు. ప్రభుత్వాల నుండి రైతులకు అందాల్సిన రుణ పరపతి, ఎరువులు, విత్తనాల సబ్సిడీ తగ్గిపోవడం, పంటలకు గిట్టుబాటు ధరలు అమలు కాకపోవడంతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళి గ్రామీణ జీవితం ఛిద్రమయ్యింది.

వ్యవసాయాన్ని ముంచే మోడీ విధానాలు

                 వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్‌ 5న ఆర్డినెన్స్‌ ద్వారా మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను చట్టాలుగా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్‌ 17-19 తేదీల మధ్య లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం, రైతు ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల ఉత్పత్తుల ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటల సాగు కాకుండా, ఈ కంపెనీలకు ఏది లాభమో దానినే ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహారధాన్యాలు కూడా దూరమవుతాయి. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి. వ్యవసాయ రంగంలో నూతన పరిశోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. జాతీయ బ్యాంకుల నుండి రైతులకు అందుతున్న అరకొర రుణ సదుపాయం కూడా అందక పంటల పెట్టుబడికి, రైతు కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటన్నింటివల్ల పేద, దిగువ మధ్య తరగతి రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని కోల్పోయి భూమి లేని నిరుపేదల్లో చేరిపోతారు. ముఖ్యంగా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫారస్సు చేసిన మొత్తం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న కీలక అంశం అమలుకు నోచుకునే అవకాశమే లేదు.

కనీస మద్దతు ధర ఎందుకు ?

                 అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 23 పంటలకు మాత్రమే ఈ మద్దతు ధర ప్రకటించబడుతుంది. అందులో 20 పంటలు ఆహారానికి సంబంధించినవి. ఇందులో వరి, గోధుమ, జొన్న లాంటి ఏడు ముతక ధాన్యాలు, ఆరు పప్పుధాన్యాలు, ఏడు నూనెగింజల పంటలు ఉన్నాయి. వాస్తవంగా వరి, గోధుమ పంటలకు మాత్రమే కొద్దిమేర ఈ కనీస మద్దతు ధర అమలవుతుంది. ఈ రెండు పంటల సేకరణలో 65 శాతం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుండే జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం వృద్ధి చెందడానికి వరి, గోధుమ పంటలకు మద్దతు ధర లభించడం ఒక కారణం. పంజాబ్‌లో వరి పంట అమ్మకాలు 78 శాతం, హర్యానాలో 90 శాతం చిన్న, సన్నకారు రైతుల నుండి జరుగుతున్నాయి. అందుకే మోడీ నల్ల చట్టాల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు రాష్ట్రాల రైతులు కేంద్రం పెట్టే అన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమిస్తున్నారు. 2000 నుండి 2014 వరకు దేశవ్యాప్తంగా 45 శాతం మంది మధ్య తరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ చట్టాలు అమలైతే దేశంలో, మన లాంటి రాష్ట్రాల్లో రైతు వ్యవసాయం కనుమరుగవుతుంది. దీనివల్ల పట్టణాల్లో పనులకు పోటీ పెరిగి వేతనాలు తగ్గడం, ఆకలి చావులు, ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతాయి. అందుకే ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ ప్రజల బతుకు కోసం సాగుతున్న ఉద్యమం.

నీరో చక్రవర్తిలా మోడీ

                చరిత్రలో రోమ్‌ను పాలించిన నీరో చక్రవర్తి అనగానే ‘రోమ్‌ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్‌ వాయించిన వ్యక్తిగా’ గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢిల్లీ చుట్టూ వేలాది రైతులు రెండు వారాలుగా ఆందోళన చేస్తుంటే ద్వారకలో డైవింగ్‌ చేసిన, తిరువనంతపురంలో గగన్‌యాన్‌ అంతరిక్ష మిషన్‌ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు పట్టుకుంది. గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా-2023’ నివేదిక ప్రకటించిన, గత 11 సంవత్సరాల్లో కుటుంబ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయని, అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగలేదని హెచ్‌సిఇఎస్‌ తాజా నివేదిక బట్టబయలు చేసినప్పటికీ ఏ మాత్రం చలించక, వేషాలు మార్చి మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కల్గించగల నేర్పరి మన ప్రధాని. కొద్దిమంది దేశీయ, విదేశీ సంపన్నుల కోసం కోట్లమంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా వ్యవసాయాన్ని, దేశాన్ని కాపాడుకోలేం.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి. రాంభూపాల్‌
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి. రాంభూపాల్‌
➡️