విదేశాల్లో ఉద్యోగమా?..అప్రమత్తత అవసరం

May 23,2024 05:20 #editpage

‘విదేశాల్లో పెద్ద ఉద్యోగం. ఏసీ రూముల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పని. రూ.లక్షల్లో సంపాదన’ అని చెప్పి నిరుద్యోగ యువతను నమ్మించి విదేశీ ముఠాలకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను విశాఖ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. అంతే కాకుండా చాలా మంది గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాల పేరుతో విజిటింగ్‌ వీసాలపై పంపి మోసం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందుకే విదేశాల్లో ఉద్యోగం అంటే ఒకటికి రెండు సార్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విజిటింగ్‌, స్టూడెంట్‌ వీసాలపై..
టర్కీ సమీపంలోని అజర్‌ బైజాన్‌కు 29 మందిని స్టూడెంట్‌ వీసాపై తీసుకెళ్లి…ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేసిన ఘటన గతంలో శ్రీకాకుళంలో వెలుగుచూసింది. అక్కడి పోలీసులు గుర్తించి బాధితులను ఇండియాకు తిరిగి పంపించారు. విశాఖపట్నంలో ఓ కన్సల్టెన్సీ సంస్థ సౌదీలో రెండేళ్ల పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని 76 మంది నుంచి రూ. 60వేల చొప్పున వసూలు చేసింది. విజిటింగ్‌ వీసాపై సౌదీకి తీసుకెళ్లి పని కల్పించింది. అయితే ఆరు నెలలకే వీసా గడువు ముగియడంతో ఆ దేశం వారందరినీ ఇండియాకు వెనక్కి పంపించేసింది. బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.
డబ్బులు వసూలు చేసి..
విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు గతంలో అనేకం వెలుగుచూశాయి. స్వీడన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో ఓ సంస్థ నిరుద్యోగులకు టోకరా వేసింది. 70 మంది నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. యూరప్‌, మలేషియా పంపిస్తామని ఏజెంట్లు మోసం చేశారని జగిత్యాలలో చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో గల్ఫ్‌ మోసాలు తరచూ బయటపడుతూనే ఉంటాయి. గల్ఫ్‌ పంపిస్తానని నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఏజెంట్‌ రూ. 4 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యాడు.
హెచ్చరిస్తున్న విదేశీ మంత్రిత్వ శాఖ
విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువగా తూర్పు ఐరోపా దేశాలు, గల్ఫ్‌ కంట్రీస్‌, ఇజ్రాయిల్‌, కెనడా, మయన్మార్‌ వెళ్లే నిరుద్యోగులకు ఎదురవుతున్నట్లు భారత విదేశాంగ శాఖ గుర్తించింది. అందుకే విదేశాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు చేయాలనుకుంటే రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని, చట్టపరమైన నిబంధనలను అనుసరించి మాత్రమే విదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారానే సంప్రదిస్తున్నారని, తమ ఆఫీసు అడ్రస్‌గానీ, ఇంటి అడ్రస్‌గానీ తెలియనివ్వడం లేదని గుర్తించింది. అందుకే రిజిస్టర్డ్‌ ఏజెంట్లందరూ తమ కార్యాలయం ఎదుట ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌ను కచ్చితంగా డిస్‌ప్లే చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ గుర్తింపు లేని రిక్రూటింగ్‌ ఏజెంట్లెవరైనా నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి విదేశాలకు పంపిస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. ఇమ్మిగ్రేషన్‌ చట్టం-1983 ప్రకారం ఇది మానవ అక్రమ రవాణా కిందికి వస్తుందని స్పష్టం చేసింది. కాని మోసాలు జరుగుతూనే వున్నాయి. కట్టడి కరువౌతోంది.
నిశిత పరిశీలన అవసరం
మెరుగైన ఉపాధి కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూ, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. అందుకే విదేశీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రిజిస్టర్‌ చేయని రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవద్దని పేర్కొంటున్నారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు ముందుగా ఏజెంట్‌ వివరాలను తెలుసుకోవాలి. విదేశాంగ శాఖలో ఏజెంట్‌గా నమోదు చేసుకున్నారా లేదా పరిశీలించాలి. ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ చెక్‌ చేయడానికి వఎఱస్త్రతీa్‌వ.స్త్రశీఙ.ఱఅ అనే భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌ను విజిట్‌ చేయాలి. అసలైన ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌ నంబర్లు ఈ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ అయి ఉంటాయి. అంతేకాకుండా ఆఫర్‌ లెటర్‌ను నిశితంగా పరిశీలించాలి. ఉద్యోగ నిబంధనలు, షరతులతో పాటు జీతం, జాబ్‌ కాంట్రాక్ట్‌ వివరాలు లేకుంటే ఆ ఆఫర్‌ లెటర్‌ మోసపూరితమని గ్రహించాలి.

– మహమ్మద్‌ ఆరిఫ్‌,
7013147990

➡️