జగజ్జేత భారత్‌

అద్భుతమైన ఆటతీరు, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం చేజారిపోకూడదన్న కసి, తీవ్రమైన ఒత్తిళ్లలోసైతం చక్కటి మనోనిబ్బరాన్ని ప్రదర్శించగల ఆటగాళ్ల పరిణతి భారత్‌ను రెండోసారి పొట్టి క్రికెట్‌లో జగజ్జేతగా నిలిపాయి. టి-20 ప్రపంచకప్‌లో భారత్‌ చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఏడు నెలల క్రితం వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుని, కంగారూల చేతిలో పరాజయం పాలైన బాధ నుంచి కోలుకుని, ఈ టోర్నీలో టీమిండియా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. తొలిసారి టి-20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్‌ను చేజిక్కించు కోవాలని తహతహలాడిన సఫారీలు చివరిలో తడబడినా మంచి పోరాటపటిమను కనబ రిచారు. భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌కోహ్లీ, రవీంద్ర జడేజా టి-20 నుంచి నిష్క్రమణకు ఇదే మంచి తరుణంగా భావించి రిటైర్మెంట్‌ ప్రకటించారు.
అసాధారణ, అద్భుత విజయాలెన్నో సాధించినా… విశ్వవిజేతగా నిలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్‌, మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో 2007లో టి-20లలో, 2011లో వన్డేల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ నిలిచింది. 2013లో ఇంగ్లండ్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీతో ఆ కొరత కూడా తీరింది. 37 ఏళ్ల 60 రోజుల వయసులో అత్యధిక వయసున్న కెప్టెన్‌గా టి-20 ట్రోఫీని సాధించిన రోహిత్‌ శర్మ… భారత్‌కు ప్రపంచ కప్‌ అందించిన మేటి కెప్టెన్లు కపిల్‌, ధోనీ సరసన చేరాడు.
పుష్కలంగా విజయావకాశాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా… ఏదో ఒక దశలో వైఫల్యం భారత జట్టును 11 ఏళ్లుగా వెంటాడుతోంది. కోచ్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాంబినేషన్‌లో… వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్స్‌లోనూ, గత ఏడాది నవంబర్‌లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్నా… ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడకుండా ఫైనల్‌కు ఇరు జట్లు చేరుకోవడం టి-20లలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఆ చరిత్రను తిరగరాసిన భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తుది వరకూ నువ్వా.. నేనా.. అన్నట్లు ఫైనల్లో పోరాడాయి. కెప్టెన్‌గానే కాకుండా, ఆటగాడిగానూ రోహిత్‌ శర్మ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అద్భుత ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఈ టోర్నీలో వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా, కీలకమైన మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడు. ఫైనల్‌కు ముందు ఏడు మ్యాచ్‌ల్లో 75 పరుగులు చేసిన కోహ్లీ… ఫైనల్‌లో ఒక వైపు వికెట్లు పడిపోతున్నా… 76 పరుగులు చేసి భారత్‌ విజయానికి గట్టి పునాది వేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుని తన 14 ఏళ్ల టి-20 కెరీర్‌కు తుది వీడ్కోలు పలికాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రిషబ్‌ పంత్‌… మునుపటి స్థాయిలో బ్యాటింగ్‌లో, కీపింగ్‌లో తన సత్తా చాటాడు. ఒక దశలో భారత్‌ ఓటమి అంచుల వరకూ వెళ్లిపోగా.. తొలిసారి టి-20 ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపిం చింది. ఆరు వికెట్లు చేతిలో ఉండగా, 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో హార్దిక్‌పాండ్యా కీలకమైన క్లాసెన్‌, డేవిడ్‌ మల్లిర్‌లాంటి ముగ్గురి వికెట్లు పడగొట్టడం మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌. 4.17 ఎకానమీతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు దక్కించుకోవడంతోపాటు జస్ప్రీత్‌ బూమ్రా ఫైనల్లోనూ ప్రత్యర్థులను తన బంతులతో బెంబేలెత్తించాడు. బౌండరీ దాటుతున్న బంతిని చేజిక్కించుకుని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఫీల్డింగ్‌ క్యాచ్‌ ఆటను మలుపు తిప్పింది. ఆఫ్ఘన్‌ జట్టు ఆటగాడు ఫరూఖీతోపాటు 17 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల క్లబ్‌లో ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ స్థానం సంపాదించుకున్నాడు. ఇలా అందరి ఆటా… జగజ్జేతగా జట్టును నిలిపింది. దేశ విదేశాల్లోని భారత క్రికెట్‌ క్రీడాభిమానుల ఆనందోత్సాహాలు, సంబరాలు మిన్నంటాయి.
ఎన్నో సవాళ్లను అధిగమించి పాకిస్తాన్‌ శరణార్ధి శిబిరాల్లో క్రికెట్‌ నేర్చుకున్న ఆఫ్ఘన్‌ కుర్రాళ్లు… తమ పాలకులను అతికష్టం మీద ఒప్పించి… సెమీ ఫైనల్‌కు చేరుకోవడం స్ఫూర్తిదాయకం. ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా సూపర్‌-8 దశకు చేరుకోవడం, పాక్‌లాంటి జట్టును సైతం ఓడించడం చిన్న విషయం కాదు. అద్భుత ఆటగాళ్లు రోహిత్‌, కోహ్లీల వెలితిని యువ ఆటగాళ్లు భర్తీ చేసి మరిన్ని విజయాలను చేకూర్చుతారని ఆశిద్దాం.

➡️