Dunki Movie Review : డంకీ ముూవీ రివ్యూ

Dec 21,2023 17:42

 

ప్రముఖ బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌, తాప్సీ జంటగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’. ఈ సినిమాలో మరో హీరో విక్కీ కౌశల్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 21.12.2023వ తేదీ గురువారం రోజున ప్రేక్షకులకు ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా..!

కథ

హార్డీ (షారుక్‌ఖాన్‌) ఓ సైనికుడు. యుద్ధంలో తనని కాపాడిన వ్యక్తిని చాన్నాళ్ల తర్వాత కలిసేందుకు పంజాబ్‌కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. డబ్బు సమస్యలతో ఉన్న అతని చెల్లెలు మన్ను (తాప్సీ పన్ను) ఎలాగైనా లండన్‌కి వెళ్లి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉంటుంది. ఇక ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్‌ (విక్రమ్‌ కొచ్చర్‌), బల్లి (అనిల్‌ గ్రోవర్‌)లు కూడా డబ్బు సంపాదించడానికి లండన్‌కి వెళ్లాలనుకుంటారు. తన ప్రాణాన్ని కాపాడినందుకు అతని చెల్లెలు మన్నూకి లండన్‌ వెళ్లేందుకు హార్డీ సాయం చేయాలనుకుంటాడు. ఈ ముగ్గురు లండన్‌ వీసా కోసం నానా తంటాలు పడతారు. అయినా వీరికి వీసా రాదు. చివరికి దేశ సరిహద్దులగుండా అక్రమ మర్గాన (డంకీ ట్రావెల్‌ గుండా) లండన్‌కి వెళ్లాలనుకుంటారు. వీళ్లకి హార్డీ ఎలా సహాయం చేశాడు. మరి వారు అనుకున్నట్టుగా ఇంగ్లాడ్‌కి చేరుకున్నారా? లేదా? ఈ క్రమంలో ప్రేమించుకున్న మన్ను, హార్డీల ప్రేమకథ సుఖాంతమైందా? లేదా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

అక్రమ వలసదారుల కథే ఈ చిత్రం. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వలసదారులు ఎన్ని కష్టాలు పడతారు? తీరా అక్కడకి వెళ్లిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యల్ని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ చక్కగా చూపించారు. ఇక సినిమా విషయానికొస్తే.. మన్ను, ఆమె స్నేహితుల నేపథ్యంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ. ఈ ముగ్గురి సమస్యల్ని తెలుసుకున్న తర్వాత వారు లండన్‌కి వెళ్లేందుకు హిర్డీ సాయం చేయాలనుకుంటాడు. లండన్‌ వీసా కోసం హిర్డీ చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. వీరికి ఇంగ్లీషు రాదని ఇంగ్లీషు నేర్పించడం నుంచి.. అక్కడ నేర్చుకునేచోట సుఖీ (విక్కీ కౌశల్‌) పరిచయం..వీసా ఇంటర్వ్యూల వరకు సరదాసరదాగా సాగిపోతుంది. సుఖీ (విక్కీ కౌశల్‌) పాత్ర కూడా ఎమోషనల్‌గా టచ్‌ అవుతుంది. ఇక ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌గా టచ్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌ అంతా భావోద్వేపరంగానే సాగుతుంది. మన్ను గ్రూప్‌ లండన్‌కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. తీరా లండన్‌కి వెళ్లిన తర్వాత అక్కడ ఎదుర్కొనే సమస్యలు, క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ భావోద్వేగానికి గురిచేస్తాయి. కథపరంగా కొత్తదే అయినా.. ఇందులో సాగదీత సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వీటికి కత్తెర పెట్టినట్లయితే సినిమా ఇంకా బాగుండేది. అలాగే నటీనటుల ఎమోషన్‌ మిస్సయింది. దీంతో కథకి ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వలేరు. వలసదారులకు సంబంధించిన కథాంశమే అయినా.. చిన్న చిన్న విషయాలకే దేశం విడిచి వెళ్లిపోవాలనుకోవడం.. దాన్ని మాత్రమే హైలెట్‌ చేయడం చూస్తే ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోలేరు. దర్శకుడు ఇందులో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సీరియస్‌ అంశాన్ని కూడా ఏదో జోక్‌గా చెప్పినట్టుగా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..

షారుక్‌ఖాన్‌, తాప్సీ పన్ను నటన హైలెట్‌. ఇక విక్కీ కౌశల్‌ తదితర పాత్రలు బాగుంది. అమన్‌ పంత్‌, ప్రీతమ్‌ సంగీతం పరవాలేదు. సీకె మురళీధరన్‌, మనుష్‌ నందన్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️