హాయ్ నాన్న మూవీ రివ్యూ

Dec 7,2023 17:58 #movie, #review

నేచురల్‌ స్టార్‌ నాని, ప్రముఖ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా కలిసి నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌, పాటలు విశేష ఆదరణ పొందాయి. కొత్త దర్శకుడైన శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం డిసెంబర్‌ 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో తెలుసుకుందామా..!

కథ

విరాజ్‌ (నాని) ముంబైలో ఓ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌. అతనికి తన ఆరేళ్ల కూతురు మహి (కియారా ఖన్నా) అంటే ప్రాణం. మహి పుట్టినప్పటి నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయాన్ని తన గుండెల్లో పెట్టుకునే బాధబయటకు కనపడనీయకుండా.. ఎంతో జాగ్రత్తగా కూతుర్ని పెంచుతాడు. మహికి విరాజ్‌ రోజూ కథలు చెప్పడం అలవాటు. విరాజ్‌ చెప్పే కథల్లో హీరోగా తన నాన్ననే మహి ఊహించుకుంటుంది. అలాగే రోజూ అమ్మ కథ చెప్పాలని మహి అడుగుతున్నా.. విరాజ్‌ మాత్రం అమ్మ కథ గురించి చెప్పడు. ఎలాగైనా అమ్మ కథ తెలుసుకోవాలని మహి ఓరోజు ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. అప్పుడే ఓ రోడ్డు ప్రమాదం నుంచి మహీని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. ఇద్దరూ ఓ కాఫీ షాప్‌లో కూర్చొని విరాజ్‌కి ఫోన్‌ చేసి అక్కడికి రమ్మని చెబుతారు. అక్కడ విరాజ్‌ని అమ్మ కథని చెప్పమని మహి మారాం చేయడంతో.. అప్పుడు వర్ష గురించి చెబుతాడు. తన తల్లి ఎలా ఉంటుందో తెలియని మహి వర్షలో యష్ణని ఊహించుకుంటుంది. విరాజ్‌, వర్షల కథ విన్న తర్వాత యష్ణ విరాజ్‌ని ప్రేమిస్తుంది. అప్పటికే మరొకరితో నిశ్చితార్ధమైన యష్ణ ప్రేమను విరాజ్‌ అంగీకరిస్తాడా? అసలు వర్ష ఎవరు? విరాజ్‌, వర్షలు ఎందుకు విడిపోయారు? విడిపోయినవాళ్లు మళ్లీ కలిశారా? లేదా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

‘జెర్సీ’ తండ్రీ కొడుకుల ఎమోషన్‌ మూవీ. ‘హారు నాన్న’ తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఇక ఈసినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో తండ్రీ కూతుళ్ల నేపథ్యంలోనే కథ సాగుతుంది. పాత్రల పరిచయం, కొన్ని సీన్లతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మహి యష్ణలో తన అమ్మను చూసుకున్నప్పటి నుంచి కథనంలో వేగం పెరుగుతుంది. విరాజ్‌, వర్షల ప్రేమ, పెళ్లి, మహి పుట్టడం, ఆ తర్వాత వర్షకి యాక్సిడెంట్‌ అవ్వడం.. కన్నకూతుర్ని, భర్తని వదిలేసి వెళ్లిపోవడం వరకు చెప్పి ఆపేస్తాడు. ఆ తర్వాత చిన్న ట్విస్ట్‌తో విరామం వస్తుంది. ఈ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అమ్మ గురించి నాన్న తన కూతురికి ఎమోషనల్‌గా చెప్పే ఈ కథ హృదయాలను హత్తుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు చివరలో ‘ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవడం లేదా’ అని విరాజ్‌ మహితో అన్న మాటలు భావోద్వేగానికి గురిచేస్తాయి. చివరికి జయరామ్‌ పాత్రతో క్లైమాక్స్‌నివ్వడం హైలెట్‌గా ఉంది. దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలిచిత్రమే. అయినప్పటికీ అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కించారు. కథ పాతదే అయినా.. స్క్రీన్‌ ప్లే, ట్విస్టులు ఈ సినిమాకు ప్రధాన బలం. కొన్నిసన్నివేశాల సాగదీతే ఈ సినిమాకు మైనస్‌. ఓవరాల్‌గా ఈ చిత్రానికి అందరూ కనెక్ట్‌ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరెలా చేశారంటే..

ప్రేమికుడు, భర్త, తండ్రిగా నాని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ నానికి పోటీగా నటించింది. చిన్నారి కియారా ఖన్నా కూడా బాగా నటించింది. తన నటనతో మెప్పించింది. ఇక ప్రియదర్శి, జయరామ్‌ తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. హేషమ్‌ సంగీతం అలరించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️