పిండం మూవీ రివ్యూ

Dec 15,2023 14:09 #movie, #review

 

 

హీరో శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌ వంటి ప్రముఖ తారాగణం నటించిన తాజా చిత్రం ‘పిండం’. హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 15వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు నచ్చిందో తెలుసుకుందామా..!

కథ

ఆంథోని (శ్రీరామ్‌)కి శుక్లాపేట రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌గా ఉద్యోగం వస్తుంది. ఆ గ్రామంలోనే తక్కువ ధరకి వస్తుందని ఓ పాత ఇంటిని కొనుగోలు చేస్తాడు. తల్లి సూరమ్మ, భార్య మేరి (ఖుషి రవి), తన ఇద్దరు కూతుళ్లు సోఫి, తారలతో కలిసి ఆ ఇంట్లోకి దిగుతాడు. ఆ ఇంట్లో దిగే సమయానికే మేరి గర్భవతిగా ఉంటుంది. ఆ ఇంట్లోకి దిగిన తర్వాత ఏవో అదృశ్య శక్తులు ఆ కుటుంబ సభ్యుల్ని వెంటాడుతాయి. ఆ ఇంటిని ఖాళీ చేయాలని ఆంథోని భావిస్తున్న సమయంలో భూత వైద్యురాలు అన్నమ్మ (ఈశ్వరీ రావు) వచ్చి ఆ ఇంట్లో ఆత్మలున్నాయి.. తాను ఆ ఆత్మలను వదిలిస్తాను ఇంటిని ఖాళీ చేయొద్దని చెబుతుంది. ఆ ఇంట్లో అన్ని ఆత్మలు ఎందుకు ఉన్నాయి? ఆత్మలను అన్నమ్మ ఎలా వదిలిస్తుంది. ఈ క్రమంలో అన్నమ్మకు ఎదురైన సమస్యలేంటి? చివరకు అన్నమ్మ ఆంథోని కుటుంబాన్ని ఆత్మల నుంచి రక్షిస్తుందా లేదా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

హారర్‌ సినిమాలంటే ప్రేక్షకులకు గుర్తుకొచ్చేవి ఊరి చివరన ఉండే ఓ పాతబడిన ఇల్లు.. దగ్గర్లో ఓ పెద్ద మర్రిచెట్టు. ఇంచుమించు హారర్‌ సినిమా అంటే ఇవే ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఓ పాత ఇల్లు.. అందులో ఆత్మలు ఉన్నట్టు దర్శకుడు సాయికిరణ్‌ దైదా చూపించారు. అయితే హారర్‌ని కామెడీతో ముడిపెట్టకుండా దర్శకుడు చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గానే ప్రయత్నించారు. ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయం… ఊరి చివర పాత ఇంట్లోకి ఆంథోని కటుంబం మకాం మార్చడం.. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత వింత సౌండ్లు, ఫొటోలు కింద పడిపోవడం వంటివి చూస్తే కొంత భయాన్ని కలిగిస్తాయి. ఓ చిన్న ట్విస్ట్‌తో విరామం వస్తుంది. ఫస్టాఫ్‌లో ఆత్మలు ఉన్నాయని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఆ ఆత్మలు వెనుక ఉన్న కథేంటి అన్నదాన్ని చూపించారు. మేరీ కడుపులో ఉన్న పిండానికి, బయట ఆత్మలకు లింక్‌ ఉన్నట్టు చూపించడం.. రొటీన్‌ సన్నివేశాలు.. గత హారర్‌ సినిమాల మాదిరిగానే ఈ చిత్ర కథ కూడా కావడం ఈ సినిమాకు మైనస్‌. క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. ఈ చిత్రంలో భూతవైద్య క్రతువులు మితిమీరిన స్థాయిలో ఉన్నాయి. వీటిని కట్‌ చేసినట్లైతే సినిమా మరోస్థాయిలో ఉండేది. ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ పరవాలేదు. కథ రొటీన్‌గా ఉన్నా.. స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. హారర్‌ జోనర్‌ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓసారి థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాని చూసి రావొచ్చు.

ఎవరెలా చేశారంటే..

శ్రీరామ్‌ నటన బాగుంది. ఖుషి రవి, ఈశ్వరీరావు నటన హైలెట్‌. అవసరాల శ్రీనివాస్‌ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇందులో మూగమ్మాయిగా చిన్నారి నటన అద్భుతంగా ఉంది. సౌరభ్‌ సూరంపల్లి సంగీతం బాగుంది. సతీష్‌ మనోహర్‌ సినిమాటోగ్రఫీ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️