Salaar Movie Review : ‘సలార్‌’ మూవీ రివ్యూ

Dec 22,2023 15:09 #movie, #prabhas, #review, #salaar

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘సలార్‌’. కెజిఎఫ్‌ మూవీతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌నీల్‌- ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 22వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో తెలుసుకుందాం..!

కథ

ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో అజ్ఞాతంగా గడుపుతూ.. మెకానిక్‌గా పనిచేస్తుంటాడు దేవా (ప్రభాస్‌). అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ఆద్య (శృతిహాసన్‌)కు ఓబులమ్మ (ఝాన్సీ) వల్ల ప్రాణహాని ఉందని తెలిసి.. ఆమెను కాపాడుకోవడానికి ఆమె తండ్రి బిలాల్‌ (మైమ్‌ గోపి) దేవా దగ్గరకు పంపిస్తాడు. దేవా తన తల్లి (ఈశ్వరీరావు) మాట జవదాటకుండా హింసకు దూరంగా ఉంటాడు. ఇక మరోవైపు ఖాన్సార్‌ సామ్రాజ్యానికి కాబోయే దొర వరద రాజమన్నార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)ను చంపాలని కుట్ర పన్నుతారు. వరద రాజమన్నార్‌, దేవా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. తన స్నేహితునికి ముప్పు పొంచి ఉండడంతో దేవా ఖాన్సార్‌కి వచ్చి అతనికి రక్షణగా నిలబడతాడా? అసలు ఖాన్సార్‌ నేపథ్యం ఏంటి? దేవా అజ్ఞాత జీవితం ఎందుకు గడపాల్సి వచ్చింది? అతనికి సలార్‌ అనే పేరు ఎలా వచ్చింది? ఆద్య తండ్రి.. తనను దేవా వద్దకే ఎందుకు పంపాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన కెజిఎఫ్‌ వన్‌, టు చిత్రాల మాదిరిగానే ‘సలార్‌’ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కెజిఎఫ్‌ మూవీని గుర్తుకుతెస్తాయి. ఇక సినిమా విషయానికొస్తే.. వరద రాజమన్నార్‌, దేవాల చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ శృతిహాసన్‌ ఎంట్రీ. ఆ తర్వాత దేవా ఎంట్రీ. అయితే హీరోగా ప్రభాస్‌ ఎంట్రీ అదిరిపోతుందని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తన ఎంట్రీని చాలా సాదాసీదాగానే ప్లాన్‌ చేశాడు. ఇక దేవా… తల్లీ కొడుకుల మధ్య అనుబంధం, దేవాను కత్తిపట్టొద్దని ఆమె పదే పదే నియంత్రించే సన్నివేశాలు చూస్తే.. ప్రభాస్‌ ఇమేజ్‌ని పెంచేశాయి. ఇంటర్వెల్‌లో హీరో ఎలివేషన్‌ సీన్స్‌ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో ఖాన్సార్‌ సామ్రాజ్యంలో ఏం జరగబోతుందనే ఆసక్తిని కల్పిస్తూ విరామం వస్తుంది. సెకండాఫ్‌లో హీరో ఖాన్సార్‌ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం.. అక్కడ కుర్చీ కోసం జరిగే కుతంత్రాలు సినిమాపై హైప్‌ని పెంచుతాయి. కానీ ఇందులో క్లారిటీ మిస్సయ్యింది. తెరపై ఏదో జరుగుతుంది.. దానికి లింకేంటి అని అనుకునేలోపే ఇంకో పాత్ర వస్తుంది. దీంతో సగటు ప్రేక్షకుడు కన్ఫ్యూజ్‌ అవుతాడు. తల్లి మాదిరిగానే, తన స్నేహితుడు కూడా దేవాను కత్తి పట్టకుండా నియంత్రిస్తుంటారు. అయితే దేవా కత్తి పడితే ఎలా ఉంటుందో అన్న ఊహాను మాత్రం ప్రశాంత్‌ నీల్‌ బాగానే కల్పించాడు. అక్కడక్కడా దేవా మెప్పించే యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తాయి. ఇక పార్ట్‌ టు పై హైప్‌ని పెంచుతూ క్లైమాక్స్‌ ఉంది. ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌ కటౌట్‌ను తెరపై బాగానే ఉపయోగించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ని హైలెట్‌ చేసి చూపించడంలో ప్రశాంత్‌ ప్రతిభ తెరపై కనిపించింది. ఈ చిత్రంలో కొన్ని సాగదీత సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కథ, కథనం పరంగా కొంత నిరాశకలిగించినప్పటికీ ఈ సినిమా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని కచ్చితంగా అలరిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

హీరో ప్రభాస్‌ నటన అద్భుతంగా ఉంది. స్నేహితునిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా బాగా నటించాడు. హీరోయిన్‌ శృతిహాసన్‌ పాత్ర నిడివి తక్కువ కానీ.. నటనపరంగా బాగుంది. ఈశ్వరీరావు, ఝాన్సీ పాత్రలు కీలకం. వారి నటనా అలరించింది. రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం పరవాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️