Sarkaaru Noukari Movie Review : సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ

Jan 1,2024 16:16 #movie, #review

ప్రముఖ సింగర్‌ సునీత కుమారుడు హీరోగా నటించిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ సినిమా న్యూఇయర్‌ స్పెషల్‌గా విడుదలైంది. ఈ ఏడాది (2024) విడుదలైన తొలి చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందాం..!

కథ

గోపాల్‌ (అకాష్‌ గోపరాజు) ఓ అనాథ. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటాడు. గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చిన తర్వాత సత్య (భావన)ను పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగం రీత్యా వీరిద్దరూ మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌కి వెళ్లి అక్కడే కాపురం పెడతారు. ఆ గ్రామస్తులు కూడా సర్కారు నౌకరోడి భార్యగా సత్యని ఎంతో గౌరవిస్తారు. అయితే మొదట ఎంతో అభిమానించే ఆ ఊరి ప్రజలు.. ఆ తర్వాత భార్యా, భర్తలిద్దరినీ అంటరానివాళ్లుగా చూస్తారు. దానికి కారణం, ప్రభుత్వం సూచించినట్టుగా.. ఎయిడ్స్‌ నివారణ కోసం ఆ ఊళ్లో కండోమ్స్‌ పంచడంతో, ఆ ఊరి ప్రజలు గోపాల్‌ని అవమానిస్తారు. దీంతో సత్య భర్తని అసహ్యించుకుంటుంది. ఆ ఉద్యోగం వదిలేయమని గోపాల్‌ని కోరుతుంది. అయితే, గోపాల్‌ భార్య మాట వినడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం వదులుకోనని చెబుతాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, సత్య తన పుట్టింటికి వెళుతుంది. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఎయిడ్స్‌ వ్యాధితోనే తన స్నేహితుడు కూడా చనిపోతాడు. గ్రామస్తులు ఎంత అవమానించినా… ఆ ఊరిని వదలకుండా.. గ్రామస్తుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గోపాల్‌ ఏం చేశాడు? సత్య చివరికి గోపాల్‌ని అర్థం చేసుకుని తన దగ్గరికి వస్తుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

1990లో ఎయిడ్స్‌ వ్యాధితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలంలో ఈ వ్యాధి సోకిన వారిని ఊరి నుంచి వెలివేసేవాళ్లు. అలాంటి ఘటనలు కోకొల్లలు. మహబూబ్‌నగర్‌ కొల్లాపూర్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయట. వాస్తవ సంఘటనల ఆధారంగానే దర్శకుడు శేఖర్‌ ఈ కథను తెరకెక్కించారు. ఇక సినిమా విషయానికొస్తే… ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల పరిచయం, పెళ్లి, గవర్నమెంట్‌ ఉద్యోగం వల్ల గోపాల్‌కు వచ్చే చిక్కులు, అవమానాలు, ఆ గ్రామస్తులు చేసే సందడి తెరపై నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. కథ ప్రారంభం నుంచే 1990ల్లో పుట్టినవాళ్లయితే.. కథకి బాగా కనెక్ట్‌ అవుతారు. ఒక ఎమోషనల్‌ సీన్‌తో విరామం వస్తుంది. ఫస్టాఫ్‌ కామెడీ అయితే.. సెకండాఫ్‌ ఎమోషనల్‌గా సాగుతుంది. హీరో బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ కూడా పరవాలేదు. ముగింపు ప్రేక్షకులు ఊహించిందే. ఈ సినిమాలో కమర్షియల్‌ హంగులు లేకపోవడమే మైనస్‌. దర్శకుడు కూడా సినిమాలో అలాంటి హడావిడి చూపించలేదు. దీంతో ఈ చిత్రం నేటి యూత్‌కి అంతగా నచ్చకపోవచ్చు. కానీ 1990ల్లో పుట్టినవారికి ఈ కథ బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్‌గా ఈ సినిమాను థియేటర్‌కి వెళ్లి ఓసారి చూసిరావొచ్చు.

ఎవరెలా చేశారంటే..

హీరోగా ఆకాశ్‌కిది తొలి చిత్రమే అయినా.. ఆ పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. హీరోయిన్‌ భావన నటన ఆకట్టుకుంది. సర్పంచ్‌గా తనికెళ్ల భరణి తన నటనానుభవాన్ని తెరపై చూపించారు. ఇక తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు గుర్తుపెట్టుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️