విద్వేష సినిమాల ‘ఆట’కట్టు!

Apr 22,2024 05:10 #moviies

”చెబుతున్నది అబద్ధమే కావొచ్చు.. దానిని పదే పదే చెప్పు. అది నిజమే అనే భ్రమ ప్రజల్లో ప్రబలిపోతుంది.” ఇది గోబెల్స్‌ థియరీ. మనదేశంలో దానినే ఊపిరిగా చేసుకొని బతికే పార్టీ ఎన్నికల సమయంలో దురుద్దేశ పూరితంగా ఇలాంటి అబద్ధాల, ఆవేశాల సినిమాలను తీయించి, తన అజెండా ప్రచారానికి వాడుకుంటోంది. ఇది 2014 ఎన్నికల నుంచీ ఒక ప్రణాళిక ప్రకారం సాగుతోంది. ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగానూ ఇలాంటి ఉన్మాద ప్రబోధ సినిమాలు వెండితెరను ముంచెత్తాయి. కానీ, ఈ ‘భావావేశాల క్రీడ’ క్రమంగా అర్థం కావడం వల్ల కాబోలు, ఈసారి ఆ తరహా సినిమాలకు జనాదరణ దక్కలేదు.
హిందూత్వ భావజాలాన్ని, బిజెపి అనుకూల ప్రచారాన్ని చేయటానికి ఈసారి హిందీలో దాదాపు అర డజను సినిమాలు సిద్ధం అయ్యాయి. ‘స్వతంత్ర వీర సావర్కర్‌’, ‘జెఎన్‌యు’, ‘గోద్రా’, ‘ఆర్టికల్‌ 370’, ‘మై అటల్‌ హూన్‌’, ‘బెంగాల్‌ 1947’ వంటివి తెర మీదికి వచ్చాయి. తెలుగులో తెలంగాణా బిజెపి నాయకుడి నిర్మాణంలో ‘రజాకార్‌’ అనే సినిమా విడుదలైంది. చరిత్రను ఒక కోణంలోనుంచే వీక్షించి, విద్వేషపూరితంగా 2022లో రూపొందించిన ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ఎక్కువ లాభాలను తీసుకురావడంతో అది అనేక భాషల్లోకి డబ్‌ అయింది. అదే ఒరవడిలో పూర్తి అబద్ధాలతో ‘కేరళ స్టోరీ’ తీసి, దర్శక నిర్మాతలు చేతులు కాల్చుకున్నారు. కొద్దిపాటి ఆదరణ దొరికినా, ఈ ఎన్నికల కోసం రంగంలోకి దిగిన సినిమాలన్నీ ఈ పాటికే అన్ని భాషల్లోకి దిగుమతి అయ్యేవి. కానీ, హిందీ రాష్ట్రాల్లోనూ ఆ సినిమాలు అట్టర్‌ఫ్లాపయ్యాయి.
స్వాతంత్య్ర సమయంలో పాల్గొనని బిజెపి సైద్ధాంతిక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ – తమ తరఫున గొప్ప వీరుడంటూ సావర్కర్‌ని ముందిపీఠిన నిలపటానికి శాయశక్తులా ప్రచారం చేస్తూ ఉంటుంది. అతడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రమే ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని తప్పు చేశానని, తనను జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు అధికారులకు విశ్వాస పాత్రుడినై ఉంటానని సావర్కర్‌ రాసుకున్న క్షమాపణ అర్ధింపు లేఖలు చరిత్రలో ఇంకా భద్రంగానే ఉన్నాయి. ఆ వాస్తవాలను దాచేసి, అవాస్తవాలతో తెరకెక్కించిన కథ ‘వీర్‌ సావర్కర్‌’. దానిని అద్భుతంగా ప్రచారం చేయాలని బిజెపి ప్లాన్‌ చేసినా, అది నెరవేరలేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ వాళ్లే ఉచిత ప్రదర్శనలు వేసి, ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేశారు.
మేథావులకు నిలయంగా, మన దేశ ప్రతిష్టకు చిరునామాకు ఉన్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) అంటే బిజెపికి, దాని అనుబంధ సంఘాలకు తొలినుంచీ కడుపుమంట. ఆ విశ్వవిద్యాలయాన్ని అభాసుపాలు చేయటానికి అవి నిత్యం అసత్యాలతో ప్రచారం చేస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా వచ్చిన సినిమా ‘జెఎన్‌యు – జహంగీర్‌ నేషనల్‌ యూనివర్సిటీ’. బిజెపితో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యాపార సంస్థ మహాకాల్‌ మూవీస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. యూనివర్సిటీ అసాంఘిక శక్తులకు నిలయం అన్నట్టుగా నిర్మించిన ఈ సినిమాని ఎబివిపి వాళ్లు జెఎన్‌యు ప్రాంగణంలో ప్రదర్శించే ప్రయత్నం చేయగా, విద్యార్థులు అడ్డుకున్నారు. విద్వేష రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
గతంలో ‘పిఎం మోడీ’ అన్న సినిమాను తీసిన సందీప్‌ సింగ్‌ ఈసారి ‘మై అటల్‌ హూన్‌’ సినిమా నిర్మాత. ఇతడిపై మాదక ద్రవ్యాల సరఫరా ఆరోపణలు ఉన్నాయి. బిజెపికి దగ్గరగా ఉంటూ ఆ కేసులను ఎదుర్కొంటున్నాడు. బిజెపి అనుకూల సినిమాలు తీసి, తన భక్తిని ప్రదర్శిస్తున్నాడు. అయితే, ఆ పార్టీ అనుగ్రహమైతే దొరికింది కానీ, తీసిన సినిమాలేవీ ప్రజాదరణ పొందలేదు. ‘గోధ్రా’ సినిమాలో నటించిన కనోడియా గతంలో బిజెపి ఎమ్మెల్యే. బిజెపికి గట్టి మద్దతుగా నిలిచే నిర్మాణ సంస్థే ఈ సినిమాను నిర్మించింది. దేశ విభజన సమయంలో బెంగాల్‌లో జరిగిన హింసపై రూపొందించిన సినిమా ‘బెంగాల్‌ 1947’. ఆ సందర్భంలో మతోన్మాదులు రాజేసిన గొడవల్లో ఎన్నో హిందూ, ముస్లిం కుటుంబాలు బలయ్యాయి. గాంధీ స్వాతంత్య్ర సంబరాల్లో కూడా పాల్గొనకుండా బెంగాల్‌లో ఆ కల్లోలిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, సామరస్యం కోసం ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ఈ చారిత్రిక వాస్తవాలకు చోటివ్వలేదు. ముస్లిములు మొత్తం హిందువులకు శత్రువులు అన్నట్టుగా అవాస్తవాలు తెరకెక్కించారు.
తెలంగాణా బిజెపి నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి పూర్తి అసత్యాలతో ‘రజాకార్‌’ చిత్రాన్ని రూపొందించారు. దీనిని ప్రమోట్‌ చేయటానికి బిజెపి నాయకులంతా నేరుగా రంగంలోకి దిగారు. బండి సంజరు అయితే ఏకంగా ఆ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వాలంటూ తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ధోరణిని బిజెపి అన్నిచోట్లా కొనసాగిస్తోంది. తమకు అనుకూలమైన సినిమాలు అయినప్పుడు సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా బహిరంగ వేదికల మీద నుంచి ఆ సినిమాలను చూడాల్సిందిగా ప్రజలకు పిలుపునివ్వడం అలవాటుగా మారింది. ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కేరళ స్టోరీ’, ‘ఆర్టికల్‌ 370’ వంటి వివాదాస్పద సినిమాలకు మోడీ ప్రచారం కల్పించారు.
అయితే, ఈ సినిమా కథల వెనుక ఉన్న కథ ప్రజలకు అర్థం అవుతోంది. చరిత్రను వక్రీకరించటం, విద్వేషాన్ని పెంచటం, మతం పేరిట యువతీ యువకుల్లో ఉన్మాదం ఎక్కించటం ఈ సినిమాల అజెండా. ఈ ఎన్నికల సినిమాల పన్నాగం ఈసారి పారలేదు. అబద్ధపు పునాదుల మీద నిర్మించిన సినిమా ఆటలు అన్నిసార్లూ సాగవు. 2024 బిజెపి ఎన్నికల సినిమాలకు ఎదురైన అనుభవం ఇదే!

➡️