లూలాను ఈ రొంపిలోకి లాగుతారా? 

Mar 24,2024 03:41 #politics

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న భారీ మాదక ర్రవ్యాల అక్రమ రవాణా కేసులో పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలుగుదేశం- బిజెపి కూటమి, వైసిపిలు రెండూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలోనే దీంతో ఎలాంటి సంబంధం లేని ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరైన బ్రెజిల్‌ అద్యక్షుడు లూలా డ సిల్వా పేరును ఈ రొంపి లోపికి లాగడం పలువురిని ఆశ్చర్యపరచింది. ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుకి లూలాకు సంబంధమేమిటి? ప్రపంచంలో అతి పెద్ద దేశాల్లో ఒకటైన బ్రెజిల్‌లో సైనిక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన యోధుడు, 180 రోజులు డ్రగ్స్‌ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా ముఠాలపై యుద్ధం ప్రకటించిన అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు లూలా డ సిల్వా ప్రస్తుతం జి-20 కూటమికి నేతృత్వం వహిస్తున్నాడు. అటువంటి నేతను కించపరిచే విధంగా రాష్ట్రంలోని కొందరు రాజకీయ ప్రబుద్ధులు వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. 78 ఏళ్ల ఈ వామపక్షవాది అనేక నిర్బంధాలను ఎదుర్కొని 2022 అధ్యక్ష ఎన్నికల్లో తిరగులేని విజయం సాధించి బ్రెజిల్‌ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించినప్పుడు ప్రపంచ దేశాల నేతలు, వామపక్ష పార్టీల నేతలు, ప్రగతిశీల సంస్థలు, అభినందనలు తెలిపాయి. అందులో భాగంగా మన దేశ ప్రధాని కూడా అభినందనలు తెలిపారు. ఆ క్రమంలోనే ఇక్కడి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కొందరు ఆయనను అభినందించి ఉంటారు. దీనిని స్వాగతించడానికి బదులు కించపరిచేలా మాట్లాడడం తగని పని.
బ్రెజిల్‌ ఏదో మారుమూల ఉన్న అనామక దేశమేమీ కాదు. బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంది. లాటిన్‌ అమెరికా దేశాల వామపక్ష ప్రగతి శీల శక్తులకు స్పూర్తి నిస్తున్న బ్రెజిల్‌ను మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధ రవాణా, డెత్‌ స్క్వాడ్‌లు వంటి వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా ట్రంప్‌, బోల్సనారో జోడీ మార్చేసింది. 2003 నుంచి 2010 వరకు పదేళ్ల పాటు బ్రెజిల్‌ అధ్యక్షుడిగా పనిచేసి, మళ్లీ 2023 జనవరి 1న ఆ దేశ 39 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లూలా బ్రెజిల్‌ను డ్రగ్స్‌ మాఫియా, తుపాకుల అక్రమ రవాణా గ్యాంగ్‌లు, కిరాయి హంతక ముఠాల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాడు.సైనిక, నేవీ, వైమానిక దళాలతో కూడిన సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించారు. కొకైన్‌, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే మాఫియాలపై ఉక్కుపాదం మోపారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అన్నిట్లోను ఆపరేషన్‌ నిర్వహించారు. గత ఏడాది ఒక్క సెస్టెంబరులోనే పశ్చిమ రియో ప్రాంతంలో భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థీకృత నేరాలు ఎక్కువగా చోటుచేసుకునే బ్రెజిల్‌ పశ్చిమ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ మాఫియాలు, హంతక ముఠాల పీచమణిచేలా భారీగా సాయుధ బలగాలను పంపారు. లూలా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజున బ్రెజిల్‌ రాజధానిలో పెద్దయెత్తున హింసకు పాల్పడిన బోల్సనారో ప్రేరేపిత గ్యాంగ్‌ల్లో ఈ మాఫియాల పాత్ర కూడా ఉంది. సైనిక నియంతృత్వ ప్రభుత్వాల హయాంలో పనిచేసిన మాజీ సైనిక అధికారులు, సైనికులు ఎక్కువగా ఈ మాఫియాలను నడుపుతున్నారు.మాజీ అధ్యక్షుడు బోల్సనారో కూడా మాజీ సైనిక అధికారే. ఆయనకు, అయన కుటుంబానికి ఈ ముఠాలతో సంబంధాలున్నాయనే విషయాన్ని టైమ్స్‌ పత్రిక 2022లో ఓ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఈ ముఠా సభ్యులు బోల్సనారోను కెప్టెన్‌ అని ముద్దుగా పిలుస్తారు. వీటిని ఎదిరించినందుకు లూలాపై తప్పుడు కేసు బనాయించి జైలులో పెట్టారు.
2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. 2022లో సుప్రీం కోర్టు ఆయనపై కేసును కొట్టివేసి, శిక్షను రద్దు చేసింది. బ్రెజిల్‌లో నిరంకుశ, అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్టించేందుకు యత్నించిన నేత లూలా డసిల్వా ఎవరో ప్రపంచానికంతటికీ తెలుసు. అటువంటి వ్యక్తిని ఎవరికీ తెలియని నాయకుడని, ఆయనను అభినందిస్తూ ఇక్కడి ఎంపీ అభినందనలు తెలపడమేమిటని చౌకబారు వ్యాఖ్యలు చేయడం వల్ల లూలా ప్రతిష్ట ఏమీ తగ్గిపోదు. ఆ వ్యాఖ్యలు చేసిన నేతల నీతిమాలినతనాన్ని చూసి ప్రజలు ఏవగించుకుంటారు. ఇప్పటికైనా ఈ డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంలోకి ఆ అంతర్జాతీయ యోధుణ్ణి లాగడం మానుకుని అసలు దోషులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.

➡️