‘నిశ్శబ్దంగా’ చొచ్చుకెళ్లే కవితా చైతన్యం

Jun 10,2024 05:25 #book review, #sahitya

‘నిశ్శబ్ద ప్రవాహం’ పేరిట వచ్చిన కవయిత్రి శాంతికృష్ణ వెలువరించిన కవితా సంపుటిలో- కవితల హోరు మృదువైన శైలితో మనసుకు హత్తుకుపోయేలా సాగింది. ఈ కవయిత్రి తెలుగు సాహితీవనం వ్యవస్థాపకురాలు. గతంలో ‘చినుకు తాకిన నేల’, ‘స్వప్నధార’; ఇప్పుడు ‘నిశ్శబ్ద ప్రవాహం…’ కవితా సంపుటాలను వెలువరించారు. స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు .. వంటి మృదు భావనలు ఈ ఈమె కవిత్వానికి దినుసులు. అలాగే ఈ సంపుటిలో వివిధ సామాజిక అంశాలపైనా కలం సంధించారు.
”ముచ్చటపడి నువ్వు సైకిలడిగితే / సెలవు రోజు కూడా / అమ్మ తలపై సిమెంటు తట్ట లేచింది” అని ‘శిలగా మారిన అమ్మ’ కవితలో అమ్మ పడే కష్టం మన కళ్లకు కట్టించారు కవయిత్రి. వానలు లేక తాగునీరు సహితం కరువై అల్లాడుతున్న రాయలసీమ చిరునామాను ఎవరైనా చెప్పండి… మీ ఊరి నదికి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ‘కరుణించిన ఏ వాన మబ్బో ఆ దారంట పయనిస్తే, ఏడ నుంచొస్తాయో మాయదారి గాలులు/ మబ్బులకు మాయమాటలు చెప్పి దారి మళ్ళిస్తుంటాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు- ‘ఎవరైనా చెప్తారా’ కవితలో. శ్రామికుల గురించి ఒక కవితలో రాస్తూ, ‘ఎన్ని యుగాలు మారాలో నువ్వు జగాన రాజవ్వాలంటే’ అన్నారు. ‘మరచిన ఉత్తరం’ కవితలో అమ్మ ఆశీస్సుల ఉత్తరం, నాన్న ఆదేశాల ఉత్తరం, మిత్రుడి మురిపాల ఉత్తరం గురించి నెమరేసుకున్నారు. ”అవును ‘ఆమె’ ఒక ఆమని/ ‘ఆమె’ ఎప్పుడూ ఆమనే/ పసితనం నుండే అలవాటేమో క్షమాగుణం/ అందుకే ‘ఆమె’ ద్వేషాగ్నులు తెలియని ఓ హిమనీ నదం” అని చాలా చక్కగా ‘ఆమె’ను అభివర్ణించారు.
‘బతుకమ్మ బతుకునీయమ్మా / రక్షణ కోల్పోతున్న అతివలకు/ బతుకు నీయవమ్మా / మహిళల జీవితాలకు భరోసా నీయవమ్మా’ అంటూ ఓ కవితలో బతుకమ్మని వేడుకున్నారు. ‘ఇప్పుడో కొత్త లాకర్‌ కావాలి/ పుట్టిన మరుక్షణమే పాపాయిలను అందులో దాచుకోవాలి’ అంటూ ఇంకో కవితలో ఆవేదన చెందారు. లింగ సమానత్వం చూపని సమాజంపై ధర్మాగ్రహం ప్రదర్శించారు. ”మాయమవుతున్న మానవత్వపు ఆనవాళ్ళని రేపటితరం పుస్తకాల్లో చదువుకోవాలేమో/ ఒకప్పుడు మనుషుల్లో మానవత్వం ఉండేదని” అంటూ చాలా కలత చెందారు ‘పూలరెక్కలు’ కవితలో. కుటుంబ విలువల గురించి ఎంతో గొప్పగా వివరించారు ‘ఆలంబన” కవితలో.
”అమ్మంటే మన అమ్మే కాదు; జంతువు కూడా అమ్మే. లేశమైనా కానరాని మానవత్వాన్ని చూసి మృగాలెంత భయపడుతున్నాయో” అంటూ ఆవేదన చెందారు ‘ఓ అమ్మ’ కవితలో. ‘ఋణ బంధం’ కవితలో మహిళ గురించి … ‘పేగుబంధం కోసం ప్రాణగండం లెక్క చేయని అమ్మవు నీవు/ మహిలో అద్భుత ఆవిష్కరణవు నీవు/ మనిషి తీర్చుకోలేని ఆజన్మ ఋణబంధం నీవు” అని అద్భుతంగా చెప్పారు.
‘అక్కడి నేలలోనూ కొన్ని నీళ్ళుంటాయి, అవి రైతులు కార్చిన కన్నీళ్ళు’ అంటూ రాయలసీమ దుస్థితిని కళ్ళకు కట్టారు- ఒక చోట. పరువు హత్యలకు చలించిన ఈ కవయిత్రి ‘కన్నీటికి కరగని పెద్దరికాలు కడుతున్నాయి కులమత గోడలు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బతికింది చాలు బావిలో కప్పలా’ అంటూ గర్జించారు. ‘పక్క దేశపోడు ఎదిగెదిగి పోతుంటే, కులపోడికి ఓట్లేసి, కులపోడితో వియ్యమంది, కులపు గజ్జి కుక్కలా నువ్వు కుయ్యి కుయ్యి మంటున్నావు, బావిలో కప్పలా అక్కడే చచ్చావు’ తీవ్ర స్వరమూ వినిపించారు. ”బతకాలంటే క్షణ క్షణం మరణించడం కాదు, మరణించేంత వరకూ జీవించడమే, కష్టమైనా ప్రయత్నించాలి” అంటూ ‘నా కోసం నేను’ కవితలో.చక్కని సందేశం ఇచ్చారు. ‘రియల్టర్ల చేతిలో మైనపు బొమ్మల్లా కరిగిపోతున్న పచ్చని పొలాల సోయగాలని తిలకిస్తూ, ”ఇపుడేమైపోయాయో పంటలతో పచ్చగా అలరారే నా పల్లె ఆనవాళ్ళు’ అని తలపోస్తూ వాపోయారు. ‘మర్రిచెట్టు మనకెపుడూ బోధిస్తూనే ఉంటుంది తనలా ఉన్నతంగా ఎదగమని, మానవత్వంతో పరిమళించమని, మంచితనమనే ఔషధాన్ని అందరికి పంచమని’ – అని చెట్టు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను వల్లెవేశారు. అంటరానితనాన్ని కరోనాతో పోల్చి ఇప్పుడు ”మనకి మనమే అంటరాని వాళ్ళ మయ్యాము, ఈ లోకంలో ఒంటరి వాళ్ళ మయ్యాము” అని అంటరానితనం గుండెలకెంతటి రంపపుకోతో వివరించారు. ‘సహనపు సంకెళ్ళు’ కవితలో ఈ కవయిత్రి స్వరం రౌద్రంగా మారింది. ”ఓ శ్వేత కుసుమమా/ అణచివేతకు కాలం చెల్లిందని తెలుసుకో” అని అమెరికాను గద్దించారు. ‘నీ అహంకారం సమాధి చేస్తాం’ అని హెచ్చరించారు. ‘విప్లవం ఎప్పుడూ అచేతనం కాదు’ అని ఉరిమి చెప్పారు. చిన్న చిన్న పదాలతో పదునైన, హృద్యమైన భావాలతో ఈ కవితా సంపుటి పరిమళించింది. రూ.100 వెల ఉన్న ఈ కవితా సంపుటి కోసం కవయిత్రిని 95022 36670 నెంబర్లో సంప్రదించొచ్చు.

– అరుణ నాయుడు తోట
63019 30055

➡️