ఒత్తిడిని జయించు.. విజయం సాధించు

Mar 13,2024 07:32 #examinations, #jeevana, #students
  • పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురౌతుంటారు. ప్రశాంతంగా ఉండాలి. తద్వారానే మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు చదివిన అంశాలే కాబట్టి ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలను చదువుకుంటూ వెళ్లటం ఉత్తమం. తద్వారా గతంలో చదివిన విషయాలను మళ్లీ ఒకసారి గమనంలోకి తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే మంచి మార్కులతో విజయం సాధించటం సులభమే అవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాదిలో కష్టపడి చదివింది ఎలాంటి తప్పిదాలకు తావీయకుండా 3.15 గంటల సమయంలో (పిఎస్‌, ఎన్‌ఎస్‌ పరీక్షలు 2 గంటలు మాత్రమే) పరీక్షల్లో సమర్థవంతంగా రాయగలిగినప్పుడే చక్కని ఫలితం చేజిక్కుతుంది. పరీక్షలు రాసేటప్పుడు దొర్లే చిన్నా చితకా పొరపాట్లు ఫలితాల్లో విద్యార్థుల అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. ఒక మార్కు తగ్గినా పరీక్ష తప్పొచ్చు. వస్తాయన్న మార్కులు సాధించలేకపోవచ్చు. ఇలాంటి తప్పిదాల కారణంగా ప్రతిభావంతులు సైతం ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశం కోల్పోతుంటారు. మరికొన్ని రోజులు మాత్రమే పరీక్షలకు సమయం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. సాధారణ పరీక్షల్లో జరిగే తప్పుల వల్ల నష్టం ఏమీ లేకుండా ఉండొచ్చు. కానీ, పబ్లిక్‌ పరీక్షల్లో అవే పొరపాట్లు పునరావృతమైతే జరిగే నష్టం అపారం. ఈ నేపథ్యంలో పరీక్షల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు చేసే సాధారణ తప్పిదాలు ఏమిటో తెలుసుకుందాం.

ఒత్తిడికి దూరంగా ఉండాలి
—> ఆశించిన రీతిలో అధిక మార్కులు సాధించాలంటే, పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదు. చదివినదంతా తక్కువ సమయంలో రివిజన్‌ చేసుకోవాలి.
—> గ్రాఫులు, పటాలు, బొమ్మలను పెన్సిలుతోనే గీయాలి.
—> స్కెచ్‌ పెన్నులు వాడకూడదు.
—> ఒఎంఆర్‌ షీట్‌పై బార్‌కోడ్‌ ఉంటుంది కాబట్టి ఎలాంటి అనవసరమైన రాతలు రాయకుండా, నలపకుండా, చెమట చుక్కలు పడకుండా జాగ్రత్త వహించాలి.
—> పరీక్షా సమయంలో సెల్‌ఫోన్‌, టివి, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి.
—> నిర్ధేశించుకున్న సమయం ప్రకారం సిలబస్‌ రివిజన్‌ పూర్తిచేయాలి.
ప్రతిరోజూ సమయానికి నిద్రపోవాలి, ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.

జవాబులు ఇలా రాయాలి
ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నాపత్రాన్ని చదవడానికే పావుగంట సమయం ఇచ్చారు. సుమారు 75 శాతం మంది ప్రశ్నా పత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబులు రాయటం మొదలెడుతున్నారు. ఇది సరికాదు. ముందుగా ప్రశ్నలను బాగా చదివాకే సమాధానాలు రాయటం ప్రారంభించాలి. సమాధాన పత్రాలతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వగానే ముందుగా ప్రతి పేజీకి ఎడమవైపు 2-2.5సెంటీమీటర్లు ఉండేలా మార్జిన్‌ వదలాలి.

తెలుగు, హిందీని తేలికగా తీసేయొద్దు
తెలుగు, హిందీ, ఆంగ్లంలో వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. తెలుగు మన మాతృభాషే కదాని తేలికగా తీసుకోకూడదు. మంచి మార్కులు సాధించడం కోసం పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను పున:శ్శరణ చేయాలి. ప్రతిపదార్ధం , వ్యాకరణాంశాలు రివిజన్‌ చేయాలి.

ఇంగ్లీషులోనూ మంచి మార్కులు సాధించొచ్చు
గ్రామీణ విద్యార్ధులు కూడా మంచి మార్కులు ఇంగ్లీషు సబ్జెక్టులో సాధించొచ్చు. సెక్షన్‌ ఎ లో రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ స్టడీస్కిల్స్‌, సెక్షన్‌ బిలో గ్రామర్‌, ఒకాబలరీలలో మంచి మార్కులు సాధించొచ్చు. సెక్షన్‌ సిలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్‌ స్వంతంగా రాయడం ద్వారా మంచి మార్కులు సాధించొచ్చు.

.
నాలుగు సబ్జెక్టుల్లో బొమ్మలూ కీలకమే
గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల్లో సమాధానాలు రాసేటప్పుడు మొదట 2 మార్కులవి, తర్వాత ఒక మార్కువి రాయాలి. చివరగా 4 మార్కుల సమాధానాలు రాస్తే మంచిది. భౌతికశాస్త్రంలోని సమస్యల (ప్రాబ్లెమ్స్‌)లో ప్రమాణాలను రాయడం మరిచిపోరాదు. ఉదాహరణకు సెంటీ మీటరు, గ్రాము, జౌలు, వాట్స్‌ తదితరాలు. జీవశాస్త్రంలో ప్రయోగాలకు చెందిన జవాబులను రాసేటప్పుడు సంబంధిత బొమ్మలను కూడా తప్పక వేయాలి.
గణితంలో ముఖ్యమైన నిర్వచనాలు , సూత్రాలు రివిజన్‌ చేయాలి. టెక్ట్స్‌బుక్‌ చాప్టర్‌ చివరలో ఉండే సమస్యలను మరొక్కసారి రివిజన్‌ చేసుకోవాలి. గ్రాఫ్‌ వంటి ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. త్రికోణమితి, బహుపదులు, వాస్తవ సంఖ్యలు, సాంఖ్యాక శాస్త్రం సమితులు వంటి చాప్టర్లు మరింతగా రివిజన్‌ చేయడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు.
సాంఘిక శాస్త్రంలోని మ్యాప్‌ పాయింట్‌కు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. పైచార్టు, మ్యాప్‌ రీడింగ్‌ ప్రశ్నలను తప్పనినరిగా రాయాలి. సమకాలీన అంశాలలో మూస ధోరణులకు ప్రాధాన్యం తగ్గించి, సొంత అవగాహనతో నిత్య జీవిత ఉదాహరణలు అన్వయిస్తూ రాయాలి. ఒక మార్కు ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. కాలపట్టికను జాగ్రత్తగా అర్థంచేసుకొని జవాబులు రాస్తే మంచి మార్కులు పొందొచ్చు. ఎక్కువ మంది ఇక్కడే తప్పులు చేస్తుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. పేపరు దిద్దేవారు మార్కులు వేయటానికి ఇది అవసరం. లేకపోతే ఒక్కోసారి జవాబుకు వేసిన మార్కులు కనిపించక లెక్కవేయడం మరిచిపోతుంటారు. ప్రశ్నాపత్రంలో బాగా వచ్చిన ఏ ప్రశ్నకైనా ముందుగా జవాబు రాయొచ్చు. ఆ ప్రశ్న నంబరును ఎడమవైపు మార్జిన్‌లో తప్పక వేయాలి. ప్రశ్నల నంబర్లు తప్పుగా వేయడం, మరిచిపోవడం చేసేవారు 1 శాతం వరకూ ఉంటారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
@ ఎర్ర సిరా ఉండే (బాల్‌)పెన్ను వాడకూడదు.
@ నీలం బ్లూ, నలుపు సిరా ఉండే వాటినే ఉపయోగించాలి.
@ పెద్ద అక్షరాలతో, మరీ ఎక్కువ మార్జిన్‌ వదిలి భారీగా పేజీలు నింపడం వల్ల ప్రయోజనం శూన్యం.
@ దిద్దేటప్పుడు ఉపాధ్యాయులు అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది.
@ ప్రతి పుటకు 20-25 వాక్యాలు రాస్తే మేలు.
@ జవాబులను వ్యాసంలా కాక బుల్లెట్‌ పాయింట్ల రూపంలో రాయాలి. దానివల్ల మూల్యాంకనం చేసే వారికి సులభంగా అర్ధమవుతుంది.
@ ఇలా రాసేవారు 50 శాతానికి మించడం లేదు.
@ రాయాల్సినవన్నీ పూర్తయ్యాకే ఐచ్ఛిక (ఛాయిస్‌) ప్రశ్నలు రాయడానికి ప్రయత్నించాలి. లేకుంటే సమయం సరిపోక ఇబ్బంది తలెత్తే అవకాశముంది.
@ పేజీ చివర కొంత ప్రదేశం మిగిలిందని ఇంకో జవాబు రాయటం, పదాన్ని విడకొట్టి రాయటం చేస్తున్నారు. ఇలా చేయకూడదు
@ బిట్‌ పేపర్‌లో కొట్టివేతలు, దిద్దివేతలు ఉండరాదు.
@ బ్రాకెట్‌లో ఒకటి రాసి, మళ్లీ కొట్టివేసి బయట రాస్తున్నారు. ఇలా చేయటం సరికాదు.
@ సాధ్యమైనంతవరకు 10-15 నిమిషాలు ముందే పరీక్ష రాయటం పూర్తి చేయాలి.
@ రాసిన జవాబులు, ప్రశ్నల నంబర్లను మరోసారి పరిశీలించుకోవాలి.
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి. విజయాన్ని సాధించండి.

 


– ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
సెల్‌ : 94907 62412

➡️