వెనుకబడిన విద్యార్థుల కోసం …

Jun 16,2024 04:05 #Jeevana Stories

పరీక్షలు విద్యార్థుల ప్రతిభా పాటవాలకు కొలమానాలు అని చాలిమంది భావిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి చుట్టూ ప్రశంసలు, పొగడ్తలు ఉన్నట్లే ఉత్తీర్ణత కాని వారి చుట్టూ అవమానాలు, భయాలూ చుట్టుముడతాయి. ఆ అవమానాలతో చాలామంది విద్యార్థులు అసలు చదువు జోలికే వెళ్లరు. అంతటితో స్వస్తి చెప్పి ఏ పనో చూసుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన మరిముత్తు మాత్రం అందరిలా అలా ఊరుకోలేదు. తనలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని కంకణం కట్టుకున్నారు. ఆ ప్రయాణంలో అతను చేసిన కృషికి గాను ఇప్పుడు అతను ఉంటున్న జిల్లాలో పరీక్షల ఉత్తీర్ణత శాతం వృద్ధి చెందుతోంది.

తమిళనాడు అరియలూర్‌ జిల్లాకి చెందని మరిముత్తు విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆటపాటలతోనే కాలం గడిపేవాడు. టీవీ చూడడం, స్నేహితులతో గడపడం అతని దినచర్య. ఈ పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అతని స్నేహితులు మాత్రం పైతరగతులకు వెళ్లారు. మరిముత్తు ఒక్కడే ఒంటరి వాడైపోయాడు. 16 ఏళ్ల మరిముత్తుకి ఈ పరిస్థితి చాలా బాధ కలిగించింది. రెండోసారి పరీక్షకు సిద్ధమై విజయం సాధించాడు. ఆ తరువాత ప్రైవేటుగా ఉన్నత చదువు చదివి, కంప్యూటర్‌ సెంటర్‌ పెట్టుకుని జీవితంలో స్థిరపడ్డాడు. అయితే ఆ 16 ఏళ్ల యువ మురిముత్తు మానసిక స్థితి ఇప్పటి వరకు అంటే, 53 ఏళ్ల మరిముత్తుని కూడా ఒకపట్టాన వదిలి పెట్టడం లేదు. ఏదో బాధ, వెలితి ఎన్నో ఏళ్లు అతన్ని వెంటాడింది. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోవడం అనే బాధ అతన్ని ఎంతలా ప్రభావితం చేసిందంటే, అతనితో పాటు చదివిన స్నేహితులందరినీ కూడదీసి 1998 నుంచి ‘సిటీ గ్రూప్స్‌’ అనే సంస్థను నడిపేంత వరకు.
చదువులో వెనకబడిన విద్యార్థులకు మొదట చదువుపై ఆసక్తి కలిగించడం, ఆ తర్వాత పరీక్షలకు సిద్ధం చేయడాన్ని ‘సిటీ గ్రూప్స్‌’ సంస్థ విధిగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు వెళ్లి చదువులో వెనుకబడిన విద్యార్థులను వెతికి మరీ నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ‘సిటీ గ్రూప్స్‌’ నడుస్తోంది.
ఆసక్తి ఇలా పెంచుతున్నారు..
చదువులో వెనుకబడిన విద్యార్థులకు క్విజ్‌ పోటీలుపెట్టి వాళ్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీస్తున్నారు. ఆ తరువాత ప్రత్యేకంగా తయారుచేసిన స్టడీ మెటీరియల్స్‌ను పంచి పెడుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ‘సిటీ గ్రూప్స్‌’ సభ్యులు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారు. పబ్లిక్‌ పరీక్షల భయం పోగొట్టేందుకు సంస్థ సభ్యులే ప్రత్యేకంగా మాక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. క్రమం తప్పకుండా అంటే 1999 నుంచి 2005 వరకు ఈ సంస్థ చేసిన సేవకు గాను ప్రభుత్వం నుంచి విశేష స్పందన వచ్చింది. 2006 నుంచి ప్రభుత్వమే స్వయంగా మాక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 500 నుంచి 1000 మంది విద్యార్థులను సెలక్ట్‌ చేసి స్టడీ మెటీరియల్‌ని ‘సిటీ గ్రూప్స్‌’ సభ్యులు అందిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే సరళ భాషలో వాటిని రూపొందించారు. ఈ కృషి వెనుక తానొక్కడినే లేనని, ఎంతోమంది దాతల సహాయం ఉందని మరిముత్తు ఎప్పుడూ చెబుతారు.
‘సబ్జెక్ట్సుపై సరైన అవగాహన లేకపోవడం వల్లే నేను పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయాను. పాఠశాలలో విద్యలో ముందుండేవారు, వెనకుండేవారు ఎప్పుడూ ఉంటారు. ఒకేలా చదవలేరు. రాయలేరు. కానీ చదివే పుస్తకాలు ఒకటే. దీంతో ప్రతిభ గల విద్యార్థులు అర్థం చేసుకున్నంత సులభంగా, నైపుణ్యం లేని వారు అర్థం చేసుకోలేరు. ఆ పరిస్థితి నేను అనుభవించిందే. అందుకే నాలాంటి విద్యార్థుల కోసం నేనే ముందుకు వచ్చాను. వారికి అర్థమయ్యే భాషలో స్టడీ మెటీరియల్స్‌ రూపొందిస్తున్నాను. వివిధ స్కూళ్లకు వెళ్లి పంచిపెడుతున్నాను. ఏళ్ల తరబడి నేను చేసిన కృషికి గాను ఇప్పుడు ఫలితం వస్తోంది. అరియార్‌ జిల్లా వంద శాతం ఉత్తీర్ణత వైపు పరుగులు తీస్తోంది. ఈ విజయంతో నేను ఆ రోజు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయినప్పుడు పడ్డ బాధంతా మర్చిపోతున్నాను. ఇంతటితో నా లక్ష్యం పూర్తవ్వలేదు. మరిన్ని జిల్లాలకు ‘సిటీ గ్రూప్స్‌’ సేవలు విస్తరిస్తాను’ అంటూ మరిముత్తు ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక, నిరాశ, నిస్పృహలతో మునిగిపోయిన ఒక డ్రాపౌట్‌ విద్యార్థి తీసుకున్న ఓ నిర్ణయం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చదువుపై ఆసక్తి పెంచుతోంది. బతుకుపై ఆశలు చిగురింపజేస్తోంది.

➡️