కోడళ్ల గౌరవం కోసం …

May 25,2024 05:45 #feachers, #jeevana

ఆమె ఆ ఇంటి ఇల్లాలు. భర్త, పిల్లల బాధ్యతల్లో రోజంతా తలమునకలై ఉంటుంది. అత్తమామల సపర్యలతో వారి ప్రేమానురాగాలు పొందాలనుకుని తహతహలాడుతుంది. అయినా అదేంటో ఆమె వంక కన్నెత్తి కూడా చూడరు ఆ ఇంటి వారు. కొడుకు పెళ్లామైనా, ఆమె వారికి పరాయిదే. మనుమలు, మనుమరాళ్లను కని, ఆ ఇంటి తరాలను మార్చే వారథి అయినా ఆమె ఒంటరిదే.. ఈ పరిస్థితి ఆమె ఒక్కత్తెదే కాదు. ఆ ప్రాంతంలో అనేకమంది మహిళలది. లింగనిష్పత్తిలో గణనీయమైన క్షీణదల వల్ల అక్కడ మహిళల సంఖ్య నశించిపోయి, వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఉంది. హర్యానాలోని కొన్ని గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా ఈ పరిస్థితికి అద్దంగా నిలుస్తున్నాయి. దీంతో అక్కడి పురుషులు, ఇతర రాష్ట్రాల నుంచి వధువులను కొనుగోలు చేస్తున్నారు. వివాహబంధంతో తీసుకొచ్చినా కోడలు స్థానం ఇవ్వని పరిస్థితి ఆ గ్రామాల్లో కనిపిస్తుంది. కనీస పౌరురాలిగా కూడా ఆమెని చూడరు. నిత్యం దొంగలా, దోపిడీదారురాలిగా చూస్తున్న ఇంటివాళ్లతో ఆమెకు అడుగడుగునా అవమానాలే!

ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నిస్తోంది ఊర్మిళ.
ఆమె ఓ బాధితురాలు. కొన్నేళ్లుగా కోడళ్ల గౌరవం కోసం పోరాడుతోంది. తాజాగా హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభకు ఎదురుగా నిల్చొని నినాదాలు చేసింది. వారించిన సిబ్బంది నుండి విడిపించుకుని మరీ అక్కడే ఓ గుడారంలో తన 8 ఏళ్ల కూతురుతో విషణ్ణ వదనంతో తన గోడు వినిపించింది.
‘మమ్మల్ని అవమానించడానికే ఇక్కడికే తీసుకువచ్చారా? మాకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు? పెళ్లి చేసుకునే కదా తీసుకువచ్చింది. మరి ఎందుకు మర్యాద ఇవ్వరు?’ అని ఆమె అడుగుతున్న ప్రశ్నలు అక్కడి గ్రామాల్లోని ఎంతోమంది మహిళలవి. అయినా ఆ ప్రశ్నలు అడిగే ధైర్యం వారికి లేదు. అసలు ఆ ఆలోచనలు వచ్చినా గ్రామంలో వారి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అందుకే వారందరి ప్రతినిధిగా తనొక్కతే గళమెత్తింది.
ఆడపిల్లల కొరత వల్లే హర్యానా గ్రామీణ పురుషులు బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి అమ్మాయిలకు ధర చెల్లించి మరీ కొనుక్కుంటారు. వీరిలో ఎక్కువ మంది బాల్యంలో వచ్చినవారే. ఆర్థిక పరిస్థితులు బాగోలేక పుట్టింటి కంటే అత్తింటిలో మెరుగైన జీవనం సాగించవచ్చని ఎన్నో కలలు కంటారు. కానీ, ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. అందుకే ‘వధువుల కొనుగోళ్ల ప్రక్రియను ఇకనైనా ఆపాలని, అప్పుడే తమకు గౌరవం దక్కుతుంద’ని ఊర్మిళ పోరాడుతోంది.
భర్తతో కలిసి ఊర్మిళ, హర్యానాలోని కర్సోలా గ్రామానికి 13 ఏళ్ల క్రితం చేరుకుంది. అప్పటికి ఆమెకు పెళ్లయి రెండేళ్లు. బీహార్‌ ఆమె స్వస్థలం. అత్తింటికి వచ్చిన రోజు ముఖం మీదే తలుపులు వేశారు. అక్కడికి దూరంగా ఓ ఇంట్లో ఆమెను ఉంచి భర్త రోజూ తన అమ్మానాన్న ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఆ ఇంట్లోకి రావడానికి ఊర్మిళకి అనుమతి లేదని తరచూ చెప్పేవాడు. ఇతర రాష్ట్రం నుండి వచ్చిన తనలాంటి కోడళ్ళందరిదీ ఇదే పరిస్థితని ఆమెకి నిదానంగా అర్థమైంది.
కూతురు పుట్టిన రెండేళ్లకే భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఆమె పరిస్థితి మరింత దిగజారింది. భర్త చనిపోయి అత్తింటికి వచ్చిన ఊర్మిళకి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ‘ఆస్తిలో భాగం అడుగుతానని అత్తింటి వాళ్లు నాపై నిందలు మోపారు. ఇంట్లో ఏ వస్తువూ ముట్టుకోకూడదు. తనంతట తానుగా నీళ్లు తాగకూడదు. అన్నం తినకూడదు. వాళ్లు పెట్టినప్పుడే తినాలి. తాగాలి’ అనే షరతులు పెట్టారు. పెద్ద మనుషుల్లో పెట్టి న్యాయం చెయ్యమని అడిగితే మూడు అడుగుల వెడల్పులో ఉండే ఓ చిన్న గదిని నా కోసం కేటాయించారు. అక్కడే తినాలి, పడుకోవాలి, వండుకోవాలి. బయటికి రాకూడదు. జైలు లాంటి నిర్బంధం అనుభవిస్తున్నాను. ‘ఈ స్థితిలో మార్పు రావాలంటే, నాలాంటి వాళ్లందరికీ గౌరవం దక్కాలంటే ధైర్యం చేసి ప్రశ్నించాలి’ అనుకున్నాను. ఆ ప్రయత్నం నాతోనే మొదలవ్వాలని మొదటి అడుగు వేశాను’ అంటున్నప్పుడు ఆమె మాటల్లో నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ప్రస్తుతం ఆమె ఆ ప్రాంతంలో ‘మోల్‌ కి బహు’ పేరుతో పిలవబడుతోంది. ‘కోడలి గౌరవం కోసం’ అని తెలుగులో దానర్థం.
‘నన్ను ఎప్పుడూ మా అత్తామామ, పేరు పెట్టి పిలవలేదు. ‘బీహారియన్‌’ అని పిలిచేవారు. మా ఇంటికి నాలుగిళ్లు అవతల, గుడీ నివసిస్తోంది. ఆమె కూడా నాలాగే ఇక్కడికి వచ్చింది. రోజూ రాత్రుళ్లు భర్త తెగ కొట్టేవాడు. బాగా తాగేవాడు. ‘ఇద్దరు బిడ్డలు పుట్టినా నేను ఆ ఇంటికి, అతనికి పరాయిదానిగానే బతికాను. ‘బాహర్‌కి బహూ’ అని పిలిచేవారు’ అని తన గోడు వినిపించింది గుడీ.
ఇలాంటి వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తోంది ఊర్మిళ. కూరగాయల కోసం మార్కెటికి వెళ్లినప్పుడో, పని మీద బయటికి వచ్చినప్పుడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోడళ్లను గుర్తించి వాళ్ల ఫోను నెంబర్లు తీసుకుంటుంది. ‘ముఖం కనపడకుండా దుపట్టా వేసుకుని, హర్యానా సాంప్రదాయాన్ని పాటిస్తున్నా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళల ముఖాలను చూడగానే నేను పసి గట్టేస్తాను. నా గురించి పరిచయం చేసుకోగానే వాళ్లు పడుతున్న బాధలు ఏకరవు పెడతారు. న్యాయం చేయమని ప్రాధేయపడతారు. అలా ఇప్పటి వరకు కొన్ని వందల మందిమి ఓ బృందంలా తయారయ్యాం. మా పోరాటం, న్యాయంగా మాకు రావాల్సిన హక్కుల కోసం కాదు.. మమ్మల్ని గుర్తించమని, గౌరవించమని..’ అని అంటోంది ఊర్మిళ.
2023లో వెలుగు చూసిన ఓ నివేదిక ప్రకారం హర్యానాలోని మొత్తం 22 జిల్లాల్లో 9 జిల్లాల్లో (రోహతక్‌, సిర్సా, ఫతేబాద్‌, సోనిపట్‌, యమున నగర్‌, జింద్‌, ఛర్ఖి దాద్రి) లింగ నిష్ఫత్తి దారుణంగా పడిపోయింది. మహిళల కొరత కారణంగా పురుషులు తమ డిమాండ్ల కోసం చాన్నాళ్ల క్రితమే ‘రాండా యూనియన్లు’ ఏర్పర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆ యూనియన్‌ ఓ నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. ‘బహు దిలావో, ఓటు పావో’ (వధువును తీసుకురండి, ఓటు వేయండి). దీంతో అక్కడి పురుషులు హిందీ ప్రభావ రాష్ట్రాల్లో వధువుల కోసం జల్లెడ పట్టారు. పేద కుటుంబాలే లక్ష్యంగా వధువులను కొనుగోళ్లు చేయడం మొదలుపెట్టారు. అసలే ఆడపిల్లల పట్ల వివక్ష నిండిన సమాజంలో పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన కోడళ్లను, సొంతవారిగా ఆ ఇళ్లే కాదు, ఆ సమాజం కూడా అంగీకరించడం లేదు.
ఊర్మిళ పోరాటం వారందరి కోసమే. తనలాంటి వేలాదిమందికి గౌరవం దక్కాలని తను రోడ్డెక్కింది. గొంతు చించుకుని అరుస్తోంది. ఆ అరుపులు అసెంబ్లీ దాకా వినిపిస్తున్నాయి. సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.

➡️