భావి ఐఎఎస్‌ల కోసం ఫౌండేషన్‌

దేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సర్వీస్‌ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఎఎస్‌). దీన్ని భారత పరిపాలన వ్యవస్థకు ఉక్కు కవచంగా చెబుతారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించటంలో సివిల్‌ సర్వెంట్ల పాత్ర ఎంతో కీలకం. అందుకనే ఐఎఎస్‌ కావాలని లక్షల మంది యువతీయువకులు కలలు కంటారు. ఆ కలల్ని నిజం చేసుకునే దిశగా ఏటేటా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాస్తారు. అయితే, అందులో ఉత్తీర్ణత సాధించటం సులభమైంది మాత్రం కాదు. ప్రణాళికా బద్ధమైన కృషి, సాధించాలనే తపన, కఠోర దీక్షతో సాధన చేస్తేనే ఆ లక్ష్యం సాధించొచ్చునని చెబుతున్నారు శాసనమండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు. ఆ దిశగా ఆయన వేలాదిమంది యువతను సివిల్‌ సర్వీసెస్‌, ఎపిపిఎస్‌సి నిర్వహించే వివిధ గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 పరీక్షల వరకూ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వివిధ శిక్షణా కేంద్రాలకు, అవగాహనా శిబిరాలకు వెళ్లి తర్ఫీదునిస్తున్నారు. అలా తర్ఫీదు పొందిన ఎందరో నేడు ఆర్‌డిఒలు, సబ్‌ కలెక్టర్లు, ఎంపిడిఒలు, ఎంఆర్‌ఒలుగా పనిచేస్తున్నారు. మరికొందరు జాతీయ, రాష్ట్రస్థాయి పదవుల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఐఎఎస్‌ అధికారి కావాలంటే ప్రాథమిక స్థాయిలో పౌండేషన్‌ తప్పనిసరని లక్ష్మణరావు చెబుతున్నారు. అందులో భాగంగా గుంటూరులో సన్‌, కెవిఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టుల ఆధ్వర్యంలో ఐఎఎస్‌ ఫౌండేషన్‌ కోర్సును గత పదేళ్లుగా నిర్వహిస్తున్నారు.


సివిల్‌ సర్వీసెస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువ మంది ఎంపికవుతుంటారు. చాలామంది అటువైపు దృష్టి సారించకపోవడం అందుకు ఒక కారణం. ఎక్కువమంది తెలుగు విద్యార్థులను సివిల్‌ సర్వీసెస్‌ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషిని పైన పేర్కొన్న సంస్థలు చేస్తున్నాయి. గుంటూరులోని స్టూడెంట్స్‌ యూనియన్‌ ఫర్‌ నేషన్‌ (సన్‌)ను యశ్వంత్‌, పవన్‌, మల్లికార్జునరావు ఏర్పాటు చేశారు. దాని ద్వారా విద్యార్థులకు కెరీర్‌గైడెన్స్‌, గ్రూప్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో కాకర్ల సాయికుమార్‌, ఆశిష్‌, సుజిత్‌, దేవా భాగస్వాములై ముందుకు నడిపిస్తున్నారు. సన్‌, కేవీఆర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ వాటి సంయుక్త ఆధ్వర్యంలో 2014 నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా పది రోజులపాటు ఐఎఎస్‌ పౌండేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. గుంటూరు బ్రాడీపేట యుటిఎఫ్‌ కార్యాలయంలో ఈ ఉచిత తరగతులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ తరగతులకు ఉత్సాహంగా హాజరవుతున్నారు. 2023లో మంగళగిరిలో కూడా ఈ పౌండేషన్‌ తరగతులు నిర్వహించారు. సన్‌ సంస్థ సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరిలలో కూడా పోటీ పరీక్షలకు శిక్షణ, అవగాహనా తరగతులు నిర్వహిస్తోంది.

ఏమేమి బోధిస్తున్నారంటే…
ఈ తరగతులు ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. 30వ తేదీ వరకూ కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ తరగతులు జరుగుతున్నాయి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షతోపాటు గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షకు కావాల్సిన అర్హలతోపాటు ఎలా సిద్ధం కావాలో నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక అంశాలు, ప్రపంచ పరిణామాలు, చారిత్రక, ఆర్థిక, రాజకీయ అంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్య, వైజ్ఞానిక అంశాలు, గణితం బోధించటంతో పాటు వర్తమాన అంశాలపై పట్టు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ఏ అంశంపైనా కూలం కుషంగా తెలుసుకోవటం, లోతుగా పరిశీలించటం, తెలియని విషయాల గురించి అన్వేషించటం, రాజ్యాంగం, హక్కులు, బాధ్యతలు మొదలైన విషయాల గురించి తెలుసుకునే పద్ధతులపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.

ఎక్కువ మందిని ప్రోత్సహించటమే లక్ష్యం : – కెఎస్‌ లక్ష్మణరావు విద్యావేత్త, కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ

ఈ తరగతుల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఎలా ఉంటాయో తెలియ జేస్తున్నాం. ఏ పరీక్ష అయినా రాసే వరకూ అభ్యర్థుల్లో ఆందోళన సహజం. ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్‌ అయితే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో కూడా విజయాన్ని సాధించొచ్చు. చేపట్టిన వృత్తి, వికాసానికే కాదు; సామాజిక శ్రేయస్సుకూ ఉపయోగపడేదిగా ఉండాలన్న తపన, శ్రమించే తత్వం ఉన్న వారు ఈ సర్వీసెస్‌ను అందుకోవచ్చు. ముందుగా సిలబస్‌పై సంపూర్ణ అవగాహన అవసరం. ప్రాథమిక స్థాయి నుంచి కృషి ప్రారంభమైతే డిగ్రీ తర్వాత ఈ పరీక్షల్లో నెగ్గే వీలుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సివిల్‌ సర్వీసెస్‌కు తక్కువమంది ఎంపికవుతున్నారు. కెరీర్‌ ఆప్షన్‌ చాలా పరిమితంగా ఉండటమే కారణంగా నేను భావిస్తున్నా. అందుకనే పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 2014 నుంచి ఈ పౌండేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. సిలబస్‌ విశ్లేషణతోపాటు నిత్యం వార్తా పత్రికలు, ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను క్షుణ్ణంగా చదివే అలవాటు చేస్తున్నాం.

విశేషమైన ఆదరణ : కాకర్ల సాయికుమార్‌, కోఆర్డినేటర్‌, సన్‌


నేను 2014లో ఐఎఎస్‌ పౌండేషన్‌ తరగతులకు హాజరయ్యాను. ఆ తర్వాత ఇక్కడి తరగతుల స్ఫూర్తితో వాలంటీర్‌గా చేరాను. అప్పటి నుంచి ‘సన్‌’ ద్వారా తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. గతేడాది మంగళగిరిలో ఏర్పాటు చేసిన తరగతుల్లో అశ్విన్‌ బోధించారు. ఈ ఏడాది ఆయన ఐపిఎస్‌కి ఎంపికయ్యారు.

పౌండేషన్‌తోనే… పోస్టింగ్‌ వరకూ : కొండా యుగకీర్తి, ఎంపిడిఒ, ప్రకాశం జిల్లా.


ఈ పౌండేషన్‌ తరగతులు సామాన్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నేను ఈ తరగతులకు హాజరై ప్రిపేర్‌ అయ్యాను. బిటెక్‌ పూర్తయ్యాక 2018 గ్రూప్‌-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపిడిఒగా ఎంపికయ్యాను.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️