హరిలో రంగ హరి…

Jan 14,2024 09:28 #Jeevana Stories

తెల్లవారుజామున మంచుకురిసే వేళల్లో చీకట్లు తొలగక ముందే ‘హరిలో రంగ హరి.. తెల్లవారుతోంది లేవండి మరి’ అన్నట్లుగా సంకీర్తనలు పాడుకుంటూ అందరినీ మేలుకొల్పేది హరిదాసులే. సంక్రాంతి రోజుల్లో ప్రతి లోగిళ్లనూ వీరి పలకరింపులతో పండుగకు సరికొత్త శోభతోపాటుగా అందాన్ని తీసుకొస్తాయి. సంప్రదాయ వస్త్రధారణతో వినసొంపైన కీర్తనలు పాడుకుంటూ ప్రతి లోగిళ్లనూ పలుకరిస్తుంటారు. పండగ వాతావరణం వారి రాక నుంచే మొదలవుతుంది.

             ఒకప్పుడు వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్టుమెంట్‌ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకి దిగటానికి బద్ధకిస్తున్నారు. ప్రపంచీకరణ ప్రభావం, వ్యవసాయ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలతో ఏటేటా పంటల దిగుబడులు తగ్గుతుండటం, మార్కెట్లో ధరల మాయాజాలంతో రైతులు, కౌలురైతుల ఇంట ఇంట సంతోషం తక్కువగా ఉంటోంది. నిరుద్యోగం, వలసలు, వృత్తి, ఉద్యోగాలకు ఇతర ప్రాంతాలకు వెళ్తుండటంతో హరిదాసులకు కూడా ఆదరణ తగ్గుతోంది. సరైన ఆదరణ లేకపోవటంతో వారు కూడా ప్రత్యామ్నాయ వృత్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆదరణ లేకపోయినా, ఆదాయం రాకపోయినా తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కాపాడుకోవటానికి ఇతర వృత్తుల్లో ఉంటున్నా కేవలం పండుగ నెలరోజుల్లో భావితరాల వారు ఈ వృత్తిని నేడు కొనసాగిస్తున్న వారూ ఉంటున్నారు. ఆదరణ లేకపోయినా పాత సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు కొందరు హరిదాసులు. వారిని పకలరిద్దాం.

సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం

మా ప్రాంతంలో తెలగాదాస్‌లు కార్తీక మాసం నుంచి శ్రీరామనవమి వరకూ 90 రోజులపాటు దీక్ష చేపడతాం. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాలాంటి వారు 130 మంది వరకూ ఉన్నారు. ఎంచుకున్న ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఈకాలంలో కీర్తనలు పాడుతూ అక్షయపాత్ర ద్వారా దానాలు స్వీకరిస్తాం. నేను అచ్యుతాపురంలో డీజిల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాను. పాత తరం సంప్రదాయాలను పక్కన బెట్టడం ఇష్టం లేక ప్రతి ఏడాది తప్పకుండా హరిదాసులుగా మారుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామంలో నేను కొనసాగిస్తున్నాను.   – మాడా రామకృష్ణ, ధర్మవరం అగ్రహారం, విశాఖ జిల్లా.

దశాబ్దాలుగా ఇదే వృత్తిలో…

మాది కూడా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్య పేట మండలం బండిపాలెం. విజయవాడలోని కృష్ణలంకలో అద్దెకు ఉంటున్నా. వెంకటనరసయ్య, మోకా నరసింహారావు, నాగార్జున, రామలక్ష్మి, బ్రహ్మస్వామి వంటి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. పటమటలో ముగ్గురు తిరుగుతున్నారు. నంది గామలో ఒక్కరు.. ఇలా ఎవరికి వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే తిరుగుతుంటారు. కొంతమంది పాత్రల్లో వేస్తున్నారు. మరికొందరు వేయటం లేదు. సంక్రాంతి రోజుల్లో ప్రతి ఏటా సంకీర్తనలు పాడుతూ తిరుగుతాం. మిగతా రోజుల్లో వ్యవసాయ పనుల్లోనే ఉంటాం. – మేకా పూర్ణచంద్రరావు, బండిపాలెం, జగ్గయ్యపేట మండలం.

– యడవల్లి శ్రీనివాసరావు

వ్యవసాయ పనులకు వెళ్తాం

మా గ్రామంలో ఆరు కుటుంబాల వరకూ ఉన్నాయి. 18 సంవత్సరాలుగా విజయవాడ కృష్ణలంకకు వస్తున్నాం. నాతోపాటు మా కుటుంబానికి చెందిన నలుగురం వచ్చాం. నేనూ నా కుమారులిద్దరూ కృష్ణలంక ప్రాంతంలో తిరుగుతున్నాం. రాణిగారితోటలో చిన్న గదిని అద్దెకు తీసుకుని ఈనెల రోజులూ ఉంటున్నాం.. నా తండ్రి కూడా ఏటేటా ప్రతి సంక్రాంతి పండుగకు ఇదే తీరున చేసేవారు. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఊళ్లో పొలం పనులకు వెళ్తాం. హరిదాసులకు గతంలో వైభవంలా ఉండేది. ఇప్పుడు అంతటి ఆదరణ లేదు. తెల్లవారుజామున నిద్రలేచే కుటుంబాలే చాలా తక్కువగా ఉంటున్నాయి. – ఎర్రవెల్లి నర్సాదాస్‌, బండిపాలెం, జగ్గయ్యపేట మండలం, ఎన్‌టిఆర్‌ జిల్లా.

➡️