మాదకద్రవ్యాల మార్కెట్‌గా భారత్‌ !

Mar 27,2024 04:46 #editpage

బ్రెజిల్‌ నుంచి విశాఖ రేవుకు భారీ మొత్తంలో ఒక కంటెయినర్‌లో వచ్చిన మాదక ద్రవ్యాల గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ‘సంధ్య ఆక్వా కంపెనీ’ చిరునామాతో వచ్చిన వాటి మార్కెట్‌ విలువ యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆక్వా మేత తయారీకి అవసరమైన పొడి ఈస్టు పులియపెట్టేందుకు అవసరమైన శిలీంధ్రము)ను తెప్పించామే తప్ప దానిలో మాదక ద్రవ్యాల గురించి తమకు తెలియదని సదరు కంపెనీ చెబుతోంది. దీని వెనుక తెలుగుదేశం, వైసిపి, బిజెపి నేతలు కంపెనీ యజమానులతో సంబంధాల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో లూలా గెలిచినపుడు వైసిపి పక్ష నేతగా అభినందనలు పంపానే తప్ప వేరే సంబంధాలేవీ లేవని విజయసాయి రెడ్డి ప్రకటించుకున్నారు. సాక్షి పత్రిక వెలువరించిన కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించినందున రూ.20 కోట్లకు దావా వేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. వివరాలు పూర్తిగా తెలియక ముందే చంద్రబాబు, లోకేష్‌ ముందుగానే స్పందించారంటే వారికి ముందే తెలుసు అన్నట్లుగా వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖ రేవులో రాష్ట్ర అధికారులు సిబిఐకి సహకరించలేదనే విమర్శలు వచ్చాయి. వైసిపి నేత అభినందనలు తెలిపారంటే మాదక ద్రవ్యాలతో లూలాకూ సంబంధం ఉండవచ్చనే అనుమానాలు కలిగే విధంగా కొన్ని పత్రికల్లో రాతలు ఉన్నాయి.
ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా ఒకటి. లాటిన్‌ అమెరికాలో ముఠాలు అక్కడి ప్రభుత్వాల కూల్చివేతకు, ప్రజాస్వామ్యానికే ముప్పుగా ఈ ముఠాలు పరిణమించాయి. మన దేశ భద్రతకూ ప్రమాదం వస్తున్నదని అనేక మంది హెచ్చరిస్తున్నారు. గతంలో మన దేశం మాదకద్రవ్యాల సరఫరా మార్పిడి కేంద్రంగా ఉండగా ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్‌గా కూడా రూపొందినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవలి సంవత్సరాలలో భారీ మొత్తాలలో పట్టుబడుతున్నాయి. గత ఏడాది పాకిస్తాన్‌ నుంచి వచ్చిన రూ.25 వేల కోట్ల విలువగల మాదక ద్రవ్యాలను మన అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు గుజరాత్‌ లోని ముంద్రా రేవుకు వచ్చిన రూ.21 వేల కోట్ల విలువగల మూడు వేల కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న అంశం తెలిసిందే. రవాణా జరుగుతున్న వాటిలో పట్టుకుంటున్న మొత్తాలు స్వల్పమే అన్న సంగతి తెలిసిందే. గతేడాది 650 బిలియన్‌ డాలర్ల విలువ గల లావాదేవీలు జరిగినట్లు అంచనా. చట్ట విరుద్ధమైన ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో 30 శాతమని అంచనా. మాదకద్రవ్యాల ముఠాలు మన దేశంపై కేంద్రీకరిస్తున్నట్లు పట్టుబడుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల సంఘటిత ముఠాలు ఆసియా, అందులోనూ మన దేశం మీద కేంద్రీకరించటానికి కారణం నడమంత్రపు సిరి వచ్చిన కుటుంబాలు, వారి సంపదలు పెరగటంతో పాటు మాదక ద్రవ్యాల వాడకం కూడా పెరుగుతున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాలలో వీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరి మార్కెట్‌ పెరగకపోవటం, సింథటిక్‌ డ్రగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వటం వంటి కారణాలతో కొత్త మార్కెట్ల వేటలో మనదేశం మీద కేంద్రీకరించారు. కొకెయిన్‌ తయారీకి అవసరమైన కోకా ఉత్పత్తి, దిగుబడి ఇటీవలి కాలంలో లాటిన్‌ అమెరికాలో విపరీతంగా పెరిగింది. కొత్త ప్రాంతాలు, దేశాలకు అది విస్తరించింది. మార్కెట్‌లో పోటీ, సరఫరాకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.
మాదక ద్రవ్యాల మాఫియా కుట్రలకు బలైన వారిలో ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ఒకరు. లాటిన్‌ అమెరికాలో అనేక మంది రాజకీయ నేతలుా, మాఫియా డాన్లకు పెద్ద తేడా కనపడదు. అనేక దేశాల్లో వీరు ప్రజాస్వామిక, వామపక్ష నేతల సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేయటం, అనేక మంది నేతల అపహరణ, హత్యల్లో భాగస్వాములు. బ్రెజిల్‌, మెక్సికో మాదక ద్రవ్య మాఫియాలకు పెట్టింది పేరు. వారు మిలిటరీతో సహా అన్ని రంగాలలో ప్రవేశించారు. అనేక దేశాల పాలకులను తెర వెనుక ఉండి నడిపించేది వారే. వామపక్ష ఉద్యమాలను అడ్డుకొనేందుకు అమెరికా ఇలాంటి శక్తులకు పూర్తి మద్దతు, అవసరమైన మారణాయుధాలను అందిస్తోంది. వారిని ప్రజాస్వామిక పరిరక్షకులుగా చిత్రిస్తోంది. బ్రెజిల్‌లో ఇలాంటి ముఠాలను అడ్డుకొనేందుకు, రవాణా నిరోధానికి లూలా ప్రభుత్వం త్రివిధ దళాల నుంచి వేలాది మిలిటరీ, ఇతర భద్రతా సిబ్బందిని రేవులు, విమానాశ్రయాల్లో నియమించాల్సి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 2023 నవంబరులో ప్రారంభించిన వేట ఈ ఏడాది మే నెల వరకు జరుగుతుందని లూలా ప్రకటించారు. దీన్ని అడ్డుకొనేందుకు మాఫియా గ్యాంగులు అనేక బస్సులు, ఒక రైలును దగ్దం చేశాయి. అనేక నగరాల్లో ఈ శక్తుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయలేని స్థితి ఉంది. ఒక వైపు ఈ ముఠాలతో చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్ధులు, మరోవైపు ఈ గ్యాంగ్‌లను ఎదుర్కొనేందుకు లూలా పని చేయాల్సి వస్తోంది. ఈ అణచివేత కారణంగానే బ్రెజిల్‌ నుంచి విశాఖకు డ్రగ్స్‌ తరలించి ఉండవచ్చు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత మాదక ద్రవ్యాల రవాణా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కొకెయిన్‌ పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒక టన్ను ఆకు బలీవియా వంటి చోట్ల వెయ్యి డాలర్లకు దొరికితే ఐరోపా రేవుల్లో 35 వేల డాలర్లు పలుకుతోంది. అది వినియోగదారుల దగ్గరకు వచ్చేసరికి మరికొన్ని రెట్లు అవుతుంది. కోకా ఆకుల ఉత్పత్తి ప్రపంచ కేంద్రంగా లాటిన్‌ అమెరికా ఉంది. మిగతా వాటి ఉత్పత్తి కూడా ఎక్కువే. గతంలో కరీబియన్‌ ప్రాంతం నుంచి రవాణా జరిగితే ఇప్పుడు బ్రెజిల్‌ నుంచి ఎక్కువగా ఉంది. వంద సంవత్సరాల క్రితమే వీటిపై నిషేధం పెట్టినప్పటికీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. డ్రగ్స్‌ ముఠాలతో పాటు వారికి అవసరమైన ఆయుధాలను అందచేసే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, సరఫరా అన్నీ వికేంద్రీకరణ కావటంతో ఎక్కడైనా పట్టుబడిన వారు తప్పితే మిగతా నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా పని చేసిన పచ్చి మితవాది జైర్‌ బోల్సనారో మాదక ద్రవ్యాల మాఫియాల సంబంధాలు జగమెరిగిన సత్యం. బోల్సనారో మీదే ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూలా గెలిచాడు. బోల్సనారో ఏలుబడిలో రియో నగర శివార్లలో మాఫియా ముఠాలు పదిహేడు లక్షల మంది నివసించే బ్రిటన్‌లోని బర్మింగ్‌హోమ్‌ నగరమంతటి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. అక్కడ వారే సర్వస్వం. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి ముప్పు అని వేరే చెప్పనవసరం లేదు. ఇలాంటి గ్యాంగులు వున్నందునే నేరాలు అదుపులో వుంటున్నట్లు గతంలో బోల్సనారో బహిరంగంగా ప్రశంసలు కురింపించాడు. తుపాకులపై ఉన్న ఆంక్షలు తొలగించి వాటిని సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాడు.
మూడు దశాబ్దాల క్రితం 1993లో బ్రెజిల్‌ సావోపాలో నగర జైల్లో నేరగాళ్ల మధ్య కొట్లాట జరిగింది. కారణం ఏమిటంటే ఫస్ట్‌ కాపిటల్‌ కమాండ్‌ అనే కొత్త మాఫియా ఏర్పడటమే. ఇప్పుడది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో అతి పెద్ద ముఠాగా ఎదిగింది. దానిలో నలభైవేల మంది జీవిత కాల సభ్యులు, మరో అరవై వేల మంది దానితో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు వివిధ దేశాల్లో విస్తరించారు. పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ నగరంలోని జైళ్లలో ఈ ముఠాకు చెందిన వెయ్యి మంది ఉన్నారని అక్కడి అధికారులే గతేడాది వెల్లడించారు.ఈ ముఠా నైజీరియాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించింది. మన దేశంలో అనేక మంది నైజీరియన్లు మాదకద్రవ్యాలతో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కొందరు చెబుతున్నదాన్ని బట్టి ఒక నైజీరియన్‌ మన దేశంలో డ్రగ్‌ మాఫియాను అదుపు చేస్తున్నట్లు వార్తలు. ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐలకు ఉందని చెబుతారు. పక్కనే ఉన్న మెక్సికో నుంచి వస్తున్న మాదకద్రవ్యాలను ఎందుకు అరికట్టలేకపోతోందన్నది ప్రశ్న. నిజానికి చేతగాక కాదు. ఆ ముఠాలతో అమెరికాలో ఉన్నవారికి ఉన్న లావాదేవీలే కారణం. అక్రమంగా ప్రవేశించేవారితో అమెరికాలోని పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలలో చౌకగా పనిచేయించుకుంటారు. మాదక ద్రవ్యాలను తెప్పించుకుంటారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో డ్రగ్‌ మాఫియాదే రాజ్యం. వారికి తెలియకుండా అక్రమంగా ప్రవేశించేవారు ఉండరు. అక్కడి నుంచి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతుంది. ఫెంటానిల్‌ అనే మత్తు పదార్ధం ఒక బిళ్ల తయారీకి పది సెంట్లు ఖర్చు అవుతుంది. దాన్ని ఔషధం పేరుతో నకిలీ మందుల చీటీలను సృష్టించి కొనుగోలు చేసి పది నుంచి 30 డాలర్ల వంతున అమ్ముతారు. పది కిలోల ఫెంటానిల్‌ 50 వేల డాలర్లకు దొరికితే దాన్ని రెండు కోట్ల డాలర్లకు విక్రయిస్తారు. అమెరికాలో దీన్ని వాడి 2022లో లక్ష తొమ్మిది వేల మంది మరణించినట్లు నమోదైంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని ఆసరా చేసుకొని ఇష్టంలేని ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రజా ఉద్యమాలను దెబ్బ తీసేందుకు ముఠాలను అనేక దేశాల్లో అమెరికా ప్రోత్సహించింది. చివరికి అవి ఏకు మేకైనట్లుగా సంఘటిత ముఠాలుగా ఏర్పడి దేశాలనే శాసించే స్థితికి చేరాయి. తమలో తాము ఘర్షణ పడకుండా ఎవరి ప్రాంతంలో వారు దందా చేసుకొనేందుకు స్వతంత్ర (కార్టెల్స్‌) సంస్థలను ఏర్పాటు చేసుకొనే స్థాయికి ఎదిగాయి. అమెరికాలో తొలిసారి 1968లో అధ్యక్షుడిగా గెలిచిన రిచర్డ్‌ నిక్సన్‌ విధిలేని పరిస్థితిలో మాదక ద్రవ్యాలు పౌరుల తొలి శత్రువు అని ప్రకటించాడు. అప్పటికే హెరాయిన్‌, మార్జువానా అమెరికాలో విపరీతంగా పెరిగి, కొకెయిన్‌ రంగంలోకి వచ్చింది. మార్కెట్‌ ఎంతో లాభసాటిగా ఉండటంతో కార్టెల్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇవి ఎంతగా ఎదిగాయంటే కరీబియన్‌ ప్రాంతంలో కొన్ని దీవులను కొనుగోలు చేసి అక్కడ ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసి సరకు రవాణాకు విమానాలను కూడ కొనుగోలు చేశాయి. అలాంటి సంస్థలలో విబేధాలు తలెత్తి మార్కెట్‌ ఆక్రమణకు కొత్త సంస్థలను ఉనికిలోకి తెచ్చారు. ప్రత్యర్ధులను అంతం చేసేందుకు సాయుధ ముఠాలనూ రంగంలోకి తెచ్చారు. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఉగ్రవాద సంస్థలు ఆ వైపు మళ్లాయి. అందువలన అవి చేసే కార్యకలాపాలను నార్కో టెర్రరిజం అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ పాలకుల కోరిక మేరకు జోక్యం చేసుకున్న సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన అమెరికా వారి చేత మాదక ద్రవ్యాలను కూడా ప్రోత్సహించింది. తరువాత వారే అమెరికాకు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.

– ఎం. కోటేశ్వరరావు

➡️