గాయపడిన బిడ్డ బతికి లేని కుటుంబం

Jan 19,2024 10:50 #israel hamas war

బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో.. ఆకలితో ఏడుస్తున్న పిల్ల ఆకలి తీర్చాలని ఎంతలా తపనపడిపోతుందో. పాలు తాపించినా, లాలించినా బిడ్డ ఏడుపు ఆపకపోతే, ఏదైనా దెబ్బ తగిలిందేమోనని ఆతృతగా ఆ వైపు పరుగులు పెడుతుంది. కానీ, అక్కడ గంటల తరబడి గొంతెండిపోయేలా ఏడుస్తున్న పిల్లల ఆకలి తీర్చేందుకు ఏ తల్లీ ముందుకు రావడం లేదు. ఆ పిల్లలకు పాలు తాగించేందుకు కన్నవారెవరూ అక్కడ కనిపించడం లేదు. ఆకలి బాధకు తోడు గాయాలతో నెత్తురోడుతున్న ఆ పిల్లల పక్కనే ‘గాయపడిన బిడ్డ, బతికి లేని కుటుంబం’ అని రాసి వున్న నేమ్‌ బోర్డు వేలాడుతోంది. వారంతా గాజా పిల్లలు. మూడు నెలలకు పైగా కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ యుద్ధంలో వేలాది మంది చిన్నారులు చనిపోగా, బతికి ఉన్న లక్షలాది మంది పిల్లలు వారు.

బాంబుల దాడి, తెగిపడుతున్న కాళ్లూ, చేతులు, కుప్పకూలుతున్న భవంతులు, ఒక చోట నుంచి మరో చోటికి పారిపోవడం.. వంటి దృశ్యాలతో గాజా నిండిపోయింది. సున్నిత మనస్కులైన పిల్లల మనసుల్లో ఈ పరిస్థితులు పెను విషాదాన్ని నింపుతున్నాయి. దాడుల్లో చనిపోయిన వారు చనిపోగా, బతికి వున్న పిల్లలు ప్రాణం ఉండీ లేనట్లుగా, జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. క్షతగాత్రులుగా పడి ఉన్న ఆ చిన్నారుల ఆరోగ్యం కాపాడేందుకు శాయశక్తులా శ్రమించే వైద్య సిబ్బంది అక్కడ ఉన్నారు. అయితే మౌలిక వసతులు లేక, బిడ్డలు పడుతున్న వేదన చూడలేని ఎన్నో హృదయాలు కన్నీరు కారుస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వారి శారీరక ఆరోగ్యంపైనే దృష్టిపెట్టలేకపోతున్నారు అక్కడి సిబ్బంది. ఇక మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించేవారేరి? ఇప్పుడు అక్కడ ఇదే అతి పెద్ద సమస్య.

12 ఏళ్ల ఘెనా జడిలి శూన్యంలోకి అలా చూస్తూ ఉంటోంది. ‘మా చెల్లి కొన్ని వారాలుగా ఇలాగే ఉంటోంది. ఆమె చిరునవ్వు నవ్వి చాలా కాలమైంది. డిసెంబరు 28న మేమంతా దక్షిణా గాజాని విడిచి ఇక్కడికి వచ్చాం’ అంటూ ఘెనా సోదరి చెబుతోంది. ఘెనాతో పాటు ఆమె ముగ్గురు సోదరీమణులు ప్రస్తుతం దక్షిణ గాజాలో వాళ్ల బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. సెంట్రల్‌ గాజాలో ఓ శరణార్థ శిబిరంలో కొన్నేళ్లుగా ఘెనా కుటుంబం నివసిస్తోంది. నిత్యం సంఘర్షణలతో కొట్టుమిట్టాడే గాజాలో శరణార్థ శిబిరాలే శాశ్వత నివాసాలుగా మారిపోతాయి. ఇప్పుడు తాజా పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. దీంతో లక్షలాది మంది ఒక చోట నుంచి మరో చోటికి తరలిపోతున్నారు. ‘ఇక్కడికి వచ్చాక బాంబు మోతలతోనే మాకు తెల్లారుతోంది. మా చెల్లి ఘెనా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. ఇంతకు ముందు తను అలా లేదు. రాత్రుళ్లు నిద్ర పోవడం లేదు. ఉన్నఫళంగా ఉలికి ఉలికి పడుతోంది’ అంటూ ఘెనా మరో సోదరి రాజా అంటోంది. గాజాలో ఇప్పటి వరకు 19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు. వారిలో సగానికి పైగా చిన్నారులే ఉన్నారు.

ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన 155 శరణార్థ శిబిరాల్లో వలస వచ్చిన 12 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. రెండు లక్షల మంది పాఠశాలలు, కల్యాణ మండపాలు, ఆస్పత్రుల్లో తలదాచుకున్నారు. వేలాదిమంది రోడ్ల మీదే సేద తీరుతున్నారు.

విపరీతమైన చలి, మృగ్యమైన ఆరోగ్య సేవలు, నీటి కొరత, పారిశుధ్య లోపం కారణంగా నవజాత శిశువులు తీవ్రంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటిన్నింటి మధ్య ఆ పిల్లల మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. యుద్ధం మొదలవ్వక ముందు అంటే 2022లో ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో గాజా వ్యాప్తంగా 80 శాతం మంది చిన్నారుల మానసిక ఆరోగ్యం దెబ్బతిందని పేర్కొంది.

గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దీర్ఘకాల యుద్ధం కారణంగా పిల్లలు విపరీత ఒత్తిడికి గురవుతున్నారని చెప్పింది. వారిలో సగానికి పైగా చిన్నారులు ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నారని కూడా ఆందోళన చెందింది. ప్రస్తుత పరిస్థితిలో ఆ బిడ్డల వేదన ఇంకెంత రెట్టింపైందో..శరణార్థులను ఆదుకునేందుకు గాజా వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడూ తలమునకలై ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవేమీ వాటి కార్యకలాపాలు కొనసాగించ లేకపోతున్నాయి. ఇక్కడి ప్రజలు నిలకడగా ఒక చోట ఉండడం లేదు. ముఖ్యంగా అక్టోబరు 7న యుద్ధం మొదలైన నాటి నుండి పరిస్థితి మరింత దిగజారింది. అక్టోబరు చివరి నాటికి 20 నెలల హబూబ్‌ నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఆ దాడిలో హబూబ్‌ కుటుంబమంతా ప్రాణాలు విడిచారు. మరుసటి రోజు ఉదయం పక్కింటి పైకప్పు శిథిలాల్లో తీవ్ర గాయాలతో హబూబ్‌ కనిపించాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుండి ఏడుపు ఆపడం లేదు. కమల్‌ ఓద్వాన్‌ హాస్పటల్‌లో హబూబ్‌ గాయాలకు చికిత్స చేస్తున్నారు. ఆ బాధ తాళలేక గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని ఓదార్చేందుకు తన వారెవరూ బతికిలేరు. హబూబ్‌ ఉన్న మంచానికి ‘గాయపడిన చిన్నారి, బతికి లేని కుటుంబం’ అన్న నేమ్‌ బోర్డు తగిలించారు. అలాంటి బోర్డులు ఆ వార్డులోని పిల్లలందరి మంచాలకు వేలాడదీశారు. ఆ పిల్లలకు వైద్యం చేస్తున్నప్పుడు వైద్య సిబ్బంది కళ్ల నుండి ఆగకుండా కన్నీరు కారుతూనే ఉంది.

శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న చిన్నారుల పరిస్థితి మరోలా ఉంది. మానసిక ఒత్తిడితో ఆ పిల్లలు కళ్ల నిండా దైన్యం నింపుకుని ఉంటున్నారు. వారి ఆవేదన తీర్చే మార్గం అక్కడెవరికీ తెలియడం లేదు. ‘ఇక్కడ తలదాచుకున్న చిన్నారుల్లో చాలామంది నిద్రలో పక్క తడుపుతున్నారు. చిన్న చిన్న శబ్దాలకు కూడా విపరీతంగా భయపడిపోతున్నారు. ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన పిల్లలు ఏదో కోల్పోయినట్లు, నిస్తేజంగా ఉంటున్నారు’ అంటున్నారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్ ఓ శరణార్థ శిబిరంలో సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త హనీన. ‘మా ముందు ఒకటే లక్ష్యం వుంది. ఆస్పత్రికి వచ్చేవారి ప్రాణాలు రక్షించడమే కీలకంగా పనిచేస్తున్నాం. అంతకుమించి వారి మానసిక ఆరోగ్యంపై ఆరా తీసే తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు’ అంటున్నారు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌. మానసిక ఒత్తిడిని దూరం చేసే విభాగంలో పనిచేస్తున్న సంతోష్‌ ఇప్పుడు పూర్తికాలం క్షతగాత్రులను నయం చేసే పనిలో గడుపుతున్నారు. ముందస్తు జననాలతో నవజాత శిశువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడింది. వారికి వైద్యం చేసే సౌకర్యాలు ఇక్కడ లేవు. దీనికి తోడు జనవరి 5న ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం చేసిన సర్వేలో రెండేళ్ల లోపు చిన్నారుల్లో 96 శాతం మంది తీవ్ర ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిల్లల జీవితంలో బాల్యం చెరగని ముద్ర వేస్తుంది. గాజా పిల్లల జీవితాల్లో మాత్రం అది ఓ చేదు జ్ఞాపకం.

➡️