మాస్టర్‌ స్కూబా..

Jun 21,2024 05:45 #feachers, #jeevana, #Scuba

పిల్లలకు నీళ్లను చూస్తే భలే సరదా! ఒక పట్టాన వదిలి రారు. ఇక సముద్రాన్ని చూస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉంటాయా! కేరింతలే కేరింతలు.. గంతులే గంతులు.. అయితే బెంగుళూరుకు చెందిన 12 ఏళ్ల కైనా ఖరే, అలా నీళ్లని చూస్లూ ఊరుకునే బాపతు కాదు. ఆ నీళ్ల లోతుకు వెళ్లి దాని రహస్యాలు తెలుసుకోవాలనుకునే తాలుకా. అందుకే రెండేళ్ల నుండే ఈత నేర్చుకుంది. 10 ఏళ్లు వచ్చేసరికి స్కూబా డ్రైవింగ్‌లో నిష్ణాతురాలైంది. రెండేళ్లు తిరిగేసరికి ఇప్పుడు ఆ క్రీడలో మాస్టర్‌ డైవర్‌గా కీర్తి సంపాదించుకుంది.

బెంగుళూరులో నివసిస్తున్న కైనా బాలికల విభాగంలో ప్రపంచంలోనే అతిచిన్న స్కూబా డైవర్‌ మాస్టర్‌గా కీర్తి గడించింది. 10 ఏళ్లప్పటికే ప్రపంచ గుర్తింపు పొందిన ఈ చిన్నారి, ఓపెన్‌ వాటర్‌ సర్టిఫికేషన్‌, నీటి అడుగున ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన నైట్రోక్స్‌ డైవింగ్‌, పర్ఫెక్ట్‌ బాయిన్సీ కంట్రోల్‌, రెస్క్యూ డ్రైవర్‌ ట్రైనింగ్‌ వంటి ఇతర ప్రత్యేక కోర్సుల్లో ధృవపత్రాలను సాధించింది. పెద్దలకు ఏమాత్రం తీసిపోకుండా పాల్గొన్న ప్రతి పోటీలో పతకాలు సాధిస్తున్నందుకే మాస్టర్‌ డైవర్‌ బిరుదును దక్కించుకుంది. ఈ బిరుదు అసాధారణ జ్ఞానం, నైపుణ్యం, అంకితభావం ఉన్న క్రీడాకారులకే లభిస్తుంది.


రెండేళ్లప్పుడే అండమాన్‌ దీవుల్లో ఓపెన్‌ వాటర్‌ డైవ్‌లో పాల్గొన్న కైనా, తన ప్రయాణం గురించి ఇలా వివరిస్తోంది. ‘అప్పుడు నా వయసు రెండేళ్లే. అది ‘తండేమ్‌’ డైవ్‌.అందులో పాల్గొన్నప్పుడు నాకు భలే సరదా అనిపించింది. నా ఆసక్తిని గమనించి, అమ్మానాన్న ఇండోనేషియా బాలిలో ఓపెన్‌ వాటర్‌ కోర్సులో చేర్పించారు. ఆ తరువాత థారులాండ్‌లో నా కోర్సును పూర్తిచేశాను. చాలా క్లిష్టమైన అండమాన్‌ వాతావరణంలో డైవ్‌ చేసి మాస్టర్‌ డైవర్‌గా గుర్తింపుపొందాను’ అంటున్న కైనా తనకు ఇంతలా ప్రోత్సహించిన అమ్మానాన్నకే ఈ గొప్పతనమంతా చెందాలని అంటుంది.
‘కైనా చిన్నప్పటి నుండీ ‘వాటర్‌ బేబీ’. రెండేళ్లకే ఈదడం ప్రారంభించింది. ఒక్కోసారి మేము బలవంతంగా తనని నీళ్లల్లో నుండి బయటికి లాగవలసి వచ్చేది. మొదట్లో సముద్రం లోతుల్లోకి పంపించేందుకు భయపడ్డాం. కానీ తన ఇష్టాన్ని కాదనలేకపోయాం. అయితే సర్టిఫికేట్లు సాధించాలని ఎప్పుడూ అనుకోలేదు. సరదాగా నేర్చుకుంటే చాలు అనుకున్నాం. కానీ తను అలా ఊరుకోలేదు. డైవింగ్‌లో ఎంతో కఠిన నియమాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది. నైపుణ్యం గల శిక్షకుల పర్యవేక్షణలో నిత్యం శ్రమించింది. తన ఆసక్తిని గమనించి మేము కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు’ అని తల్లి అన్షుమా కైనా ప్రయాణం గురించి చెబుతున్నారు.

అది చాలా క్లిష్ట ప్రయాణం
‘ఒక్కసారి సముద్రం లోతుల్లోకి వెళ్లాక అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. మీతో పాటు డైవ్‌ చేస్తున్న వ్యక్తి కనిపించకుండా వుంటారు. వాళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద చేపలు దాడి చేయొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకసారి అండమాన్‌ దీవుల్లో డైవ్‌కి వెళ్లినప్పుడు మొదట ఉన్న వాతావరణం లోతుల్లోకి వెళ్లాక లేదు. రెస్యూ డైవింగ్‌కోర్సు నేర్చుకోవాలన్న లక్ష్యంతో నేను ఆ రోజు సముద్ర లోతుల్లోకి వెళ్లాను. అప్పుడు అక్కడ పెద్ద తుఫాను సంభవించింది. గాలి, వానతో సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది. నాతో పాటు వచ్చిన డైవర్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 20 మీటర్ల దూరంలోని పడవ దగ్గరికి నేనొక్కదాన్నే అతన్ని లాక్కుని వెళ్లాల్సివచ్చింది’ అని అప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కైనా గుర్తుచేసుకుంది.
అయితే ఈ సవాళ్లేమీ ఆమె ప్రయాణానికి అడ్డుకట్ట వేయలేదు. సవాళ్లను అధిగమిస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళుతోంది. ‘నీరు నా రెండవ ఇల్లు. అక్కడ చాలా సరదాగా ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. విశ్రాంతిగా ఉంటుంది. చేపలు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాయి. భలే సరదాగా ఉంటుంది’ అంటూ కళ్లు ఇంత పెద్దవి చేసుకుని తన సముద్రలోతు అనుభవాన్ని చెబుతోంది కైనా. కైనా లాంటి చిన్నారులు మన ఇంట్లోనో, మన చుట్టుపక్కలో ఉంటారు. వారి అభిరుచికి తగ్గట్లుగా ప్రోత్సాహిమిస్తే, కైనాలానే వారు కూడా ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారు.

➡️