ఎంత చదివినా కూలీ చేస్తూ..

May 19,2024 08:29 #feachers, #Jeevana Stories

చదువుకుంటే బతుకు బాగుపడుతుందని ఎన్నోసార్లు అనుకుంటాం. చదువుకోకపోతే జీవితం వ్యర్థం అని కూడా చాలామందికి చెబుదాం. అయితే, ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది విద్యాధికులు రోజు కూలీ కోసం మూటలు ఎత్తుతున్నారు. పారలు పట్టుకుంటున్నారు. పొలం బాట పడుతున్నారు. ఉద్యోగం కోసం పట్టణానికి వలస వచ్చి రోజుకు రూ.300 నుండి రూ.500 రూపాయలకు పనిచేసే గ్రాడ్యుయేట్లు మన చుట్టూ చాలా మంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందరో విద్యాధికులు, రెండు పూటలా తిండి తినడం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ‘ఉద్యోగాల కోసం చదివిన ఆ చదువులు ఎందుకు పనికి రాకుండా పోయాయి?’ అన్న వారి ప్రశ్నలకు కొన్ని దశాబ్దాలుగా సమాధానా లు దొరకడం లేదు.
పాతికేళ్ల క్రితం మనదేశ నిరుద్యోగ యువతలో ఉన్న విద్యావంతులు ఇప్పుడు రెట్టింపు సంఖ్యకు చేరారు. మహారాష్ట్ర దభండి గ్రామానికి చెందిన 42 ఏళ్ల శివానంద్‌ సావలె బాల్యం నుండి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. విద్య నేర్పిస్తున్న టీచర్లను చూసి చాలా ప్రభావితమయ్యాడు. పెద్దయ్యాక వాళ్లలాగా ఉద్యోగాలు చేయాలని ఆశపడ్డాడు. ఈ మధ్యలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయి. పేదరికంతో బాధపడ్డాడు. తండ్రి అకాలమరణం చెందాడు. ఎన్ని బాధలు పడ్డా అనుకున్న లక్ష్యం చేరాలని కష్టపడి చదివాడు. గ్రామంలో అత్యధిక విద్యావంతుడిగా చరిత్ర సృష్టించాడు. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్తి చేసిన సావెలే ఎలిమెంట్రీ స్కూలు టీచరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోపు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక్కడే అతను మానసికంగా ఎంతో కుంగిపోతున్నాడు. తన చుట్టూ ఉన్న వారు తన తోటి చదువుకున్న వారితో నిత్యం అవమానాలు పడాల్సివస్తోంది. ఎందుకంటే సావెలే, ఆ గ్రామంలో భూమి లేని నిరుపేద కూలీ కంటే తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. నెలకు రూ.7500, అంటే రోజుకు రూ.250 కూలీకి పనిచేస్తున్నాడు. ఆ గ్రామంలో వ్యవసాయ కూలీకి అంతకంటే ఎక్కువ జీతమే అందుతోంది. ‘నువ్వు చదువుకునేటప్పుడు నీ వెనక చాలా దూరంలో మూలన కూర్చొన్న వ్యక్తి కూడా ఇప్పుడు నీ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు!’ అని ఎన్నోసార్లు ఎంతోమంది గేలి చేశారు. ఈ అవమానాలు సావెలే ఒక్కడివే కాదు.. కొన్ని లక్షల మంది విద్యావంత నిరుద్యోగులవి. తక్కువ వేతనాలకి పనిచేస్తున్న ఎంతోమంది తమ విద్యార్హతను బయటికి చెప్పడానికి కూడా ఇష్టపడకుండా కూలి పనులు చేస్తున్నారు.
సావెలే స్నేహితుడు రాథోడ్‌ది మరో కథ. కుటుంబ సమస్యలతో చదువు అర్ధంతరంగా ఆపేశాడు. వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నాడు. స్థిర ఆదాయం కలిగి ఉన్నాడు. తన స్నేహితుడు సావెలే పరిస్థితిని చూసి బాధ పడని రోజు లేదు. ‘వాడు స్కూల్లో బాగా చదివేవాడు. ఉద్యోగం కోసం ఎన్నో కలలు కన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపలేదు. కానీ ఈ రోజు చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. వాడిని చూసినప్పుడల్లా గుండె చెరువైపోతుంది’ అని గద్గద స్వరంతో చెబుతున్న రాథోడ్‌ లాంటి స్నేహితులు మనచుట్టూ ఎంతోమంది.


సావెలే నివసిస్తున్న ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలోని రాలేగావ్‌ టౌన్‌లో 27 ఏళ్ల సిద్ధాంత్‌ మెండే జీవిస్తున్నాడు. ఇంజినీరింగ్‌ చదివాడు. కానీ ఇప్పుడు ఓ భవననిర్మాణరంగ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇంటి పనులు చేయిస్తున్నాడు. రోజంతా అతడు పడిన కష్టానికి గాను నెలకు రూ.12 వేలు మాత్రమే వస్తుంది. అంటే రోజుకు రూ.400 దక్కుతుంది. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ పొలం పనులకు వెళితే వచ్చే మొత్తానికి ఇది సమానం. అయితే ఇంతకు ముందే సిద్ధార్థ్‌ మెరుగైన ఉద్యోగం కోసం పూణె, నాగపూర్‌ వంటి పట్టణాలకు కూడా వెళ్లాడు. అక్కడ రూ.13 వేలు వస్తాయని చెప్పడంతో ఖర్చులకు పోను ఏమీ మిగలదని ఉన్న ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని గ్రామానికే పరిమితమయ్యాడు.
‘నా డిగ్రీకి, నా పనికి ఏ సంబంధం లేదు. డిగ్రీ సాధించడం కోసం నాలుగేళ్లు కష్టపడ్డాను. మెరుగైన ఉద్యోగం కోసం రెండేళ్లు తిరిగాను. ఎక్కడా సంతృప్తి లేదు. ఇప్పుడు నా తప్పు తెలిసివచ్చింది. కానీ గడిచిన సమయం తిరిగి రాదు కదా! అని చెబుతున్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగుల ఆవేదన కనిపిస్తోంది.
‘దశాబ్ద కాలంలో రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో బిజెపి చేసిన వాగ్ధానానికి ఎంతో సంతోషించాను. కానీ అటువంటిదేమీ జరగలేదు. నా చుట్టూ పనిచేసే వాళ్లలో చాలామంది చదువుకున్న వారే ఉంటున్నారు. ఈ పరిస్థితి చూసి 2019 నుండి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇప్పుడు నేను బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను’ అని చెబుతున్న సిద్ధార్థ్‌, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగంలో సంతృప్తికరంగా లేడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావిస్తున్నాడు. ‘ఏ వ్యాపారం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు’ అంటున్న సిద్ధార్థ్‌ ముఖంలో భవిష్యత్తుపై బెంగ స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ప్రాంతంలోనే నివసిస్తున్న 21 ఏళ్ల ఆర్తీ కున్‌కున్వార్‌ గ్రాడ్యుయేట్‌ మధ్యలోనే ఆపేసింది. తండ్రి చనిపోవడంతో కుటుంబానికి తనే పెద్ద దిక్కైంది. ఈ పరిస్థితుల్లో గ్రామం విడిచి వెళ్లలేక, ఉన్న ఊరిలోనే చాలా తక్కువ వేతనానికి పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలం వెల్లదీస్తోంది. ‘నా స్నేహితుల్లో చాలా మంది గ్రాడ్యుయేట్‌ పూర్తిచేసి, ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరినీ చూస్తే, నేను ఎంతోకొంత సంపాదిస్తున్నానని తృప్తి చెందుతున్నాను’ అంటోంది.
పైన చెప్పుకున్న ఈ వ్యక్తులు, వాళ్లకెదురైన సందర్భాలు నిరుద్యోగులుగా మిగిలిపోయిన ఎంతోమంది విద్యావంతులవి. పాలకుల ప్రగల్భాలకు లోబడుతున్న నిరుద్యోగులందరూ వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవాలి. కుల, మతాల విద్వేషాలు రెచ్చగొట్టే పాలకులు, ఎప్పుడూ ఉపాధి మార్గం వైపు ఆలోచించరు. కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.

➡️