వేలం వెర్రి

Jun 16,2024 04:32 #jeevana

ఉరవ కొండ గ్రామంలో రాజీవ్‌, లక్ష్మి నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు వారు దేవాలయానికి బయలుదేరారు. వెళ్ళే దారిలో రావిచెట్టుకు దారం చుట్టి పసుపు రాసి బట్టు పెడుతోంది ఒక భక్తురాలు. అప్పటికే ఆ చెట్టుకు కొన్ని వందల దారాల చుట్లు ఉన్నాయి. మరికొంచెం దూరం వెళ్ళేసరికి మరొక చెట్టు మొదట్లో ‘కోర్కెలు తీర్చే చెట్టు’ అని రాసి ఉంది. ఆ చెట్టు కొమ్మల నిండా కోర్కెల చిట్టాలు రాసి, వేలాడదీసి ఉన్నాయి. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కొంతమంది చిన్న రాళ్ళను విసిరి దండం పెడుతున్నారు. ‘ఎందుకు?’ అని అడిగితే. ‘ఇలా విసిరితే పాపాలు పోతాయి’ అన్నాడు ఒక భక్తుడు. అలా విసిరిన రాళ్ళతో పెద్ద గుట్ట తయారయ్యింది అక్కడ.
ఇద్దరూ దేవాలయంలో ప్రవేశించారు. అక్కడ ఒకామె ‘మీకు మగపిల్లలు ఉన్నారా?’ అని అడిగి మరీ, ఎర్ర గాజులు పంచిపెడుతోంది. ‘మగపిల్లలు ఉన్న తల్లి మూడు ఎర్రగాజులు వేసుకోవాలి’ అని కూడా చెప్తోంది. ‘మన ఎదురింటావిడ పుస్తెల తాడులో పసుపు కొమ్ము కట్టు కోవాలని’ చెప్పింది. ‘సరే’నని నేను కట్టుకున్నాను’ అని పసుపుకొమ్ము భర్తకి చూపించింది లక్ష్మి.
‘ఏంటో ఈ వేలం వెర్రి’ అన్నాడు రాజీవ్‌ కోపంగా.
‘అంటే ఏమిటండీ?’ అని అడిగింది లక్ష్మి.
‘పూర్వం గ్రామాల్లో బహిరంగ వేలం వేసేటప్పుడు పంతాలకు, పౌరుషాలకు పోయి మరీ ఒకరిని మించి ఒకరు పోటీగా పాడేవారు. లాభమా, నష్టమా అనేది కూడా ఆలోచించేవారు కాదు. కొంతమందికి ధర పెంచడం అలవాటు. వాళ్లు కొనరు, వేలం పాటలో పాల్గని, ధరను పెంచి ఇతరులచేత కొనిపిస్తారు. ఇదే వేలం వెర్రి అనే పలుకుబడిగా జనాల నోటిలో నానిపోయింది. పక్కవాళ్ళు చేస్తున్నారు కదా! అని, అవసరం ఉన్నా లేక పోయినా, ఉచితానుచితాలు ఆలోచించకుండా ఏదైనా పనిని చేయడాన్ని వేలం వెర్రి అంటారు’ వీధి గోడ మీద చేతి ముద్రలు వేసి ‘ఓ స్త్రీ రేపురా’ అని రాయడం, దేవుడి పేరుతో ఉత్తరాలు రాయడం, ఈ విషయాన్ని పదిమందికి చేరవేస్తే శుభం కలుగుతుంది’ వంటి ప్రచారాలు ఇలాంటివే’ అని వివరించాడు రాజీవ్‌.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️