పోలవరం దారెటు?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకంగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టుపై టిడిపి కూటమి ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలో నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి ప్రాధాన్యమివ్వకపోవడం ఆందోళనకర విషయం. రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షల మంది నిర్వాసితుల గురించి సర్కారు పొడిపొడి మాటలతో దాటవేయడం అమానవీయం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల పునరావాసంపై పదేళ్లుగా దోబూచులాడుతున్న, నిధులివ్వకుండా తాత్సారం చేసిన, ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క మాట శ్వేతపత్రంలో ఉదహరించకపోవడం సరికాదు. ఒక వైపు తప్పులు చేసిన మోడీ ప్రభుత్వాన్ని కాపాడుతూ మరోవైపు గత వైసిపి ప్రభుత్వ ప్రమాదకర ధోరణులను ఎత్తిచూపి, అంతకుముందు తన హయాంలో అద్భుతాలు చేశామని పేర్కొన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉండి, తనపై కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆధారపడ్డ స్థితిలో కూడా కేంద్రం నుంచి నిధులు సాధిస్తామనికానీ, గట్టిగా నిధులు అడుగుతామనికానీ శ్వేతపత్రంలో కనీసమాత్రమైనా ముఖ్యమంత్రి చెప్పలేదు.
టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలూ పోలవరం అంటే డ్యామ్‌ నిర్మాణం, ఇతర సివిల్‌ పనులుగా చూశాయే తప్ప ప్రాజెక్టు కోసం ఊళ్లూ, ఇళ్లు, భూములు త్యజించిన నిర్వాసితుల గోడు పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ వలన లక్షా ఆరు వేల కుటుంబాలు మునుగుతాయని ఎప్పుడో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన 2005లో అంచనా వేశారు. రెండు దశాబ్దాల అనంతరం సామాజిక ఆర్థిక సర్వే పేరిట ముంపు కుటుంబాలను 96 వేలకు కుదించినట్లు శ్వేతపత్రంలో వెల్లడించారు. ఎగువ కాఫర్‌ డ్యాం కట్టాక కొద్దిపాటి వరదలొస్తే చాలు కాంటూరు సర్వేల కంటే అదనపు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇంకోవైపు ఈ ఇరవై ఏళ్ల కాలంలో జనాభా పెరిగింది. 18 ఏళ్లు నిండిన వారూ పెరిగారు. జనాభా, కుటుంబాలు పెరుగుతుండగా, నిర్వాసితులయ్యే కుటుంబాలను తగ్గించడం వెనకున్న మర్మం ఏమిటో అర్థం కాదు. ఎక్కడేకాని ప్రాజెక్టులు గాలిలో కట్టరు. అభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు వాటి వలన నిర్వాసితులయ్యే వారందరికీ పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే నిర్మాణం ప్రారంభించాలన్నది సహజ న్యాయసూత్రం. అంతర్జాతీయ చట్టాలూ అదే చెబుతున్నాయి. దశల పేరిట నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామనడం త్యాగధనుల పట్ల ప్రభుత్వాల అమానవీయతను సూచిస్తుంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచితం, అవకతవకల వలన పోలవరం స్తంభించినందున తొలి దశకు నాలుగేళ్లు పడుతుందని శ్వేతపత్రంలో టిడిపి సర్కారు తెలిపింది. తొలి దశ నిర్వాసితుల పునరావాసం రెండేళ్లలో పూర్తవుతుందని, రెండవ దశ పునరావాసం ఆపై దశలవారీగా కొనసాగుతుందని వెల్లడించింది. ఇన్నేళ్లయినా పునరావాసం కోసం పోరాడుతున్న గిరిజన, పేద నిర్వాసితులకు దరిదాపుల్లో పునరావాసం దక్కదని ప్రభుత్వ శ్వేతపత్రంతో అర్థమైపోయింది. తొలి, మలి దశల్లో పునరావాసానికి ఇంకా రూ.25 వేల కోట్లు కావాలంటోంది ప్రభుత్వం. మొదటి ప్రాధాన్యతలో ఆ నిధులు కేంద్రం నుంచి రాబట్టే విషయంలో మాత్రం నాలిక మడత పెడుతోంది. డిజైన్ల దగ్గర నుంచి అంచనాల వరకు, కాఫర్‌ డ్యాము నుంచి డయాఫ్రంవాల్‌, గైడ్‌బండ్‌, రివర్స్‌టెండర్ల వరకు అన్నీ కేంద్ర సంస్థల కనుసన్నల్లోనే జరిగాయి. కాబట్టి టిడిపి, వైసిపి, ఏ ప్రభుత్వం తప్పు చేసినా కేంద్ర అండదండలు పుష్కలంగా ఉందన్నది స్పష్టం. జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినందున పోలవరంలో తప్పిదాలకు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో కేంద్ర సంస్థలు తప్పించుకోజాలవు. అవకతవకలకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలి. ముంపుపై శాస్త్రీయ సర్వే చేసి నిర్ధారించాలి. ఆగస్టులో గోదావరికి వరదల ముప్పు ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. అందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలి.

➡️