కవిత్వంలోకి వొంపిన జీవన వైభవం!

Mar 25,2024 05:30 #editpage

మనిషి కన్నా ముందు కవిత్వాన్ని రాసిందీ పాడిందీ ప్రకృతే! చెట్ల కొమ్మల మీద మెటాఫర్లు అంత్యప్రాసల నాట్యమాడుతాయి. వానచుక్కలు చెమటచుక్కల్ని కలుపుకొని మణిప్రవాళాలై పరుగులు దీస్తాయి. గాలి పాటకి తాళమేసే గరికపచ్చ గగనంలో కవిత్వపు పొద్దు పొడుస్తుంది. ప్రకృతంతా మాట్లాడాక ఆ వరుసలో చివరి కవితా శీర్షిక మనిషి.
చూరుకి వేళ్ళాడుతున్న రవికల గుడ్డ మెడని ముద్దు పెట్టుకున్నాక ఉండే అచేతనానికీ, ఉవ్వెత్తున ఎగసిపడే నవ యవ్వనపు చైతన్యానికీ కవిత్వం చుట్టమే, ఇది వయసు తప్పిన కవిత్వం ముసలాడిలో యువకుడిని చూపిస్తుంది, యవ్వనంలోకి అనుభవాన్ని మోసుకొస్తుంది. జీవితం కవిత్వం ఏ ఇద్దరికీ ఒకేలా అర్థమవవు. కవిత్వం కాలాన్ని కప్పుకొని పడుకున్న నిన్నటి జీవితం, అందుకే చదివిన ప్రతిసారీ కొత్తగా వినబడుతుంది. విన్న ప్రతి మాటా కొత్తగా చదివిస్తుంది. నాలుగు మాటల వాక్యమంత చిన్న జీవితం మనిషిది, పురుగుల మందు సీసా మూత తీసేంత సమయంలో చాలా జీవితాలు వాక్యాంతాల్లోకి ఒరిగిపోతాయి. అక్షరాలు మోయలేని బాధలెన్నో, కవిత్వంతో తుడవలేని కన్నీరెంతో, నక్షత్రాల అద్దం ముందు ముసుక్కప్పుకొని పడుకున్న మనిషి కళ్ళలోకి సూటిగా చూడలేక కవిత్వాన్ని పక్కకి తిప్పుకున్న కవులెందరో? మెట్టా నాగేశ్వరరావు కవి మాత్రం అక్కడే ఆగి ఒక్కడే నిలబడి గొంతెత్తి పాడుతున్నాడు. లోకమంతా చీకటిని ఒప్పుకున్నాక కూడా ఒక చిన్న వెలుగు రేఖని కలగంటున్నాడు.
ఏదో నాలుగు ప్రేమ కవితలు రాసుకొచ్చి మా చిగురు పెదాలపై చిరునవ్వులు మొలిపిస్తాడనుకుంటే, కోర మీసాల్ని రువ్వి పాత ప్రేమల్ని గుర్తు చేస్తాడనుకుంటే ‘నాగలికత’లు చెపుతున్నాడీ నాగరికత నేర్చిన లోకానికి. ప్రణయాక్షరాలు నేర్పుతాడనుకుంటే శ్రమాక్షరాలు దిద్దిస్తున్నాడు. ఇది నాకెంత మాత్రం నచ్చలేదు. అసలీ కవిత్వమే నచ్చలేదు. లేకపోతే రైతు బొమ్మల్ని మా దేహాలపై పచ్చ పొడిపించుకోమంటాడా? అక్షరాల కళ్ళాపిని మా బతుకు పొద్దుల మీద చల్లి మెలకువలోకి జారిపోమంటాడా? ముంతల కావడిని భుజానికెత్తుకుని చిటికెనేలుతో పసిపోరన్ని పట్టుకొని బతుకు తేనె జుర్రుకు తాగమంటాడా? ఎంత అస్తవ్యస్తమైన కవిత్వం ఇది. అవును… అస్తవ్యస్తమైన కవిత్వమే ఇది! ఎందుకంటే మనిషి జీవితం కూడా అలాంటిదే. దాన్నే అక్షరాలా చూపిస్తుంది. అందుకే అలాగే వుంటుంది. అలాగే ఉంది. నీకూ నాకూ నచ్చకపోయినా మెట్టా ఒక్కడే మొదలెట్టి ఒక్కడే ముగిస్తాడు. నీకూ నాకూ వినపడే దాకా ఆకాశం నుంచీ, అగాథం నుంచీ, అన్ని దిక్కుల నుంచీ అన్నీ కాలాల్లోకి కవిత్వాన్ని ఒంపుతూనే ఉన్నాడు. కవిత్వపు వైవిధ్యాన్ని నిత్యనూతనంగా కలగంటున్నాడు.
ఇక్కడ కవిత్వం సమయాన్ని దాటి పరిగెడుతుంది. ఇది వ్యాకరణం లేని కవిత్వపు భాష. ఎందుకంటే మూల భావనలకు వ్యాకరణం అవసరం లేదు; అప్పుడే పుట్టిన బిడ్డకి బట్టలు అవసరం లేనట్టుగా. చాలాసార్లు మెట్టా కవిత్వం చదివి పుస్తకం మూసేసాక నిశ్శబ్ధంలో అసలు కవిత్వం వినబడుతుంది. గుక్కపట్టిన బాల్యానికీ, తిక్కపుట్టిన యవ్వనానికీ, మార్మికాల మనిషికీ తాత్వికబోధ చేస్తున్నాడు తన కవిత్వంతో. కళ్ళు మూసుకొని వున్నప్పుడు కళ్ళు తెరిస్తే, దారంతా తరువు పూలవాన కురిస్తే, నిశాచరం పొట్టపగిలి వెలుగుల్ని ప్రసవిస్తే అనుభవించడానికి కవిత్వం కన్నా గొప్ప మాధ్యమం ఏముంటుంది? అలా అనుభవించి రాసిన అందమైన కవిత్వం ఇది.
ఇది నా కవిత్వం అని మెట్టా లోకానికి సాక్ష్యం చెబుతున్నాడు. కాలపు దారానికి కవిత్వపు పూసలు గుచ్చుతున్నాడు. నిశిరాతిరి నిద్దురని చెడగొట్టి మనసు చెవిలో ముచ్చట్లు చెప్పే ఆలోచనల జోరీగలు కవిత్వంలోంచి పుడతాయి. అమావాస్య చీకటికి తోటిమనిషి పున్నమి మోముని చూపించే వెలుగు దివ్వెలు కవిత్వంలోనే ఉద్భవిస్తాయి. అపరిచితాల రెక్కల్ని తెంపి మనసుల్ని కలిపే మహామంత్రాన్ని కవిత్వం కడుపునకంటుంది. ఇవన్నీ తెలిసి, కవిత్వం లోతూ, ఎత్తూ, బరువూ అన్నీ కొలిచి రాశాడు మెట్టా.
చెట్ల బెరళ్లకు గాయాల కాయలు కాస్తే సుతారంగా తాకి ఓదార్చడం తెలిసినోడికి, నాణానికి రెండోవైపు కూడా అపజయమే ఉన్నా గెలవడం తెలిసినోడికి, ఫ్రెంచ్‌, స్పానిష్‌, కొరియన్‌, రష్యన్‌, జర్మన్‌ యుద్ధాల క్షతగాత్రాల్ని తనలోనే పలికించి అనుభవించగలిగినోడికి మాత్రమే ఈ కవిత్వపు భాష తెలుసు. అక్షరాల మోముకి నిరాడంబరాల మెరుగులు దిద్ది, అనుభూతుల రసారవింద నేత్రాలతో శ్రామికతని నింపుకొని, భావోద్వేగాల హల్లులకి భాషతో తలకట్లు పెట్టి రాసిన కవితా సంకలనం ఇది. చీపురు చప్పుళ్లు సూర్యుడ్ని మేల్కొలిపినట్టు ఈ కవిత్వం మనిషిని మేల్కొలుపుతుంది.
సమూహాల భావజాలాలకి ఈ కవిత్వం subtitles , సమాజపు సినిమాకి ఈ కవిత్వం శ్రీవర, సగటు మనిషి చరిత్రకి ఈ కవిత్వం reference.
కవిత్వం ముఖంమీద రాసుకున్న self బయోగ్రఫీ. చూడగానే నువ్వెవరివో అర్థమవుతుంది. నీ భావనల వంతెనలు ఎక్కి నీ దరికి వచ్చే మస్తిష్కాలు కూడా నీలాగే ఆలోచిస్తాయి, నీ అనుభూతుల్ని సొంతం చేసుకుంటాయి. అందుకే నీకోసం మాత్రమే రాసుకునే కవిత్వం కూడా విశ్వజనీనమవుతుంది. విశ్వాన్ని నీలో చూసుకుంటే ఎల్లలు లేని మనస్సు విశ్వమంతా నిండి కవిత్వాన్ని శాశ్వతం చేస్తుంది. ఇక్కడ కూడా మెట్టా నాగేశ్వరరావు కేవలం వాళ్ళ ఇంట్లోంచో, వాళ్ల ఊర్లోంచో రాసిన కవిత్వం ఇది, కానీ అలాంటి ఇల్లులే, అలాంటి ఊర్లే మనవి కూడా, అందుకే ఆ కవిత్వం మనది అయింది. మనలాగే మనకు వినిపిస్తుంది. లోతైన గాఢమైన భాషలు కొన్నింటిని విందాం.
”సూర్యబావిలోంచీ కాంతిజలాన్ని తోడుకుని లోపలి తానం చేస్తాను/ నేనే సూర్యుడయ్యాక, బతుకొక వేకువరాగం పాడుతోంది”
జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, కాపాడుకుంటూ కవిత్వమై సాగుతానంటున్నాడు మెట్టా, కోరికల సంకెళ్లలో చిక్కుకోకుండా జ్ఞానజలంతో లోపలితానం చేసి వేకువరాగం పాడతానని సగర్వంగా ప్రకటించుకుంటున్నాడు.
”నేను సూఫీనవుతున్నాను/ హృదయాన్ని కన్నులుగా చూస్తున్నాను/ భ్రమలెపుడూ నా దృశ్యాలు కావడంలేదు”
ఈ వాక్యానికి ముందెప్పుడో మెట్టా సూఫీ అయ్యాడు. కన్నులతో చూస్తూ హృదయంతో దర్శించడం మొదలుపెట్టాడు. నిజాలనిచ్చెనలమీద అసలైన ప్రయాణానికి ఇది నాందీ వాక్యం.
”శబ్దాలన్నీ అలికిడిలోనే కాదు/ నిశ్శబ్దంలోనూ శబ్దాలుంటాయి/ పెదాల క్రమశిక్షణ నిశ్శబ్దానికి దారి”
అవును నిశ్శబ్దం కూడా భాషే! మాటల్లో చెప్పలేని ఎన్నో భావనలను నిశ్శబ్దంగా చెప్పొచ్చు. అసలు నిశ్శబ్దం ఉన్నతోన్నత భావవ్యక్తీకరణా ప్రక్రియ. పదాలమధ్య ఖాళీలతో కవిత్వం బాగా వినపడుతుంది.
”నీవు నేనూ ఒకటే శ్మశానం దగ్గర కలుసుకున్నాం/ బూడిదకుప్పగానూ సమానమయ్యాం!”
ప్రయాణాలన్నీ శ్మశానానికే అన్నట్టుగా అందరం అక్కడ కలుసుకొని మిగిలిపోయిన మాటల్ని మంటల్లో కలిపేసుకోవాల్సిందే. కుప్పపోసిన అసమానతలన్నీ అక్కడ కాలిపోవాల్సిందే. ఎవరి లోకంలో వాళ్ళున్నా అందరం ఒక్కటయ్యేది అక్కడే!
గులకరాళ్ళకు రెక్కలు కట్టి సాహిత్యాకాశంలో ఎగిరించిన కవి మెట్టా, తెల్లంగికీ చింతలతోపుకీ కొంకణి తీరానికీ కూడా కవితా సింహాసనమేసి కూర్చోబెట్టి గౌరవించాడు. పొక్కిలి లేచిన తండాల గుమ్మం ముందు కవిత్వంతో చుక్కలముగ్గులు పెట్టాడు. చీమలు, వాగులు, గడియారాలు, మబ్బులు అన్నింటితో కవితాక్షరాలనే దిద్దించాడు. లోకం ప్రేమదృశ్యమైంది. వాస్తవాలు చితిముందు చింతనలయ్యాయి, నదిమీది పడవలన్నీ అందమైన అక్షరాలయ్యాయి.
కవిత్వమంటే కేవలం ప్రతీకలే కాదు, ప్రత్యామ్నాయాలు కూడా. జీవన రణగొణ పరుగుల్లోంచి తప్పించి నడిపించే కళాత్మక మార్గం. ఆరుబైట పడుకుంటే వెన్నెలొచ్చి రాసే వెన్నపూస. కవిత్వం నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటుంది. నిన్ను నువ్వు మర్చిపోయేలా చేసి నిన్ను నీకు గుర్తు చేస్తుంది. కొంచెంసేపు కవి మెట్టాతో గడిపి మంచి కవిత్వాన్ని, మధ్య తరగతి జీవన వైభవాన్ని సంపూర్ణంగా అనుభవించే అవకాశం ఈ పుస్తకం. కవి మెట్టానాగేశ్వరరావుకి అభినందనలు.
– గౌతమ్‌ లింగా
దక్షిణాఫ్రికా
027630255994

➡️