ఎడారి బానిసల కన్నీటి వర్షం ‘ఆడుజీవితం’

Jun 17,2024 03:05 #aksharam

భారతీయ సాహిత్యంలో మలయాళ సాహిత్యం ఒక విశిష్టమైనది. సాధారణ జీవితాల్లోని పచ్చినిజాలను, విస్తారంగా పండించిన సాహిత్య పంటలసత్తువను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలు. ఆ వరుసలో కష్టాల కన్నీళ్ల వర్షంలో తడిచి ముద్దయిన ఒక వలసకూలీ జీవితపు అంగవస్త్రమే ‘బెన్యూమిన్‌’ కలం నుంచి వెలువడిన ‘ఆడు జీవితం’ నవల. రచయిత అసలు పేరు ‘బెన్ని డేనియల్‌’. అతడి కలంపేరు ‘బెన్యూమిన్‌’. ఈయన 1971 మే 18వ తేదీన కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఎన్జెట్టూర్‌ గ్రామంలో జన్మించాడు. 1992 నుంచి 2013 వరకు బహ్రెయిన్‌లోనూ, మరి కొంతకాలం ఆస్ట్రేలియాలోనూ నివసించాడు. మలయాళ కథా రచయితగా పరిచయమైన ఈయన 2008లో ‘ఆడుజీవితం’ అనే నవలను ప్రచురించాడు. అది భారీ విజయం సాధించడం తో అతడు మరింత చురుకైన, సుప్రసిద్ధ రచయితగా మారాడు.
సౌదీ అరేబియాలో వలస వచ్చిన కార్మికులను ఎలా బలవంతంగా బానిసలుగా మార్చుతారో వివరించే కథే ‘ఆడు జీవితం’ నవల. ఘనమైన సాంద్రత కలిగిన సన్నివేశాలతో, అబ్బురపరిచే శిల్ప చాతుర్యంతో, సజీవకత ఉట్టిపడే చిత్రీకరణతో, హృదయాలను ద్రవింపచేసే పాత్రల ద్ణుఖంతో, ఆకలి, అసహాయత పోటీపడి మనిషిని కృంగదీస్తూ కన్నీటితో కరచాలనం చేస్తూ ఈ నవల సాగిపోతుంది. చదివిన తరువాత ఈ నవల ఎక్కడికో పారిపోదు. మన జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిక్షిప్తమై పోతుంది.
ఈ నవలలోని కథను సంక్షిప్తంగా చర్చించాలంటే, ఈ నవల కథానాయకుడు ‘నజీబ్‌ మహమ్మద్‌’. కేరళలోని ఒక గ్రామంలో పడవ నడుపుకుంటూ జీవితం సాగిస్తూ వుంటాడు. కొత్తగా వివాహమైంది. క్రమంగా పడవకు గిరాకీ తగ్గటంతో, మెరుగైన ఆదాయం కోసం గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగం చేయాలను కుంటాడు. అదే గ్రామంలో తన చిన్ననాటి స్నేహితుడు ‘హకీం’ కూడా అదే ప్రయత్నంలో వుంటాడు. ఇద్దరూ కలిసి ఒక ఏజెంట్‌ సహాయంతో పాసుపోర్టు, వీసాలు సంపాదించి, విమానం ఎక్కి సౌదీలో ‘రియాద్‌’ విమానాశ్రయంలో దిగు తారు. తమను స్పాన్సర్‌ చేసిన వ్యక్తి ఎయిర్‌ పోర్టుకు రాడు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక బెంబేలు పడుతున్న స్నేహితులిద్దర్ని కొందరు అటుగా ట్రక్కులో వచ్చి బలవంతంగా వాళ్లను ఎక్కించుకుని తీసికెళ్తారు. రెండు గంటల ప్రయాణం తరువాత ఎడారి ప్రాంతం చేరి నజీబ్‌ ను ఒక చోట, హకీంను మరోచోట దింపి, చివరికి వాళ్లను మేకల, ఒంటెల కాపర్లుగా మారుస్తారు.
ఎడారిలో మేకల మధ్య నజీబ్‌ జీవితం దుర్భరంగా తయా రవుతుంది. రాత్రి పడుకోవటానికి సరైన చోటువుండదు. ఎముకలు కొరికే చలిలో, రోజుల తరబడి ఆకలితో నరకాన్ని అనుభవిస్తాడు నజీబ్‌. కూర లేకుండా ఎండిపోయిన రొట్టెలు తినటానికి ఇస్తారు, తాగటానికి నీళ్లు సైతం తగినంతగా అందించరు. స్నానానికి అసలు అవకాశం వుండదు. తాను చేస్తున్న పనిని పర్యవేక్షించటానికి ఒక సూపర్వైజర్‌ దూరం నుంచి బైనాక్యులర్‌తో రోజూ గమనిస్తూనే వుంటాడు. ఏమాత్రం తేడా వచ్చినా శిక్షలు ఘోరాతిఘోరంగా వుంటాయి. మేకల మధ్య బానిస బతుకు నిత్యం కన్నీళ్ల వర్షాన్ని కురిపిస్తూ సాగిపోతూ వుంటుంది. క్షణ క్షణం తన భార్య, తల్లి గుర్తుకు వచ్చి తల్లడిల్లిపోతూ వుంటాడు. తప్పించుకుని పారిపోదామని ఒకసారి ప్రయత్నం చేస్తే, తెలిసి తన యజమాని షూట్‌ చేస్తాడు. బుల్లెట్‌ కాలికి తగిలి గాయపడతాడు. తనలాగా తప్పించు కోవటానికి ప్రయత్నించినోళ్లు ఎలా కళేబరాలుగా మారి పోయారో ఇసుకను తవ్వి శవాలను చూపిస్తారు. చూసి వణికి పోతాడు నజీబ్‌.
తిండిలేక, శరీరానికి సరైన పోషణలేక గడ్డం మీసాలు పెరిగిపోయి, శరీరం శుష్కించిపోయి, కళ్లు లోనికి వెళ్లిపోయి, శరీరం స్నానంలేక పాలిపోయి, వికారంగా తయారయ్యి, ఒంట్లో నుంచి ఎముకలు పొడుచుకుని బయటికి వస్తూ వుంటాయి. ఒకసారి తన గుడారం దగ్గరికి వచ్చిన వ్యాను అద్దంలో తన ముఖాన్ని చూసుకుని, అసలు మనిషి పోలికలు లేని తన వికారమైన ఆకారాన్ని చూసి కెవ్వుమని కేకలు వేసి, బావురుమని ఏడుస్తాడు. ఆ నిస్సహాయ స్థితిలో మేకలలో తానూ ఒక మేకగా బతుకుతూ, రోజూ కన్నీళ్లు తోడుగా జీవిస్తూ వుంటాడు.
యాదృచ్ఛికంగా ఒకరోజు ఎడారిలో తన స్నేహితుడు హకీంను కలుస్తాడు నజీబ్‌. వీళ్లకుతోడు ఈజిప్టునుంచి వచ్చిన కాదిరీ కూడా జత అవుతాడు. ఒకరి బాధలు ఒకరు చెప్పు కుంటారు. ఒకరి కన్నీళ్లని మరొకరు తుడుస్తారు. ముగ్గురు కలిసి ఈ ఎడారి నరకం నుంచి పారిపోదామని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అదునుచూసి ఒకరోజు ముగ్గురు కలిసి పారిపోతారు. ఎన్నిరోజులు నడిచినా ఎడారి తరగటం లేదు. అలసిపోతున్నారు. ఆకలి, దాహం తట్టుకోలేక పోతున్నారు. అడుగులు ముందుకు కదలటంలేదు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న హకీం మధ్యలోనే ప్రాణాలు వదులుతాడు. స్నేహితుడి చావును చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు నజీబ్‌. స్నేహాతుడి శవాన్ని వదల్లేక వదులుతూ కాదిరీతో కలిసి తిరిగి, ప్రయాణం మొదలుపెడతాడు. కొంతదూరం వెళ్లాక ఇసుక తుఫాను కాదిరీని బలి తీసుకుంటుంది. ఏకాకిగా మిగిలి పోతాడు నజీబ్‌. తనకు ఎడారిలో చావు తప్పదనుకుంటాడు. ఒకరోజంతా నడిచిన తరువాత రోడ్డు కనిపిస్తుంది. విపరీతంగా వాహనాలు వెళుతూ వుంటాయి. ఏ వాహనం ఆగదు. చివరకు ఒక అరబ్‌ షేక్‌, నజీబ్‌ను తన వాహనంలో ఎక్కించుకుని టౌన్‌లో దింపుతాడు. కొందరు నజీబ్‌ను చూసి జాలిపడి ఆసుపత్రిలో చేర్పిస్తారు. నజీబ్‌ దగ్గర పాసుపోర్టు, వీసా వుండవు. అవి లేకుండా సౌదీలో తిరగటం నేరం. ఆ విషయం పోలీసులదాకా వెళ్లి నజీబ్‌ ను జైలుకు తీసికెళ్తారు..
ఎడారి కంటే జైలుజీవితంలో కొంత స్వేచ్ఛను అనుభవిస్తాడు నజీబ్‌. జైలులో స్నానం చేయటానికి అవకాశం రాగానే నగంగా పరిగెత్తి స్నానం చేస్తాడు. జైలులో తన మంచితనం చేత అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. పారిపోయి వచ్చిన బానిసల కోసం ఆయా యజమానులు జైళ్లకు వచ్చినప్పుడు, ఖైదీలను హాజరుపరుస్తూ వుంటారు. తమ పనివాళ్లను గుర్తుపట్టిన యజమానులు తిరిగి వాళ్లను తమ వెంట తీసికెళ్లిపోతూ వుంటారు. ఆ క్రమంలో నజీబ్‌ యజమాని కూడా ఆ జైలుకు వచ్చి నజీబ్‌ గురించి వెదుకు తాడు. ఇప్పుడు నజీబ్‌ కు గడ్డం, మీసాలు లేవు. కొంచెం ఆరోగ్యంగా కూడా వున్నాడు. జైలుకొచ్చిన నజీబ్‌ యజమాని అతన్ని గుర్తించలేకపోతాడు. చివరకు తనకథంతా తెలుసుకున్న జైలరు, నజీబ్‌ జీవితంపట్ల చాలా సానుభూతిని ప్రకటించి, నజీబ్‌ విడుదల కోసం సహాయం చేస్తాడు. మొత్తంమీద సౌదీ అరేబియా, ఇండియా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగి సజీబ్‌ లాంటి వలస కూలీలను స్వదేశానికి తిరిగిరావటానికి ఒక విమానాన్ని ఏర్పాటు చేస్తారు. నజీబ్‌ జైలునుంచి విడుదలై విమానం ఎక్కుతాడు. లోపల అంతా తనలాంటివాళ్లే. వాళ్ళంతా ఆ క్షణంలో మేకల్లాగా కనిపిస్తారు. తానూ ఆ మేకల్లో ఒక మేకై ఆ మందలో కూర్చుంటాడు, విమానం గాలిలోకి ఎగురుతుంది, నవల ముగుస్తుంది.
వాస్తవంగా నజీబ్‌ అనే వ్యక్తి గల్ఫ్‌ ఎడారుల్లో బానిస జీవితాన్ని అనుభవించి వచ్చినవాడు. అతడి నిజ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ‘బెన్యూమిన్‌’ ఈ నవల రాశాడు. ఈ రచన ద్వారా కేరళ సాహిత్య ఆకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్న ‘బెన్యూమిన్‌’ 2021లో ‘మంథలిరిలే’ అనే నవలకు ‘వాయిలార్‌’ అవార్డును అందుకోవడమే కాకుండా ‘మ్యాన్‌ ఏసియన్‌ లిటరరీ ప్రైజ్‌ కు ఎన్నికయ్యాడు కూడా. 2008లో అబుదాబి అవార్డు, 2015లో పద్మప్రభ సాహిత్య పురస్కారం, 2019లో ‘ముత్తాతు వర్కీ అవార్డు ఈ నవలకు లభించాయి. ఈ నవల అరబిక్‌, నేపాలీ, తమిళం, ఒడియా, థారు భాషల్లోకి అనువాదమైంది. ‘కేరళ లిటరరీ అవార్డు’తో పాటు, దక్షిణ సాహిత్య బహుమతి కోసం ఎంపికైంది. కేరళలో నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఈ నవల పాఠ్యాంశంగా ఉంది. ఈ నవలను ‘జోషఫ్‌ కోయిపల్లి’ ఇంగ్లీషులోకి ‘ది గోట్‌ డేస్‌’ పేరుతో అనువాదం చేశాడు. ఇంగ్లీషులోకి ఈ నవల వచ్చాక దీనిని జెట్‌ మీడియా ప్రొడక్షన్స్‌, అల్టాగ్లోబల్‌ మీడియా కలిసి ‘ది గోట్‌ లైఫ్‌’ పేరుతో సినిమా నిర్మించారు. ఈ సినిమాను ఆస్కార్‌ అవార్డుకోసం పంపుతారనే వార్త కూడా వినిపిస్తోంది.
ఈ నవల పాఠకులను మైమరపించటమే కాదు, హృదయాన్ని కదిలించి కన్నీరు కార్పించగల సత్తా కలిగిన
ఉత్తమ మలయాళ నవల ‘ఆడుజీవితం’. సన్నివేశాల రూపకల్పనలో రచయిత పాటించిన సాహిత్య ప్రమాణాలు, నవల నడకలో సాగిన చిక్కదనం, పాత్రల రూపకల్పన వగైరాలు చాలాకాలంపాటు పాఠకులకు గుర్తుండిపోతాయి. మరచిపోలేని ఒక గొప్ప సాహిత్య సంపదను ఆత్మీయంగా అందించిన ‘ఆడుజీవితం’ నవల రచయిత ‘బెన్యూమిన్‌’కు హృదయపూర్వక అభినందనలు.

– డా.కె.జి.వేణు
98480 70084

రచయిత బెన్యూమిన్‌

 

➡️