రంగుల కల

Dec 24,2023 13:57 #Sneha

ఏంటో నేను మా ఇంట్లో

పెంచుకునే పెంపుడు కుక్కకు

కొద్దిరోజుల నుంచి

తెగ ముద్దొచ్చేస్తున్నాను..

నా పేగు తెంచుకున్న

నా బిడ్డ కంటే ఎక్కువగా

నా వెనక తిరుగుతూ

తెగ ప్రేమించేస్తోంది..

కూరగాయల కోసం బుట్టలో

డబ్బులు, కాయితం

పెట్టీ పెట్టగానే

అల్లావుద్దీన్‌ పూనినట్టు

సరుకులు, కూరలు

ప్రత్యక్షమైపోతున్నాయి..

నన్ను నడవనివ్వకుండా

తోకూపుకుంటూ

వెళ్లి గొడుగు తెచ్చి మరీ

చేతిలో పెడుతోంది..

పనమ్మాయికి భౌభౌ పాఠాలు

చెప్తూ దగ్గరుండి

మరీ పనులు చేయించేస్తోంది..

మా పిల్లాడి స్నానానికి

దగ్గరుండి మగ్గుతో

నీళ్లందిస్తూ

తల్లో నాలుకలా

తయారైపోయింది..

రంగుల కండువాలు కప్పుకుని

కరపత్రాలేసుకొస్తున్న

పాత సీసాలో కొత్త నాయకుల

వాసనలంటుకున్నాయేమో..

ఏదైనా కొత్త హామీ

దొరికిందేమో కానీ..

పూటకో రంగును

పులుముకుని

నాతో సెల్ఫీలు

కూడా దిగుతోంది..

నన్ను చూస్తేనే

కరిచేలా గాండ్రించే

పులిలాంటి కుక్క

ఇప్పుడు పిల్లిలా

తయారయ్యింది..

పెడిగ్రీ కోసమో

పెరుగన్నం

కోసమేమో అనుకున్నా..

కానీ లేట్‌గా

అర్థమయ్యింది..

త్వరలో

మరణించబోయే నా శరీరంలో

అణువణువును నాలుగేళ్ల

పాటు ఆస్వాదించడం

కోసమే రంగుల

ప్రపంచంలోకి

లాక్కెళుతోందని..

కళ్ళు బైర్లు కమ్మే

ఈ రంగులెంత

విచిత్రమైనవో కదా..

మన జీవితాల్ని

చిటికెలో మార్చేస్తాయి..

ఎన్నికలలో..

ఈ రెండు కాళ్ళ హచ్‌డాగ్‌లకు

ఈ ఐదేళ్ళ ఋతువులో..

ఎన్నెన్ని మాయా క్రతువులో..!

అమూల్య చందు9059824800

➡️