నా దృష్టిలో కథే హీరో!

Nov 26,2023 09:33
actress varalakshmi profile

స్టార్‌ హీరో కూతురు కన్నా.. ప్రత్యేక నటిగా గుర్తింపు పొందేవాళ్లల్లో తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముందుంటారు. కెరీర్‌ ప్రారంభంలో ఆమెకు అపజయాలు ఎదురైనా, మనసుకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. కొత్తగా విడుదలైన ‘కోట బొమ్మాళి పిఎస్‌’ సినిమాలో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించి- తమిళ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

వరలక్ష్మి తమిళ, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించారు. ఆమె 2012లో తమిళంలో విడుదలైన ‘పోడా పోడి’ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. హీరోయిన్‌గా చేసిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఆ సమయంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ని హీరోయిన్‌గా పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ‘చూడటానికి చాలా లావుగా ఉంది. యాక్టింగ్‌ రాదు, ఏం రాదు’ అంటూ మొదట్లో చాలా కామెంట్స్‌ చేశారు. ‘వాటి వల్ల నేను చాలా బాధపడ్డాను. ఒక్కోసారి సూసైడ్‌ చేసుకోవాలనిపించేది. కానీ ఈ కామెంట్‌ చేసేవాళ్లకి.. నేనేంటో, నా యాక్టింగ్‌ ఏంటో సినిమాల్లో చేసి చూపించాలనే సంకల్పంతో ముందుకు వచ్చాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అప్పుడే ఆమె సరైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం హీరోయిన్‌ రోల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, క్యారక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌, లేడీ విలన్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ అయ్యారు. అంతేకాదు.. శరీర కసరత్తు చేసి, ఏకంగా 30 కేజీలు తగ్గారు. దాంతో వరుస అవకాశాలు వచ్చాయి. సౌత్‌లోనే మోస్ట్‌ డిమాండ్‌ ఉన్న లేడీ విలన్‌గా గుర్తింపు పొందారు. అనుకున్నట్టుగానే ప్రతీ ఒక్క మూవీలోనూ తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇండిస్టీకి వచ్చిన కొత్తలో వరలక్ష్మి ప్రేమ, పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో, ఇంటర్వ్యూస్‌లో ఇచ్చే స్టేట్మెంట్స్‌పై ట్రోల్‌ చేయడం, రూమర్లు, వివాదాలు ఎదుర్కొన్నారు. మొదట్లో ఇవన్నీ ఇబ్బంది కలిగించినా ఇండిస్టీలో ఉంటే ఇవన్నీ కామన్‌ అని సర్దుకుపోయారు. ‘రవితేజ హీరోగా వచ్చిన ”క్రాక్‌” చిత్రంలో చేసిన జయమ్మ పాత్ర తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సినిమాలు చేసే టైమ్‌ లేనంతంగా తెలుగు చిత్రాలు చేస్తున్నాను. దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తుండటం సంతోషంగా ఉంది. అలాగే ‘యశోద’ లో నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేశా. తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే హైదరాబాద్‌లోనే స్థిరపడిపోవాలి అనిపిస్తోంది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ లో హీరో శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. ఇది ఈ మధ్య విడుదలయ్యింది. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.’నా దృష్టిలో కథే హీరో. అందులో నటించే పాత్రలు ఒకరు ఎక్కువ. మరొకరు తక్కువ అని కాదు. ఆ దృష్టితోనే నేను నా పాత్రలు ఎంచుకుంటున్నా. ”కోట బొమ్మాళి” సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. అందులో భాగంగా ఈ పాత్ర ఉంది. పరిస్థితులు డిమాండ్‌ నేపథ్యంలో సిగిరెట్‌ కాల్చే సీన్‌ ఉంటుంది. అయితే ప్రతి స్క్రిప్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. పోలీసులపై పొలిటికల్‌ ప్రెజర్‌ ఏవిధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్‌. క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌లా అందర్నీ థ్రిల్‌ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్‌ చేయడమే నా గోల్‌. వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలని ఎప్పుడూ భావిస్తా. లేడీ ఓరియంటెండ్‌ సినిమాలతో పాటు, క్యారెక్టర్‌ నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. సంక్రాంతికి నేను నటించిన ‘హనుమాన్‌’ విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో కలిసి ‘మ్యాక్స్‌’ చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు వచ్చాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ చేస్తా’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.

జననం : 1985 మార్చి 5
తల్లిదండ్రులు : ఆర్‌. శరత్‌కుమార్‌, ఛాయ శరత్‌కుమార్‌
నివాసం : బెంగళూరు
ఇతర పేర్లు : వరు
విద్య : హిందూస్తాన్‌ ఆర్ట్స్‌, అండ్‌ సైన్స్‌ కాలేజీ(బీఎస్సీ)యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌ బర్గ్‌ (మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్మెంట్‌)

➡️