మబ్బు తెరపై మసక బొమ్మలు

Feb 18,2024 08:34 #Sneha, #Stories
Blurred figures on a hazy screen

మబ్బు తెరపై మసక బొమ్మలు

దబ్బు దబ్బున పరుగులెత్తే

మబ్బు గుంపులు చూడముచ్చట!

కన్నులకు కనిపించె వింతగ

కొన్ని బొమ్మల రూపమచ్చట!!

 

చల్లచల్లగ అడుగులేస్తూ

పిల్లియొకటగుపించె ముందుగ!

క్షణములోనే నెమలిలాగా

కానవచ్చెను కడు పసందుగ!!

 

కదిలె మబ్బులు మెల్ల మెల్లగ

కన్నులార్పక చూచుచుండగ

అవ్వ కనబడె బువ్వ తింటూ

అయ్యె నాకది కనుల పండుగ!!

 

మబ్బుతెరపై మసక బొమ్మలు

మార్పు జెందుట చూచుచుంటిని!

ప్రక్కనున్నా చిన్ని తమ్ముని

ఒక్కసారవి చూడమంటిని!!

 

అక్కడే చూస్తుంటి నక్కా

ఒక్కటీ కనిపించకున్నా!

అనెను తమ్ముడు చిన్నబోతూ

అలా ఎందుకు అనెను నాన్నా!!

 

పెద్దదానివి కదా నీవూ

పిన్నవాడే కదా తమ్ముడు!

నీకుగల ఊహించు శక్తీ

లేకవాడటులనెను అమ్మడు!!

 

కవికి, సామాన్యునికి తేడా

కలదు ఇట్టులె లోకమందూ!

ఊహలకు మరి రెక్కలొస్తే

ఉండునిట్టులె కనుల విందూ!!

 

నాన్న మాటలు విన్న మీదట

నా మనస్సున బాధ తరిగెను!

మబ్బు తెరపై మసక బొమ్మలు

మంచి విషయం బోధపరిచెను!!

 

– అలపర్తి వెంకట సుబ్బారావు, 94408 05001

➡️