రంగులు

Mar 24,2024 09:19 #Sneha

నాన్న సూపర్‌ మార్కెట్‌కి వెళ్తుంటే, సరదాగా ట్రాలీ పట్టుకుని తిరిగి చిప్స్‌ ఏవైనా కొనుక్కోవచ్చు అని నేను కూడా వెళ్ళాను. వెళ్ళి అమ్మ చెప్పిన సరుకులు సరిగ్గా చూస్తూ, డౌట్స్‌ వస్తే కాల్‌ చేసి కన్ఫర్మ్‌ చేసుకుని ట్రాలీ సగానికి నింపాము. హెల్దీ స్నాక్స్‌ అని నచ్చచెప్పుకుని, కొన్ని చిప్స్‌ కొన్నా, నాన్నేమో నిర్మొహమాటంగా హై కాలరీస్‌ ఉన్న ఐస్‌క్రీమ్‌ కొన్నాడు. ఇవన్నీ సులువే, బిల్‌ వెయ్యడానికి పే…..ద్ద లైన్‌లో నించోవాలి. మోస్ట్‌ బోరింగ్‌ పార్ట్‌ ఆఫ్‌ షాపింగ్‌. హూ అనుకుంటూ, అటూ ఇటూ కదులుతూ, కాలు కదుపుతూ నిస్సహాయంగా నించున్నా.
హోలీ సీజన్‌ కదా, కాష్‌ కౌంటర్స్‌ నిండా, అప్పుడే వచ్చిన, ఫ్రెష్‌ కలర్స్‌, పిచ్కారీలు, వాటర్‌ గన్ల కొత్త కొత్త స్టాక్‌ పెట్టారు. ఆ బోరింగ్‌ వెయిట్‌ టైంలో, కాస్త ఎంటర్టైన్‌ చేశాయి. వాటికి మధ్యలో పెట్టిన అట్రాక్టివ్‌ బ్రైట్‌ పింక్‌ కలర్‌లో ఉన్న వాటర్‌ గన్‌ నన్ను ఆకర్షించింది. నాకన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ప్రేమతో దాన్ని చూస్తోంది ఓ పోనీ టైల్‌ బుడ్డి పాప. దాన్ని సరదాగా ఏడిపిద్దామని, ‘వో బహుత్‌ అచ్ఛా హై నా, లేలో’ అన్నాను. నేనేదో ప్రెసిడెంట్‌ అవ్వమన్నట్టు అవాక్కయి, ‘నహీ నహీ’ అని తల అడ్డంగా ఊపింది. ఏదో కొంటెగా అల్లరి సమాధానం ఇస్తుందనుకుని ‘క్యూం?’, అని అడిగా. ‘పైసె నహీ హై’ అని చాలా సాధారణంగా జవాబు చెప్పింది, దాని ప్రేమంతా పెట్టేసి, ఆ వాటర్‌ గన్‌ను, పింక్‌ నైల్‌ పాలిష్‌లో ఉన్న దాని బుల్లి చేతులతో తడుముతూ. అదేంటో.. సడన్‌గా నాకు బాధొచ్చేసింది. ఆ గన్‌కి ఒకవేళ ప్రాణముండుంటే, ఎలాగైనా ఆ పిల్ల దెగ్గరకు వెళ్ళిపోయేదేమో అనిపించింది.
ఎవరీ పాప అని షాప్‌ వాళ్ళని అడిగా, కింద సెక్యూరిటీ గార్డ్‌ కూతురు అని చెప్పారు. ‘ఆప్కో వో చాహియే క్యా?’ అని అడిగితే, అప్పటిదాకా నిరాశతో ఉన్న కళ్ళను, పెట్రమాక్స్‌ లైట్లు చేసేసుకుని, ‘హా హా’ అంది. సరే కొందామా, వాళ్ళ నాన్నకి నచ్చుతుందా అని సందేహిస్తూ, కాష్‌ కౌంటర్‌ దగ్గర పెట్టాను. ఆ పిల్ల దానికి ఎగరేస్తూ, ఆ గంతుల్లో, దాని ‘థాంక్యూ’ అన్న మాట కూడా అదిరిపోతూ వస్తోంది. అలా కొనివ్వగానే, దాని గుండెల దెగ్గర పెట్టేసుకుని, గట్టిగా పట్టేసుకుని, నా గుండె పిండి పారేసింది. నేను షాప్‌ వదిలి వెళ్లినంత వరకు నాకేసి నవ్వుల ప్రేమ చూపులు చూస్తూనే ఉంది.
చిన్నప్పుడు నేను చదువుకోడానికి చిరాకు పడుతుంటే, నాన్న వచ్చి, మల్లికా నీకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కదా, బాగా చదువుకుని ఫుల్లు డబ్బులు సంపాదించేసావనుకో, బోలెడంత మంది చిన్న పిల్లలకి ఏవి కావాలంటే అవి కొనేయచ్చు, అని చెప్పేవారు. I dont remember the impact this made back then, but I now realized the importance of what money can actually give you. కష్టం, చిరాకు అనుకుంటున్న ఈ సాఫ్ట్వేర్‌ జాబ్‌ నేను ఎప్పటికీ మానను అనుకున్నా.
హమ్మయ్య అని నాకే తెలియకుండా గర్వంగా మెట్లు దిగి షాప్‌ బయటకు వస్తుంటే, వెనుక ఏవో ఏడుపులు, అరుపులు. ఏంటా అని చూస్తే, అక్క చేతిలోని వాటర్‌ గన్‌ చూస్తూ, కళ్ళలో ఏడుపు నీళ్ళు నింపేసుకుని ఏడుస్తోంది ఇంకో బుడ్డి మొహంది. ఓసి నీ.. ఆగు వస్తున్నా అనుకుంటూ, గూగుల్‌ పే ఓపెన్‌ చేసి, షాప్‌కి వెనక్కి వెళ్ళాను.

➡️