అక్కడక్కడా.. అరుదుగానైనా!

Feb 4,2024 07:29 #Sneha, #Stories
doctor story

‘ఇదంతా పెద్ద బిజినెస్‌ స్ట్రేటజీలేరా జయా. ఇదిగో ఈ పక్కన మందులషాపు కనిపిస్తోంది కదా.. దాని అర్థమేంటో తెలుసా? ఈ మహానుభావుడు రాసిన మందులు ఇక్కడే కొనుక్కొని తీరాలని, చెప్పకుండానే చెప్పడం అన్నమాట! అంటే.. ఫీజులో ఒకచేత్తో ఇలా ఇచ్చిన రాయితీని, మందుల్లో రెండోచేత్తో అలా తిరిగి లాగేసుకుంటాడన్న మాట. ఎంతమందిని చూడలేదు ఇలాంటి డాక్టర్లని ఈ నాలుగేళ్లలో..’ అరిచినంత పనిచేశాడు సిద్ధార్థ ‘డాక్టరుగారి ఫీజు ఐదువందలేనటరా సిద్ధూ..’ అంటూ మొహమింత చేసుకొని చెప్తున్న జయకుమార్‌ వైపు కోపంగా చూస్తూ.

చదువుతున్న పేపర్లో నుంచి తలెత్తి, ‘మరీ అంత గట్టిగా మాట్లాడకురా బాబూ. ఇక్కడ పనిచేసేవాళ్ళు వింటే బాగుండదు అన్నాడు జయకుమార్‌ ఆందోళనగా చుట్టూ చూస్తూ.

‘ఒకసారి అలా చూడు..! బుద్ధుడు, వివేకానందుల సూక్తులే ఎటు చూసినా! ఈయన కూడా నువ్వనుకుంటున్నట్టు అందరిలాంటి వాడే అయితే, ఇవన్నీ ఇంత ధైర్యంగా, ఇలా తగిలించుకునే వాడంటావా?’ అడిగాడు నెమ్మదిగా.

‘దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయన్న మాట.. ఎప్పుడూ వినలేదా నువ్వు?’ తిరిగి ప్రశ్నించాడు సిద్ధార్థ విసురుగా.. పేపర్లో నుంచి కనీసం కళ్ళైనా కదల్చకుండా.’వీడింతే. ఇక మారడు. అయినా వీడిని అనుకొని ఏం లాభంలే.. ఎవడో చేసిన నిర్వాకానికి నరకయాతన అనుభవిస్తున్నాడు పాపం!’ అనుకున్నాడు జయకుమార్‌ స్నేహితుడి వైపు జాలిగా చూస్తూ. తర్వాత కుర్చీలో విశ్రాంతిగా జారబడి కూర్చొని కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి జారిపోయాడు.

*********************************

ఎన్నాళ్ళిలా బాధపడతావురా సిద్ధూ? విజయవాడలో మంచి డాక్టర్‌ ఒకాయన ఉన్నాడట. చాలా సమర్ధుడట. మా బంధువొకరన్నారు మొన్న. ఆయన్నొకసారి కలిస్తే బాగుంటుందనిపిస్తోంది’ అన్నాడు జయకుమార్‌. సలుపుతున్న దవడ మీద చేత్తో గట్టిగా రుద్దుకుంటున్న సిద్ధార్థతో.

బాధా, కోపం సమ్మిళితమైన దృక్కులు సారించాడు సిద్ధార్థ మిత్రుని వేపు. జవాబు చెప్పకుండా మొహం తిప్పుకున్నాడు విసురుగా. సిద్ధార్థ దగ్గర నుండి సమాధానమేమీ రాకపోవడంతో అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు జయకుమార్‌. ‘డాక్టర్ల ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా జయా నీకు? నాలుగేళ్ళలో ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగానో, ఎంత సొమ్ము తగలేశానో నీ కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? జలగలు రక్తం పీల్చినట్టు లక్షలు పీల్చేసినవాళ్లే గానీ, మానవత్వం ఉన్నవాడు ఒక్కడంటే ఒక్కడు.. ఎక్కడైనా కనబడ్డాడా మనకి? అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడెవడో మంచి డాక్టర్‌ ఉన్నాడట.. అక్కడికి వెళ్దాం పద.. ఇక్కడ ఇంకెవడో ఉన్నాడట.. ఇక్కడికి వెళ్దాం అంటూ ఇలా చంపుకు తింటావెందుకు నన్ను?’ గట్టిగా అరిచాడు సిద్ధార్థ.

నాలుగేళ్ళుగా సిద్ధార్థ ఎంత బాధ అనుభవిస్తున్నాడో తెలిసినవాడూ, ప్రత్యక్షంగా చూస్తున్నవాడూ గనుక, కోపం తెచ్చుకోలేదు జయకుమార్‌ కూడా. మౌనంగా ఉండిపోయాడు.

***********************************

పంటినొప్పికని వైద్యం కోసం వెళ్తే, అటు, ఇటు తిరిగి, అది చివరికి మరేదో జబ్బు అని తేలింది. అప్పటివరకూ ఎటువంటి అనారోగ్యానికీ లోనుకాకుండా, చక్కటి ఆరోగ్యంతో తొణికిసలాడుతూ, రోజుకు పది కిలోమీటర్లు సునాయాసంగా నడిచే సిద్ధార్థ నెత్తిన పిడుగుపడ్డట్టైంది. అతనూ, అతనితో పాటు అతని భార్యాపిల్లలూ అమితమైన ఆందోళనకూ, మానసికవత్తిడికీ గురయ్యారు.

ఆ వ్యాధి నివారణకు శస్త్రచికిత్స తప్ప మరొక మార్గం లేదనీ, అది కూడా వారం పది రోజుల్లోపు జరిగిపోవాలనీ, ఆలస్యం చేస్తే వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించి, ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనీ చెప్పి, విపరీతమైన భయాందోళనలకు గురిచేశారు కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు.

స్నేహితులంటూ పెద్దగా లేని సిద్ధార్థకు, తనకు సంభవించిన విపత్తు గురించి ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి సలహా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. దానికితోడు కనీసం ‘సెకండ్‌ ఒపీనియన్‌’కు వెళ్లాలన్న ఆలోచన కూడా కలగలేని సందిగ్ధస్థితిలో సిద్ధార్థ ఉన్నాడు. పర్యవసానంగా వైద్యులు చెప్పిన సలహాను పాటించి, వారు సూచించినట్టు శస్త్రచికిత్స చేయించుకున్నాడు వెనకా ముందూ ఆలోచించకుండా. దానితో పాటూ, చికిత్సలో భాగమైన ‘రేడియేషన్‌ థెరపీ’, ‘కీమో థెరపీ’ వైద్యం తీసుకున్నాడు. ఆ చికిత్సలు రెండూ మొదలయ్యాకగానీ అర్థం కాలేదు.. వచ్చిన రోగానికి, చేసే వైద్యం ఎంత భయంకరమైన హింసో. నెలరోజులపాటు సాగిన రేడియేషన్‌ థెరపీ నరకం చూపించి వదిలిపెట్టింది. దాని ప్రభావంవల్ల నోరంతా పుళ్ళు పడిపోయి, చల్లటి నీరు తాగినా, నిప్పులు పడ్డట్టు భగ్గుమని మండిపోయేది. దానికితోడు మొహమంతా నల్లగా మాడిపోయి, చంటిపిల్లలు చూస్తే జడుసుకునేలా భయంకరంగా తయారయ్యింది.

ఇక కీమోథెరపీ గురించి చెప్పనే అక్కర్లేదు. ఒక సెషన్‌ అయ్యాక వారంరోజుల పాటు దారుణమైన నీరసం, నిస్సత్తువా అవహించి, నాలుగడుగులు వేయడానికి కూడా శక్తి ఉండేది కాదు. తిండి సహించేది కాదు. బలవంతంగా ఏదైనా కొంచెం తింటే, తిన్నది లోపల ఇమిడేది కాదు. బయటకు వాంతుకొచ్చేసేది. వీటికితోడు, నెత్తిమీద జుట్టంతా ఊడిపోయి, బోడిగుండై పోయింది.

పర్యవసానంగా భయంకరమైన మనోవేదనకూ, ఆత్మన్యూనతకూ గురయ్యాడు సిద్ధార్థ. భార్యనూ పిల్లల్నీ తప్పా ఇంకెవరినీ కలిసేవాడు కాదు. ఆఖరుకు స్నేహితుడు జయకుమార్‌కి కూడా దూరంగా ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడానికి ఆసక్తి చూపని ఏకాకిగా, విరక్తితో పరమకోపిష్టిగా మారిపోయాడు. అయితే అది ఆరంభం మాత్రమేననీ, అసలు కథ ముందుందనీ అనతికాలంలోనే అర్థ్దమైంది సిద్ధార్థకు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమోగానీ, ఆపరేషన్‌ జరిగిన భాగంలో విపరీతమైన నొప్పి మొదలైంది. రెండుమాటలు మాట్లాడినా, రెండుముద్దలు తిన్నా భరించలేని బాధతో గిజగిజలాడి పోయేవాడు.

‘నొప్పి భరించలేకపోతున్నాను మొర్రో’ అని గోలపెడుతుంటే, ‘యు హావ్‌ టు బేర్‌ విత్‌ ద పెయిన్‌ బీ ఇట్‌ విల్‌ టేక్‌ సమ్‌ టైం టు కమ్‌ డౌన్‌’ అన్న పొడిపొడి ఇంగ్లీషు సమాధానం చెప్పారు డాక్టర్‌. ఎందుకంత తీవ్రమైన నొప్పి వస్తోందో, దానికి కారణమేంటో, ‘సమ్‌ టైమ్‌’ అంటే.. అది ఎంతకాలమో స్పష్టంగా చెప్పే నాథుడు ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడలేదు అంత పేరు మోసిన ఆస్పత్రిలో.

ఇక ఆపరేషన్‌ చేసిన సర్జన్‌ అయితే ‘ముత్యాలముగ్గు’ సినిమాలో నూతనప్రసాద్‌లా బహుమితంగా భాషించే మితభాషి. అంతమాత్రం కూడా మాట్లాడేవాడు కాదు. ‘నాలుగేళ్ళ నుంచీ నెలకొకసారైనా సందర్శించుకుంటున్నా ఆ డాక్టర్‌ని.. వెళ్ళిన ప్రతిసారీ, అప్పుడే మొదటిసారి చూస్తున్నవాడిలా నిర్వికారంగా చూస్తాడే తప్ప, కనీసం గుర్తుపట్టినట్టైనా కనబడడురా మహానుభావుడు.

నొప్పి భరించ లేకపోతున్నాను మొర్రో అని మొరపెట్టుకుంటే, మొక్కుబడిగా దవడ మీదా, మెడ మీదా అటూ ఇటూ వేళ్ళతో పొడిచి, పెయిన్‌ కిల్లర్‌ ఒకటి రాసి.. మొహాన పారేస్తాడు తప్ప, ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. ఐదునిమిషాల ప్రహసనంరా అది. దానికి ఫీజెంత పిండుతాడో తెలుసు కదా నీకు. కడుపు మండిపోతుంది తలంచుకుంటే.

‘ ఏమీ చెయ్యలేని నిస్సహాయత, కోపంతో వణికిపోతాడు సిద్ధార్థ నొప్పితో గిలగిల కొట్టుకుంటూ.’నీ బాధ అర్థం చేసుకోగలనురా సిద్ధూ. కానీ, మధ్యతరగతి మనుషులం. మనం చేయగలిగింది ఏముంది చెప్పు? అందరూ అనుకున్నట్టు ఈ దేశంలో చట్టానికీ, న్యాయానికీ అతీతమైన అదృష్టవంతులు రాజకీయ నాయకులూ, గూండాలూ కాదురా. చేసిన పాపాలకి వాళ్ళలో కనీసం కొంతమందైనా పదవులు కోల్పోవడమో, జైలు ఊచలు లెక్కబెట్టడమో చూస్తాం అరుదుగానైనా! కానీ ఈ డాక్టర్లున్నారు చూడూ.. వీళ్ళురా అసలైన అదృష్ట జాతకులు! ఎన్ని అరాచకాలు చేసినా, వైద్యం పేరు చెప్పి ఎంతమందిని, ఎన్నిరకాలుగా పీల్చి, పిప్పి చేసినా, చట్టం వాళ్లని చిటికెన వేలితోనైనా ముట్టుకోలేదు. అంత అనుకూలం.. ఇక్కడి చట్టాలు వాళ్ళకి. కరోనా కాలంలో విలువలు గాలికొదిలేసిన కార్పొరేట్‌ ఆస్పత్రులు జనాల్ని ఎలా దోచుకు తినేసాయో అందరికీ తెలిసినదే కదా. ఎవడన్నా ఏమైనా చెయ్యగలిగేడా? వాళ్ళని. ఇవన్నీ తలవంచుకొని, ఆవేశపడితే రక్తపోటు ప్రకోపించడం తప్ప ఇంకేమీ జరగదు. కానీ చిన్నకుర్రాడిలా మంకుపట్టు పట్టకుండా, నేను చెప్పిన డాక్టర్‌ దగ్గరకు ఒకసారి వెళ్ళొద్దాం. ఆయన కూడా అందరిలాగానే ఉన్నాడనుకో, డాక్టరు అన్న మాటే ఇంకెప్పుడూ ఎత్తను నీ దగ్గర. ఈ ఒక్కసారికీ నామాట విను.’ బతిమలాడాడు జయకుమార్‌ అనునయంగా.’కాదంటే ఊరుకుంటావా నువ్వు? సరే అనే వరకూ సతాయించి చంపవూ! అలాగే అఘోరిద్దాంలే’ అని చెప్పి, లేచి వెళ్లిపోయాడు కోపంగా.

***********************************

అది జరిగిన నెలరోజులకుగానీ ఆ డాక్టర్ను కలవడానికి సమయం దొరకలేదు వారికి. అది లభించి, ఆస్పత్రికి వచ్చినా మూడు గంటల సుదీర్ఘ నిరీక్షణ తరవాతగానీ ఆయన దర్శనభాగ్యం లభించలేదు. ఆస్పత్రి మొత్తం రోగులతో నిండిపోయి ఉండడం, వారిలో ఎక్కువమంది మధ్యతరగతి, అంతకంటే కిందిస్థాయికి చెందినవారే ఉండడం జయకుమార్‌ గమనించి, కించిత్తు ఆశ్చర్యపోయాడు కూడా!’.

ఎట్టకేలకు లోపలి నుంచి పిలుపు రావడంతో డాక్టర్‌ కూర్చున్న గదిలోకి ప్రవేశించారు ఇద్దరూ. ఆయన చిరునవ్వుతో ప్రసన్నంగా పలకరించడం వారికి కాస్తంత సంతోషాన్ని కలుగజేస్తే, కేస్‌ హిస్టరీ మొత్తం తెలుసుకుంటూ అందుకు అవసరమైన వాటి కోసం.. అక్కడక్కడా అవసరమైన ప్రశ్నలు మాత్రమే వేస్తూ, ఓపికగా అడిగి తెలుసుకోవడం సిద్ధార్థకు అబ్బురపాటును కలిగించింది.

సిద్ధార్థ చెప్పిన విషయం పూర్తిగా విన్న తరవాత, లేటెస్ట్‌ రిపోర్టులు పరిశీలించి, నొప్పికి కారణం ఏమయ్యుంటుందో విపులంగా వివరించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాకుండా మళ్లీ పరీక్షలు చేయాలి.. అనకుండా మందులు నిర్దేశించడం దిగ్భ్రాంతికి గురిచేసింది.

‘ఎలాంటి టెస్టులూ లేకుండానే మందులు రాసి పారేస్తున్నాడీయన. అసలు పనిచేస్తాయా ఇవి’ అన్న సందేహాన్ని కూడా కలిగించింది. అప్పటికే కరడుగట్టిన నిరాశావాదిగా రూపాంతరం చెందిపోయిన సిద్ధార్థలో. ప్రిస్క్రిప్షన్‌ చేతికిస్తూ ‘అంత దూరం నుంచి ఎందుకు వచ్చారిక్కడికి? అక్కడా స్పెషలిస్టులు ఉన్నారు కదా?’ అని యథాలాపంగా ప్రశ్నించారు డాక్టర్‌. ‘మీరు మంచి హస్తవాసి కలవారనీ, అంతకంటే ముఖ్యంగా విలువలు ఉన్న డాక్టర్‌ అనీ, తెలిసినవారు చెప్పారు సార్‌. అందుకే దూరమైనా వచ్చాం’ సమాధానమిచ్చాడు జయకుమార్‌ వినయంగా. ‘అవునా’ అన్నట్టు ఆశ్చర్యంగా చూసారాయన.

‘అవును సార్‌. మావాడు మీగురించి చెప్పినప్పుడు నాకైతే కొంచెం కూడా నమ్మకం కలగలేదండీ. వాడి బలవంతం మీదే వచ్చాను’ అన్నాడు సిద్ధార్థ. ‘నమ్మకం కలగలేదా, ఎందుకు?’ ‘ఎందుకంటే రోగుల ‘పర్స్‌’ తప్ప, ‘పల్స్‌’ చూసే డాక్టర్ని గత నాలుగేళ్లలో ఎక్కడా చూడలేదండీ నేను. వైద్యుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారని.. నిజం చెప్తున్నాను.. మిమ్మల్ని చూశాకే తెలిసింది’ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు సిద్ధార్థ. ‘వాడి మాటలు పట్టించుకోకండి సార్‌. నాలుగేళ్ళుగా నరకం చూస్తున్నాడేమో, అలాగే మాట్లాడుతున్నాడు’ అన్నాడు జయకుమార్‌ డాక్టర్‌ వైపు ఆదోళనగా చూస్తూ. ‘ఫరవాలేదు’ అన్నట్టు చిన్నగా తల పంకించారు డాక్టర్‌. తరవాత క్షణం సేపు సిద్ధార్థవైపు సాలోచనగా చూసి.. ‘ఇక్కడ నేను చేస్తున్నది వ్యాపారం కాదు సిద్ధార్థగారూ’ అన్నారు గంభీరంగా.

‘నేను డాక్టర్ని. నేను చేసేది వైద్యం. నడుపుతున్నది హాస్పిటల్‌. వ్యాధులూ బాధలూ తగ్గించడం నా వృత్తి.. బాధ్యత కూడా. వాటిని నిర్వర్తించే ప్రయత్నం నిబద్ధతతో చేస్తున్నాను.. అంతే! సరే మందులు నేను చెప్పినట్టు, క్రమం తప్పకుండా వాడండి. అవసరం అయితే, మెయిల్‌ చేయండి. ఇరవైనాలుగు గంటల్లోపు సమాధానం ఇస్తాను. భయపడకండి. మీ నొప్పి తగ్గిపోతుంది’ అని ధైర్యం చెప్పి, మరో పేషెంట్‌ను లోపలికి పంపమన్నదానికి సూచనగా బజర్‌ మోగించారు. ‘వెళ్ళేముందొక మాట డాక్టర్‌గారూ’ అన్నాడు సిద్ధార్థ కూర్చున్న దగ్గర నుండి లేచి నిలబడుతూ.

‘ప్రస్తుతకాలంలో వైద్యులు కొందరు పేదలను దోచుకుంటున్నారు. చాలామంది వైద్యం ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అందులో నేనూ ఒకణ్ణి. అందుకే ఇలా మారిపోయాను. కానీ, మిమ్మల్ని చూశాక మాత్రం ఎక్కడో ఒకచోట మానవత్వం ఉన్న వైద్యులు ఉన్నారని నమ్మకం కలిగింది. మీవంటి వారు సమాజంలో తయారుకావాలి. యువత ఆ దిశగా ముందుకు అడుగులు వేయాలి’ అని భావోద్వేగంతో చెప్పి, బయటకు నడిచాడు సిద్ధార్థ స్నేహితుడి చేతిని ఆసరాగా పట్టుకొని.

  • కృపాకర్‌ పోతుల, 8008416660
➡️