తేనెతుట్టె

May 26,2024 09:29 #kavithalu, #Sneha

చెట్టు కొమ్మమీద తేనె
తుట్టెవున్నది!
తుట్టె నిండ పూల తేనె
పట్టి వున్నది!!

నేలపైన చుక్కలుగా
రాలి పడ్డది!
కొంటె కుర్రడొకనికి అది
కంట బడ్డది!!

కొంటె కుర్రడికది తాగ
కోర్కె కలిగెను!
రయమున ఆ తుట్టెపైకి
రాయి విసిరెను!!

తగిలి రాయి తేనెటీగ
లెగుర జొచ్చెను!
మరల అంతలోనె అటకు
తిరిగి వచ్చెను!!

కొంటె కుర్రవాడి ముఖం
కుట్టి పెట్టగ,
కుర్రో మొర్రో అంటూ
కుర్ర డేడ్వగ,

అది చూసిన మంచిబాలు
డాగి ఇంచుక
ముందు జాగ్రత్తగ గొంగళి
ముసుగు వేసుక,
ముందు కొచ్చి కుర్రడిపై
ముసుగు కప్పెను!
ముసుగు వలన కుర్రాడికి
ముప్పు తప్పెను!!

ఆపదలో ఎవరినైన
ఆదుకోవలె!
తెలివిగలిగి మెలగాలని
తెలుసుకోవలె!!

అలపర్తి వెంకటసుబ్బారావు
9440805001

➡️