కాలమా – న్యాయమా!

Mar 17,2024 07:10 #kavithalu, #Sneha

ఎంతమాయ చేసావే కాలమా!
నిగ్గుతేల్చాల్సిన ఎన్నో సత్యాలను
కాలగర్భంలో కలిపేసుకుని..
ఆశల్ని అవిరి చేసి అధరాలపై
ఎఱ్ఱని రంగులు దిద్దుకోమంటావు
కాసిన్ని నవ్వుల్ని అద్దుకోమంటావు!
ప్లాస్టిక్‌ పువ్వులపై అత్తర్లు చల్లి
అందంగా నా సిగలో అలంకరించి
పరిమళాలను ఆస్వాదించమని
వెఱ్ఱిగా నవ్వుతుంటావు!
ఎంతమాయ చేసావే కాలమా!
స్వార్థపు పొరలు మందంగా కప్పిన
మాంసపు దేహాలపై..
పట్టు వస్త్రాలను ధరింపచేసి
అందమైన బంధాలుగా భ్రమింపచేస్తావు!
మధురమైన మాటలు నోటితో పలికిస్తూ,
నొసటితో వెక్కిరించే పరివర్తన చెందని
గొంగళి పురుగులేగా.. ఇప్పటి బంధాలన్నీ!
ఎంతమాయ చేసావే కాలమా!
కాసుల గలగలల మధ్య
మమతలు మాసిపోకూడదంటూ
మౌనవ్రతం చేయిస్తావు..
అన్నీ సానుకూలమే అనిపించేలా
నన్ను మరపించి.. శల్యసారథ్యం వహిస్తావు
ఎంతమాయ చేసావే కాలమా!
నీ నైజం మాకిక తెలుపుమా..!

పద్మజా రామకృష్ణ పి
9491830278

➡️