పయనిద్దాం.. ప్రగతిదారిలో..

Dec 31,2023 08:47 #Sneha

మట్టిని, మనిషిని మోస్తున్న బంగారు భూగోళానికి అలుపే లేదు. అది విరామ మెరుగక పరిశ్రమిస్తూ, నిరంతరంగా సాగిపోతోంది. ప్రతి దినమూ తన చుట్టూ తాను వడివడిగా తిరిగేస్తూ, ఏడాదికోమారు సూర్యుణ్ణి చుట్టేస్తూ కొంగొత్త కాలాన్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ మోసుకొస్తుంది. గడిచిన క్షణం తిరిగి రాదు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఈ క్షణమే మనది. నేడే మనతో ఉండేది. అందుకే తక్షణం కదులుదాం. కార్యాచరణను ఎంచుకొని ఇప్పుడే మొదలుపెట్టేద్దాం.. పయనిద్దాం ఆశలు సాకారమయ్యే ప్రగతిదారిలో.. కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ దీనిపైనే ఈ ప్రత్యేక కథనం.

ఇదిగో 2023. నేటిని దాటి, రేపటికి ఇది గతమైపోతోంది. ఎన్నెన్నో జ్ఞాపకాలను అందించి, హెచ్చరికలు చేసి తన బాధ్యతను నెరవేర్చి వదిలి వెళ్లిపోతోంది. అదిగో.. కొంగొత్త సంవత్సరాది 2024. వెలుగులు విరజిమ్ముతూ అరుదెంచుతోంది. నూతన కర్తవ్యాలను, ఎన్నో సంతోషాల మూటలను, మరెన్నో సవాళ్లను మోసుకొస్తూ మనల్ని తనలోకి ఆహ్వానిస్తోంది.

అందుకుందాం, ఆ ప్రేమ హస్తాలను.సాదరంగా స్వాగతించి చేరిపోదాం, కొత్త సంవత్సరపు వెచ్చని ఒడిలో..

గతావలోకనం..

శ్వాస తీసుకునే ప్రతి జీవి పయనం ప్రకృతి గీసిన ప్రణాళిక ప్రకారమే సాగిపోతోంది. ఆ సమస్త జీవరాశుల్లో మనిషి వేరు. నిరంతరం అభివృద్ధి వైపు నడిచే మానవుని ఆలోచనే అతడిని ప్రత్యేక జీవిగా నిలబెట్టింది.

మనుషులం ఎప్పుడూ గతం కంటే భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాం. కాలంతో పాటు వెళ్లిపోతూ.. అప్పుడప్పుడూ ఆగి, గతం అనే అద్దంలోకి తొంగి చూసుకుంటాం. అందులో కనిపించిన నీరసానికి, ఉత్సాహానికి, అపజయానికి, విజయానికి కారణం ఏమిటా అని పరికించుకుంటాం. మళ్లీ గతం ఇచ్చిన ఉత్సాహమే ఊపిరిగా లోటుపాట్లను ఈసారి ఎలాగైనా అధిగమించాలని సంకల్పించుకుంటాం. మనసులోనో, కాగితంపైనో ఏవేవో ప్రణాళికలు రచించుకుంటాం. వాటి అమలుకు నూతన ఏడాది ఆరంభాన శ్రీకారం చుట్టాలనుకుంటాం. మన కళ్ల ముందే చాలామంది పట్టుదలతో శ్రమించి, అనుకున్న విజయాన్ని అలవోకగా అందుకుంటున్నారు. కానీ, అంతకంటే ఎక్కువమందికి అందులో వెనుకబడ్డ గతమే మిగిలిపోతోంది.

  •  మన చిన్నారి పాపాయిలకు ‘ఈ సారి తప్పకుండా కన్నా…’ అని ఇచ్చి తప్పిపోతున్న హామీలను,
  • ‘వద్దండీ.. ఇది మంచిది కాదు. మానేయండి, మారాలండీ’ అని భార్య చెబుతున్న మాటలను,
  • ‘ఇది ఇలా కాదోరు. ఈ పద్ధతి వద్దు’ అని అంటున్న భర్త సూచనలను,
  • ‘ఏం నాన్నా.. ఈ ఏడాదైనా చేస్తావా?’ అని ఆశగా చూస్తున్న అమ్మ అభ్యర్థన చూపులను,…

ఇంకా మనసులో గీసుకున్న ఎన్నో ఆశావహ బతుకు చిత్రాలను నెరవేర్చే, పట్టించుకునే, ఫలప్రదం చేసే ప్రణాళిక కోసం పరితపిస్తాం. ఎవరికి వారం కావలసిన పథక రచన చేసుకుంటాం.

సమస్యలు ఎన్నో..గతం మిగిల్చిన, విషాదాలు, చేదు అనుభవాలేవో మనల్ని తొలుస్తుంటాయి. ఓ తల్లికి ఎంతో ఇష్టమైన బంధాన్నీ, రక్త సంబంధాన్నీ గతంఎత్తుకుపోయి ఉండొచ్చు. ఓ విద్యావంతుడు ఉద్యోగ వేటలో విఫలమై ఉండొచ్చు. ఓ విద్యార్థి అనుకున్న మార్కులు సాధించ లేకపోవచ్చు. బాధ్యతలు మోస్తున్న ఓ ఇంటి పెద్దను తీవ్రమైన అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు.. వేధిస్తూ ఉండొచ్చు. ఎన్నున్నా గత నిస్సహాయత నుంచి తెప్పరిల్లి, కొత్త ఊపిరి తీసుకొని ముందడుగు వేయాలి. నిజానికి అదే కదా మన దినచర్య.

ప్రతి రాత్రీ నిద్రపోతాం, ఉదయన్నే తాజాగా మేల్కొంటాం. ఒక్కొక్కటీ చక్కబెట్టుకుంటూ ఎన్నింటినో అధిగమిస్తాం. ఇలా అడుగు ముందుకు వేస్తున్న మనం.. ఏడాది మారేటప్పుడు మాత్రం ఎందుకో ఒకింత భావోద్వేగానికి గురవుతాం. ఏదేమైనా గతాన్ని స్పర్శించి, సమీక్షించుకుంటేనే కదా.. మనకు వర్తమానం విలువ తెలిసేది. భవిష్యత్తును గెలిచేందుకు ఓ ప్రణాళికతో సిద్ధమయ్యేదీ…

కొలత, దానికి తగ్గ నడత…

ఆరోగ్యం అన్నింటిలోకీ ప్రధానమైనది. మనలో కొందరికి క్రమం తప్పకుండా డాక్టరు వద్దకు వెళుతున్నా ఆరోగ్యం గాడిలో పడకపోవచ్చు. ఒకటి తగ్గితే మరొకటి వెంటాడొచ్చు. ప్రధానంగా ఏ సమస్యకైనా శరీర అధిక బరువు తోడైపోతుంది. అయితే గతంలోలా బరువు తగ్గడం ఇప్పుడు ఏమంత పెద్ద విషయమేమీ కాదు. చాలామంది ఓ మూడు నెలల డైట్‌ ప్లాన్‌ పెట్టుకొని, చకచకా అమలు చేసి తగ్గిపోతున్నారు. అయితే అంతకుమించి ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. అందుకు మన దైనందిన జీవనశైలిలో మార్పులు చాలా అవసరం.

మనకు కోవిడ్‌ సమయం ఎంతో నేర్పింది. ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్న మనిషిని ఒక్కసారి పట్టిలాగి గట్టిగా హెచ్చరించి, వదిలి పెట్టింది. ఆ భీకర ఘడియలను చవి చూసిన మనం ఇప్పటికే చాలా మారి ఉంటాం. వ్యాయామం, పోషక ఆహారం తీసుకోవడం వంటి విషయాల్లో చాలా ఇళ్లల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు మన జీవనశైలిగా మారిపోవాలి. తినే క్యాలరీలు ఎన్ని, వినియోగించే క్యాలరీలు ఎన్ని అనే దానిపై పట్టు సాధిస్తే సరి. కొత్తలో ఏ పదార్థం.. ఎంత పరిమాణంలో.. ఎన్ని క్యాలరీలు కావాలో.. చూసుకోవడం పెద్ద పనే. కానీ, క్రమంగా అది అలవాటైతే భలే ఉంటుంది. మనమే ఎదుటివారికి చెప్పగలం : ‘హేరు! కప్పు బువ్వ తిన్నావా, అంటే… ఇన్ని క్యాలరీలు’; ‘ఇన్నడుగులు వేశావా? అయితే ఇన్ని క్యాలరీలు ఖర్చుపెట్టావోరు’ అని. ఇలా కొలత, దానికి తగ్గ నడత అలవాటు చేసుకుంటే ఆరోగ్యం 90 శాతం మన చేతిలో ఉన్నట్టే!

స్నేహ హస్తం అందిద్దాం..

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న మనుషులతో, పరిసరాలతో సంబంధ మన బాంధవ్యాలు ఆరోగ్యకరంగా ఉండాలి.. ఉంచుకోవాలి. మనిషి సంఘజీవి. అయినా చుట్టూ ఉన్న వారితో, చివరికి కుటుంబసభ్యులతో సైతం స్నేహం నెరపకుండా ఎవరికి వారు యమునాతీరు అన్నట్లు సాగిపోతున్న జీవితాలు చాలామందివి. ఉరుకుల పరుగుల జీవితం అనే నెపంతో ఏకాకి లోకంలో ఎంతోమంది. ఏదో సాధించేద్దామని, సాధించేశామని అనుకుంటాం. ఈ పరిస్థితిని ఒక్కసారి పరికించి చూసుకోవాలి. ముందు మనం గెలవాలి. అందులో సందేహం లేదు. కానీ, ఆ గెలుపు ఆనందం మనకు నిజమైన ఉత్సాహాన్ని ఇవ్వాలంటే మాత్రం మన తోటివారికి స్నేహహస్తం అందించి, గెలిపించాలి. అందుకు అనుగుణంగా ‘ఉమ్మడి కార్యాచరణ’ ను అలవాటు చేసుకోవాలి. ఉమ్మడి అంటే ఇక్కడ నీ చుట్టూ ఉన్నవారు కావొచ్చు. నీ కుటుంబం కావొచ్చు. ఇరుగుపొరుగు కావొచ్చు. ఒక లక్ష్యం కోసం పని చేసే బృందం కావొచ్చు.

ఉదాహరణకు.. ఉదయాన్నే ప్రభాత వేళ, చలిలో, నులివెచ్చని కిరణాల్లో మనం వాకింగ్‌కు వెళ్తాం. అదే సమయానికి ఇంట్లో మీకు జ్యూస్‌ తయారుచేస్తూనో, వంట పనిచేస్తూనో మీ భార్య ఉండిపోవచ్చు. నిజానికి వాకింగ్‌ అనేది మీ కంటే మీ భార్యకు లేదా ఇంట్లో మీ తల్లికి, తండ్రికి ఎక్కువ అవసరం కావొచ్చు. వారిని ఉత్సాహపరిచి, అవసరమైనవి కొనిపెట్టి, తగిన సహకారం అందించి, ముందుకు నడిపించాలి. కుటుంబమంతా ఒకే బాట, ఒకే మాటగా నడిస్తే.. ఉత్సాహం, ఆనందం రెట్టింపవుతాయి. ఒక ఉమ్మడి అలవాటుగా మారి, సంతోష వాతావరణాన్ని సృష్టిస్తాయి.

పట్టణాల్లో, నగరాల్లో, అపార్టుమెంట్లు మధ్యతరగతి జనావాసాల్లో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. తలుపులు బిడాయించుకొనే సంస్కృతి చాలా వరకు మారి స్నేహ వాతావరణం, కలిసి సంబరాలు చేసుకోవడం కనిపిస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ మనలో చాలామందికి మన ఎదురింట్లో, పక్కింట్లో ఉండే వారి పేర్లు కూడా తెలీవు. దీనిని బ్రేక్‌ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆత్మీయ పలకరింపుతో చుట్టుపక్కల వారిని మార్చుకోవొచ్చు. మన దైనందిన పనుల్లో ఇరుగు పొరుగును తోడు చేసుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం.. కలిసి వాకింగ్‌కు, మార్కెట్‌కు వెళ్లడం.. ఎలా వీలైతే అలా కలివిడితనం ఎంచుకుందాం. స్నేహం అనేది కేవలం సాయం కోసం కాదు. ఒక్కోసారి నైరాశ్యాన్ని వదిలించడానికి.. మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.

‘సార్వత్రిక’ బాధ్యత వచ్చేస్తోంది!

వస్తున్నది ఎన్నికల ఏడాది. 2024 మొదటి సగంలోనే సార్వత్రిక ఎన్నికలు. ఆ పార్టీ ‘మంచిదా? ఈ పార్టీ మంచిదా? ఎవరికి ఓటేద్దాం? వారి కంటే వీరు బెటర్‌… ఛ… వీరూ అంతే. మొన్నటివరకు ఆ పార్టీ ఫర్వాలేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది కూడా బాబోరు అనిపిస్తోంది. ‘ఛీ ఛీ.. ఎవరికి వోటేసినా ఒరిగేదేముంది? – కానీ తప్పదు. భారత రాజ్యాంగంపై గౌరవం ఉన్న ప్రతి పౌరుడూ ఓటు తప్పక వేయాలి. మరి ఏం చేద్దాం, ఎవరికి వేద్దాం? నోటాకు వేద్దామా? అలా చేస్తే అన్యాయం ఓడదు, న్యాయం గెలవదు కదా? మరెలా? వీరంతా ఒకరికొకరు ప్రత్యామ్నాయం కానే కాదు. అందరూ దొందూ దొందే. అదిగో అక్కడ కనిపిస్తున్నది నిక్కచ్చయిన ప్రత్యామ్నాయం. కానీ దానికి బలం లేదు? మరి ఏంచేయాలి? ఇదీ యువత అంతరంగ మధనం. కింకర్తవ్యం బలం పెంచడమే.. అంటే అటువైపు ఆలోచనలు..అడుగులు వేయడమే.

ఇక్కడ గెలుపూ ఓటములు లెక్కలోకి తీసుకోకూడదు. ఏది మంచి? ఏది చెడ్డ అన్నదాన్నే పరిగణనలోకి తీసుకొని చైతన్యంతో ఆలోచించాలి. ప్రజాపక్ష శక్తులను బలపర్చాలి. ప్రతి ఓటూ ఒక్క నిక్కమైన అభిప్రాయం. దానిని బలంగా వ్యక్తీకరించాలి. ఏది కచ్చితమైన ప్రత్యామ్నాయమో దాని పక్షాన నిలబడడం, అభ్యుదయానికి ఊతమివ్వడం మన కర్తవ్యంగా ఉండాలి. కుళ్లు రాజకీయాలు బాబోరు అని పక్కన పెట్టేస్తే అంతా కుళ్లే. అసలు సిసలైన సామాన్యుడు దిగితేనే రాజకీయం రంగు మారుతుంది. స్వచ్ఛమైన సెలయేరు వలె రాజకీయం ప్రవహిస్తే, చట్టసభలు నడిస్తే సమాజం అంతా శ్రేయోరాజ్యమే!

పిల్లల కోసం పెద్దల తపన..

‘బాబు సెల్‌ఫోన్‌లో మునిగిపోతున్నాడు. వాడి బుల్లి చేతులు బలహీనమైపోతున్నారు. బయట ఆటకు వెళ్లడు. చురుకుదనం లేదు. ఏం చేయాలో తోచడం లేదు’… ఇలా బాధపడే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువే. నిజమే… ఓ ఐదుగురు పెద్దలం ఉన్న ఇంట్లోనైతే ఏ కంగా ఐదారు ఫోన్లు పిల్లలకు అందుబాట్లో ఉన్నట్టే. సెల్‌ఫోన్‌ పిల్లలకైనా, పెద్దలకైనా ఒక రకంగా అవరోధంగానే తయారైంది. దాన్ని ఉపయోగించే అవగాహన సరిగ్గా లేని చోట అది చేసే మంచి కంటే చెడే ఎక్కువ. పిల్లలు, విద్యార్థుల విషయంలో మాత్రం సెల్‌ ప్రమాదాన్ని కచ్చితంగా అడ్డుకోవలసిందే!

అందుకోసం మనం ఎన్నో చేద్దామనుకుంటాం. ”పిల్లల్ని పొద్దునే వాకింగ్‌కి తీసుకెళ్దామనో, ఆదివారం పార్కులకో, ఫ్రెండ్స్‌ ఇళ్ళకో తీసుకెళ్తామని, వాడికి చదువుతోపాటు వేరే వ్యాపకం ఉండేలా డ్యాన్సు, డ్రాయింగ్‌, గిటార్‌ వాడికి ఏది ఇష్టమైతే అందులో ట్రైనింగ్‌ ఇప్పిద్దామని” ఇలా కొన్ని ప్లాన్‌ చేసుకుంటాం. ప్రయత్నిస్తాం. కానీ అందరికీ ఇవి కుదరకపోవచ్చు. మనం ఉండే ప్రాంతంలో అలాంటి ట్రైనింగ్‌ సెంటర్లు లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అంతేసి ఫీజు కట్టలేకో, మరొకటో అవరోధంగా మారొచ్చు. ఇవన్నీ మన ఉత్సాహాన్ని, ప్రయత్నాన్ని నీరుగార్చకూడదు.

లక్ష్యం గురి స్పష్టంగా ఉంటే ఆచరణకు అనేక మార్గాలు ఉంటాయి. మనం అనుకున్నవి చేయాలని ప్రయత్నిస్తూనే ప్రత్నామ్నాయాలను ట్రై చేయొచ్చు. – మనమే పిల్లలమైపోవచ్చు. కేరంబోర్డు, బిజినెస్‌ గేమ్‌, చెస్‌, షటిల్‌ ఇలా ఏదో ఒకటి.. మనమూ పిల్లలతో కలిసి ఎంచక్కా ఆడుకోవచ్చు. -వారానికోమారు పిల్లల్ని తీసుకొని దగ్గరలోని హైస్కూలు గ్రౌండ్‌కు బ్యాటూ, బాలు పట్టుకొని వెళ్లిపోవచ్చు. – పిల్లల్ని వెంటేసుకుని మార్కెట్‌కు వెళ్లొచ్చు. – కొంచెం పెద్ద పిల్లలైతే ‘గత నెల మన ఖర్చు, ఆదాయం ఇంత. కొన్న వస్తువులు ఇవి. ఇందులో ఏవి అవసరమో, ఏవి కొనకుండా ఉండాల్సిందో చూడు.’ అని వాళ్లకే పురమాయించొచ్చు. – వచ్చేనెల ఖర్చు తగ్గించడానికి ఏం చేద్దామా అని ప్లాన్‌ రాయించొచ్చు.- నెల జీతం వారికే ఇచ్చి, ఇంటిని నడిపే బాధ్యత అప్పగించొచ్చు. ఆ మేరకు బజార్లో సరుకులు కొని, తెమ్మని చెప్పొచ్చు. చిన్నపిల్లలైతే ఆటపాటలకు ఇంట్లో అమ్మకు అంత సమయం కుదరకపోతే.. నాన్న, ఇంట్లో ఓపికతో ఉన్న పెద్దవారు.. ఆ బాధ్యత తీసుకోవాలి. పిల్లల చేత మంచిపుస్తకాలు చదివించాలి.వారు చదువుతున్నంతసేపు మనం కూడా వారితో పాటూ కూర్చొని పుస్తకమో, పత్రికో చదవాలి. ఇవన్నీ ఇంట్లో పెద్దలందరి ఉమ్మడి బాధ్యతగా ఈ ఆచరణ ఉంటే పెద్ద వారికీ ఆనందం, ఆరోగ్యం. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులకు స్పష్టత, ఒకేమాటగా నడుచుకునే తత్వం ఉండాలి.

– పిల్లల కంటే ముందు పెద్దలం మనం ‘మాటకు కట్టుబడి’ ఉండాలి. – పిల్లల్ని ఫోన్‌ తియ్యొద్దని చెప్పామూ అంటే… పిల్లల ఎదుట మనం ఫోన్‌ తియ్యకూడదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరించడం సాధ్యపడకపోవచ్చు.  అప్పుడు – ఫోన్‌ ఎందుకు తీస్తున్నాం? ఏం పని ఉంది? ఎంత సేపు ఫోన్‌ వాడాలను కుంటున్నాం అనేది చిన్నారులకు తెలియజేయాలి. మనం చెప్పిన టైం ప్రకారం వాడి అవసరం పూర్తవ్వగానే ‘ఇదిగో నాన్నా ఫోన్‌ పక్కన పెట్టేస్తున్నా…!’ అని కూడా చెప్పాలి.

చీకట్లు ముసురుతున్నాయా?

అవును. వెలుగుకోసం ఎదురుచూసే మన చుట్టూ చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయ్.

నీవూరు నీది కాదట, నీ ముత్తాతల తాత ఇక్కడివాడు కాదట. అందుకే నిన్ను ఎక్కడికో తరిమేయాలట. నువ్వు తినే తిండి సరికాదట. నీ బట్ట బాగోలేదట. నీ భాష మారాలట. మన నోరు తిరగని, మస్తిష్కానికి అర్థంకాని భాషేదో నేర్వాలట. నీ నడవడికకు వేరెవరో స్కెచ్‌ గీస్తారట. అందులోనే నువ్వు నడవాలట. వాళ్ల దృష్టిలో మన భారత రాజ్యాంగం ఓ చిత్తు పుస్తకమట.

ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు పాలకులుగా ఉండడం వల్ల – మన చిన్నారుల పాఠ్యపుస్తకాల్లోంచి సైన్సు పేజీలు చిరిగిపోతున్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే కదా రోజు మారేది. సూర్యుని చుట్టూ తిరిగితేనే 2024 వంటి కొంగొత్త ఏడాది సాక్షాత్కరించేది. కోపర్నికస్‌ చెప్పిన.. ప్రపంచ మానవాళికి తెలిసిన.. వాస్తవం ఇది.

కానీ వారంటున్నారూ.. భూమి బల్లపరుపుగా ఉందట! సూర్యుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నారట. ఈ విషయం మన మూడో తరగతి బుజ్జిగాడికి చెబితే ‘అచ్చే… హవ్వ … షేమ్‌ షేమ్‌…’ అని పకాలున నవ్వుతాడు.

ఈ పరిణామం ఇంతటితో ఆగడం లేదు. డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, భగత్‌సింగ్‌ త్యాగాన్ని, అంబేద్కర్‌, మహాత్మగాంధీల సమతా సామరస్య పలుకులను పాఠాల నుంచి తొలగించేశారు. మనం జాగరూకతతో ఉండకపోతే మనల్ని దశాబ్దాల వెనక్కి, పాతరాతి యుగానికి తీసుకుపోజూస్తున్నారు.

‘మంచి గతమున కొంచెమేనోరు.. మందగించక ముందుకడుగేరు..’ అని గురజాడ ప్రబోధిస్తే.. ‘పదండి ముందుకు పదండి తోసుకు.. పోదాం పోదాం’ అని వీపు తట్టి మహాకవి శ్రీశ్రీ నడిపిస్తే.. ఆ నవయుగ వైతాళికుల మాటలను అసత్యాలు చేసి, ‘గతమంతా గొప్పే. గతమే ఉన్నతం. గతంలోకి పోదాం..’ అంటున్నారు ఈ తిరోగాములు. నిమ్మకు నీరెత్తినట్టు మనం ఊరుకుంటే ఇక మనకు మిగిలేది చిమ్మచీకట్లే. సమయం లేదు సోదరా, తక్షణం ఎదిరించడం మన కర్తవ్యం. అదే 2023 వెళ్తూ వెళ్తూ మనకు చేసిన హెచ్చరిక. ఆలోచించు.. అచేతనంగా వెనక్కు నడుద్దామా? జాగురూకతతో వెలుగు దారిలో మునుముందుకు పయనిద్దామా..?

వాయిదాలొద్దు దేనికైనా..

మన పనికి మనమే చాలాసార్లు మోకాలడ్డు పెట్టుకుంటాం. అలవాటుగా మారిన బద్ధకం, వాయిదా అనేవి ఆ పని చేయిస్తాయి. వాయిదా అనేది ఎంత గలీజుదంటే చివరికి అది మనల్ని ఒక అబద్ధాల కోరుగా మార్చేస్తుంది. కొందరి వాయిదాలు అసలు మామూలుగా ఉండవు. ‘రేపు చేస్తాను’ అన్న మాట గోడ మీద రాసుకున్నట్టే ఉంటుంది. కుటుంబాల్లో ఒకింత అశాంతికి, అలజడికి ఈ వాయిదా, బద్ధక లక్షణాలూ కారణమవుతాయి. మధ్యతరగతి కుటుంబాల్లో మనకు మనమే యజమానులం, మనకు మనమే సేవకులం. కనుక పని నిర్వహణలో కచ్చితత్వం ఉంటే అది మనకు చికాకును దూరం చేసి, ప్రశాంతతనిస్తుంది.

కార్పొ’రేట్‌’ మాయా ప్రపంచం..

మనమున్నది ఓ మార్కెట్‌ మాయా ప్రపంచంలో. ఇది కార్పొరేట్‌ మాయ. ఫైబర్‌ నెట్‌ మాయ. పెట్టుబడి మాయ. నిత్యం కాటు వేస్తున్న లాభాల పడగ కింద రక్షణ కోసం, అభివృద్ధి కోసం, ముందడుగు కోసం ప్రణాళికా, ఆచరణ అంటూ కొట్టుమిట్టాడుతున్న మనం ఒక్కసారి పరికించి గట్టిగా మనసు అద్దంలో చూసుకుంటే… అప్పుడు అర్థమవుతుంది – మనల్ని మన లాంటి సామన్యులు ముందడుగు వేయలేకపోవడానికి మరేదో అడ్డుపడుతోందని. పెరగని నిజ వేతనం, నిత్యం పెరిగే ఖర్చుల మధ్య అసలు పొదుపు సాధ్యమా? అని నీరసం వస్తుంది. నిజానికి చాలామంది మధ్యతరగతి, బడుగుజీవుల ఆర్థిక ప్రణాళికలు ఆదాయంతో వేసుకున్నవి కాదు. అప్పులతో వేసుకున్నవే. ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారమంతా మన ఇంట్లోనే కనిపిస్తుంది. బాధలన్నీ సామాన్యుడికే! ఎందుకంటే.. దేశంలో 99 శాతం మంది సామన్యుల చేతుల్లో 10 శాతం సంపద మాత్రమే ఉంది. కేవలం వంద మంది కుబేరుల గుప్పెట్లో 90 శాతం సంపద పోగుపడింది.

నూరు శాతం ఆచరణ ..

మధ్యతరగతి జనం ప్రణాళికలు అంటూ కొట్టు మిట్టాడుతుంటాం. కానీ ఓ రైతు, ఓ శ్రామికుడు అలా కాదు. అతడు సూర్యుని కంటే ముందే లేస్తాడు. భూమితోటే పరుగులు తీస్తాడు. బద్ధకం ఉండదు. వాయిదా అస్సలు కుదరనే కుదరదు. నీరసం, నిస్సత్తువ, జ్వరం, ఆర్థిక భారం.. ఇలా ఎన్ని ఆటంకాలున్నా పని, సాగు అనే కదనరంగంలో ఆచరణ ఆగదు. నూటికి నూరుశాతం ఆచరణ ఉన్నప్పుడు ఫలితం అతడికే దక్కాలి కదా మరి. కానీ అలా జరగటం లేదు. ఏటేటా కష్టం, నష్టం. ఇలా కోలుకోలేని దెబ్బమీద దెబ్బలెన్ని తగిలినా గాని.. రేపటి ఉదయాన అన్నదాత యథాప్రకారం పనిలో అడుగుపెడతాడు. కొండంత ఆశతో కార్యాచరణకు దిగుతాడు. ఈ శ్రామికుల కర్తవ్య దీక్ష మధ్యతరగతి జీవికి ఒక గొప్ప మార్గదర్శక పాఠమే!

అయితే అసలైన కోణం తరచి చూస్తే మనకు అర్థమవుతుంది. కొత్త ఏడాదులు ఎన్ని వచ్చినా, కేలెండర్లు ఎన్ని మారినా ఎదుగూ బొదుగూ లేని బడుగు జీవితాలను గెలిపించాల్సింది ఎవరు? వారి బతుకు బాగుకు ప్రణాళికలు రచించేదెవరు? ఓట్లు వేయించుకున్న వారు కోట్లు పోగేసుకోవడం తప్ప.

కొందరి గెలుపు అందరిదీ!

మన గెలుపు మనదే. కానీ, కొందరి గెలుపు అందరిదీ. ఒక సామాజిక ఉద్యమకర్త.. ఒక అభ్యుదయ రచయిత.. నిరంతరం జనపక్షంగా నిలిచే వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక, మానవవాదులు.. ప్రజాహితం కోరే శాస్త్రవేత్తలు.. సామాజిక విశ్లేషకులు.. జనం తరపున మాట్లాడే మేధావులు.. ఉత్తమ భావాలు వెదజల్లే ఉపాధ్యాయులు.. నిజాన్ని నిర్భయంగా చెప్పే నిక్కచ్చయిన పాత్రికేయులు.. వీరి గెలుపు అందరిదీ కదా. ‘సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వానికి తోడుపడవోరు’ అన్న గురజాడ మాటలను అక్షరాలా ఆచరిస్తున్న ఎందరో మహానుభావులు మన ఎదుటే ఉన్నారు. ఉన్నత ఉద్యోగాలు, అధికార హోదాలు వదులుకొని సమాజం కోసం అంకితమైన వీరి పని నిరంతరం జనం పక్షాన గొంతెత్తటమే! అన్యాయంపై జనాన్ని ఉజ్జీలు ఉజ్జీలుగా కదిలించడమే! వారిలాగా అందరం పని చేయలేకపోవచ్చు. నిర్బంధాలను, లాఠీలను దెబ్బలను ఎదుర్కోలేకపోవొచ్చు. అన్యాయాలను ఎదిరించి, జైళ్లలో మగ్గలేకపోవచ్చు. కానీ వారి గెలుపుకు తోడ్పాటు అందించలేమా? గొంతు చించుకుంటున్న వారి వాదనల్లో ఏ నిజం దాగి ఉందో ఆలోచించలేమా? వారికి మద్దతుగా నిలవలేమా? అలా కలబడ్డవారికి అండగా నిలబడ్డం కూడా మనందరి కర్తవ్యమే కదా!

2024… లీపు సంవత్సరం!

రండి .. రండి ..

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది..

మున్ముందుకు సాగిపోదాం..

ప్రజాహితపు ప్రపంచాన్ని నిర్మించుకుందాం..

ప్రపంచం మొత్తం ఇప్పట్లా అనుసంధానమై లేనప్పుడు ఎవరి క్యాలండర్లు వారికి ఉండేవి. ఒక దేశంతో మరొక దేశానికి వ్యాపార వ్యవహారాల్లో సంబంధాలు ఏర్పడ్డాక – ఒకే తరహా కాల గణన అనివార్యమైంది. అలాంటి అవసరాల్లోంచే ప్రపంచ దేశాలన్నీ గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ను అంగీకరించాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలెండరే గ్రెగోరియన్‌ క్యాలెండరు. ఇందులో ఏడాదికి 365.25 రోజులు ఉంటాయి. మామూలుగా సంవత్సరానికి 365 రోజులే లెక్కిస్తాం. మిగిలిన పావు రోజు నాలుగేళ్లకొకసారి పూర్తి రోజుగా లెక్కపెట్టి – దానిని ఫిబ్రవరి 29వ రోజుగా క్యాలెండర్లో చేరుస్తారు. 29 రోజుల ఫిబ్రవరి నెల ఉన్న సంవత్సరాన్ని లీపు సంవత్సరంగా పిలుస్తారు. 4 చేత నిశ్శేషంగా భాగించబడే ప్రతి సంవత్సరం లీఫు సంవత్సరమే అవుతుంది. 2020, 2024, 2028 లీపు సంవత్సరాలు. (2020) మన ముందు లీఫు సంవత్సరం కోవిడ్‌ రూపంలో మనను హెచ్చరించింది. (2024) ఇప్పుడు మనం జగమెరుగుదాం. వెలుగు రేఖలకు ఆహ్వానం పలుకుదాం.

నేటి యువతీ యువకులు ఎందరో కులం కుళ్లును, మతపరమైన చీలికలను చీల్చి చెండాడుతున్నారు. ఎంతో అభ్యుదయపు, ఉన్నత భావావేశంతో ఆలోచిస్తున్నారు.. చర్చిస్తున్నారు. కానీ, ఆ చర్చ మూడు కంప్యూటర్లు, ఆరు టీ కప్పుల ఎదుట, నాలుగు గోడల మధ్యనే ఉండిపోతే ఉపయోగం ఉండదు కదా! సోషల్‌ మీడియాలో లైక్‌లకు, కామెంట్లకు పరిమితమైపోతే కార్యాచరణలో కాలు మోపేదెవరు? సమాజాన కుళ్లు కడిగేందుకు కదన రంగంలోకి దూకేదెవరు? ఈ నూతన ఏడాదిన ఇవి కూడా కొంచెం ఆలోచించాలి.

ఎల్‌. శాంతి

7680086767

➡️