బాల్యాన్ని బతికించుకుందాం..

Jun 9,2024 06:12 #child labour, #Children, #Sneha, #Stories

లేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయసు పరిశ్రమల్లో మగ్గుతోంది. పసిప్రాణాలు ప్రమాదకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. బట్టీల్లో బండ చాకిరీకి బలైపోతోంది. చదువు సంధ్యలు లేవు.. ఆటపాటలు లేవు.. పోషకాహారం అనే మాటకు తావే లేదు. పిల్లలు శ్రామిక యంత్రాలుగా మారిపోయిన సామాజిక దురవస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలింది. అందులోనూ మన దేశంలో మరీ తీవ్రమైన పరిస్థితి. ఇందుకు కారణాలు.. ఏయే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బాలలు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు.. ఈ నెల12న ‘ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా.. వీరి విముక్తికి ప్రభుత్వాలు, సామాజిక సేవా కార్యకర్తలు చేస్తున్న, చేయదగిన కృషిని తెలుపుతూ ఈ ప్రత్యేక కథనం..

బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది. దీనికి కారణం ఎవరు? రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకుల్లా చిత్తుకాగితాలు ఏరుకుంటూ.. చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం వీరి నిత్యకృత్యం. ఇటుకలు మోస్తూ.. ఇనుమును కరిగిస్తూ.. రిక్షాలాగుతూ.. బిక్షమెత్తుకొంటూ.. పంక్చర్‌లేస్తూ.. పేపర్‌ వేస్తూ.. పాలు, పల్లీలమ్ముతూ.. ఇంటిపనుల్లోనూ.. కంపెనీల్లోనూ.. పశువులు కాస్తూ.. కలుపులు తీస్తూ.. పాలిష్‌ చేస్తూ.. పెయింట్‌లు వేస్తూ.. ఇవన్నీ బాల కార్మిక వ్యవస్థ ఆనవాళ్లే.. అన్నం లేక కొందరు.. ఆటలు తెలియక ఇంకొందరు. బాల్యం చితికి.. బాధ్యత తెలిసి ఇంకొందరు.. దుకాణాలు.. హోటళ్లు ఇలా.. ఎక్కడ చూసినా బలైపోతున్న బాల్యం కనిపిస్తోంది. బాధ్యత మరచిన పెద్దలు.. బాలల్ని బలిపశువులుగా చేయకుండా కాపాడలేమా..? అందరూ ఆలోచించి ఆసరా ఇస్తే బాల్యం బందీఖానా నుంచి విముక్తి కావటం ఖాయం.

బలైపోతున్న బాలలు..
పుట్టుక నుంచి కౌమారం వరకు ఉండేదే బంగరు బాల్యం. వీరి బంగారు భవిష్యత్తుకు పునాది పడే దశ. ఈనాటి బాలలే రేపటి భారత నిర్మాణ సారథులు. అలాంటి వారిని చదువులకు, ఆటలకు దూరం చేసి, శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాలకార్మిక వ్యవస్థ అంటారు. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు. పొట్టకూటి కోసం.. చిట్టి చేతులతో.. బాలల విషయంలో మనకు రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకరేమో స్కూల్‌ బ్యాగ్‌ వేసుకొని బడికి వెళ్తే, మరొకరు బరువైన బస్తాలు మోసుకుంటూ కూలి పనికి వెళ్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు తమ కనీస హక్కులైన విద్య, ఆరోగ్యం, ఆటపాటలు కోల్పోయి, పొట్టకూటి కోసం తమ చిట్టి చేతులతో వివిధ పనుల్లో నిమగమై ఉన్నారు. ఎంతో మంది బాలల బాల్యం ఒకరి ఇంట్లో అంట్లు తోమడంలో, రెస్టారెంటుల్లో సమోసాలు అందించడంలోనో మగ్గిపోతోంది. పంక్చర్‌ షాపుల్లో, మెకానిక్‌ షెడ్లలో మసకబారి పోతోంది. అందుకే అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919 ప్రథమ సమావేశంలో 14 ఏళ్ల లోపు బాలబాలికల్ని పనిలో నియమించకూడదని పేర్కొంది.

చరిత్ర..
బాల కార్మికులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఉద్యమాన్ని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఐరాస 2002లో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రారంభం రోజున అన్ని దేశాల ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, పౌర సమాజం అలాగే వివిధ అంతర్జాతీయ సంస్థలు బాల కార్మికులను పని నుంచి విముక్తి చేసి, వారికి సరైన ఆర్థిక, సామాజిక భరోసాను కల్పించే దిశగా అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని ఐరాస సూచించింది.

కారణాలు..
బాలలు కార్మికులుగా మారడానికి ప్రధాన కారణాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఒకటి పేదరికం కాగా, మరొకటి వారిని చేరదీసేవారు లేకపోవడం. దీంతో గత్యంతరం లేక ఆ బాలలు తమ కడుపు నింపుకోవడానికి పనుల్లో చేరడం అనివార్యమైపోతోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించాలి. అందుకు సమాజం చొరవ తీసుకోవాలి. బాలల్ని పనుల్లో పెట్టుకోకుండా, వారికి అందమైన బాల్యాన్ని అందించాలి. అప్పుడే బాల కార్మికులు లేని సమాజం సాధ్యమవుతుంది.

వ్యవస్థను అంతం చేద్దాం..!
ఈ ఏడాది ‘మనం చట్టబద్ధంగా నిబద్ధతతో పని చేద్దాం.. బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం..!’ అనే థీమ్‌తో పనిచేసి ఫలితం సాధించవచ్చని ఐక్యరాజ్య సమితి విశ్వసిస్తోంది. దీనికై తక్షణ చర్యలు తీసుకోవడం అవసరమనేది థీమ్‌ ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం జూన్‌ 12న, జరుపుకునే బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎల్‌ఒ సభ్యులు, తదితర భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది.


తగ్గింపు కాదు.. అంతమే లక్ష్యం..
ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ 25వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకుంటున్నాం. గత కొన్నేళ్లుగా సంఘర్షణలు, సంక్షోభాలు, కోవిడ్‌-19, మరిన్ని కుటుంబాలను పేదరికంలోకి నెట్టివేశాయి. లక్షలాది మంది పిల్లలను బాల కార్మికులుగా మార్చాయి. నేడు 16 కోట్ల మంది పిల్లలు ఇప్పటికే బాల కార్మికులుగా ఉన్నారు. ఈ సంఖ్య 2022లో 15.2 కోట్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరు. 7.2 కోట్ల మంది బాలలు అత్యంత ప్రమాదకర పనులను నిర్వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

ఆఫ్రికాలో అత్యధికం..
ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల్లో ఉన్న ప్రతి పది మంది పిల్లల్లో దాదాపు తొమ్మిది మంది ఉన్నారు. మిగిలిన బాల కార్మికుల జనాభా అమెరికా (1.1 కోట్ల్లు), యూరప్‌, మధ్య ఆసియా (60 లక్షలు), అరబ్‌ స్టేట్స్‌ (10 లక్షలు) మధ్య విభజించబడింది. సంఘటనల విషయానికొస్తే అమెరికాలో ఐదు శాతం మంది పిల్లలు, ఐరోపా, మధ్య ఆసియాలో నాలుగు శాతం, అరబ్‌ రాష్ట్రాల్లో మూడు శాతం మంది బాలకార్మికులుగా ఉన్నారు.

నిషేధ చట్టం..
బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం (1986లో) తెలియచేసిన దాని ప్రకారం ప్రమాదకర వృత్తుల్లో బాల కార్మికులను నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు వంటి రంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. 2010లో సర్కస్‌లో, ఏనుగుల సంరక్షణలోనూ బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్‌ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలు శిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి.

జాతీయ ప్రాజెక్టు..
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో అతి ముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు. దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాల కార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించింది. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 259 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతోంది.

రాజ్యాంగ రక్షణలు..
మన దేశ రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి పరచడమే కాకుండా, ఇతర రక్షణలనూ సూచిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తుల్లో పనిచేయకుండా రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. రాజ్యాంగంలోని 24వ ప్రకరణ ప్రకారం 14ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేపట్టడం నిషిద్ధం. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదు. బాల్యాన్ని, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించాలని రాజ్యాంగ ప్రకరణలు 39(ఇ), (ఎఫ్‌) చెబుతున్నాయి. బాలల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2007లో కమిషన్‌ ఏర్పాటైంది.


విద్యా హక్కు చట్టం
(రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ 2009)..
బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానిక ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. విద్యాహక్కు చట్టం ఇచ్చిన హామీ ఏమిటంటే.. వీరందరినీ వారివారి వయసుకు తగిన తరగతుల్లో చేర్చించి, విద్యనందించాలి. అలా చేయటం ఒక సవాలే. విద్యా సంవత్సరం మధ్యలో వారు వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైతే అదనపు శిక్షణ ఇవ్వాలి. దండన లేని బోధన అందించాలి.
మరి ఇంతటి అవగాహనతోనే ప్రభుత్వాలు, సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే బాలలకు నిజమైన భవితను ఇవ్వగలుగుతాం.

  • గోళ్ళమూడి శేఖర్‌బాబు,
    పోగ్రాం మేనేజర్‌,
    నవజీవన్‌ బాలభవన్‌, విజయవాడ
    8121214386

 

సేకరణ : యడవల్లి శ్రీనివాసరావు

➡️