నానీలు

Apr 28,2024 09:00 #kavithalu, #Sneha

జెండా కర్రలు
నిటారుగా నిలబడి
అక్కడక్కడా
పొంచి చూస్తున్నాయి

కుర్చీలన్నీ
బోసిపోయి కూర్చుంటే
పార్టీలన్నీ
పచార్లు చేస్తున్నాయి

అజెండాలు
నోరు కదపనే లేవు
పార్టీ గుర్తులు
రంగుల్ని పోగేసాయి

అంతటా
నీళ్ళు నమలడాలే
సర్దుబాట్లన్నీ
సద్దుమణిగి వున్నాయి

ఆంక్షలన్నీ
ఆకాశాన్ని అంటాయి
మాటలన్నీ
మూగబోయి కూర్చున్నాయి

చిత్ర పటాలు
కిందికి దిగాయి
పథకాలు
ఆలోచనలో పడ్డాయి

అధికారం
తాబేలు నడకైంది
మమకారం
మంచమెక్కి కూతేసింది

ఎన్నికల సిత్రాలు
భలే తమాషాలు
ఎటు చూసినా
తత్తరపాట్లే

ఎన్నికలంటే చాలు
వీధి ముచ్చట్లు
ఎటు చూసినా
ఓటు నోటు కేకలు

ఎన్నికల కాలం
నడిసొచ్చే కుర్చీలు
అంతటా
పరిగెత్తే పార్టీలు

అక్కడక్కడా
సానుభూతి వేషాలు
కొన్ని చోట్ల
సానుకూల స్పందనలు

మాటలలో
భావం లేని బోధనలు
మనసులో
చేజార్చిన స్మృతులు

ఎన్నికల కాలం
బొమ్మా బొరుసాటలు
నలువైపులా
ఇక్కట్లతో చిక్కులు

– నరెద్దుల రాజారెడ్డి
9666016636

➡️