బాలికలు.. భవిష్యత్తు దీపికలు..

Jan 24,2024 11:31

తల్లి.. చెల్లి.. భార్య.. కూతురు.. ఇలా ఏ బంధం లేకుండా పురుషులు తమ మనుగడ సాగించలేరు. అలాంటి ఆడపిల్ల జీవితం.. పురిటిలోనే ఆంక్షలు, వివక్షలతో మొదలవుతుంది. ఒకవైపు బాలికలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నేల నుంచి నింగి వరకు ప్రతి రంగంలోనూ ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. మరోవైపు అంతకు రెట్టింపు స్థాయిలో అణచివేతకు లోనవుతున్నారు. ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు గురవుతున్నారు. పుట్టిన తరువాత తల్లిదండ్రులు, సమాజం విధించిన ఆంక్షల మధ్య పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా ప్రభుత్వం ‘నేషనల్‌ గర్ల్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌’ పేరుతో కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగానే 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

‘అబ్బాయి పుడితే వంశాన్ని నిలబెడతాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెడతాడు. శ్మశానానికి తీసుకెళ్లేది అతనే. ఆడపిల్ల ఎప్పటికైనా ‘ఆడ’ (అక్కడి) పిల్లే. మన ఇంట్లో ఉండదు. అత్తారింటికి వెళుతుంది’ అనే దగ్గరే ఆడపిల్ల వివక్ష మొదలవుతుంది. ఇలాంటి దురభిప్రాయాలు సమాజాన్ని తిరోగమనానికి తీసికెళతాయి. చనిపోతే కొడుకే కర్మకాండలు చేయాలని ఏ శాస్త్రంలోనూ లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి నలుగురు ఆడపిల్లలు. తండ్రి చనిపోతే ఆ ఆడపిల్లలే భౌతికాయాన్ని శ్మశానం వరకూ మోశారు. కర్మకాండలు చేశారు. జనరేషన్‌ మారుతున్న కొద్దీ ఆలోచనలు, మనస్తత్వాలు మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే సమాజం అభివృద్ధి వైపు నడుస్తుంది.

అభివృద్ధికి ఆటంకాలు..

ఆడపిల్లలకు కౌమారదశలో శారీరక మార్పులు వస్తాయి. అది సహజం. అక్కడి నుంచి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. వారికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.. బంగారం కొనాలి.. అంటూ ఆరాటపడుతుంటారు. కానీ తన కూతురికి అసలు ఏమి ఇష్టం? ఎలా చదువుతుంది? ఏ సబ్జెక్టు అంటే ఇష్టం, క్రీడల పట్ల తన ఆసక్తి ఎలా ఉంది? తన చుట్టూ వాతావరణం ఎలా ఉంది? అనే విధంగా ఆలోచన చేయడం లేదు. అలా గమనించి, వెన్నుతట్టిన తల్లిదండ్రులు తమ కూతుళ్లు సాధించిన విజయాలను చూసి గర్వపడుతున్నారు.

ఆడపిల్లకి ఇచ్చే బహుమతుల్లోనూ వివక్ష కనబడుతుంది. గాజులు, పట్టీలు, డ్రెస్సులు, వంట సామాగ్రి కొనిపెడతారు. కానీ వాళ్లు చదువుకునేందుకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏంటి? తన బలహీనతను అధిగమించే విధంగా ఏమి చేయాలి? ఏ వస్తువులు అవసరం? తన సమస్యలు కనుక్కొని పరిష్కరించడం, తన విజ్ఞానాన్ని పెంచే విధంగా, మానసిక వికాసం అయ్యేలా అవసరమయ్యే బుక్స్‌ కొనివ్వడం, పోషకాహారం పెట్టడం చేస్తే బాగుంటుంది. వాటిని బహుమతిగా ఇస్తే నిజంగా సంతోషిస్తారు.

‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఆడపిల్లలకు స్వతంత్రం రాలేదు’ అంటాడు ఓ మహానుభావుడు. నిజమే. ఏళ్లు గడుస్తున్నా ఆడపిల్లల హక్కులు సాధన కోసం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంత మేరకైనా చదువుకుంటున్నా అందులో మళ్లీ వివక్ష ఉంది. ప్రభుత్వ కాలేజీలు అమ్మాయిలకు, ప్రైవేటు కాలేజీలకు అబ్బాయిలను పంపిస్తున్నారు. అయినా చదివి వారికన్నా ఎక్కువ శాతం మార్కులు సాధించి, చూపిస్తున్నారు ఆడపిల్లలు. బాలికల హక్కుల కోసం గతంలో చేసిన ఉద్యమాల ఫలితంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. స్కూలు, కాలేజీ చదువులకు పంపిస్తున్నారు. సుమారు డెబ్భై శాతం మంది ఆడపిల్లలు పాఠశాలలకు వెళితే, ఉన్నత విద్యకు వెళ్లే వాళ్లు 15 శాతం కన్నా మించి లేరు. ఎందుకు ఇంత తేడా ఉందని సర్వే చేస్తే.. ఎక్కువ చదివిస్తే, తనతో సమానంగా చదివేవాడు దొరుకుతాడో, లేదో.. ఉద్యోగం చేసేందుకు ఒప్పుకుంటాడో లేదోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతుంది. చదువుకు డబ్బు పెట్టడంకన్నా అమ్మాయి పెళ్లికి, కట్నానికి దాచిపెడితే సరిపోతుందనే వాదనతో.. ఆడపిల్లల అభివృద్ధి ముందుకు సాగడం లేదు. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. కిశోర బాలికలకు అవసరమైన అన్ని రంగాల్లో నిర్ణయాత్మక భాగస్వామ్యం కల్పించడం నేటి సమాజంలో తక్షణ అవసరం. కుటుంబాల్లో, సమాజంలో వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచినవాళ్లమవుతాం.

సమాన దృష్టితో..

ఆడపిల్ల పుడితే ఆమె భవిష్యత్తు – సమాజంలోని ఒత్తిళ్లకు కట్టుబడి నిర్ణయించబడుతుంది. పెద్దగా నవ్వితే, మాట్లాడితే.. ‘చూసినవారు ఏమనుకుంటారో..!’ అనే భావనతోనే తల్లిదండ్రులు ఆమెను ఆంక్షలతో పెంచుతారు. ఎవరినైనా ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే.. ఇక ‘మా పరువంతా తీసింది’ అని అమ్మాయిని చంపేందుకు కూడా ఆలోచించడం లేదు కొంతమంది తల్లిదండ్రులు. అవే విషయాలు అబ్బాయిలతో పోలిస్తే ‘వాడు మగాడు. ఎలా ఉన్నా సరిపోతుంది’ అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ధోరణి మారాలి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. ఎవరు తప్పు చేసినా దండించే విధానం ఒకేవిధంగా ఉండాలి. ఇద్దరినీ సమంగా ప్రేమించాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి అంట్లు కడగమని, ఇల్లు శుభ్రం చేయమని, బట్టలు ఉతకమని చెబుతారు. కానీ అబ్బాయిలకు (కొడుకులకు) ఈ విషయాలు చెప్పేందుకు ఆలోచిస్తారు. కొందరు అబ్బాయిలు ఆ పనులు చేయకూడదని వాదిస్తారు కూడా. కానీ తరం మారుతున్న కొద్దీ ఇద్దరూ ఇంటా బయటా పనులు సమానంగా చేసుకుంటూనే కలతలు లేకుండా ఉండగలరు.

న్యాయకత్వ లక్షణాలు..

యువతలో ముఖ్యంగా అమ్మాయిలు రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. దీనికి వెనక రకరకాల కారణాలున్నా… దీనికి బీజం మాత్రం పాఠశాల, స్కూలు స్థాయిలో పడుతుంది. చాలా స్కూళ్లల్లో మగపిల్లల్ని లీడర్స్‌గా ఉంచుతారు. ఆడపిల్లలకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఇష్టపడదు యాజమాన్యం. పితృస్వామిక వ్యవస్థ భావజాలం నుంచి వచ్చిన భావనలే ఇవన్నీ. వారికి అంత సామర్థ్యం లేదనుకుంటారు. కానీ తల్లిదండ్రుల కష్టాన్ని గ్రహించే శక్తి ఆడపిల్లలకు ఎక్కువ ఉందని నిపుణుల మాట. దానికనుగుణంగా మసులుకుంటారు. బాధ్యతగా వ్యవహరిస్తారు. అందుకే బాలికల్లో న్యాయకత్వ లక్షణాలు అలవరచాల్సిన బాధ్యత, ఆ దిశగా వారిని చైతన్య వంతులుగా చేయాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉంది. లింగ సమానత్వం, ప్రతిస్పందించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం కూడా అత్యవసరం. ఇది బాలికలను చూసే దృష్టికోణం మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అత్తింటి వేధింపులు

కొంతమంది అత్తమామలు ఆడపిల్లల్ని కన్నావంటూ కోడళ్లను సూటిపోటీ మాటలతో వేధిస్తుంటారు. అసలు పుట్టబోయే బిడ్డ ఎవరో నిర్ణయించేది పురుష క్రోమోజోములే. సమాజంలో దీనిపై అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే కోడళ్లపై వేధింపులు తగ్గుతాయి. అబ్బాయిని కనకపోతే భార్యను వద్దనే భర్తలూ ఉన్నారు. ఈ విషయాలపై సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుంది. దీన్నే వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు నొక్కి మరీ చెప్పింది.

హక్కుల అమలు..

అమ్మాయిల పట్ల సమాజంలో లోతుగా పాతుకుపోయిన మూసధోరణుల వల్ల చాలా విషయాల్లో వెనకబడిపోతున్నారు. అందుకే వారిని చదువుతోపాటు మిగిలిన విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ ఉండాలి. కేంద్రం ‘బేటీ బచావో… బేటీ పఢావో’ అంటూ విస్తతంగా ప్రచారం చేస్తోంది.. కానీ ఆచరణలో శూన్యం. కిశోర బాలికల ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషకాహార లోపాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలికల చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. చదువు పూర్తి అయ్యాక ఉపాధి, నైఫుణ్యాలు కల్పించాలి. కుటుంబంలో బాలికలను బరువుగా, భారంగా కాకుండా బాధ్యతగా చూస్తే వారి జీవితాలు విరాజిల్లుతాయి. సరైన నైపుణ్యాలను, అవకాశాలను అందిస్తే మరింతగా రాణించి, సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. రేపటి సమాజ పురోగతిలో వాళ్లూ భాగస్వాములవుతారు.

 

  • పద్మావతి, 9490099006
➡️