మైనార్టీలకు మేడిపండు సంక్షేమం

Dec 17,2023 13:58 #Sneha

”ఒక అందమైన తోటఆ తోటలో రకరకాల పూలురంగురంగుల పూలు గులాబీలు, మందారాలు, చమేలీలుమొగలిపూలు, బంతిపూలు, గుల్‌మొహర్‌లుఅన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుంది ఆ తోటఅయితే..ఆ పూలన్నింటినీ నలిపేసి.. తొక్కేసి.. నరికేసి..ఒక్క కమలమే విస్తరించాలంటేఆ తోట అందమంతా ఏమైపోతుంది?!” అంటాడు జల్‌జలా కవి ఆఫ్రీన్‌. భారతదేశం రకరకాల పూలతో నిండిన అందమైన పూలతోట! ఆ తోటలోని పూల సౌరభాన్ని ఆస్వాదించలేని, గ్రహణశక్తిని కోల్పోయిన గండు తుమ్మెదలు వికృతంగా ప్రవర్తిస్తే.. పూలతోటనే నాశనం చేస్తే.. ప్రకృతి వికృతి కాదా..?భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు నిలయమైన భారతావనిలోవిశృంఖలత చోటుచేసుకుంటే సుందర భారతం బడబానలం కాదా..?? ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ.. ఈ నెల 18 ‘మైనార్టీల హక్కుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం..

ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటనలు జరిగినా, హింసాత్మక సంఘటనలు జరిగినా.. వారిలో ముస్లిం పేర్లు కనిపించినా అందరి అనుమానపు చూపులు ముస్లింలపై ఎక్కుపెట్టబడతాయి. ముస్లిమేతర సమాజం నుంచి గుచ్చుకునే ప్రశ్నల ముళ్లు ముస్లిములను ఆత్మన్యూనతా భావంలోకి, అపరాధ భావంలోకి నెట్టేస్తున్నాయి. సంఖ్య రీత్యా భారతదేశంలో ముస్లిములు రెండో స్థానంలో ఉన్నప్పటికీ, వారి తర్వాత స్థానంలో వున్న వారికున్నంత స్వేచ్ఛ కూడా ముస్లిములకు లేదనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. అడుగడుగునా వారి దేశభక్తి శంకించబడుతోంది. ఎప్పటికప్పుడు తమ దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాము ముందుగా భారతీయులం, ఈ మట్టిలో మట్టి, ఈ ధూళిలో ధూళి. అణువణువునా భారతీయతను నింపుకున్నవారం. అయినా.. అనుమానపు చూపులు, రుజువులు నిత్యకృత్యంగా మారిందని అణచివేయబడుతున్న గొంతుల ఆక్రందన. ‘ఏ గొడవల్లేకుండా/ బతుకును వెళ్లమార్చాలనుకుంటాను/ ఉన్నట్టుండి ఎందుకో మరి/ నగరాల నడి వీధుల్లో నా నెత్తురు/ తీర్థ స్నానఘట్టమవుతుంది’ అంటారు కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌. అంతేకాదు- ‘వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య/నా రక్తం ఏరులై పారింది’ అంటాడు. ముస్లింలలో ఏర్పడిన అభద్రతాభావం, వివక్ష, అణచివేత, పేదరికం, హిందూత్వ దాష్టీకం వంటివి సౌందర్యవంతమైన ముస్లిం సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. మెజారిటీ మత భావజాలం వల్ల మైనారిటీలు ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేతలు భరతమాత నుదుటిన ఎప్పటికీ చెరగని పుట్టుమచ్చగా మారాయి.

భారతదేశంలోని సామాన్య ప్రజలకున్న సమస్యలన్నీ వారికీ వున్నాయి. బీదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, వివక్ష, స్త్రీల పట్ల నిరాదరణ- ఇవన్నీ ఈ దేశంలోని ప్రజలందరికీ వున్న సమస్యలే. కాకపోతే అనేక చారిత్రక కారణాల వల్ల, బ్రిటీష్‌ పాలకులు, భారతదేశంలోని హిందూ ఉగ్రవాద ప్రచారకులు చేసిన దుష్ప్రచారాల వల్ల ఆత్మన్యూనతా భావానికి, వ్యక్తిగత స్థాయిలోను, సాముదాయికంగానూ లోనవుతున్న ముస్లిముల విషయంలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా వున్నాయి. ‘మీరు స్వేచ్ఛ నుండి శాంతిని వేరు చేయలేరు, ఎందుకంటే ఎవరికీ స్వేచ్ఛ లేకపోతే ఎవరూ శాంతితో ఉండలేరు’ అంటారు మాల్కం ఎక్స్‌. ‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లిములు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరాడే స్థితికి వారు నెట్టబడుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న పెద్ద మూర్ఖత్వం. అలా చూడకపోవడం వల్ల, సంప్రదాయంలో అదొక పెద్ద భాగంగా ఉండడంవల్ల భారత దేశం అన్నిటి కంటే పెద్దదిగా, గొప్పదిగా, ఏళ్ళ తరబడి అలరారింది’ అని నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న మత, జాతి, లైంగిక, జాతి లేదా భాషాపరమైన మైనారిటీల హక్కులను కాపాడేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 18న ‘మైనారిటీల హక్కుల దినోత్సవం’ జరుపుకుంటారు. ఈ రోజు మైనారిటీ సంఘాలు, మూలాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై దృష్టి పెడుతున్నాయి. మైనారిటీలలోని వివిధ వర్గాల పట్ల అన్ని రకాల వివక్షలను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న రోజు ఇది. ఎటువంటి వివక్ష లేకుండా మైనారిటీ సమూహాల హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం.

అంటే ఎవరు ?

దేశ జనాభాలో సగం కంటే తక్కువ ఉన్న వ్యక్తుల సమూహాన్ని మైనారిటీలుగా నిర్వచించారు. ఐక్యరాజ్యసమితి మైనారిటీలను ‘ఏదైనా దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ఆధిపత్యం లేని, తక్కువ జనాభా కలిగిన సమూహం లేదా సంఘం’గా నిర్వచించింది. భారతదేశంలో ఐదు మత సమాజాలను మైనారిటీలుగా ప్రకటించారు. వీరిలో ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు లేదా పార్సీలు ఉన్నారు. 2014 తర్వాత జైనులను కూడా మైనారిటీ కమ్యూనిటీగా నోటిఫై చేస్తూ.. ఈ జాబితాలో చేర్చారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో దాదాపు వెయ్యి మందిలో 193 మంది మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు. వీరిలో ముస్లిములు అతిపెద్ద మైనారిటీ సమూహం. వీరు ప్రతి వెయ్యి మందిలో 142 మంది ఉన్నారు. అతి తక్కువగా ప్రతి వెయ్యి మందిలో పార్సీలు కేవలం ఆరుగురు మాత్రమే. అయితే దేశంలో రాజకీయ చర్చల్లో ‘మైనారిటీ’ అనే పదం ఆధిపత్యం చెలాయిస్తోంది.

రాజకీయ ప్రాతినిధ్యం…

గతంలో మనకు ముస్లిం రాష్ట్రపతులు, హోం మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ముస్లిములను మినహాయించడమనేది మనం గమనిస్తున్నాం. వారి జనాభా ప్రాతిపదికగా లోక్‌సభలో 74 సీట్లు ఉండాలి. అయితే, కేవలం 27 సీట్లు మాత్రమే ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలకు గాను ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. పదిహేను రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. ముస్లిం మంత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా వారిని మైనారిటీ వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దేశం మొత్తం మీద నాలుగు వేల పైచిలుకు శాసనసభ్యులుంటే, కనీసం నాలుగు వందల మంది కూడా ముస్లిం శాసనసభ్యులు లేరు. సుమారు పదిహేను రాష్ట్రాల శాసనసభల్లో ముస్లిముల ప్రాతినిధ్యమే లేదు.

సాహిత్యం…

భారతదేశంలో మతం ఆధారంగా ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం వుంది. మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే మైనారిటీ సాహిత్యంగా రూపొందుతోంది. తెలుగు సాహిత్యంలో ఖాదర్‌ మొహియొద్దీన్‌ ‘పుట్టుమచ్చ’, హిందీలో ‘ముసల్మాన్‌’ వంటి అద్భుతమైన దీర్ఘకవితలు ముస్లీం సమాజంపై కొంత ప్రభావం చూపుతున్నాయనే చెప్పొచ్చు. మైనారిటీ సమాజం నుంచి వచ్చిన కవులు, కవయిత్రులు, రచయితలు.. వారి హక్కుల కోసం గళం విప్పారు. కలం ఎత్తారు. షాజహానా వంటి కవయిత్రులు తమ హక్కుల కోసం సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు.

విద్యావకాశాలపై దాడి…

మైనారిటీ కమ్యూనిటీలుగా వున్న ముస్లిములు, బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు ఎంఫిల్‌, పిహెచ్‌డి చేయడానికి ఐదేళ్లపాటు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2009లో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (యంఎయన్‌ఎఫ్‌)ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.. 2022-23 నుండి రద్దు చేసింది. ఇది మైనారిటీ వర్గాన్ని ఉన్నత విద్య నుండి, చదువుల నుంచి పూర్తిగా దూరం చేయడానికేనని మైనారిటీ విద్యార్థులు ఆందోళనలో వున్నారు. 2019లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం.. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు. అయితే దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరిన వారిలో కేవలం 5.5 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐఎస్‌హెచ్‌ఇ), యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యుడిఐఎస్‌ఇపి) లు విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 18-23 సంవత్సరాల వయస్సు గల ముస్లిం విద్యార్థుల విద్యపై విశ్లేషణ జరిపి సేకరించిన ఆధారాల ప్రకారం 2020-21లో గత ఏడాది కంటే 8.5 శాతం తగ్గింది. 2019-20లో 21 లక్షల మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకోగా, 2020-21 నాటికి వారి సంఖ్య 19.21 లక్షలకు పడిపోయింది.

కమిటీలు.. నివేదికలు..

గోపాల్‌సింగ్‌ కమిషన్‌, రాజేంద్ర సచార్‌ అధ్యక్షతన ఏర్పడిన సచార్‌ కమిటీ, జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా అధ్యక్షతన పని చేసిన మైనారిటీ కమిషన్లు మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే ముస్లిం ప్రజలు చాలా వెనకబడి ఉన్నారని సచార్‌ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతేకాదు. విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి ఉన్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సహాయం కూడా నామమాత్రంగానే ఉందని పేర్కొంది. 2007లో జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ ముస్లిం మహిళల్లో నిరక్షరాస్యులు ఎక్కువని, బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీరిలో స్వంత వ్యవసాయ భూమి లేని వారు అత్యధికులని చెప్పింది. ఈ స్థితి నుండి వారిని అభివృద్ధి చేయడానికి ముస్లిం మైనారిటీలకు 10 శాతం ఇతర మైనారిటీలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రభ్వుత్వ సంక్షేమ పథకాల్లో వీరి వాటాకు తగ్గట్టుగా పొందేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని కూడా ఆ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

వలస కార్మికులూ మైనారిటీలే …

వలస కార్మికులు ఇప్పుడు దేశం వెలివేసిన అనాథలు. ప్రభుత్వాలు పట్టించుకోని నిరాశ్రయులు. ఉన్న ఊరుని, కన్నవారిని, తన చుట్టూ వున్న బంధాలను వదిలేసి.. దుఃఖపు నదిలా మారి వలసబాట పడతారు. నిరుద్యోగం, పంటలు పండక పోవడం, వర్షాభావ పరిస్థితులు, ఉపాధి కొరత, నిరక్షరాస్యత వంటి అనేక కారణాలు వీరి వలస కారణమౌతాయి. సొంతూరిలో సంపాదించలేని పనిని, పొరుగూరులోనైనా సాధించొచ్చన్న ఆశతో బయల్దేరతారు. ఒక ఊరి కాపు.. మరో ఊరిలో పాలేరు అన్న చందంగానే వుంటుంది వీరి బతుకు ప్రయాణం. ముఖ్యంగా మైనారిటీలు మాట్లాడే భాష, వీరి జీవైన శైలిని బట్టి.. వీరు తమవారు కాదన్న చులకన భావనతోనే చూస్తారు.

సంక్షేమం అందని ద్రాక్ష..

స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్లు అవుతున్నా.. మైనారిటీల స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ చోటు చేసుకోలేదు. నేటికీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా వుంది. స్వాతంత్య్ర ఫలాలు మైనారిటీలకు అందని ద్రాక్షాగానే మిగిలాయి. మైనారిటీల సంక్షేమం కోసం వేసిన కార్పొరేషన్లు కూడా నిధులలేమితో కునారిల్లుతున్నాయి. నేటికీ ఎక్కువ శాతం మైనారిటీలు చిన్న చిన్న వృత్తులకే పరిమితమై ఉన్నారు. విద్య, ఉద్యోగావకాశాలలో అయితే చివరి వరుసలోనే వుంటారు. ఏ సంక్షేమ పథకాలూ వారి వరకూ చేరవు. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ముస్లిం మైనారిటీలు ఏ విధంగానూ మెరుగ్గాలేరని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. ముస్లిం జనాభాలో 63.7 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. దీంతో విద్య, ఆరోగ్య సేవలు వారికి దూరంగానే వుంటున్నాయి. 5-9 ఏళ్ల మధ్య పిల్లల్లో 49 శాతం మాత్రమే పాఠశాలకు వెళుతున్నారు. మధ్యలోనే స్కూళ్లు మానేస్తున్న పిల్లల సంఖ్య కూడా ముస్లిములోనే అధికం. ముస్లిములలోని ఆర్థిక వెనుకబాటుతనమే దీనికి కారణం. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కూడా వీరి దీనస్థితికి కారణంగా కనిపిస్తోంది. తమ సంక్షేమాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు ఫణంగా పెట్టకుండా.. మైనారిటీలు జాగృతం కావడం నేటి అవసరం.

ముగింపు

మైనారిటీల హక్కుల ఉల్లంఘన, వారిపట్ల వివక్ష, పక్షపాత విధానాలను ఇలాగే కొనసాగిస్తే అనేక త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర భారత భవిష్యత్తు ఖచ్చితంగా మసక బారిపోతుంది. మనిషికున్నంత చరిత్ర మానవ హక్కులకూ వుంది. మనిషి సాగించిన ప్రతి పోరాటంలోనూ, సాధించిన ప్రతి విజయంలోనూ మానవ హక్కులు అణచివేయబడటమో, సమున్నత స్థాయిలో విజయకేతనాన్ని ఎగురవేయడమో జరుగుతూనే వుంది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లని, నాగరికతకు మెట్టిల్లని చెప్పుకునే అమెరికాకు మానవ హక్కులను పాతరేసి, నెత్తుటేరులు పారించడం నిత్యకృత్యం. అలాంటి అమెరికాతో అంటకాగుతూ.. ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా చెప్పుకునే మోడీ నుంచి ఇంతకంటే ఆశించడం వ్యర్థమే. అహింసను పవిత్ర వ్రతంగా పెట్టుకున్న గాంధీజీ.. ‘పిరికితనంతో బానిస జీవితం గడపడంకన్నా దౌర్జన్యంతో శత్రువును ప్రతిఘటించడం మంచిది’ అంటాడో సందర్భంలో. ‘నా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా ఈ దేశానికి ఉపయోగంలేదు’ అంటాడు ఫైడల్‌ కాస్ట్రో. కార్పొరేట్‌- మతోన్మాద రాజకీయ క్రీడలో అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరూ గళమెత్తాలి. పిడికిలి బిగించాలి. ‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా’ తమ హక్కులను తామే కాపాడుకోవాలి. భావ వ్యక్తీకరణ అణచివేత నుంచి మూక దాడుల వరకు జరుగుతున్న ఉల్లంఘనలను ఎదుర్కోవాలి. ‘బలవంతమైన స్పరము/ చలిచీమల చేత చిక్కి చావదె సుమతి’ అన్నట్టుగా.. వేయి గొంతులు ఒక్కటై పీచమణిచే రోజు దగ్గరలోనే వుందని గుర్తించాలి. ‘ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది’ అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మైనారిటీల వెనుకబాటును ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చాలి. విద్యావైద్యం పరంగా ఎలాంటి వివక్షా లేకుండా వారి హక్కులను కాపాడాలి.

చరిత్ర …

ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్‌ 18ని ‘మైనారిటీల హక్కుల దినోత్సవం’గా ప్రకటించింది. భారతదేశంలో ఈ రోజున దేశవ్యాపితంగా మైనారిటీ హక్కులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, వారివారి హక్కుల గురించి అవగాహన కల్పించడం జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌సిఎం) బాధ్యత. ఈ సందర్భంగా, ఈ మైనారిటీ వర్గాలను మెరుగుపరచడం, ఉద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐరాస పేర్కొంది.

రాష్ట్రంలో..

ఆంధ్రప్రదేశ్‌లో 11.5 శాతం మంది మైనారిటీలు ఉన్నారు. అందులో 10 శాతం మంది ముస్లిం మైనారిటీలు. విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమం, వైద్యం తదితర రంగాలన్నిటిలో ముస్లిములు వెనుకబడి ఉన్నారు. దేశంలో 30 కోట్ల మంది ఉన్న ముస్లిములలో ఇప్పటికీ 43 శాతం మంది నిరక్షరాస్యులు, డిగ్రీ ఆపైన చదువుకున్న వారు కేవలం 6.96 శాతం. ఐఎఎస్‌ లలో 3, ఐఎఫ్‌ఎస్‌ లలో1.8, ఐపిఎస్‌ లలో 4, రైల్వే ఉద్యోగాల్లో 4.5, పోలీసు శాఖలో 6 శాతం మంది మాత్రమే ముస్లిములు ఉన్నారు. ఈ నాటికీ బాలకార్మికుల్లో 40 శాతం మంది ముస్లిం పిల్లలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆర్థమవుతుంది. రాష్ట్రంలో స్వల్ప ఆదాయం వచ్చే వారిలో 62 శాతం మంది ముస్లిములే ఉన్నారు. వీరు ఎక్కువ భాగం పట్టణాల్లో, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ మెకానిక్‌లుగా, మోటార్‌ కార్మికులుగా, తోపుడబండ్ల వ్యాపారులుగా, ఇంటిపనివారుగా, దర్జీలుగా, హౌటల్‌, బీడీ కార్మికులుగా అసంఘటితంగా జీవిస్తున్నారు. వచ్చే ఆదాయం తక్కువ కావడంతో సహజంగానే విద్య, వైద్యం కొనగలిగే శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే ముస్లిములలో నిరక్షరాస్యత, దారిద్య్రం ఎక్కువగా వుంటుంది.

                                             పోరాటాలతోనే సాధ్యం…

భారత్‌ వెలిగిపోతోందంటూ విశ్వవేదికలపై ఉపన్యాసాలిస్తున్న పాలకులే అణచివేత, వివక్షలను పెంచి పోషిస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకొంటున్న భారత్‌లో కొనసాగుతున్న మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అక్షింతలు వేసినా పాలకుల్లో చలనం లేకపోవడం విడ్డూరం. ఏ దేశ స్వాతంత్య్ర, అభివృద్ధి ఫలాలైనా ప్రాథమికంగా అన్ని వర్గాలు, అన్ని సముదాయాల ప్రజలకు నిష్పక్షపాతంగా, న్యాయంగా, స్వేచ్ఛగా అందినప్పుడే స్వాతంత్య్రానికి, అభివృద్ధికి ఒక అర్థముంటుంది. ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తమకు కావలసింది, తమకు దక్కాల్సింది సాధించుకునే దిశగా సామాజిక చైతన్యంతో, నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు కదలాలి. ‘ప్రజల చైతన్యంలో మనం నాటిన విత్తనాలు మొలకెత్తకుండా ఎల్లకాలం ఉండబోవు. సామాజిక కార్యక్రమాన్ని శత్రువులు నేరాలతోనూ బలప్రయోగంతోనూ అణిచివేయలేరు. ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అంటారు అమెరికా కుట్రదారులకు బలైన చిలీ మాజీ అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీ. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల నేతలు, బహుజనులతో కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. పోరాడాలి.. సాధించుకోవాలి.

రాజ్యాంగ హక్కులు…

భారత రాజ్యాంగం వారి భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను ఇచ్చింది. 1992లో ఐక్యరాజ్యసమితి మతపరమైన, భాషాపరమైన లేదా జాతిపరమైన మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కులపై ప్రకటనను ఆమోదించింది. అదే సంవత్సరం మైనారిటీల కోసం జాతీయ కమిషన్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దేశంలోని మైనారిటీలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన కొన్ని హక్కులు, స్వేచ్ఛలను పరిశీలిద్దాం..

  • ఆర్టికల్‌ 14- ‘చట్టం ముందు సమానత్వం’ మరియు ‘చట్టాల సమాన రక్షణ’ కోసం ప్రజల హక్కు.
  • ఆర్టికల్‌ 15 (1), (2) – మతం, జాతి, కులం, లింగ, జన్మస్థలం ఆధారంగా పౌరులపై వివక్ష నిషేధం.
  • ఆర్టికల్‌ 16(1),(2) – ఉద్యోగం లేదా రాష్ట్రం పరిధిలోని ఏదైనా కార్యాలయానికి నియామకానికి సంబంధించిన విషయాలలో సమాన అవకాశాలు పౌరుల హక్కు.
  • ఆర్టికల్‌ 25(1) – ప్రజల మనస్సాక్షి స్వేచ్ఛ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు – పబ్లిక్‌ ఆర్డర్‌, నైతికత మరియు ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి.
  • ఆర్టికల్‌ 28 – విద్యాసంస్థల్లో మతపరమైన బోధన లేదా మతపరమైన ఆరాధనకు హాజరు కావడానికి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ వుంటుంది.
  • ఆర్టికల్‌ 30(1) – మతపరమైన, భాషాపరమైన మైనారిటీలందరికీ తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకునే హక్కు.
  • ఆర్టికల్‌ 30 (2) – రాష్ట్రం నుండి సహాయం పొందే విషయంలో వివక్ష నుండి మైనారిటీ-నిర్వహించే విద్యా సంస్థల స్వేచ్ఛ.
  • ఆర్టికల్‌ 350-బి – వాస్తవానికి, భారతదేశంలోని భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారికి సంబంధించి భారత రాజ్యాంగం ఎటువంటి నిబంధనను రూపొందించలేదు. అయితే, 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 రాజ్యాంగంలో ఆర్టికల్‌ 350-బిని చేర్చింది.

– కంచర్ల రాజాబాబు 9490099231

➡️