పసి హృదయాల్లో యుద్ధ బీభత్సం..!!

Dec 4,2023 13:33 #Sneha

ఏమి నేర్పుతుంది చరిత్ర ఈ యుద్ధంలో

పసి మనసులను కదిలించి వేస్తుంది

గాయపడిన తనువులో రుధిరం చిమ్ముతుంటే

ఆకలి ఆర్తనాదం అంబరాన్ని తాకుతుంది…

 

ఏ పరమార్థం సాధిస్తుంది ఈ రణ పిశాచం

అభాగ్యులను ఆహారంగా తీసుకుంటూ

కన్న పేగులను నిర్ధాక్షిణ్యంగా తుంచుకుంటూ

బాంబులతో బిత్తరపోయి చూస్తుంది ధరిత్రి..

 

పాల బుగ్గల హృదయాల్లో చెరగని ముద్ర

రక్తం అంటిన బొటనవేలు నోట్లో రంగు మార్చే

కమ్మని క్షీర ధారలు కరువై గుక్కపెట్టి ఏడ్చే

లాలి పాటలు కరువై శబ్ద ఘోష వినిపిస్తుంది..

 

పువ్వులాంటి హృదయాల్లో విషపు గుళికలు

తల్లి కౌగిలి దూరమై కన్నీళ్ల రుచులు ఆరగిస్తూ

కనపడని బంధానికై వేల కనుల చూపులు

వినిపిస్తున్న ఆర్తనాదములో భవితవ్యం ఎంత..

 

పుష్పించే రెక్కలపై బండ రాతి దెబ్బలు

సంగ్రామపు ఆధిపత్యములో కన్నీటి స్నానాలు

ముక్కు పచ్చలారని బాల్యం రోదిస్తోంది

భవిష్యత్తు యుద్ధ కౌగిలిలో ముగుస్తుంది..

 

ఎన్ని సంగ్రామాలు ఎంత నేర్పిన ఏమి లాభం

ఎదిగే మొక్కలపై రసాయన ప్రభావం

ఎడారిలా మారుతుంది ధరణి మాత ఆయుస్సు

కళ్ళు తెరిచే బాల్యం నరకం వైపు సాగుతుంది..

 

తెగిపడ్డ మొండాలు కండ్లతో నడుస్తున్నాయి

నాన్న వారి కోసం గగనాన్ని చేసి చూస్తుంటే

చిరు అరుపుల కేకలు మనసును సృజిస్తుంటే

బంధం తల్లడిల్లి దారపు పోగులా తెగిపోయే..

 

ఈ యుద్ధపు జడివానలు ఆగేదెన్నడు

ఆ చల్లని చంద్రుని వెన్నెలకు మబ్బులు కమ్ముకుంటే

ఆస్వాదించాల్సిన బాల్యం అనాథలా తిరుగుతుంది

కమ్మని నిద్ర ఉలిక్కిపడి ఏడుస్తుంది నేడు..! – కొప్పుల ప్రసాద్‌98850 66235

➡️