శాంతి, ప్రేమకు ప్రతిరూపం.. క్రిస్మస్‌

Dec 25,2023 08:25 #COVER STORY, #Sneha

క్రిస్మస్‌.. ఈ పేరు వినగానే వెలుగులు పంచే పండుగ.. పండుగలు మన సంస్కృతిలో భాగం. హిందువుల సంక్రాంతి, దసరా, దీపావళి, తదితర పండుగలు.. ముస్లిముల రంజాన్‌, బక్రీదు.. మాదిరిగానే క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ క్రిస్మస్‌. ఈ లౌకిక రాజ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగలన్నింటినీ మతాలతో సంబంధం లేకుండా అందరూ కలసి జరుపుకునే అసలైన సర్వమత సౌభ్రాతృత్వాన్ని మనం చూడవచ్చు. ప్రేమ.. దయ.. అనుబంధం.. ఆప్యాయత.. స్నేహశీలత.. సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే సుగుణాలే కదా మానవాళి మనుగడకు ప్రతీకలు.. క్రిస్మస్‌ వేడుకల్లో ఇవి దండిగా ద్యోతకమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగగా ఒక ప్రత్యేక స్థానం క్రిస్మస్‌కు ఉంది. ఈ క్రిస్మస్‌ను ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారు? వాటిలో ప్రత్యేకతలు ఏమిటి? ఇలాంటి ఆసక్తికర విశేషాలను తెలిపేదే ఈ ప్రత్యేక కథనం.

ఏసుక్రీస్తు పుట్టినరోజు.. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే రోజును.. ఘనంగా, అట్టహాసంగా, ఆడంబరంగా, ప్రేమతో జరుపుకుంటారు. క్రైస్తవులు తమ ఇళ్ళు, చర్చిల దగ్గర రంగు రంగుల విద్యుద్దీపాలు, స్టార్లు, క్రిస్మస్‌ ట్రీలు, చూడచక్కగా అలంకరించుకుంటారు. అనేకచోట్ల అన్ని మతాల వారూ ఈ పండుగలో భాగస్వాములు అవుతుంటారు.

వెలుగులు.. జిలుగులు..

ఎక్కడ చూసినా క్రిస్మస్‌ సందడి.. క్రీస్తు జనన వృత్తాంతాల బొమ్మలు.. గుమ్మాలకు క్రీస్తు తోరణాలు.. శాంతాక్లాజ్‌ సందడి.. క్రిస్మస్‌ట్రీ తళతళలు.. ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. బట్టల దుకాణాల్లో పండుగ ఆఫర్లు ఆకర్షణీయంగా ఆహ్వానిస్తున్నాయి. చర్చిలయితే సర్వాంగ సుందరంగా శోభిల్లుతున్నాయి. ఇంటిపైన క్రిస్మస్‌ స్టార్‌ మెరుపులు, ముంగిట క్రిస్మస్‌ ట్రీలు కళకళలాడుతున్నాయి. బేకరీలు, స్వీట్‌ షాపులు స్పెషల్‌ కేకులతో నోరూరిస్తున్నాయి. స్పెషల్‌ ఆర్టికల్స్‌ రారమ్మంటున్నాయి. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లో కోఠి, విజయవాడలోని బీసెంట్‌రోడ్డు, వన్‌టౌన్‌ ఇలా అనేక ముఖ్య పట్టణ ప్రధాన మార్కెట్లలో ఇసుకేస్తే రాలని వాతావరణం.

క్రిస్మస్‌ చెట్టు..

ఏసుక్రీస్తు జన్మించిన విషయం ఒక నక్షత్రం ద్వారా వెల్లడయిందని నానుడి. అందుకే క్రిస్మస్‌ పండుగకు నెల రోజుల ముందు నుంచే విద్యుత్‌ దీపం అమర్చిన నక్షత్రాలను ఏర్పాటు చేస్తారు. అది క్రీస్తు రాకకు సూచనగా వారు భావిస్తారు.

క్రిస్మస్‌ చెట్టు.. అలంకరణ కోసం కాదు! శీతాకాలం.. కొత్త సంవత్సరానికి ఆహ్వానంగా ఒక పచ్చని చెట్టు కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రతీక. ప్రపంచంలో మొట్టమొదటి క్రిస్మస్‌ చెట్టు 1441లో టాలిన్‌ నగరంలో స్థాపించబడింది. ఈ చెట్టు ఇప్పటికీ టౌన్‌ హాల్‌ స్క్వేర్‌లో పురాణచెట్టుగా నిలుస్తోంది. విక్టోరియా రాణి భర్త ఆల్బర్ట్‌ ఇంగ్లాండులో ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. 1605 నుంచే జర్మనీ, మరికొన్ని దేశాల్లో క్రిస్మస్‌ చెట్లను అలంకరించటం ఆనవాయితీగా వస్తోంది.

శాంతాక్లాజ్‌ : శాంతాక్లాజ్‌ క్రిస్మస్‌తో ముడిపడి ఉంటుందనేది భావన. తెలుపు గడ్డం, ఎరుపు రంగు దుస్తులు, అందమైన, వింత మనిషి వాస్తవానికి పిల్లలు ప్రేమించే సెయింట్‌ నికోలస్‌ అనే వ్యక్తి. శాంతాక్లాజ్‌ చిమ్ని ద్వారా వస్తాడని నమ్మకం. అందువల్ల శాంతా యొక్క బహుమతులు సేకరించి, చిమ్నీని వేలాడతీస్తారు. ఈ పేరుతో క్రిస్మస్‌ సమయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రత్యేకం.

విమానమే శాంతాక్లాజ్‌గా..

యునైటెడ్‌ ఎమిరేట్స్‌లో విమానయాన సంస్థ, ఎ380 విమాన ముందుభాగంలో శాంతాక్లాజ్‌ టోపీని తీర్చిదిద్దింది. ఆ విమానాన్ని రైన్‌డీర్లు లాగుతున్నట్లున్న వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదలయింది. ఈ వీడియో క్లిప్‌ అందరినీ అలరిస్తోంది.

మిస్టిలోయ్ కిస్‌ : మిస్టిలోరు ఓక్‌ చెట్టు నుంచి కట్‌ చేసిన కొమ్మలను తలుపులు లేదా తోరణాల దగ్గర ఉంచటం ఈ చెట్టు ప్రత్యేకత. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకేసారి ఆ చెట్టు కిందకు వస్తే వారు కరచాలనం చేసుకోవాలనేది పురాతన గ్రీకు ఆచారం.

క్రిస్టిన్గాలే : క్రిస్టిన్గాలే అనేది ఏసు తేజస్సుకు చిహ్నంగా నమ్ముతారు. నారింజ రంగు బంతి (భూమి) చుట్టూ ఎర్రని రిబ్బన్‌ (ఏసు రక్తం) కట్టి ఉంటుంది. పైభాగంలో కొవ్వొత్తి వెలిగిస్తారు. దాని చుట్టూ నాలుగు కర్రలు ఉంటాయి. ఈ నిర్మాణం ఏసు ప్రాపంచికం.. నలుదిశల ఆయనే ఊతం అనే దానికి సూచనగా చెబుతారు.

హోలీదండలు : హోలీ క్రైస్తవులకు ఒక పవిత్రమైన మొక్క. ఏసు క్రీస్తు తన తలపై హోలీ మొక్క ముళ్లతో ఉన్న పుష్పగుచ్చాన్ని ధరిస్తారు.

క్రిస్మస్‌ గీతాలు : క్రిస్మస్‌ సందర్భంగా క్యారల్స్‌ అనే ప్రత్యేక గీతాలను కొన్ని రోజుల ముందు నుంచే ఆలపిస్తారు. సాయంకాలాలు ఇళ్ల వద్దకు వచ్చి, పాటలు పాడి అలరిస్తారు.

బెత్లెహేం ప్రపంచ సందర్శనా కేంద్రం

బెత్లెహేం యేసు క్రీస్తు బైబిల్‌ జన్మస్థలం. జెరూసలేంకు దక్షిణాదిన ఉన్న ఒక ఐకానిక్‌ గమ్యస్థానం. క్రిస్మస్‌ సమయంలో మాంగర్‌ స్క్వేర్‌లో వేడుకలు.. పాతనగరంలో విద్యుత్‌దీపాల దృశ్యాలు.. సెయింట్‌ కేథరిన్‌ చర్చిలో జరిగే ఉత్సవాలు.. అర్థరాత్రి మాస్‌తో సహా క్రీస్తు జననం వేడుకలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వస్తుంటారు.

అమెరికాలో..

ఇక్కడ అమెరికన్లతో పాటు తెలుగువారు, ఇతర దేశస్తులు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్‌ ట్రీ, స్టార్‌, స్వీట్స్‌, కేక్స్‌ కానుకల రూపాలు వారి అభిరుచికనుగుణంగా ఉంటాయి. వైవిధ్యమైన దుస్తులు ధరించి, సంగీత కచేరీల్లో పెద్దఎత్తున పాల్గొంటారు. న్యూయార్క్‌ లాంటి ప్రధాన నగరాల చర్చిల్లో.. ప్రొటెస్టెంట్లు, రోమన్‌ క్యాథలిక్కులు, ఇతరులు ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. రాక్‌ఫెల్లర్‌ సెంటర్‌లో ఎత్తైన క్రిస్మస్‌ చెట్టు ఆకర్షణగా ఉంటుంది.

చైనాలో..

ఆసియాలో క్రిస్‌మస్‌ గ్రాండ్‌గా జరుపుకునే వాటిలో హాంకాంగ్‌ ఒకటి. మెరుపులీనే ఆకాశ హర్మ్యాలు, తళతళల తీరాలు, నగరం చుట్టూ సంగీత కచేరీలు, మిరుమిట్లు గొలిపే క్రిస్మస్‌ మార్కెట్లు ఎక్కడ చూసినా సందడే సందడి. డిస్నీల్యాండ్‌, హ్యాంకాంగ్‌ బ్యాలెట్‌, ఫిల్హార్మోనిక్‌, వింటర్‌ఫెస్ట్‌, సింఫనీగ్రాండ్‌ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఫిన్లాండ్‌ లాప్లాండ్‌లో

అద్భుత దృశ్యాలులాప్లాండ్‌ నగరంలో ఎరుపు, తెలుపు దుస్తులతో ప్రయాణించే స్థానికులే అద్భుత దృశ్యాలు.

ఇటలీలో ఏడాది పొడవునా..

ఇటలీలోని వాటికన్‌ సిటీనే మనోహరంగా ఉంటుంది. సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో అమర్చిన క్రిస్మస్‌ ట్రీ సందర్శనీయం. సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో అర్థరాత్రి మాస్‌ అద్భుతంగా జరుగుతుంది. అక్కడ దీనిని స్మారక దినంగా పాటిస్తారు.

జర్మనీలో 100 అడుగుల క్రిస్మస్‌ చెట్టు

జర్మనీలో మ్యూనిచ్‌ శీతాకాలం విడిది ప్రాంతం. మారియన్‌ ప్లాట్జ్‌లో ఉంచిన 100 అడుగుల ఎత్తైన క్రిస్మస్‌ చెట్టును అమర్చుతారు. లైవ్‌ హాలిడే సంగీతం వినసొంపుల మధ్య, మెరిసే వీధుల్లో ఈ చెట్టును చేరుకుంటారు ప్రజలు.

ఉక్రెయిన్‌లో జనవరిలోనే..

ఉక్రెయిన్‌లో క్రిస్మస్‌ వేడుకలు డిసెంబర్‌ 25న జరుపుకోరు. జూనియన్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా జనవరి ఏడో తేదీన జరుపుకుంటారు. ఆకాశంలో తొలి నక్షత్రాన్ని చూసే వరకూ వారు క్రిస్మస్‌ డిన్నర్‌ చేయకుండా సంగీతారాధనల్లో నిమగమవుతారు.

ఫిలప్పీన్స్‌లో ఆరునెలలు..

ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్‌ వేడుకలు ఆరునెలలపాటు జరుపుకుంటారు. రాజధాని శాన్‌ ఫెర్నాండోలో క్రిస్మస్‌కు ముందు శనివారం జెయింట్‌ లాంతర్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. లాంతరు తయారుచేయటంలో పోటీలు చాలా ఉత్సాహరగా ఉంటాయి. సెప్టెంబర్‌ నుంచి జనవరి మొదటి ఆదివారం వరకూ కార్యక్రమాలు కొనసాగుతాయి. పేపర్‌ లాంతర్లతో ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించుకుంటారు.

పోలెండ్‌లో చేప ప్రత్యేకత..

పోలెండ్‌లో క్రిస్మస్‌రోజున హోం అలోన్‌ చిత్రాన్ని కచ్చితంగా చూస్తారు. ఆరోజు కార్ప్‌ అనే చేప ప్రత్యేక వంటకం. ఈ చేప తింటే అదృష్టం అని వారి నమ్మకం.

ఆస్ట్రేలియాలో వైట్‌ క్రిస్మస్‌..

ఆస్ట్రేలియా ప్రజలు క్రిస్మస్‌ను బీచ్‌ వద్ద జరుపుకుంటారు. మధ్యాహ్నం బార్బీక్యూ వంటకాలతో భోజనం చేస్తారు. ఆటపాటల అనంతరం సముద్ర స్నానం చేసి, భోజనం చేస్తారు. ఆ బీచ్‌లో ఇసుక తెల్లగా ఉంటుంది. అందువల్ల అక్కడ జరుపుకునే వేడుకను ‘వైట్‌ క్రిస్మస్‌’ అని పిలుస్తారు.

జమైకాలో అల్లం జ్యూస్‌..

జమైకాలో వేడుకలు సరికొత్తగా జరుగుతాయి. మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ, ప్రత్యేకంగా అల్లంతో తయారుచేసిన తియ్యటి జ్యూస్‌ను సేవిస్తారు. ఫ్రూట్‌కేక్‌ క్రిస్మస్‌ రోజున చాలా ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది.

జపాన్‌లో ప్రేమికులు..

చికెన్‌ను ఒక సంప్రదాయ వంటకంగా భావిస్తుంటారు. రాజధాని టోక్యోలో సందడి.

స్వీడన్‌ గావ్లేగోట్‌..

స్వీడన్‌లోని స్లాట్‌స్టోర్గెట్‌ (కాజిల్‌ స్క్వేర్‌) వద్ద యూల్‌ మేక విగ్రహాన్ని 1966 నుంచి తయారుచేసే సంప్రదాయం ఉంది. గడ్డితో తయారుచేసిన ఈ మేకను ధ్వంసం చేయటం, తగులబెట్టడం, ముక్కలు చేయటం, పడగొట్టడం వంటివి సరదాగా చేస్తుంటారు. అయితే వారి నుంచి గావ్లేగోట్‌ను కాపాడేందుకు స్థానిక చర్చి అధికారులు ప్రయత్నిస్తుంటారు.

ఆస్ట్రియాలో వినూత్నంగా..

సెయింట్‌ నికోలస్‌ మంచి పిల్లలకు బహుమతులు అందజేస్తే.. క్రాంపస్‌ మాత్రం అల్లరి పిల్లలను తీసుకెళ్తాడని అంటారు. క్రిస్మస్‌ సమయంలో కొందరు భయంకరమైన దుస్తులు (రాక్షసుడు వేషం మాదిరిగా) ధరించి వీధుల్లో తిరుగుతుంటారు. పిల్లలను భయపెడుతూ చెడ్డవారిని శిక్షిస్తుంటారు.

నార్వేలో చీపుర్లు..

క్రిస్మస్‌ రోజున మంత్రగత్తెలు, దుష్ట శక్తులు చీపుర్లను తొక్కటానికి వెతుకుతుంటారని భావించి, వాటిని దాచేస్తారు. శతాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇళ్లల్లో బంగారం కంటే ఆ రోజు చీపుర్లను జాగ్రత్తగా చూసుకుంటారు.

టోరంటోలో లక్షలాది లైట్లు..

టోరంటోలో జిగే కావాల్కేడ్‌ లైటింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సిటీ హాల్‌, నాథన్‌ ఫిలిప్స్‌ స్క్వేర్‌లను ప్రదర్శించటానికి 1967లో తొలిసారి కావాల్కేడ్‌ నిర్వహించారు. స్క్వేర్‌, క్రిస్మస్‌ చెట్టు.. మూడు లక్షల కంటే ఎక్కువ లైట్లు అమర్చి వెలిగిస్తారు. రాత్రి సమయంలో ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ రోజు అక్కడ ప్రత్యేకంగా బాణాసంచా కాలుస్తారు.

కొలంబియాలో లిటిల్‌ క్యాండిల్స్‌..

సీజన్‌ ప్రారంభం నుంచే కొలంబియా అంతటా ‘లిటిల్‌ క్యాండిల్స్‌ డే’ నిర్వహిస్తారు. ఇమ్మాక్యులేట్‌ కాన్సెప్షÛన్‌ పేరుతో కిటికీలు, బాల్కనీలు, ఇంటి ముందు కొవ్వొత్తులు, కాగితపు లాంతర్లు వెలిగిస్తుంటారు. ఏ ఇంటి వద్ద చూసినా అందమైన కొవ్వొత్తులు వెలుగుతూ మనోహరంగా ఉంటాయి.

మరికొన్ని ప్రాంతాల్లో…

లాట్వియా రిగా, జర్మనీ బెర్లిన్‌, ఇంగ్లాండ్‌ లండన్‌, స్కాట్లాంగ్‌ ఎడిన్‌బర్గ్‌, ఎస్టోనియా టాలిస్‌, డెన్మార్క్‌ కోపెన్‌హాగస్‌, ఆస్త్రియా వియన్నా, చెక్‌ రిపబ్లిక్‌ ప్రేగ్‌, ఐర్లాండ్‌ డబ్లిస్‌, ఇటలీ వాటికన్‌, ఐర్లాండ్‌ డబ్లిస్‌ తదితర ప్రాంతాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి.

మనదేశంలో ఘనంగా..

మన దేశంలో గోవా, పాండిచ్చేరి, షిల్లాంగ్‌, కేరళ, ముంబై, బెంగుళూరు తదితర ప్రాంతాలు అత్యుత్తమ ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. అతి పురాతనమైన చర్చి కేరళలోని త్రిశూర్‌ జిల్లా పాలమూర్‌లో ఉంది. ఏసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన సెయింట్‌ థామస్‌ ఈ చర్చిని నిర్మించాడని, అది మలబార్‌ క్యాథలిక్‌ చర్చిగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఆయనే మన దేశంలో మరో ఆరు చర్చిలు నిర్మించారు. హైదరాబాద్‌, విజయవాడతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కార్నివాల్‌ వేడుకలను ఉత్సా హంగా జరుపుకుంటారు. సంగీతం, ఆహారం, షాపింగ్‌ వంటి సదుపాయం కల్పిస్తారు. లైవ్‌ బ్యాండ్‌ ప్రదర్శనలు.. క్రిస్మస్‌ కరోల్స్‌, మీట్‌ అండ్‌ గ్రీట్‌ శాంతాక్లాజ్‌ వంటి కార్యకలాపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఓపెన్‌ మైక్‌, రాప్‌ ఛాలెంజ్‌, హిప్‌ హాప్‌ ఛాలెంజ్‌, కాస్‌ ప్లే పోటీలు, డ్రాయింగ్‌ పోటీలు, ఫ్యాన్సీ దుస్తులు, లిటిల్‌ శాంటా పోటీల్లో యువతీ యువకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వైవిధ్యమైన ఆటలతో కుటుంబాలు ఐక్యంగా వినోదాన్ని పొందుతారు. పండుగ రోజున చర్చిల్లో పేదలు, వితంతువులకు ప్రత్యేక బహుమతులు, విద్యార్థులకు నగదు అందజేస్తుంటారు.

ఢిల్లీ : ఢిల్లీలోని పురాతన చర్చిలో కన్నాట్‌ ప్రాంతంలోని కేథడ్రల్‌ ఆఫ్‌ ది సేక్రేడ్‌ హార్ట్‌. పండుగ ముందురోజు అర్ధరాత్రి నుంచి పండుగ రోజు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి.

లక్నో : లక్నోలోని అతిపెద్ద పురాతన సెయింట్‌ జోసెఫ్‌ కేథడ్రల్‌ చర్చి. ఇక్కడ జరిగే ఈవ్‌ క్రిస్మస్‌ కరోల్స్‌ ఆకట్టుకుంటాయి. కోహిమా : నాగాలాండ్‌లోని కోహిమా నగరాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇక్కడ మేరీ హెల్ప్‌ ఆఫ్‌ క్రిస్టియన్స్‌ కేథడ్రల్‌ అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటి.

చెన్నై : సెయింట్‌ థామస్‌ కేథడ్రల్‌ బాసిలికాలో క్రిస్మస్‌ వేడుకలను ‘శాంతోమ్‌ బాసిలికా’ అని పిలుస్తారు. దేశంలోని పురాతన చర్చిల్లో ఒకటి (1523లో). వేళంగిణి మాత ఉత్సవాలు కూడా పెద్దఎత్తున జరుగుతుంటాయి.

గోవా : గోవాలో బాసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసస్‌, సే కేథడ్రల్‌, చర్చ్‌ ఆఫ్‌ అవర్‌ లేడీ ఆఫ్‌ ఇమ్మాక్యులేట్‌ కాన్సెప్షన్‌, చర్చి ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ అస్సిసి వంటి అనేక పురాతన చర్చిల వైభవం చూడవచ్చు.

కోల్‌కొతా : కోల్‌కొతాలోని పార్క్‌స్ట్రీట్‌ ఎంతో పేరుగాంచింది. నగరంలో సరికొత్త శోభ కనిపిస్తుంది. అతిపెద్ద క్రిస్మస్‌ కార్నివాల్‌ను కూడా చూడొచ్చు. వీధులన్నీ విద్యుద్దీప కాంతులతో మెరుస్తుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణలకు.. ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్‌ చర్చి ఒక ప్రత్యేకం. వేకువ జామున నాలుగు గంటల నుంచే ఇక్కడ ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు కొనసాగుతాయి. క్రిస్మస్‌ ట్రీతో పాటు రంగు రంగుల విద్యుద్దీపాలు, బెలూన్లు, స్టార్లతో పాటు భారీ క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ వందేళ్లకు పైబడిన చర్చిలున్నాయి. సెయింట్‌ జాన్‌ ది బాప్టిస్ట్‌ చర్చి, సెయింట్‌ మేరీస్‌ చర్చి, సికింద్రబాద్‌లోని సెయింట్‌ థామస్‌ ఎస్‌పిజి చర్చి, సెంటినరీ చర్చిలు అత్యంత పురాతనమైనవి. ఆల్‌ సెయింట్‌ చర్చి, హోలీ ట్రినిటీ చర్చి, గారిసన్‌ వెస్లీ చర్చి, మిలీనియం మెథడిస్ట్‌ చర్చి, సెయింట్‌ జోసెఫ్‌ చర్చి, సెయింట్‌ జార్జి చర్చి-కింగ్‌ వంటి చర్చిల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటారు. బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్‌ మార్క్‌ లూథరన్‌ చర్చి, విజయవాడ సెయింట్‌పాల్‌ కెథడ్రల్‌ చర్చి, సెయింట్‌ పాల్‌ సెంటినరీ చర్చి, తెలుగు బాప్టిస్టు చర్చిలు సరికొత్త శోభతో ఆకట్టుకుంటున్నాయి.

విశాఖపట్టణంలో ఈరోస్‌ హిల్స్‌ అనే మూడు కొండల్లో మూడుమతాల గుడులు ఉండటం మధురానుభూతే. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మితమై, అతిపెద్దదైన రోస్‌ హిల్స్‌ చర్చి ప్రాంగణం నుంచి చూస్తే వెంకటేశ్వరస్వామి ఆలయం, మసీదు కనిపిస్తాయి. చుట్టుపక్కల బీచ్‌లు, ఓడరేవులు పై నుంచి ఆకర్షణీయంగా కన్పిస్తాయి. గుంటూరుజిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ నులకపేట ప్రాంతంలో కొందరు ముస్లిము మహిళలు క్రిస్మస్‌ సీరియల్‌ లైటింగ్‌ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వీరికి ముడిసరుకు ఇచ్చి, తయారీ తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లి, అమ్ముకుంటుంటారు. తద్వారా క్రైస్తవ సోదరుల పండుగలో ముస్లిం మహిళలు పరోక్షంగా పాల్గొంటూ క్రిస్మస్‌ వెలుగులు పంచుతున్నారు. ప్రతి ఏడాది జనవరి 9 నుంచి 11వ తేదీ వరకూ విజయవాడ గుణదలలోని మేరీమాత కొండపై తిరునాళ్లు వైభవంగా జరుగుతుంటాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి క్రైస్తవ సోదరులు, ప్రతినిధులు వస్తుంటారు.

బ్రదర్‌ జోసఫ్‌ తంబి 78వ ఉత్సవాలు ..

కృష్ణాజిల్లాలోని పెద్ద అవుటుపల్లిలో బ్రదర్‌ జోసఫ్‌ తంబి చర్చిలో ఏటా జనవరి 13 నుంచి 15 వరకూ ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రిస్మస్‌ ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులతో కూడిన సంతోషం నింపాలనీ, ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుందాం.

యడవల్లి శ్రీనివాసరావు

9490099214

➡️